13. డయాబెటిస్ ఉన్న వారు ABC లతో వారి గుండె ను ఎట్లా జాగ్రత్త గా చూసుకోవచ్చు ?

కొత్త గా డయాబెటిస్ వచ్చిన వారు కానీ , కొంత కాలం డయాబెటిస్ ఉన్న వారు కానీ, వారి గుండె జాగ్రత్త లో ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసినది కేవలం మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు ! వాటి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు !
1. A అంటే Hb A 1C లో A: అంటే మనం ఈ పరీక్ష గురించి క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఈ పరీక్ష , రక్తం లో చెక్కర లేదా షుగర్ శాతాన్ని తెలియచేస్తుంది కనీసం పరీక్ష కు ముందు షుమారు మూడు నెలల క్రితం వరకూ ఆ చెక్కెర శాతం ఎంత ఉందో ! అంటే ఈ పరీక్ష రక్తం లో చెక్కెర ఏ మాత్రం కంట్రోలు లో ఉందో తెలియ చేస్తుంది ! కేవలం అది తెలుసుకోవడం తోనే జాగ్రత్త తీసుకున్నట్టు కాదు కదా ! ఆ శాతం ఎప్పుడూ 6. 5 కూ , 7 కూ మధ్య ఉండేట్టు ప్రయత్నించాలి !అంటే, తదనుగుణం గా ఆహారం విషయం లోనూ పథ్యం విషయం లోనూ అన్ని జాగ్రత్తలూ , అన్ని వేళలా తీసుకోవాలి ( ఆహారం విషయం వివరం గా ముందు ముందు తెలుసుకుందాం ! ) అప్పుడే మీరు A ను అశ్రద్ధ చేయట్లేదని తెలిసేది !
2. B : ఈ రెండో అక్షరం B అంటే బ్లడ్ ప్రెషర్ అదే రక్త పీడనం ! డయాబెటిస్ ఉన్న ప్రతి వారూ కూడా వారి బీ పీ ఎప్పుడూ తగిన కంట్రోలు లో ఉండడానికి లక్ష్యం పెట్టుకోవాలి ! క్రమం గా బీ పీ పరీక్ష చేయించుకుంటూ ఆ బీ పీ 130/80 ఉండేట్టు చూసుకోవాలి !
3. C : ఇక మూడో అక్షరం C అంటే , కొలెస్టరాల్ ! ఈ కొలెస్టరాల్ నిష్పత్తి కనుక మారి చెడు కొలెస్టరాల్ అదే LDL కొలెస్టరాల్ రక్తం లో ఎక్కువ అయి , HDL అదే మంచి కొలెస్టరాల్ అంటే మన దేహానికి ఉపయోగ పడే కొలెస్టరాల్ కనుక తక్కువ అవుతే వాటి పరిణామాలు తీవ్రం గా ఉంటాయి కదా !
ఈ LDL కొలెస్టరాల్ మన దేహం లో ఏ విధం గా చెడు పరిణామాలకు కారణం అవుతుందో , కొన్ని నెలల క్రితం టపాలలో మంచి చిత్రాలతో వివరం గా తెలియచేయడం జరిగింది. మీకు జ్ఞాపకం ఉంటే , తెలియ చేయండి , లేదా ఆ టపాలు చూడండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !