Our Health

Archive for జనవరి 17th, 2013|Daily archive page

రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health on జనవరి 17, 2013 at 7:49 సా.

రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? : 

 
రక్త హీనత ( అనీమియా )  లక్షణాలు ,  ఆ వ్యాధి వచ్చినప్పుడు ఉన్న వయసు ను బట్టి ఉంటాయి ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన ఇంకో ముఖ్య విషయం :అనీమియా కేవలం ఇనుము లోపం వల్ల నే కాకుండా , B  విటమిన్ల లోపం ఉన్నప్పుడు కూడా వస్తుంది. లోపానికి కారణం ఏదైనా , అనీమియా లక్షణాలు ఒకే రకం గా ఉంటాయి. ఆ లక్షణాల తీవ్రత కూడా అది వచ్చిన వయసు ను బట్టి మారుతుంటుంది ! 
ఉదాహరణకు : పిల్లలు పెరిగే వయసులో కనుక అనీమియా లేదా రక్త హీనత కలిగితే , పిల్లల పెరుగుదల కుంటు  పడుతుంది.
గర్భిణీ స్త్రీలలో కనుక అనీమియా ఉంటే , గర్భం లో ఉన్న శిశువు పెరుగుదల కూడా సరిగా ఉండక పోవచ్చు. 
విద్యార్ధులలో కనుక అనీమియా ఉంటే , వారు సరిగా మిగతా విద్యార్దులలా చురుకు గా ఉండక పోవడం , ఆట పాటలలో ఉత్సాహం ఉన్నా , కొద్ది సమయం లోనే అలసి పోవడం , నిరుత్సాహ పడడం  జరుగుతుంది. అంతే  కాక చదువులోనూ ఏకాగ్రత లోపించడం, పాఠాలు త్వరగా నేర్చుకోలేక పోవడం , స్తబ్దత గా ఉండడం కూడా జరుగుతుంది. అనీమియా తీవ్రం గా ఉన్నప్పుడు , పిల్లలు  మన్ను తినే అలవాటు చేసుకుంటారు , అట్లాగే బడిలో , గోడ మీద ఉన్న సున్నం  తినడం, లేదా  బలపం ( ఈ రోజులలో బడి లో , ఇంకా ఇస్తుంటే ) తినడం కూడా చేస్తుంటారు !  అప్పుడు తల్లులు వారిని  వెంటనే ” బాదకుండా ” డాక్టర్ కు చూపించడం మంచిది. ప్రత్యేకం గా ఈ లక్షణం ఉన్న చిన్నారులలో , కడుపులో  నులి పురుగులు అంటే రౌండ్ వార్మ్  ఇన్ఫెక్షన్ ఉంటే  కూడా ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కడుపులో పెరుగుతున్న నులి పురుగులు , లోపలికి తీసుకుంటున్న ఆహారాన్ని తినేసి అవి పెరుగుతూ , పిల్లలకు పోషకాహార లోపం కలిగిస్తాయి. 
ఈ విషయం లో కూడా తల్లులు శ్రద్ధ వహించాలి ! ఇంకా మలేరియా బాగా ప్రబలి ఉన్న ప్రదేశాలలో ఉన్న వారికి కూడా అనీమియా లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మలేరియా పరాన్న జీవి రక్త కణాలలో ప్రవేశించి , వాటి పోషకాలను తీసుకుని వృద్ధి చెందుతూ , మలేరియా కలిగిస్తుంది, ఆ పరిస్థితి లో కూడా రక్త హీనత కలుగుతుంది.  
పైన  ఉన్న మొదటి చిత్రం లో సహజం గా ఆరోగ్యం గా ఉన్న రక్త కణాలు చూడండి ,ఇక అనీమియా ఉన్నప్పుడు రక్త కణాలు ఎట్లా ఉంటాయో కూడా ప్రక్కన ఉన్న  చిత్రం లో గమనించండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: