నలుగురి లో బిడియమూ , సిగ్గూ ! ,( shyness and social phobia ) :
మానసిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సిగ్గు, ఇతరులెవరైనా సమీపించి నప్పుడు కానీ , వారు ఇతరులను సమీపిస్తున్నప్పుడు కానీ అనుభవించే , ఒక రకమైన కంగారూ , ఎబ్బెట్టు లేదా ముభావం. ప్రత్యేకించి కొత్త వాతావరణం లో కొత్త మనుషుల దగ్గర. ఈ అనుభవాల తీవ్రతను బట్టి వాటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. అంటే , ఈ సిగ్గు , బిడియం కాస్తా తీవ్రం అయినప్పుడు , సోషల్ ఫోబియా , లేదా సోషల్ యాంగ్జైటీ అవుతుంది. పురుషుడు ( లేదా యువకుడు ) సమీపిస్తున్నప్పుడు , లేదా చూస్తున్నప్పుడు ,వయసు లో ఉన్న అమ్మాయి లో సహజం గా ఉండే బిడియం , సిగ్గు పైన చెప్పుకున్న వాటి కోవ కు చెందదు. ఆ సిగ్గు వారిలో ప్రక్రుతి తో తమ సంగమాన్ని తెలియ చేస్తుంది . ముగ్ధ మనోహరమైన వారి సిగ్గులో ఒక విరిసీ విరియని సుగంధ పుష్పం సాక్షాత్కరిస్తుంది . మనం తెలుగు సినిమాలలో చూసే అసంఖ్యాక తొలి రాత్రి ద్రుశ్యాలను , యువతి లో సిగ్గు లేకుండా ఊహించుకోలేము ! ( ఆంగ్ల సినిమాల సంగతి వేరు కదా ! ) ( కౌమార దశలో కి అడుగు పెడుతున్న బాలురు కూడా తరచూ సిగ్గు పడుతూ ఉంటారు. ఈ సిగ్గు కూడా సహజమైనదే ! అంటే ఇట్లా ఉండే సిగ్గు అసాధారణం అనబడదు. కానీ వారు, ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అట్లాగే సిగ్గు పడుతూ ఉంటే , ఆ విషయాన్ని పరిశీలించాలి ! )ఈ సోషల్ ఫోబియా వల్ల అనేకమంది ప్రతిభావంతులు అయిన యువతీ యువకులు , చొరవ ఏమీ లేని , కొన్ని సమయాలలో చేత గాని వారి లా ముద్ర వేయ బడతారు. వారికి వచ్చిన లేదా వచ్చే అమూల్య మైన అవకాశాలను కోల్పోతూ ఉంటారు.
మరి ఈ సిగ్గు , నలుగురిలో బిడియం గురించి శాస్త్రీయం గా తెలుసుకుందాం !
ఈ సిగ్గూ , బిడియాల మూలాలేంటి ?:
ముఖ్యం గా ఆ వ్యక్తి కి సంక్రమించిన జన్యువుల ప్రభావం , వారు పెరిగే వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది. ప్రత్యేకించి , వారి వారి చిన్న తనం లో వారిని శారీరికం గా కానీ మానసికం గా కానీ చాలా అవమానం, హేళన చేసిన సంఘటనలు ఉంటే , వారి మనసులలో అవి చెరగని ముద్ర వేసి , వారి భవిష్యత్తులో కూడా వారు అభివృద్ధి చెందలేని అగాధాలను శ్రుష్టిస్తాయి. సిగ్గు, బిడియం , కనీసం కొంత వరకైనా వారి వారికి సంక్రమించిన జన్యువుల ప్రభావం వల్లనని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. వారి దృష్టి లో మొదట గా సిగ్గు పడడం జరిగి , తరువాత , తరువాత , వారు వివిధ సామాజిక వాతావరణాలలో ఉన్నప్పుడు , ఆందోళన చెందడం వల్ల సోషల్ యాంగ్జైటీ గా పరిణమిస్తుందని అభిప్రాయ పడతారు. ఇట్లా సోషల్ యాంగ్జైటీ గా లక్షణాలు పరిణామం చెందినప్పుడు, ఈ లక్షణాల తో పాటు గా , మానసికం గా క్రుంగి పోయే లక్షణం అంటే డిప్రెషన్ కూడా ఉంటుంది. అందువల్ల ఆ యాంగ్జైటీ ఉన్నప్పుడు , చెప్పలేని భయం అంటే ఫియర్ ఇంకా ప్యానిక్ లక్షణాలను కూడా వారు అనుభవిస్తారు. కొన్ని పరిశీలనల ద్వారా పాశ్చాత్య దేశాలలో గర్భం దాల్చిన కాలం లో పగలు కాంతి తక్కువ గా ఉన్నప్పుడు కూడా వారికి పుట్టిన సంతానం లో ఈ సిగ్గు, నలుగురి లో బిడియం ఎక్కువ గా ఉంటున్నాయని కనుక్కున్నారు ( భారత దేశం లో ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే , భారత దేశం లో పగలు ఎప్పుడూ పగలే ! అంటే ఒకే రకం గా వెలుతురు గా ఉంటుంది. కానీ పాశ్చాత్య దేశాలలో చలి కాలం లో కేవలం మధ్యాహ్నం మూడింటికే చీకటి పడుతుంది ! )
వచ్చే టపాలో సిగ్గు గురించి ఇంకొన్ని సంగతులు !