స్ఫూర్తి పధం లో , ప్రయాణం కొన సాగించడం ఎట్లా?
మనం చాలా సమయాలలో సోమరి తనాన్ని వదిలేసి , స్ఫూర్తినీ , ఉత్తేజాన్నీ పొందాలని, మన జీవితాలలో ఎక్కువ నిర్మాణాత్మకంగా పురోగామించాలనీ అనుకుంటూ ఉంటాము. మనకు కావలసిన స్ఫూర్తిని కూడా పొందుతాము. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే మనం తెచ్చుకున్న స్పూర్తి ఒక చేప లాగా మన ” చేతులలోనుంచి ” జారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, తరచూ జారి పోతూ కూడా ఉంటుంది. మరి ఒక సారి పొందిన స్ఫూర్తిని , మన ” చేతులలోనుంచి ” జారి పోకుండా ఉండాలంటే ఏమి చేయాలో చూద్దాం !
అంతర్వలయం ఏర్పరుచుకోవడం అంటే ఇన్నర్ సర్కిల్ ఏర్పరుచుకోవడం : మానవుడు సంఘ జీవి. తాను చేసే ప్రతి పనికీ తానే సంపూర్ణ బాధ్యత వహించినా , ఏదో ఒక సమయం లో ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవడం చేయవచ్చు. ఈ ఇతరులు ఎవరైనా కావచ్చు. వారు మీ బాగు ( హితం ) కోరే వారై ఉండాలి. వారితో మీరు అంతరంగికం గా మీ వ్యక్తిగత విషయాలు కానీ మీ చదువు లేదా ఉద్యోగ విషయాలు కానీ ఏ ఇబ్బందీ , మొహమాటమూ లేకుండా మాట్లాడి అవసరమైతే, వారి సహాయం తీసుకునేట్టు ఉండాలి. మనం చాలా సమయాలలో మనం ఇతరుల సలహా కానీ , సహాయం కానీ తీసుకోవడానికి సుముఖం గా ఉండము ! కారణాలు ఏవైనప్పటికీ , ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. మనం తీసుకునే ప్రతి సలహానూ మనం ఆచరించ నవసరం లేదు. కానీ ఇతరుల అభిప్రాయాలను కూడా తీసుకుంటే , మనం తీసుకునే నిర్ణయాల యుక్తా యుక్త విచక్షణ మనకు అలవరుతుంది. ఈ సలహాలో, సహాయమో తీసుకునే ఇన్నర్ సర్కిల్ లేదా అంతర్వలయం లో మన బాగు కోరే వారు విశ్వాస పాత్రులైన వారూ , పాజిటివ్ గా ఆలోచించే వారూ , ఇంకా వారు పురోగమిస్తూ , మన పురోగమనాన్ని కూడా కాంక్షించే వారై ఉండాలి ! ఈ విషయం లో మనం నెగెటివ్ గా ఆలోచించ నవసరం లేదు ! పైన చెప్పిన లక్షణాలున్న వారు కూడా మన సమాజం లో, మన చుట్టూ ఉంటారు ! కాకపొతే మనం కాస్త ఓపిక గా వెదకాలి ! ఇంకో ముఖ్య విషయం. మీరు మర్చిపోకూడనిది ఏమిటంటే , మీ చుట్టూ ఉండే వారు కూడా మీ సలహా , సహాయాల కోసం వెదుకుతూ ఉండవచ్చు కదా !
స్వేదం లేక పొతే విజయం లేదు : అంటే మనం తీసుకున్న నిర్ణయాల తో , చేరబోయే లక్ష్యాల కోసం తాపత్రయ పడుతూ , శ్రమ పడుతూ , చెమటను చిందించక పొతే విజయం సాధించ లేము. ప్రపంచం లో అనేక రంగాలలో విజయ వంతమైన వారు చెప్పేది ఒకటే ! 99% కృషీ , 1 % మాత్రమే అదృష్టం ! మన జీవితాల మీద మనకు ఒక పట్టు ఉండి , మనం అనుకున్నది సాధించడానికి , మన మాటలు , చేతల రూపంలోకి మారితేనే ఫలితం ఉంటుంది కదా ! లేక పొతే అవి కేవలం నీటి మాటలు అవుతాయి !
ఫ్లో ( flow state ) : ఈ ఫ్లో సైకాలజీ గురించి వివరం గా కొన్ని టపాలు పోస్ట్ చేయడం జరిగింది బాగు లో ! మన కార్యాచరణ లో ఈ ఫ్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు ! ( వివరాల కోసం పాత టపాలు చూడండి ! )
పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదు !: ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించి , వివరం గా ఆలోచించి , ఒక నిర్ణయం తీసుకున్నాక , ఆ లక్ష్య సాధన కోసం , నిరంతరం శ్రమిస్తూ ఉండాలి ! ఎన్ని అవాంతరాలు ఎదురైనా ! మానవులకే కదా అవాంతరాలు ఉండేది ! రాళ్ళూ రప్పలకు ఉండవుకదా ! అందువల్ల చివరి వరకూ పట్టుదలతో శ్రమించి లక్ష్యం చేరుకుంటే , ఆ ఆనందం, అనుభూతీ , మాటలలో వివరించ తరం కాదు !
అట్లా ఎన్నో లక్ష్యాలను చేరుకొని , మీ జీవితాలలో , ఎన్నో సంతృప్తి కరమైన అనుభూతులు చెందుతూ, ఆనందపు అంచులు చేరుకుంటారని ఆశిస్తున్నా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !