సోషల్ ఫోబియా కు చికిత్స.4.
సోషల్ ఫోబియా ఎంత సామాన్యం ?: ప్రతి వంద మంది లోకీ అయిదుగురు ఈ సోషల్ ఫోబియా తో బాధ పడుతూ ఉంటారు.
ఈ సోషల్ ఫోబియా దీర్ఘ కాలం గా ఉంటే దాని పరిణామాలు ఏమిటి ?:
క్రితం టపాలో చెప్పుకున్నట్టు, సోషల్ ఫోబియా ఉన్న వారు, నలుగురి లోకీ చొరవగా వెళ్ళ లేక , తమ శక్తి సామర్ధ్యాలను వంద శాతం బయట పెట్టలేక , తీవ్రమైన మానసిక వత్తిడికీ , సంక్షోభానికీ లోనవుతుంటారు. అప్పుడు వారికి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. క్రమేణా వారు బయటకు వెళ్ళడమూ , పది మంది లో కలవడమూ , పదిమంది లో జంకు లేకుండా మాట్లాడడమూ , లేదా తమ తమ పనులు చేసుకోవడమూ కూడా చేయలేక పోతారు. ఈ లక్షణాలు ఇంకా ఇంకా ఉంటే , వారు క్రమేణా బయటకు వెళ్ళాలంటే నే ఉత్సాహం చూపరు. బయటకు వెళ్ళాలంటే భయం ఏర్పడుతుంది. క్రమేణా వారు వెళ్ళే ప్రదేశం లో జన సంచారం ఏమాత్రం లేకపోయినా , వారు లేని పోని భయాలు ఏర్పరుచుకుని , విపరీతమైన భయానికి లోనవుతారు. ఈ పరిస్థితిని శాస్త్రీయం గా అగారో ఫోబియా ( agorophobia ) అని అంటారు. ఇంకా వీరు ఇంట్లో కూర్చొని ఆందోళన చెందుతూ , చెడు అలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం కూడా ఉంది. అంటే ధూమ పానం , మద్య పానం లాంటివి. ఇంకా కొందరు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి కూడా అలవాటు పడతారు.
సోషల్ ఫోబియాకు కారణాలు ఏమిటి ?:
ఈ సోషల్ ఫోబియా కు ఇతమిద్ధం గా కారణాలు అంటూ ఏవీ లేవు. వ్యక్తిగతం గా తమ ప్రతి ప్రవర్తనకూ ఉన్నత ప్రమాణాలు ఉండాలని భావిస్తూ , ఖచ్చితమైన నిబంధనలు పాటించే వారిలో , ఈ రకమైన ఫోబియా రావడానికి అవకాశాలు మెండు గా ఉంటాయి. అంతే కాకుండా, ఇట్లాంటి ఉన్నత ప్రమాణాలను, వారు చేసే ప్రతి పనిలో చిన్న తనం నుంచీ , వారి మీద రుద్దే వారు ( అంటే పెద్ద వారూ , తలి దండ్రులూ , టీచర్లూ ) ఉన్నప్పుడు కూడా , ఈ లక్షణాలు అలవడ వచ్చు.ఇంకా బాల్యం లో తత్తర పడుతూ , నత్తి ( అంటే స్టామరింగ్ ) ఉన్న వారు కూడా , పెరిగి పెద్దయాక , ఈ సోషల్ ఫోబియా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
ఒక సారి ఈ సోషల్ ఫోబియా వచ్చాక , అది ఎట్లా కొనసాగుతుంది ?:
స్వంత అపోహలూ ఆలోచనలూ !
1. ” నేను వెళ్ళే ప్రతి చోటా , కలిసే వారితోనూ , చాలా తెలివిగా ప్రర్తించాలి ! అంతే కాక , నేను ఉన్న చోట ( అంటే పదుగురిలో ఉన్నప్పుడు కూడా ) పరిస్థితులన్నీ ,నా నియంత్రణ లోనే ఉండాలి ” అనే భావనలు .
2. ” నేను చాలా బోరింగ్ , నాలో ఏవీ ఉత్సాహ కరమైన లక్షణాలు లేవు ” అనే ఆత్మ న్యూ నతాభావనలు.
3. ” నేను ఎక్కడ ఉన్నా , ఇతరులు నన్ను విమర్శించే ఉద్దేశం తో , నాలో లోపాలు వెదుకుతూ ఉంటారు” అనే భావన.
4. ప్రవర్తన పంచనామా : అంటే ప్రతి సారీ , నలుగురి లో కలిసే ముందూ , కలిసిన తరువాతా కూడా , తమ ప్రవర్తనను విశ్లేషించు కుంటూ , అన్నీ నెగెటివ్ అంటే నిరాశా వాద , భావనలే నెమరువేసుకుంటూ ఉండడం వల్ల.పైన చెప్పిన నెగెటివ్ భావనలు మనసు లో ఎప్పుడూ మెదులుతూ ఉంటే , ఈ ఫోబియా మొక్క కూడా ఆ ” ఆలోచనల నీరు ” తాగుతూ, వృద్ధి చెందుతూ ఉంటుంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Good, very educative articles. Keep it up.