Our Health

Archive for మే 5th, 2013|Daily archive page

17. డయాబెటిస్ లో, కాళ్ళ జాగ్రత్తలు :

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 5, 2013 at 1:04 సా.

17. డయాబెటిస్ లో కాళ్ళ జాగ్రత్తలు :

 
డయాబెటిస్ లో  పాదాల సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. దీనికి కారణం, డయాబెటిస్ చాలా కాలం కంట్రోలు లో లేక పోవడం వల్ల వచ్చే పరిణామాలతో  దెబ్బ తిన్న  నాడులు అంటే నెర్వ్. ప్రత్యేకించి పాదాలలో ఉండే నాడులు. మనం తెలుగులో సాధారణం గా నాడి చూసి మందు ఇస్తాడు డాక్టరు అని అంటాము ! ఆ నాడి ,యదార్ధానికి నాడి కాదు అంటే నెర్వ్ ( nerve ) కాదు. అది రేడియల్ ఆర్టరీ ( radial artery ) అంటే మన చేతిలోకి గుండె నుండి రక్తం సరఫరా చేసే ఒక ధమని ! ఇప్పుడు మనం నాడులు అని చెప్పుకునేది నెర్వ్ ల గురించి. ఈ నాడులు మన మెదడు నుంచి ప్రారంభం అవుతాయి. మన శరీరం లో ప్రతి భాగానికీ విస్తరించి ఉంటాయి. ఇట్లాంటి నాడులలో, కాలిలో ఉన్న నాడి  సరిగా పని చేయక పొతే , పాదాలలో స్పర్శ తెలియకుండా పోతుంది. పర్యవసానం గా కాలికి దెబ్బ తగిలినా కూడా ఎక్కువ నొప్పి కలగక పోవడం , వేడి , శీతలం లాంటి స్పర్శలు తక్కువ అవడం కూడా జరుగుతుంది ! ఈ పరిస్థితిని ‘ న్యూరొపతీ ‘ అంటారు. 
పాదాలలో చర్మం లో మార్పులు: స్పర్శ జ్ఞానం తక్కువ అవుతూ ఉండడం వల్ల , పాదం లో చర్మం ఎండి పోయినట్టు అవుతుంది అంటే డ్రై నెస్. అందువల్ల పాదాలకు ప్రత్యేకమైన ఆయింట్ మెంట్స్ పూసుకుంటూ ఉండాలి. కానీ పాదాలను ఈ ఆయింట్ మెంట్స్ తో నింప కూడదు , కారిపోయేట్టు !
పాదాల లో కాలస్ లు ఏర్పడడం :  పాదాలలో తరచూ కొంత భాగం ( ప్రత్యేకించి వత్తిడి ఎక్కువ గా ఉన్న భాగాలు ) లో చర్మం దళసరి గా అయి కొంత కాలం తరువాత, చిన్న చిన్న కంతులు లేదా బుడిపెలు గా ఏర్పడుతాయి. ఇవి స్పెషలిస్టు తో తోలిగించుకోక పొతే , పుళ్ళు గా మారుతాయి, అంటే అల్సర్ లు గా ! ఈ పుళ్ళు ఒక పట్టాన మానవు ! దానివల్ల , కోతి పుండు  బ్రంహ రాక్షసి ” అన్న చందాన ఆ పుళ్ళు సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ! చాలా మంది డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు , వ్యాధి కంట్రోలు లో లేక పోవడం వలననే ,పాదాలకు పుళ్ళు ఏర్పడినా , ” దానంతట అదే తగ్గుతుంది లే ” అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ! చాలా కేసులలో వారు వారి పాదానికి ఉన్న వేళ్ళు , పాదాలూ , ఇంకా పరిస్థితి విషమించితే , కాళ్ళూ కోల్పోయిన సందర్భాలు అనేకం ! 
పాదాలలో అల్సర్ లు,  కాలస్ లు నివారించాలంటే ఏమి చేయాలి ?: 
క్యాలస్ లు ఏర్పడితే వాటిని తోలి దశలలోనే  ఒక ప్రత్యేకమైన రాయి ( గరుకు గా ఉంటుంది ) ఆ ప్రదేశాలను ” ఆరగ తీస్తూ ” ఉండాలి !   పుళ్ళు లేదా అల్సర్ లు ఏర్పడిన తోలి దశలలొనే , వైద్యుడితో సంప్రదించి , తగిన సలహా తీసుకోవాలి !  కేవలం యాంటీ బయాటిక్స్ తీసుకోవడమే కాకుండా , రక్త పరీక్ష చేయించుకుని ,రక్తం లో షుగరు కంట్రోలు లో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అది కూడా కేవలం పరీక్ష రోజున కాకుండా పరీక్ష కు పూర్వం రెండు మూడు నెలలు, రక్తం లో షుగరు ఏమాత్రం కంట్రోలు లో ఉందో  తెలిపే పరీక్ష చేయించుకోవాలి ! అల్సర్ లు ఏర్పడినప్పుడు  ఆ అల్సర్ల మీద బరువు పడేట్టు నడవడం కూడదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడితే ,నడక మాని , పుళ్ళు మానే వరకూ విశ్రాంతి తీసుకోవాలి !  పాద రక్షలు సరియైన సైజు ఉన్నవే ఎపుడూ ధరిస్తూ ఉండాలి !  బూట్లు ధరించడం ఉత్తమం కానీ ,అవి చాలా బిగుతు గా ఉండ కూడదు. అంతే కాక  శుభ్రమైన నూలు సాక్స్ ను ప్రతి రోజూ వేసుకోవాలి , కేవలం బూట్లు మాత్రమె వేసుకోవడం మంచిది కాదు , ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్న వారు ! ఎందుకంటే , చెమట వల్ల కాళ్ళలో పుళ్ళు ఏర్పడే రిస్కు ఎక్కువ గా ఉంటుంది ! బూట్లు చిన్న చిన్న గాయాలనుంచి పాదాలను రక్షిస్తాయి కూడా ! డయాబెటిస్ ఉన్న వారు, స్మోకింగ్ చేయకూడదు. ఎందుకంటే , వారి పరిస్థితి ” గోడ దెబ్బ , చెంప దెబ్బ ” అన్న విధం గా ఉంటుంది అంటే , డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తో ,  స్మోకింగ్ వల్ల కలిగే కాంప్లికేషన్స్ తోడై ,  రక్త నాళా లనూ, నాడులనూ త్వరితం గా దెబ్బ తీస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: