Our Health

పాజిటివ్ సైకాలజీ – ఎంగేజ్ మెంట్ .9.

In మానసికం, Our minds on మే 23, 2012 at 10:37 సా.

పాజిటివ్ సైకాలజీ – ఎంగేజ్ మెంట్ .9.

 
పాజిటివ్ సైకాలజీ లో భాగం గా , అధికానందానికి సూత్రాలు లేక కిటుకులు చూస్తున్నాము కదా మనం ఇప్పటిదాకా. ఇపుడు ఇందులో భాగం గా ,  ఎంగేజ్ మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనకు తెలుసు కదా !  దీనిని సామాన్యం గా మనం పెళ్లి నిశ్చితార్ధం గా చెప్పుకోవచ్చు ఆంగ్లంలో ! కానీ ఒక పని లో నిమగ్నం అవడాన్ని కూడా ఎంగేజ్ మెంట్ అంటారు. అంటే ఇక్కడ మనం ఆశావాద మనస్తత్వం అనే ఒక ఆశయం  లో పూర్తిగా ఎంగేజ్ అవడం అనమాట అంటే నిమగ్నం అవడం.
మనం  ఇట్లా  పాజిటివ్  లేక ఆశావాద మనస్తత్వం అనే ఆశయం లో  ఏ విధం గా  పూర్తిగా నిమగ్న మవగలం ?
1. బలమైన మానవ సంబంధాలు ఏర్పరుచుకోవడం: పాజిటివ్ సైకాలజీ లో అత్యంత ప్రాధమిక సూత్రం ఏదైనా ఉందంటే అది , బలమైన మానవ సంబంధాలు ఏర్పరుచుకోవడమే ! అవి తల్లి దండ్రులతోనయినా, తోబుట్టువులతోనయినా, స్నేహితులతో నైనా , ఇంకేవరితోనైనా అవవచ్చు. మన జీవితాలలో అత్యంత సంతృప్తి ని ఇచ్చేది కూడా ఇదే నని భావించ బడుతుంది. ఎందుకంటే , మానవులకు డబ్బు ఒక దశ వరకే మన జీవితం లో మనం పొందే ఆనందానికి కొలమానం గా ఉంటుంది. మొత్తం మీద మన జీవితానందం లో ధనం ప్రభావం, ఒక దశ వరకే పరిమితమై ఉంటుందని  ప్రపంచం మొత్తం మీద వివిధ దేశాలలో ప్రజల మీద చేసిన పరిశీలనల వల్ల విశదమయింది. అంటే  ‘ ధన మూల మిదం జగత్ ‘ అనే నానుడి  ఈ ప్రపంచానికి వర్తిసుందేమో కానీ,  మన  ఆనంద మయ జీవితాలకు పూర్తిగా వర్తించదు.
మానవుడు సంఘ జీవి. అంటే తన తోటి  మానవులతో కలిసి జీవించడం మానవుల స్వభావం. అందు వల్ల  మనం మానవ సంబంధాలకోసం అందులో పటిష్టమైన మానవ సంబంధాలకోసం  మన  సమయాన్నీ , శక్తి యుక్తులనూ  వెచ్చించి  ప్రయత్నాలు చేసి  ,సఫలీకృతం కావాలి.  అలా ఏర్పడిన సంబంధాలు మన జీవితానందాన్ని ఇనుమడింప చేస్తాయి.  ఈ సంబంధాలు , ప్రాధమిక మానవ జీవిత విలువల మీద ఆధార పడి ఉండాలి కానీ నిరంతరం స్వీయ శ్రేయస్సు ను కోరుతూ చేసేవి కాకూడదు. కేవలం స్వార్ధ పూరితంగా ఏర్పరుచుకునే మానవ సంబంధాలు ,బుద్బుద ప్రాయం అవుతాయి. ఆధునిక  సాంకేతిక అభివృద్ధి  లో మానవులకు ,  అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అనేక మైన అవకాశాలు  తెరిచింది, మానవ సంబంధాలకోసం. కానీ అవి బలీయం అయేది, కేవలం, మానవతా విలువల పునాదుల మీదే.
అందువల్ల చక్కటి ఆరోగ్య వంతమైన మానవ సంబంధాలు ఏర్పరుచు కోవడం ,  జీవితం లో పాజిటివ్ గా, అంటే ఆశావాద దృక్పధం తో ముందుకు పోతూ ,  అధికానందం పొందడానికి ఎంతో ముఖ్యం. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులతో నిమగ్న మవుదాము  ఆశావాద జీవితం కోసం !

వ్యాఖ్యానించండి