Our Health

పాజిటివ్ సైకాలజీ తో అధికానందానికి సూత్రాలు.4.

In మానసికం, Our minds on మే 20, 2012 at 12:08 సా.

పాజిటివ్ సైకాలజీ తో అధికానందానికి సూత్రాలు.4.

మునుపటి మూడు టపాలలో , పాజిటివ్ సైకాలజీ అంటే ఏమిటి ? దానిని మన నిత్య జీవితం లో అనుసరిస్తే పొందే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము కదా ! 
ఇప్పుడు చదువరులంతా మరి పాజిటివ్ సైకాలజీ ని ఎట్లా అనుసరించాలి, ఆ పద్ధతులు ఏమిటో తెలుసుకోవాలని ఉత్సాహ పడుతున్నారు కదా ?! మరి తెలుసుకుందాం !
మనమందరం,  సామాన్యం గా మన జీవితాలలో ఆనందాన్ని పొందుతూ ఉంటాము. ఎంతో కొంత ! అది మనం చేసే పని ఏదయినా కావచ్చు. అంటే మనం తినే ఆహారం అయినా ఆడే ఆటలు , పాడే, లేక వినే సంగీతం అయినా , కామపరమైన సంబంధాలలోనైనా,   కుటుంబం,  లేక స్నేహితులతో , బంధువులతో గడిపే సమయం  అయినా ( బంధువులు ఒక నెల మన ఇంట్లో ‘తిష్ట ‘ వేస్తే, విషయం వేరుగా ఉంటుందనుకుంటాను ! ).
కానీ మనం రోజూ, లేక , తరచూ చేసే ఈ చర్యలలో,  కొంత ఆనందం మాత్రమె పొందుతూ ఉంటాము. ఇంకో విధం గా చెప్పాలంటే, సంపూర్ణం గా ఆనందం పొందలేక పోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది,  అలా మనం కావాలని చేయకపోయినా ! 
ఎందువల్ల ఇలా జరుగుతుందని  నిశితం గా పరిశీలిస్తే , కొన్ని స్పష్టమైన కారణాలు దర్శనమవుతాయి.
ఉదాహరణకు ,  ఉదయమే లేచి చక్కటి ఉపాహారం , అదే బ్రేక్ ఫాస్ట్ , తిందామని  అనుకోండి. మీకు ఇష్టమైనవి,  వేడి వేడి గా తయారయి, టేబుల్ మీద ప్రత్యక్షమవుతాయి. అది మీకు తెలిసేది మీ చుట్టూ వస్తూన్న వాసనల ద్వారానే,ఎందుకంటే, మీ ‘ దృష్టి ‘ మీ చేతులో ఉన్న సెల్ ఫోను వైపో, లేక , మాగజైన్ లోనో , లేక మీ ఆలోచనలు ,  మీరు చేరవలసిన గమ్యానికి వెళ్ళే దోవ లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, ఎంత సేపవుతుందో, లేక మీరు చేయ వలసిన ఉద్యోగం లో వత్తిడుల గురించో ఇలా మనసు పరి పరి విధాల ‘ పరుగు ‘  తీస్తూ ఉంటుంది.  ‘తిన్నామనిపించి ‘ బ్రేక్ ఫాస్ట్  ‘ పూర్తి ‘ చేసి బయలు దేరుతారు.   
ఇంకో ఉదాహరణ తీసుకోండి:  ప్రకాశరావు ఇంటి  దగ్గరలో,   రెండు మైళ్ళ దూరం లో ఉన్న బడి లో టీచరు. ఉదయమే లేచి కాల కృత్యాలు ముగుంచుకుని,  టేబుల్ ముందు కూర్చున్నాడు. భార్య శుక్ర వారం అవటం తో  తడి ఆరని కురులు తన నయనాలకు అడ్డం వస్తుంటే సరి చేసుకుంటూ, స్టీం చేసిన ఇడ్లీల పళ్ళెం టేబుల్ మీద పెడుతుంటే , నిశితం గా పరిశీలిస్తున్నాడు, ‘ ఇవాళ నీలో ఏదో కొత్త అందాలు కనిపిస్తున్నాయోయ్ ! అన్నాడు కొద్దిగా తడిసిన ‘ ఆమె ను’  క్రీగంట  చూస్తూ ‘ . భార్య తడబడుతూ ‘ తన వైపు ‘ అప్రయత్నం గా క్షణం పాటు చూసుకుని, మందస్మిత వదనం తో ఆ గది లోంచి వెళ్ళింది.  ఇడ్లీ తింటూ, ‘ వెన్న లా కరిగిపోతున్నాయి నోట్లో,  చట్నీ కూడా , ఆవాలతో తాలింపు పెట్టావంటుకుంటాను, కమ్మ గా ఉంది , ఇంకో రెండు ఇడ్లీలు వేస్తావూ ‘ అని, తిని , సైకిల్ తీసుకుని  బయల్దేరాడు బడి వైపుకు. ( దీనంతటికీ కూడా ఎక్కువ సమయం అయి ఉండదు కదా ! ) 
పై ఉదాహరణలు మన ఆహారం విషయం లో, మనం  అదే ఆహారాన్ని వేరు వేరు పరిస్థితులలో ఎట్లా ఆస్వాదించ గలమో తెలుపుతున్నాయి కదా !  మీరు చెప్పగలరు కదా దేనిలో ఎవరు ఎక్కువగా ఆ సామాన్య రుచులను అధికం గా ఆస్వాదిస్తున్నారో ! 
మనం మన జీవితాలలో ఇలాంటి  ఆనంద కర సమయాలు రోజూ, లేక తరచూ ఎన్నో ఉంటాయి కదా ! ఈ సమయాలలో  అధికానందం పొందలేక పోవడానికి ముఖ్య కారణం   మనం ఆ  ‘ జీవిత రుచులను ‘ సరిగా , ఆస్వాదించలేక పోవడమే !
వచ్చే టపాలో   మన  జీవిత రుచులు  ఆస్వాదించడానికి చిట్కాలు లేక సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము ! 

వ్యాఖ్యానించండి