7. గురక కు చికిత్స ఉందా?
క్రితం టపాలలో గురకకు కారణాలు ఏమిటి , గురకను కనుక్కోవడం ఎట్లా , గురక తీవ్రత ను తెలుసుకోవడం ఎట్లా , అనే విషయాలు తెలుసుకున్నాం కదా ,మరి గురక కు చికిత్స ఉందా ? అంటే ఉన్నది.
మందుల అవసరం లేకుండానే గురకను నివారించుకోవచ్చు ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే :
a. బరువు తగ్గించుకోవడం : మీ వయసుకీ , మీ ఎత్తుకీ ఉండవలసిన బరువు కన్నా కేవలం కొన్ని కిలోలు ఎక్కువ ఉన్నా కూడా గురక వచ్చే రిస్కు ఎక్కువ గా ఉంటుంది. అందువలన గురక నివారణ లో మొదటి చర్య గా బరువు తగ్గించుకోవాలి ! ఇది అనేక రకాలు గా త్వరితం చేసుకోవచ్చు . పథ్యం తోనూ , వ్యాయామం తోనూ ! బరువు ఎక్కువ అవుతున్న కొద్దీ , మెడ లోపల ఉన్న కండరాల చుట్టూ కొవ్వు పేరుకుని శ్వాస నాళాల వ్యాసాన్ని తక్కువ చేస్తుంది అనే విషయం ముఖ్యం గా గుర్తు ఉంచుకోవాలి !
b . వెల్లికిలా కాకుండా పక్కకు ఒరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి : దీనివలన గొంతులో శ్వాస సమయం లో నాలుకా, ఇతర కండరాలూ వెనక్కి వెళ్లి శ్వాస తీసుకోవడం కష్టమయే పరిస్థితి ఏర్పడదు.
c. మద్యం తాగడం మానుకోవాలి: ప్రత్యేకించి మద్యం తాగి పడుకోవడం మానుకోవాలి : ఎందుకంటే మద్యం మన కండరాలనన్నిటినీ వ్యాకోచ పరుస్తుంది అంటే రిలాక్స్ చేస్తుంది దానితో గొంతులో ఉన్న నాలుకా , ఇతర కండరాలు కూడా రిలాక్స్ అయి , అవి శ్వాస ద్వారాన్ని చిన్నది గా చేస్తాయి ! దానితో శ్వాస తీసుకోవడం కష్టమయి గురక వస్తుంది.
d . స్మోకింగ్ మానుకోవాలి : స్మోకింగ్ గొంతు లోపలి భాగాలలో వాపు కు కారణమయి శ్వాస తీసుకోవడం ఎట్లా క్లిష్ట తరం చేస్తుందో , క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! స్మోకింగ్ మానుకుంటే ఆ మార్పులు నివారించ బడి శ్వాస సునాయాసం అవుతుంది !
e. CPAP యంత్రాలు :

CPAP అంటే కంటిన్యు అస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ డివైస్ అని : ఈ పరికరం లేదా మెషీన్ ను OSA ఉన్న వారు అంటే , గురక తీవ్రత ఎక్కువ అయి , అది శ్వాస తీసుకోవడం కష్టం చేస్తున్న దశ లో వాడవలసిన పరికరం. ఈ పరికరం శ్వాస పీడనాల తేడాను కనిపెట్టి తదనుగుణం గా మార్పులు తెస్తుంది. దానితో శ్వాస మామూలు గా తీసుకోవడానికి వీలుంటుంది. ఈ పరికరాన్ని రోజూ వాడాలి. స్పెషలిస్టు సలహా తోనే పై చర్యలు పాటించడం ఉత్తమం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !