26. ప్రత్యేక సందర్భాలలో , డయాబెటిస్ ఉన్న వారు, పథ్యం లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
క్రితం టపాలలో డయాబెటిస్ నివారణకూ , నియంత్రణ కూ కూడా , పథ్యం పాటిస్తే ఉండే ప్రయోజనాల గురించి శాస్త్రీయం గా తెలుసుకున్నాం కదా ! మరి ప్రత్యేక పరిస్థితులలో డయాబెటిస్ ఉన్న వారు పథ్యం ఎట్లా పాటించాలి ?ప్రతి వారి జీవితాలలోనూ , తరచూ అనేక , సాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ! అవి కుటుంబ పరం గా గా నూ , సామాజికం గానూ ఉండవచ్చు ! కుటుంబం లో జరిగే వి సామాన్యం గా, పుట్టిన రోజులు , నామకరణాలు, పెళ్ళిళ్ళు , హాలిడేలు , వ్రతాలూ , పూజలూ , పండగలూ లాంటివన్నీ ! సాంఘికం గా , మీటింగులు , పార్టీలు , పిక్నిక్ లు , మొదలైనవన్నీ ! ఈ రోజుల్లో ప్రతి సందర్భాన్నీ ఒక విందు గా మార్చుకోవడం కూడా ఆనవాయితీ అవుతుంది కదా ! అది ఒకందుకు మంచిదే కదా , అందరూ కలిసి ఆనందం గా సమయం గడప డానికి ! ఆ యా సందర్భాలలో మరి డయాబెటిస్ ఉన్న వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
1. విందులలో ఆహారం , రుచికరం గా ఉండడమే కాకుండా , ఎక్కువ ఐటమ్స్ కూడా చేయడం వల్ల, ఎక్కువ వెరైటీ కూడా ఉంటుంది !
2. కానీ, విందులలో వండే వంటలు, కేవలం మానవుల నాలుకను దృష్టి లో పెట్టుకుని మాత్రమే వండ బడతాయి కానీ , ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు కదా ! అందువల్ల , విందులలో అతిగా తినడం ,కేవలం డయాబెటిస్ ఉన్న వారికే కాకుండా, ఎవరికీ మంచిది కాదు.
3. కుటుంబం లో జరిగే శుభకార్యాల లో మీకు నచ్చిన విధం గా, ముందే చెప్పి , మీ కోసం వంటలు చేయించుకోవచ్చు !
4. అందరితో పాటుగా తిందామని అనుకుంటే , లౌక్యం ప్రదర్శించుతూ ” నాకు కడుపు నిండిపోయింది, ఇక చాలు” అని, ఎక్కువ గా తిన కుండా తప్పుకోవచ్చు !
5. మీకు విందులలో ఆతిధ్యం ఇచ్చే వారితో ఉన్న పరిచయాలను బట్టి , కొంత క్యాలరీలు కాల్చే పనులు మీరు చేయవచ్చు, ఆ ప్రదేశాలలో ! ఎందుకంటే,ఇంట్లో కన్నా ఎక్కువే తినడం జరుగుతుంది కనుక , కాస్త ఎక్కువ పని కూడా చేస్తే , క్యాలరీలు బర్న్ అవుతాయి, వెంటనే !
6. అప్పటికే మీరు ( షుగరు కంట్రోలు కు ) ఏమైనా టాబ్లెట్స్ కనుక తీసుకుంటూ ఉంటుంటే , అవి ఈ ప్రత్యేక సందర్భాలలో , అసలే మర్చి పోకూడదు ! ఎందుకంటే , ఎప్పటి కన్నా , ఎక్కువ బ్లడ్ షుగర్ ఉండే రిస్కు ఉంది కనుక ( విందులలో ఎక్కువ గా తినడం వల్ల )
7. ప్రతి విందులో కూడా , డయాబెటిస్ ఉన్న వారు, క్రితం టపా లో సూచించిన విధం గా, వారి భోజన ప్లేటు లేదా పళ్లాన్ని ఆహార పదార్ధాలతో అమర్చుకోవాలి ! కనీసం ఆ ప్రయత్నం చేయాలి !
8. అట్లా ప్రత్యేక సందర్భాలలో సంభవం కాని పక్షం లో , అక్కడ ఉన్న వంటకాలే మితం గా తినడం , ఎక్కువ గా ఆహూతులతో మాట్లాడుతుండడం చేయాలి ! అప్పుడు నోరు ( తినడం లో కాక ! ) మాట్లాడడం లో బిజీ అయిపోతుంది , అట్లా, తక్కువ తినడం జరుగుతుంది ! సోషల్ మీటింగ్ ను ” సోషల్ ఈటింగ్ పోటీ ” అని భావించ కూడదు, డయాబెటిస్ ఉన్న వారు !
9. డయాబెటిస్ ఉంటే , తక్కువ పరిమాణం లో ఆహారం తరచూ తినడం చేయాలి , కడుపు నిండా షుష్టు గా , ఒక్కసారిగా కాక !
10. మన నాలుకకు రుచే తెలుసు కానీ , ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ తక్కువ గా ఉత్పత్తి అయి ,రక్తం లో చెక్కెర ను కంట్రోలు చేయలేకపోతుందని తెలిసేది మెదడు కే కదా , ఆ మెదడు తో నాలుకను ” కంట్రోలు ” చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ! అట్లా కాక, నాలుకనే నమ్ముకుంటే , డయాబెటిస్ ఉన్న వారి పరిస్థితి ,” కుక్కతోక పట్టుకుని గోదారి ఈదిన ” విధం గా ఉంటుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !