Our Health

Archive for మే, 2012|Monthly archive page

గుండె జబ్బు నివారణ కు కొలెస్టరాల్ రక్త పరీక్ష ఎందుకు?.16.

In Our Health on మే 6, 2012 at 11:10 ఉద.

గుండె జబ్బు నివారణ  కు  కొలెస్టరాల్ రక్త పరీక్ష ఎందుకు?.16.

నెయ్యి నూనెలన్ని, ఒక్క పోలికనుండు ,
చూడ చూడ రుచుల జాడ వేరు,
కొవ్వులందు ‘ మంచి కొవ్వులు ‘ వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !
( కీ.శే. వేమన గారికి  కృతజ్ఞతలతో ! )
మనం ఇంత  వరకూ గుండె జబ్బులకు రిస్కు ఫ్యాక్టర్లు ఏమిటి ?  ఇంకా   ACS గురించీ కొంత వరకు తెలుసుకున్నాము కదా !  ప్రత్యేకించి , కొలెస్టరాల్ అంటే చెడు కొలెస్టరాల్ , అంటే LDL కొలెస్టరాల్  ఎట్లా మన రక్త నాళాలకు అతుక్కొని ప్లేక్ ఫార్మేషన్ కు కారకమవుతుందో కూడా చూశాము కదా !
ఇప్పుడు కొలెస్టరాల్ పరీక్షల గురించి తెలుసుకుందాము.
అసలు ఈ కొలెస్టరాల్ పరీక్షలు ముందుగా ఎందుకు చేయించుకోవాలి?:
మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది కదా సమాధానం. మనకు చెడు కొలెస్టరాల్, ( LDL Cholesterol ) మన రక్త నాళాలకు ఒక పూత లాగా అటుక్కుంటుంది. ఇలా అతుక్కోవడం ఒక రోజులో జరగదు. కొన్నిసంవత్సరాలు   జరిగి,  ప్లేక్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కొలెస్టరాల్  మన రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే, అంత త్వరితం గా ప్లేక్ ఫార్మేషన్ కు ఆస్కారం ఉంది. అందువల్ల మనం ముందే మన రక్తం లో ఉండే చెడు కొలెస్టరాల్ ఎంత ఉందొ కనుక్కుంటే , తగు   జాగ్రత్తలు తీసుకోవచ్చు,  గుండె జబ్బును దశాబ్దాలకు పైగా వాయిదా వేయవచ్చు కదా !
ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫయిల్ అంటే ఏమిటి ?: ( Fasting Lipid Profile ) :
అంటే మనం ఒకరోజు రాత్రి  భోజనం  తరువాత ఏమీ తినకుండా, పర కడుపుతో అంటే ఖాళీ కడుపుతో , ఉదయం లిపిడ్ అంటే కొవ్వు అంటే  మన రక్తం లో కొవ్వు శాతం ఎంత ఉందీ, అందులో HDL , లేక LDL కొవ్వు ఎంత శాతం ఉందీ అనే పరీక్షలు చేస్తారు. కనీసం  తొమ్మిది నుంచి పన్నెండు గంటలు మనం ఏమీ తినకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మనం సహజం గా ఏమైనా తింటే మన రక్తం లో కొలెస్టరాల్ ఎలాగూ ఎక్కువ అవుతుంది. అందువల్ల తప్పు ఫలితాలు ( errors in results ) వస్తాయి. 
HDL ( High Density Lipoproteins ) గురించి మనకు ఏమి తెలుసు ?:
 కొలెస్టరాల్ మన రక్తం లో మూడు రూపాలలో ఉంటుంది. ఒకటి ట్రై గ్లిజారైడ్స్ ( Tri glycerides ), రెండు హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్  ( HDL or High density Lipoproteins ) మూడు: లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్
( LDL or Low  Density Lipo Proteins ) అని.( పై చిత్రం లో ఈ వివరణ  చిత్ర రూపం లో గమనించండి )  సాధారణం గా లిపిడ్ ప్రొఫయిల్ టెస్ట్ లో ఈ మూడూ ఎంత ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది.
HDL  కొలెస్టరాల్ మనకు అవసరం. ఇది మంచి కలిగించే గుడ్ కొలెస్టరాల్  ( good cholesterol ) అన బడుతుంది,. ఎందుకంటే , ఈ మంచి కొలెస్టరాల్ రక్తం లో తగిన పరిమాణం లో ఉన్న వారికి గుండె జబ్బులు తక్కువ గా వస్తాయని అనేక పరిశోధనల వల్ల ఖచ్చితం గా నిర్ధారణ అయింది.
ఈ HDL కొలెస్టరాల్ ఎంత ఉండాలి? :   
60 mg. % లేక  మిల్లీ మోల్స్ లో 1.55 మిల్లీ మోల్స్ per litre  కన్నా ఎక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రాకుండా రక్షణ ఇస్తుంది.
పురుషులలో  40 mg.% అంటే , స్త్రీలలో  50 mg %, అంటే  మిల్లీ మోల్స్ లో చెప్పాలంటే 1.03 mmols per litre  కన్నా తక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రిస్కు ఎక్కువ గా ఉంటుంది.
ఇంకో రకం గా కూడా గుండె జబ్బు రిస్కు ను చెపుతారు. 
మన రక్తం లో HDL కొలెస్టరాల్, LDL  కొలెస్టరాల్ నిష్పత్తి . సాధారణం గా ఈ నిష్పత్తి  2.5 – 4.5: 1  ఉండాలి. అంటే మన రక్తం లో  LDL  ఒక భాగం ఉంటే , HDL  రెండున్నర నుంచి నాలుగున్నర పాళ్ళు  ఉండాలి. అంటే మంచి కొవ్వు లేక గుడ్ కొలెస్టరాల్ అయిన HDL , ఎక్కువ పాళ్ళు ఉండి LDL తక్కువ గా ఉండాలి.
మరి మనకు ఇంత మంచి చేసే ఈ మంచి HDL  or Good cholesterol ఎలా మన రక్తం లో ఎక్కువ నిష్పత్తి లో ఉండేట్టు చూడడం ? :
అనేక శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ క్రింది విషయాలు తెలిశాయి.
అధిక బరువు తగ్గడం,  క్రమం గా వ్యాయామం చేయడం, ( trans fats ) , ట్రాన్స్ ఫ్యాట్స్ మన ఆహారం లో లేక పోవడం, నికోటినిక్ యాసిడ్ అనే విటమిన్ మన ఆహారం లో ఉండడం, స్మోకింగ్ మానడం
( అంటే స్మోకింగ్ చేస్తున్న వారు ఆ అలవాటు మానుకున్నా వారిలో గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుందన్న మాట ) ,  మన ఆహారం లో ఒమేగా – 3- ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం,( అంటే Omega-3-fatty acids ), మన ఆహారం లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉండేట్టు చూసుకోవడం, మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహారం లో ఉండడం  – ఈ చర్యలన్నీ మన రక్తం లో HDL కొలెస్టరాల్ శాతాన్ని పెంచి, గుండె జబ్బు రిస్కు తగ్గిస్తాయి.
 (  ఈ ‘ మంచి ‘   HDL కొలెస్టరాల్   చిత్రం క్రింద చూడండి, అందం గా ఉంది కదూ ! )
( ఈ టపా మీకు నచ్చితే, మీ అభిప్రాయాలతో పాటు ,  www.baagu.net. గురించి మీ ప్రియ స్నేహితులకు చెపుతారు కదూ ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

లో బీ పీ కారణాలు ఏమిటి ?.15.

In Our Health on మే 5, 2012 at 8:13 సా.

లో బీ పీ కారణాలు ఏమిటి ?.15.

మనం హై బీపీ కి కారణాలూ లక్షణాలూ తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు లో బీ పీ అంటే అల్ప రక్త పీడనం,  దీనినే హైపో టెన్షన్ ( hypotension ) అంటారు. గురించి కూడా తెలుసుకుందాము.
హై బీ పీ లానే  అల్ప రక్త పీడనాన్ని కూడా సిస్టోలిక్ ఇంకా  డయా స్టోలిక్ రక్త పీడనం లాగా చెపుతారు.
సాధారణం గా 90/60 mm Hg. కన్నా తక్కువ వుంటే  అప్పుడు , అల్ప రక్త పీడనం లేదా   లో బీ పీ అంటారు.
మంచి ఆరోగ్య వంతులైన యువతీ యువకులకు  115/75 mm Hg రక్త పీడనం ఉండ వచ్చు. ఇట్లా ఉన్నప్పుడు , కేవలం సిస్టోలిక్ కానీ డయా స్టోలిక్ కానీ 20 mm Hg. కన్నా తగ్గినా  వారు లో బీపీ లక్షణాలు చూపిస్తారు.
లో బీపీ ఉంటే ఏమవుతుంది ? : 
లో బీ పీ వల్ల మన శరీరం లో ని  వివిధ భాగాలకు  అందవలసినంత ఆక్సిజెన్ అంటే ప్రాణ వాయువు అందదు. దాని వల్ల తల తిప్పటము, వికారం గా అవటము, కళ్ళు తిరిగినట్టయి క్రిందకు వాలిపోవడమో , లేక క్రింద పడిపోవడమో జరగవచ్చు.  దీనినే ఫెయింటింగ్ లేక fainting అంటారు. ఈ లక్షణము సాధారణంగా యుక్త వయసులో ఉన్న యువతులలో చూస్తుంటాము. వారు సాధారణంగా అతి నాజూకు గా ఉండి ఆహారం కూడా చాలా మితం గా తీసుకుని,  ఉదయం సరిగా తినక, కాలేజీ కి వచ్చి , అతి ప్రయాస పడటం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడ వచ్చు. అలాగే , ఋతుస్రావం ఎక్కువగా అయినా,  ఆహారం అశ్రద్ధ చేసి కాలేజీలకూ, వారి  కార్యాలయాలకూ , వచ్చి  కష్ట పడటం వల్ల కూడా , ఈ ఫెయింటింగ్  జరగవచ్చు.
లో బీ పీ కి ఇంకో అతి సామాన్య కారణం : అతి సారం. అంటే డయేరియా. మన భారత దేశం లో అన్ని వయసుల వారినీ ఈ అతి సారం ( అంటే సాధారణం గా బాక్టేరియా లేక వైరస్, లేక ఫుడ్ పాయిజానింగ్  వల్ల ) ప్రాణాంతకం అవుతుంది. ఈ అతిసార వ్యాధి ప్రబలినప్పుడు, మన శరీరం లోని ద్రవం, లవణాలు, ఎక్కువ పరిమాణం లో అతి తక్కువ సమయం లో పోయి బీ పీ చాలా పడి పోయి , అతి ప్రమాదకరం గా మారుతుంది.
పైన ఉన్న పటంలో  లో బీ పీ కి వివిధ కారణాలు చూడండి. 
ఇందులో గుండె కు సంబంధించిన కారణాలలో గుండె సరిగా కొట్టుకోక పోవడమూ , లేక గుండె కవాటాలు ఏ కారణం చేతనైనా సరిగా పనిచేయక పోయినప్పుడు కానీ , లేక రక్తం పరిమాణం అకస్మాత్తుగా తగ్గి పోవడం ( అంటే ప్రమాదాలలో రక్త స్రావం అవడం, లేక అతిసార వ్యాధికి ఫ్లూయిడ్స్  తగ్గి పోవడం అంటే బ్లడ్ వాల్యూం తగ్గి పోవడం , ( అంటే డీ హైడ్రేషన్ జరగడం )లాంటి కారణాలున్నాయి.
కొన్ని సమయాలలో  సెప్సిస్ ( sepsis )  జరిగినప్పుడు ( అంటే మన శరీరం లో   తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల , విష పదార్ధాలు  విడుదల అయి లో బీ పీ కలిగిస్తాయి ) అంటే అప్పుడు రక్త  పరిమాణం తగినంత ఉన్నప్పటికీ  ఇన్ఫెక్షన్ వల్ల  జనించిన వివిధ  విష పదార్ధాలు , వీటినే టాక్సిన్లు ( toxins ) అంటారు , అవి మన శరీరం లో ఉన్న రక్త నాళాలను తీవ్రం గా వ్యాకో చింప చేస్తాయి. దానితో లో బీ పీ ఏర్పడుతుంది.  దీనినే సెప్టిక్ షాక్
( septic shock ) అని అంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.
మీ స్నేహితులకు  www.baagu.net గురించి తెలియ చేస్తున్నారు కదూ ! 

హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి?.14.

In Our Health on మే 5, 2012 at 9:43 ఉద.

హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి?.14. 

మనం ఇప్పటి వరకూ గుండె, రక్తనాళాలకు సంబంధించిన వివరాలలో ,  హై బీ పీ అంటే అధిక రక్త పీడనానికి  కారణ  భూతమయే  రిస్కు ఫ్యాక్టర్ల గురించి వివరం గా తెలుసుకున్నాము. ఇందులో  నివారించ తగ్గ రిస్కు ఫ్యాక్టర్లు  మనం అశ్రద్ధ చేసిన కొద్దీ , వాటి ప్రభావం మన గుండె మీదా , రక్తనాళాల మీదా ఎంత తీవ్రం గా ప్రభావం చేస్తాయో  మనకు చాలా వరకు అవగాహన అయింది కదా!
ఇక మనం  హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాము .
హై బీ పీ అంటే అధిక రక్త పీడనం షుమారు తొంభై శాతం కేసులలో కారణం ఖచ్చితం గా తెలియదు అని. కానీ రిస్కు ఫ్యాక్టర్లు మనకు ఎక్కువ అవుతున్న కొద్దీ ( మనం ఎక్కువ చేసుకుంటున్న కొద్దీ  అనవచ్చు ) ఈ హై బీ పీ కూడా త్వరగా మనల్ని చేరి , చికిత్స కు కూడా  సరిగా కంట్రోలు కాక పోవచ్చు.
తల నొప్పి : తలనొప్పి చాలా సాధారణమైన  లక్షణం కదా ! అందు వల్ల మనం ఈ లక్షణాన్ని సాధారణం గా అశ్రద్ధ చేస్తుంటాము.  ఎందువల్ల నంటే , పని వత్తిడి ఎక్కువ గా ఉందనుకునో, లేక మనం ఉన్న చోట గాలి స్వచ్చం గా లేదనో , లేక చాలా ఇరుకు గా ఉన్న చోట అంటే crowded space లో ఉన్నామనుకునీ , ఈ తల నొప్పిని మనం అశ్రద్ధ చేస్తాము.  మరీ ఎక్కువ గా ఉంటె, క్రోసిన్ బిళ్ళలు కానీ,  బ్రూఫెన్ బిళ్ళలు కానీ వేసుకుని , కాఫీ అయినా , టీ అయినా తాగుతాము. విశ్రాంతి కూడా తీసుకుంటాము.
అంత వరకూ బాగానే ఉంది. మనం  జాగ్రత్త పడవలసినది ఎప్పుడంటే,  ఈ తల నొప్పి తరచూ వచ్చి, చాలా సమయం వరకూ తగ్గక పోవడం, లేక  అసలు తగ్గకుండా , అలాగే ఉండడమూ జరిగినప్పుడు అంటే అప్పుడు ఈ తల నొప్పిని పర్సి స్టెంట్ హెడేక్ లేక persistent headache అంటారు. ఇలా పర్సిస్టెంట్ హెడేక్ ఉండటం , హై బీ పీ లక్షణం కావచ్చు. ఇలా జరిగినప్పుడు అశ్రద్ధ చేయ కూడదు. కనీసం ఒక సారి అయినా  రక్త పీడనం , అంటే బీ పీ చెక్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గర కు వెళ్లి.
కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడం లేక చూపు స్పష్టం గా లేక పోవడం ( blurred vision or double vision ) : 
హై బీ పీ ఉన్నప్పుడు కళ్ళలో ఈ లక్షణాలు ఎందుకు ఉంటాయి ? : మనం తెలుసుకున్నాము కదా, అధిక రక్త పీడనం ప్రభావం ఎక్కువ గా అతి సన్నని , లేక సూక్ష్మ రక్త నాళాల మీద ఉంటుందని, అంటే కంటి లో, మెదడు లో , మూత్ర పిండాలలో , లేక , గుండె లో ఉండే రక్త నాళాలలో. అందు వల్ల కంటిలో దృష్టి మందగించినట్టు  అనిపించడమూ, లేక చూసే వస్తువు కానీ , చదివే అక్షరం కానీ చేదిరినట్టు అనిపించడమూ , లేక ఒక అక్షరం కానీ , వస్తువు కానీ రెండు గా కనిపించడమూ, జరుగుతుంటాయి.
ఇలా జరిగినప్పుడు,  కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళే ముందు, బీ పీ చెక్ చేయించుకోవడం ముఖ్యంగా చేయవలసిన పని. ఎందుకంటే, హై బీ పీ కనక ఉన్నట్టయితే,  కళ్ళ జోడు వాడినా, ఆ  లక్షణాలు తగ్గవు కదా !
ముక్కులో నుంచి రక్తం కారటం : ( epistaxis ): కొందరిలో అధిక రక్త పీడనం ఉన్నప్పుడు , వారి ముక్కు లోనుంచి రక్త స్రావం అవుతుంది. ఎందుకంటే, ముక్కు లో కూడా , అతి సున్నితమైన రక్త నాళాలు , అధిక రక్త పీడనానికి తట్టుకోలేక చిట్లి పోతాయి. అప్పుడు రక్త స్రావం అవుతుంది.  అందు వల్ల ఈ లక్షణాన్ని కూడా అశ్రద్ధ చేయ కూడదు.
ఇంకొందరిలో  అధిక రక్త పీడనం ఉన్నప్పుడు వారు అంతకు ముందు కంటే ఎక్కువ ఆయాస పడుతుంటారు , వారు చేసే పనులలో. ఇది కూడా హై బీ పీ లక్షణం కావచ్చు.
చూశారు కదా పైన ఉన్న లక్షణాలు అతి సాధారణమైనవి గా ఉన్నప్పటికీ,  హై బీ పీ కి మొదట కనపడే వార్నింగ్ సైన్స్ అవవచ్చు. మన నేత్రాలు కూడా ఈ లక్షణాలు చూపిస్తే, అప్పుడు మనం , మన మనో నేత్రం తెరిచి మనం తగు జాగ్రత్త తీసుకోవాలి కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !
(  ‘ బాగు ‘ మీకు నచ్చితే ,  మీ ‘ బాగు ‘ కోరుకునే మీ ప్రియ స్నేహితులకు కూడా ‘  www.te.wordpress. లో  www.baagu.net. గురించి చెపుతారు కదూ ! )

పురుషులలో గుండె పోటు లక్షణాలు ఎట్లా ఉంటాయి ?.13.

In Our Health on మే 4, 2012 at 8:03 ఉద.

పురుషులలో గుండె పోటు  లక్షణాలు ఎట్లా ఉంటాయి ?.13.

మనం క్రితం టపాలో  వివరంగా, స్త్రీలలో గుండె నొప్పి లక్షణాలు ఎట్లా బయట పడతాయో ! ఇప్పుడు పురుషులలో ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాము.
షుమారు అరవై శాతం పైగా పురుషులలో గుండె నొప్పి లక్షణాలు,  గుండె పోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలన లో తెలిస్సింది. కానీ తరచూ పురుషులు ముందు గా వచ్చే ఈ లక్షణాలను పట్టించుకోక అశ్రద్ధ చేస్తారని కూడా పరిశీలన లో తెలిసింది.
గుండె నొప్పి ఎట్లా ఉంటుంది? : 
గట్టి గా పిండినట్టు , తీవ్రమైన వత్తిడి తో ఉంటుంది. ఇలాంటి నొప్పి చాతీ కి మధ్య లో ఉంటుంది. కొద్ది నిమిషాలు ఉండవచ్చు ఈ నొప్పి. గుండె వేగం గా కొట్టుకోవడం అంటే సాధారణం గా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా.
డిస్కంఫర్ట్ : గుండె నొప్పి తో పాటు చాలా డిస్కంఫర్ట్ కూడా వీరు అనుభవించ వచ్చు. 
మిగతా భాగాలలో నొప్పి : లోపలి కడుపు భాగం లో నొప్పి , ఈ నొప్పి పైభాగం లో ఉన్న గుండె నొప్పి కలిగించే వత్తిడి వల్ల, క్రింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయం లో ఉన్నట్టు అనిపించవచ్చు ఈ నొప్పి. అందుకనే ఇలాంటి నొప్పిని అశ్రద్ధ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్ద్  పెయిన్ అంటారు . ( referred pain ) . ఎలాంటి నొప్పి భుజాలకూ ప్రత్యేకించి ఎడమ భుజానికీ, ఎడమ చేయి కీ , ఎడమ ముంజేతికీ పాకవచ్చు. అలాగే వీపు భాగానికీ, రెండు చేతి రెక్కల మధ్య భాగానికీ పాక వచ్చు అంటే ( between the shoulder blades ). ఇలా గుండె లో మొదలైన నొప్పి శరీరం లో మిగతా భాగాలకు పాక టానికి కారణం , గుండె కు మిగతా శరీర భాగాలకు నొప్పిని తెలియ చేసే నాడులు ఒకటే అవటం వలన.
ఊపిరి అందక పోవడమూ, కళ్ళు తిరిగినట్టూ, తల తిరిగినట్టూ , ఆత్రుత గా ఉండడము, వాంతులు రావడమూ, ఒళ్ళు  చమటలు పట్టడమూ,  తిన్న ఆహారం అరగనట్టు అనిపించడము కూడా జరగ వచ్చు .
పైన చెప్పిన లక్షణాలు , సాధారణం గా కనిపించేవి. కానీ  హార్ట్ ఎటాక్ లేక గుండె పోటు లక్షణాలు  కొద్ది తీవ్రత నుంచి , చాలా తీవ్రత తో ఉండి విపరీతమైన నొప్పి కూడా కలిగించ వచ్చు.
అలా కాకుండా, పురుషులలో  షుమారు నాలుగో వంతు కేసులలో , ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్ మయోకార్డియల్ ఇంఫార్క్షన్ అని అంటారు. ఎందుకంటే అది ఏ రకమైన ముందు లక్షణాలూ చూపించకుండా’ నిశ్శబ్దం గా  వస్తుంది కాబట్టి.  అందువల్లనే  ఛాతీలో నొప్పి ఎప్పుడు వచ్చినా, లేక అనుమానం గా ఉన్నా వెంటనే అత్యవసరంగా అంటే అర్జెంటు గా వైద్య సహాయం తీసుకోవాలి, అశ్రద్ధ చేయకుండా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 

స్త్రీలలో గుండె పోటు లక్షణాలు ఏమిటి ?.12.

In Our Health on మే 3, 2012 at 10:43 ఉద.

స్త్రీలలో గుండె పోటు లక్షణాలు ఏమిటి ?.12.

క్రితం టపాలో చదువుకున్నట్టు , ఈ గుండె పోటు లక్షణాలు , కేవలం గుండె నొప్పికే పరిమితం కాక, మిగతా లక్షణాలు, అంటే మిగతా అవయవ భాగాలు చూపించే లక్షణాలు గా కూడా కనిపించ వచ్చు. అయితే, ప్రధానం గా గుండె నొప్పి ఉంటుంది.
ఒక సూచన : ఇక్కడ మనం తెలుసుకునే విషయాలు గుండె నొప్పి ఎలా ఉంటుంది అన్న అవగాహన ఏర్పడటానికి, తగు జాగ్రత్తలు తీసుకోవడానికే !   ఆందోళన పడటానికీ, భయ పడటానికీ కాదు కదా !
గుండె నొప్పి : 
ఎందుకు వస్తుంది ?  : 
మనం మునుపటి టపాలలో వివరం గా చూశాము కదా ,  కరోనరీ ధమనులు , చెడు కొవ్వు చేరి ఎలా పూడుకు పోగలవో ! ఇలా పూడుకు పోయినప్పుడు, గుండె కండరాలకు సరిపడినంత ప్రాణ వాయువు అంటే ఆక్సిజెన్ అందక,  ఆ ప్రదేశం లోని గుండె కండరాలు  నొప్పి కలిగిస్తాయి. ఈ గుండె నొప్పి, లేక చాతీ నొప్పి, నాడులద్వారా అంటే నెర్వ్ ( nerves ) ద్వారా నొప్పి మనకు తెలుస్తుంది.
ఎలా ఉంటుంది ?: 
ఈ నొప్పి సాధారణం గా గుండె ను ‘ పిండి  వేసినట్టో, గట్టిగా ఒత్తి నట్లు కానీ,  ఉంటుంది. ఇలాంటి నొప్పి సాధారణం గా కొన్ని నిమిషాలు మాత్రమె ఉంటుంది, లేక వచ్చి , పోతూ , ఉంటుంది.
ఈ రకం గా చాతీ లో మొదలైన నొప్పి , వీపు కూ, భుజాలకూ , దవడ కూ, చేతులకూ , మెడకూ పాకుతున్నట్టు కూడా అనిపిస్తుండవచ్చు.  ఇలా జరగటం చాలా దిస్కంఫర్ట్  కలిగించ వచ్చు. ఆ ప్రదేశం అంతా నంబ్ గా అంటే మొద్దు బారినట్టు , స్పర్శ లేకుండా ఉన్నట్టు కూడా అనిపించవచ్చు.
ఇక శరీరం లో మిగతా భాగాలలో  లక్షణాలు : 
తల తిప్పినట్టుండడం,  విపరీతం గా అలసిపోయినట్టు అనిపించడం , ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించడం,  కడుపులో తిప్పుతున్నట్టు అనిపించి, ఆకలి మందగించడం , కడుపు లో మంట గా ఉన్నట్టు అనిపించడం,   కొన్ని సార్లు వాంతులు కూడా అవడం, శరీరం అంతా  చల్లని చెమటలు పట్టడం కూడా  జరుగుతుంది.
గుండె జబ్బు కు ఉండే రిస్కు ఫ్యాక్టర్లు మనం మునుపటి టపాలలో చూశాము కదా ! అలాంటి రిస్కు ఫ్యాక్టర్లు కూడా తోడైనప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉంటె, వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
గుండె నొప్పి లేకుండా , మిగతా లక్షణాలు అంటే మిగతా అవయవాలలో పైన చెప్పిన లక్షణాలు కనిపించడం అరుదు గా జరుగుతుంటుంది. అంటే సాధారణం గా గుండె నొప్పి తో పాటు మిగతా శరీర భాగాలలో లక్షణాలు కూడా కనిపిస్తాయన్న మాట.
వచ్చే టపాలో పురుషులలో  గుండె పోటు లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాము !

ACS అంటే యాంజైనా, హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏమిటి ?.11.

In Our Health on మే 3, 2012 at 9:42 ఉద.

ACS  అంటే  యాంజైనా, హార్ట్  ఎటాక్  లక్షణాలు ఏమిటి ?.11.

మనం ఇంత వరకూ , ఎక్యూట్ కరోనరీ సిండ్రోం లేక ACS or Acute Coronary Syndrome  లో గుండె కు సరఫరా చేసే రక్త నాళాల లో అంటే ధమనులలో జరిగే మార్పులు వివరం గా తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు  అలాంటి మార్పులు  ఎట్లా కనిపిస్తాయో , లేక  ఎట్లా అనుభవం అవుతాయో కూడా తెలుసుకుందాము. ఈ విషయాలు కూడా అందరూ ఉత్సాహం తో తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా ఉపయోగ పడవచ్చు.
ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం. ఈ ACS సంభవించినప్పుడు, మనం సమయానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఈ మార్పులు, మనం గమనించినా, అనుమానించినా, వెంటనే వైద్య సహాయం అందేట్టు చూడాలి. ఎందుకంటే, అత్యంత ఆధునిక చికిత్సా పద్ధతులతో,  ACS లో జరిగే మార్పులను నియంత్రించి,  మరణాలను నివారించ డమూ , లేక చాలా వరకూ తగ్గించడమూ చేయ వచ్చు.  అందుకే  ఇలాంటి మార్పులు జరిగిన వెంటనే ఉన్న అరవై నిమిషాలనూ , గోల్డెన్ అవర్ ( golden hour )అంటారు. అంటే ఈ బంగారు గంట లో మనం తీసుకునే చర్యలూ , అందే సహాయమూ , ఎంతో విలువైనవి ! సరి అయిన సమయం లో సరి అయిన చికిత్స కు అందుకే అంత ప్రాముఖ్యత ! 
ఇక ACS లక్షణాలు ఎలా కనిపిస్తాయి? : 
ఈ లక్షణాలను మనం వివరంగా తెలుసుకుందాము. ప్రధానం గా గుండె నొప్పి , లేక చాతీ లో నొప్పి.  ఈ గుండె నొప్పి కాక, అనుభవించే మిగతా లక్షణాలు.
మనకు తెలుసు కదా ! ACS లో కరోనరీ ధమనులు కొన్ని మార్పులకు లోనవుతాయని. ఈ మార్పుల తీవ్రత బట్టి , బయటకు కనిపించే లక్షణాలు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు పై పటం చూడండి. అందులో గుండెకు  రక్తం సరఫరా చేసే ఈ కరోనరీ ధమనులు పాక్షికం గా నూ, లేక సంపూర్ణం గానూ మూసుకుంటే ఎలా కనిపిస్తాయో  చక్కగా చూపబడింది.
వచ్చే టపాలో  ముందు గా స్త్రీలలో ఈ ACS లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాము !

ACS లో ఏ ఏ మార్పులు జరుగుతాయి ?.10.

In Our Health on మే 2, 2012 at 6:58 సా.

ACS లో ఏ ఏ మార్పులు జరుగుతాయి ?.10.

ACS లో జరిగే మార్పులు కొంత వరకు మనం నిన్నటి టపాలో తెలుసుకున్నాము. (  మళ్ళీ నిన్నటి టపాలో పటాన్ని గమనించి మిగతా మార్పులు క్రింద చదువుతూ , అదే పటం లో చూడండి.)
అంటే ఫిక్సెడ్  కరోనరీ అబ్స్త్రక్షన్  వరకూ. ఫిక్సెడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ అంటే  ‘ యాంజైనా ‘ అన్న మాట. ఈ పరిస్థితిలో  గుండె కండరాలకు సరఫరా చేసే రక్తం  పూర్తిగా ఆగిపోదు కానీ చాలా తక్కువ గా అందుతుంది.
ఇలా ఫిక్సెడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ జరిగిన తరువాత , ఆ ధమని లో మార్పులు రెండు రకాలు గా ఉండవచ్చు. ఒక రకం లో కరోనరీ ధమని ఇంకా , ఇంకా పూడుకు పోయి , సివియర్ ఫిక్సెడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ గా మారవచ్చు.
 అంటే ఇక్కడ అబ్స్త్రక్షన్ లేక  రక్తనాళం ‘ పూడుకు పోవడం ‘ తీవ్రం గా ఉంటుందన్న మాట.
ఇక రెండో రకమైన మార్పులలో  ధమని లో ఏర్పడ్డ ప్లేక్ లేక plaque కొద్ది గా  ‘ పెచ్చు ‘ ఊడినట్టు గా అవుతుంది.  ఈ ఉదాహరణ ఊహించుకోండి.  మనమందరం మన బాల్యం లో కనీసం కొన్ని సార్లు అయినా ఆటల్లో కింద పడి పోయినప్పుడు, మన  మోకాలో , మోచేయో  ‘ దోక్కు ‘ పోవడం మన అనుభం లోనిదే కదా ! ఇలా జరిగిన కొన్ని రోజులకు  ఆ దోక్కు పోయిన చోట పెచ్చు, చెక్కు ,  లేక ‘ scab ‘ ఏర్పడుతుంది కదా !  ఈ పెచ్చును మనం పొరపాటున అంటే తొందరగా గాయం మానాలనే ఆత్రుతతో మనమే తీయటానికి ప్రయత్నిచే వాళ్లము కదా! అప్పుడు ఆ పెచ్చు తీయగానే, ఆ ప్రాంతం లో మళ్ళీ కొద్దిగా రక్తం రావడమూ, మళ్ళీ కొత్త ‘ పెచ్చు ‘ లేక scab ఏర్పడడమూ కూడా మన అనుభవం లోనిదే కదా!
అలాగే  ప్లేక్  కూడా ‘ పెచ్చు ‘ లేచినట్టు అవుతుంది. దీనినే ప్లేక్ డిస్రప్ షన్  ( plaque disruption ) అని అంటారు.  ఆ పరిస్థితి లో మళ్ళీ ఆ ప్రదేశం లో రక్తం లోని  ప్రత్యెక రక్త కణాలు , వాటిని ప్లేట్ లెట్స్ ( platelets ) అని పిలుస్తారు ఎందుకంటే అవి చిన్న ప్లేట్ ల లాగా ఉంటాయి అంటే పళ్ళెం  ఆకారం లో ఉంటాయి కనుక, ఈ ప్లేట్ లెట్స్ కొన్ని చేరి  అక్కడ ఏర్పడిన ‘ చిన్న గాయం ‘ ను మళ్ళీ మూసివేసే ప్రయత్నం చేస్తాయి. ఇలా చేయడం  వల్ల, ప్లేట్ లేట్  ల సముదాయం లేక గుంపు ను  త్రాంబస్ లేక ‘thrombus’ అంటారు.
ఈ త్రాంబస్ ఒక సారి ఏర్పడ్డ తరువాత  రెండు పరిణామాలు జరగ వచ్చు.
ఒకటి: మళ్ళీ ఈ త్రాంబస్  మాని పోయి ఒక సున్నితమైన చెక్కు కట్టడం. ఇలా చెక్కు కట్టి నప్పుడు,  అసలే కొంత సన్న బడ్డ ధమని వ్యాసం ఇంకొంత తగ్గి , సివియర్ కరోనరీ అబ్స్త్రక్షన్  లేక severe fixed coronary obstruction గా మారుతుంది. ఇలా జరగటం  తో  క్రానిక్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్  అన బడుతుంది అట్లాంటి పరిస్థితి. క్రానిక్ అంటే దీర్ఘ కాలం, ఇస్కీమిక్ అంటే రక్త సరఫరా లేక పోవడం, హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు.
ఇక రెండో పరిణామం, ఈ త్రాంబస్ లేక ప్లేట్ లెట్ ల గుంపు మళ్ళీ ఊడి పోయి  అంటే ప్లేక్ దిస్రప్షన్ జరిగి ఆ చోట నుంచి ఇంకా రక్తం వచ్చి, మళ్ళీ త్రాంబస్ ఏర్పడి  ఆ ప్రదేశాన్ని , పూర్తిగా మూసి వేస్తుంది. అప్పుడు ఆ పరిస్థితిని మయోకార్డియల్ ఇంఫార్క్షన్ లేక గుండె పోటు అంటారు. అంటే ఈ పరిస్థితి లో గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఒకటి సంపూర్ణం గా మూసుకొని పోయి , ఆ ప్రాంతం లో ఉన్న గుండె కండరాలకు రక్తము , అంటే రక్తం లో ఉన్న ప్రాణవాయువు అంటే ఆక్సిజెన్ అందక, పనిచేయడం ఆగుతుంది. (  పైన ఉన్న పటం లో ఈ మార్పులు గమనించండి. అలాగే మిగతా మార్పులు క్రితం టపాలో ఉన్న పటం లో చూసి గమనించండి ) .
ఇలా ఒకసారి  ఏర్పడిన ప్లేక్ రెండో రకం గా ఎందుకు పరిణామం చెంది , plaque disruption లేక ఏర్పడ్డ చోటునుంచి ‘ ఊడిపోతుందో ,  కారణం స్పష్టంగా ఇప్పటి వరకూ మనకు తెలియదు. అధిక రక్త పీడనము, మిగతా రిస్కు ఫాక్తర్లూ కలిసి, ఇలా జరుగుతుందని భావించ బడుతుంది.
మిగతా విషయాలు వచ్చే టపాలో తెలుసుకుందాము !

ACS లో ఏమి జరుగుతుంది ?.9.

In Our Health on మే 1, 2012 at 8:03 సా.

ACS లో ఏమి జరుగుతుంది ?.9.:

క్రితం టపాలో చూశాము  కదా !  మనం అసలు ACS గురించి ఎందుకు తెలుసుకోవాలో !
ఇప్పుడు ACS లో  ఏ ఏ  మార్పులు జరుగుతాయో చూద్దాము.  మీరు ఈ  విషయాలు ఉత్సాహం తో తెలుసుకుంటున్న కొద్దీ మీకు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతున్నట్టే కదా !
మనం పైన ఉన్న పటం సహాయం తో ఈ మార్పులను గమనించ వచ్చు.
ఇప్పటి వరకూ మనం రక్త నాళాన్ని కేవలం ఒక గొట్టం లేక పైపు గానే అనుకుంటున్నాము కదా ! ఎందుకంటే మనం పైపు అనగానే మనకు నిత్య జీవితం లో మనం చూసే పైపు లేక పంపు స్పురణకు వస్తుంది.  అలాంటి పైపు ఒకే ఒక లోహం తో చేయబడి ఉంటుంది. పైపును బట్టి దాని మందం మారుతుంది. కానీ మన దేహం లో ఉండే రక్త నాళాలు మూడు పొరలు గా నిర్మితం అయి ఉంటాయి.
ఈ పటం లో మొదటి ఎర్రటి వలయం  ఒక కరోనరీ ధమని చిత్రం అంటే గుండెకు రక్త సరఫరా చేసే రక్త నాళం అని మనం తెలుసుకున్నాము కదా!
ఇందు లోని మూడు పొరలనూ చూడండి.  బయటి పొరను అడ్వెంటి షియా  పొర ( adventitia )అని అంటారు. ఇక మధ్య పొరను మీడియా ( media ) అంటారు. ఇక లోపలి పొరను ఇంటిమా ( intima ) అని పిలుస్తారు.  ఈ లోపలి పొరలో ప్లేక్ ఫార్మేషన్ అటే  కొవ్వు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ లోపలి పొర కే కదా రక్తం నేరుగా తగిలేది.  ఒక ఉదాహరణ ఊహించుకోండి. మనకు నీరు సరఫరా చేసే పంపు లలో  నీరు లోపలి నుండే ప్రవహిస్తుంది కదా ! అట్లాగే  రక్తనాళం అంటే ఇక్కడ కరోనరీ ధమని లో కూడా రక్తం ఇంటిమా కు ఆనుకునే ప్రవహిస్తుంది కదా !
అందుకనే, మనం తినే ఆహారం లో ఉన్న కొవ్వు , మన కడుపు లో జీర్ణమై ,చిన్న ప్రేగు లో నుంచి కైలోమైక్రానుల రూపం లో రక్తం లో కలుస్తుంది. ఇలా కైలో మైక్రానుల రూపం లోని కొవ్వు లో ఉండే చెడు కొవ్వు అంటే హాని కలిగించే LDL  కొవ్వు ,  ఇలా ఇంటిమాకు అతుక్కొని ప్లేక్  ఏర్పడుతుంది.  మనకు అర్ధమవడం కోసం ఈ మొదటి చిత్రం అంటే  ధమని మధ్య లో తెల్లగా ఖాళీ గా చూపించారు. కానీ మన దేహం లో ఏ రక్త నాళమూ ఖాళీ గా  రక్తం లేకుండా ఉండదు కదా !   ఇలా నార్మల్ గా అంటే సహజం గా ఉండే ధమని లో ప్లేక్ ఏర్పడి నప్పుడు ఎట్లా ఉంటుందో రెండో   చిత్రం లో చూడండి. ఇలా చాలా కాలం తరువాత జరుగుతుంది. అంటే కొన్ని ఏళ్ళు పట్ట వచ్చు.  రిస్కు ఫాక్తర్లు ఎన్ని ఎక్కువ అయి , అవి ఎంత తీవ్రత గా ఉంటే , అంత త్వర గానూ ఈ ప్లేక్ లేక చెడు కొవ్వు పెరుకోవడం జరుగుతుంది.  ఈ రెండో చిత్రం లో చంద్రాకారం లో మొదట ఉన్న ధమని వ్యాసం కాస్తా అర్ధ చంద్రాకారం అయింది కదా ! అంటే ఆ ధమని లో సరఫరా అవుతున్న రక్తం లో మామూలు కన్నా సగం మాత్రమె ప్రవహిస్తున్నట్టే కదా ! ఇక్కడ గమనించ వలసినది ఈ రెండవ ధమని పూర్తిగా మూసుకు పోలేదని. ఈ పరిస్థితి ని ఫిక్సడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ ( fixed coronary obstruction ) అంటారు. ఇలా జరగటం వల్ల గుండె ఆ ధమని చుట్టూ ఉన్న గుండె కండరాలకు సగం మాత్రమె రక్తం సరఫరా అయి, అది మనకు  యాంజైనా లేక angina  రూపం లో నూ, లక్షణాల తోనూ బయట పడుతుంది. 
వచ్చే టపాలో మిగతా మార్పులు కూడా ఇదే పటం తో తెలుసుకుందాము !

ఎ సి ఎస్ ( ACS ) గురించి ఎందుకు తెలుసుకోవాలి ?.8.

In Our Health on మే 1, 2012 at 11:38 ఉద.

ఎ సి ఎస్  ( ACS ) గురించి ఎందుకు తెలుసుకోవాలి ?.8.

ACS అంటే  ఎక్యూట్  కరోనరీ సిండ్రోం లేక (  Acute Coronary Syndrome ).
ఈ  వైద్య  సాంకేతిక నామం చూసి కంగారు పడనవసరం లేదు.  ఎక్యూట్  అంటే అకస్మాత్తు గా వచ్చేది. కరోనరీ అంటే గుండెకు సరఫరా చేసే రక్తనాళం ( దీనిని ఆర్టరీ లేక ధమని  అంటారు )  అని పేరు. సిండ్రోం  అంటే  కొన్ని లక్షణాల  సముదాయం.
గుండె పోటు లేక హార్ట్ ఎటాక్, గుండె నొప్పి  లేక యాంజైనా – ఈ రెండిటి నీ కలిపి వైద్య పరిభాష లో  ACS అంటారు. 
ఇప్పుడు పూర్తి గా తెలుగులో  ACS ను ‘  గుండె కు సరఫరా చేసే ధమనులలో మార్పుల వల్ల  వచ్చే లక్షణాల  సముదాయం ‘ అని చెప్పుకుందామా ?! వద్దు లెండి. క్లుప్తం గా ACS అనే అనుకుందాము.
ఎలా పిలిచినా అసలు కధ ఏమిటి ? మనం ACS గురించి ఎందుకు తెలుసుకోవాలి ?: 
హృదయం ఉన్న ప్రతి వారికీ ,  హృదయం లేక గుండె సరిగా పని చేయ లేక పోతున్నప్పుడు కలిగే లక్షణాలు తెలుసుకోవడం శ్రేయస్కరం. ( అంటే ఇక్కడ దయ చేసి పై వాక్యాన్ని శాస్త్రీయం గా చూడండి , సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య  ఒక డైలాగు లా కాక ! )
అందు వల్ల ఆ లక్షణాలు  త్వరగా గమనించి , తగు వైద్య సలహా, సహాయం తీసుకోడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.  వైద్య శాస్త్ర విజ్ఞానం ఎంతో అభి వృద్ధి చెంది , అనేక  చికిత్సా పద్దతులు  వాడుక లోకి వచ్చాయి కదా !  పేరు లోనే ఉన్నట్టు , గుండె లో  అకస్మాత్తు గా వచ్చే ఈ మార్పులను సరిచేయడం ఎంత తక్కువ సమయం లో జరిగితే అంత మంచిది. అందు వల్ల అందరూ  ACS గురించి తెలుసుకోవడం మంచిది.
ఇప్పుడు అసలు విషయం : 
క్రితం టపాలో చూశాము మనం రక్త నాళాలలో జరిగే మార్పులు ప్లాక్ ఫార్మేషన్ కు ఎలా కారణమవుతాయో ! ACS లో జరిగేదీ ఇదే !
అంటే గుండె కు సరఫరా చేసే  రక్త నాళం, దీనినే కరోనరీ ధమని అంటారు.  ఈ కరోనరీ ధమనులలో జరిగే మార్పుల తీవ్రత బట్టి , ఆ  మార్పు కు లోనైన ధమని పాక్షికం గా కానీ, పూర్తి గా కానీ ‘ పూడుకు ‘ పోతుంది.  అంటే బ్లాక్ అవుతుందన్న మాట.  ఇలా పూడుకు పోయినప్పుడు, గుండె కండరాలకు రక్తం సరఫరా కాక, గుండె సరిగా కొట్టుకోవడం జరగదు. మనకు తెలుసు కదా ! మన దేహం లో ఏ భాగం , ఏ కండరం పని చేయాలన్నా , ఆ భాగానికీ , ఆ కండరానికీ , రక్త సరఫరా సరిగా జరగాలనీ, ( ఇక్కడ రక్త సరఫరా లో ముఖ్యం గా జరుగుతున్నది, ప్రతి చోటా ఉన్న జీవ కణాలకు , ప్రాణ వాయువు అంటే , ఆక్సిజెన్ సరఫరా జరుగుతున్నదని అర్ధం చేసుకోవాలి మనం )
పై పటం లో గుండె కు సరఫరా చేసే ఒక ధమని పూడుకు పోవడాన్ని చూపించారు ఉదాహరణకు
( గుండె కు రక్తాన్ని సరఫరా చేసే ప్రతి ధమనికీ ఒక పేరు ఉంది. పై చిత్రం లో చూపించిన ధమనులు  రెండు. వాటిని లెఫ్ట్ యాన్టీరియర్  దిసేన్దింగ్  ఆర్టరీ అనీ రైట్ యాన్టీరియర్ దిసేన్దింగ్ ఆర్టరీ అనీ అంటారు.  ) 
 వచ్చే టపాలో  ACS  లో  ఏమి జరుగుతుందో తెలుసుకుందాము !