Our Health

Archive for జనవరి 22nd, 2013|Daily archive page

బాల బాలికలలో ఊబకాయం.2.

In ప్ర.జ.లు., Our Health on జనవరి 22, 2013 at 12:34 సా.

బాల బాలికలలో ఊబకాయం. 2. : 

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ  తాజా గణాంకాల ప్రకారం  బాల బాలికలలో ఊబకాయం లేదా ఒబీసిటీ  ఇరవై ఒకటో శతాబ్దం లో ప్రపంచమంతా విస్తరిస్తున్న , తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి గా పేర్కొన్నారు. రెండేళ్ళ క్రితం చేసిన ఒక పరిశీలన ప్రకారం ప్రపంచం మొత్తం లో అయిదు సంవత్సరాలకన్నా తక్కువ వయసు లో వారు  కనీసం నలభై రెండు మిలియన్ల మంది ఊబకాయులు గా  తయారవుతున్నారు. అంటే నాలుగు కోట్ల మందికి పైగా ! ఇంకా ఆందోళన కరమైన విషయం ఏమిటంటే , ఈ నాలుగు కోట్ల మంది లో ఎక్కువ భాగం అంటే మూడున్నర కోట్లమంది బాల బాలికలు , అభివృద్ధి చెందుతున్న దేశాల లోనే ఉన్నారు ! 
చిన్న పిల్లలు బొద్దుగా , లావుగా ఉంటే  ముద్దే కదా ! కాస్త ఊబకాయం తో ఉంటే  ఏమవుతుంది ? అని పెద్ద వారందరూ అనుకోవచ్చు !  కానీ ఈ పెద్దలంతా గుర్తు పెట్టుకోవలసిన అతి ముఖ్య మైన విషయం ఒకటి ఉంది. అది , అనేక పరిశోధనల పర్యవసానం గా తేలింది ఏమిటంటే , చిన్న వయసులో ఊబకాయం ” తెచ్చుకున్న వారు ” లేదా ” వచ్చిన వారు ”  పెరిగి పెద్ద వారైనా కూడా , ఊబకాయులు గానే  తయారు అవుతారు !  అంటే ఒబీసిటీ , చిన్న తనం లో వచ్చినది , వారు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ వారిని వదిలి పోదు !  ఈ ఊబ కాయానికీ , మధు మేహానికీ , అధిక రక్త పోటు  కూ  అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అంటే  ఊబ కాయం రాగానే వారికి అధిక రక్త పోటు  కూడా వస్తుంది. అంతే  కాక , మధు మెహ వ్యాధి అంటే డయాబెటిస్ వ్యాధి కూడా త్వరగా వస్తుంది.  ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే , ఈ ఊబకాయమూ  అంటే ఒబీసిటీ , దానితో కూడా వచ్చే , అధిక రక్త పోటు , ఇంకా మధుమేహం , ఈ మూడూ సంపూర్ణం గా నివారించ దగ్గ  పరిస్థితులే !  అందుకే తల్లి దండ్రులు , తమ పిల్లల పెంపకం లో అత్యంత జాగ్రత్త వహించాలి ! క్రితం టపాలో  చూసినట్టు పల్లవికి ,ఆమె తలి దండ్రులు , తాత అమ్మమ్మలు , తాము స్వయంగా చేసిన వంటకాలు , గారాబం తో , ప్రేమతో , తినిపిస్తూ , పల్లవిని ఎంతో  బాగా  చూసు కుంటున్నామని మురిసిపోతూ ఉంటారు ! కానీ జరుగుతున్నది  దీర్ఘ కాలికం గా పల్లవి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారపు అలవాట్లే !  పల్లవి పెరుగుతున్న కొద్దీ , వారి జీవితాలలో ” అపశ్రుతి ” కలిగిస్తుంది,  పల్లవి జీవితం లో కూడా   శృతి తప్పుతుంది ! 
 
మరి ఈ  బాల బాలికలలో వచ్చే ఊబ కాయానికి కారణాలు ఏమిటి ? :
 
ఏ  వయసులో నైనా వచ్చే ఊబకాయానికి ప్రధాన కారణం  తీసుకునే ఆహారం లో ఉండే  క్యాలరీలకీ ,  అవి ఖర్చు చేసే పని కీ ఏమాత్రం సమతుల్యం లేకపోవడం. అంటే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్ధమూ  పోషక విలువ అంటే  మన శరీరం లో శక్తి ని ఇచ్చేది గా ఉంటుంది.  మనం రోజూ చేసే పని కి సమానం గా ఆహారం తీసుకుంటే  మంచిదే !  కానీ అందుకు భిన్నం గా  చేసే పని తక్కువా , తినే తిండి ఎక్కువా అయినప్పుడు ఆ ఆహారం కాస్తా మన శరీరం లో క్రొవ్వు నిలువలు గా మారి పోతుంది. అప్పుడే సమస్యలు మొదలయ్యేది. ఇట్లా అతి గా తింటున్న ఆహారం కాస్తా , క్రొవ్వు నిలువలు గా మారుతూ , క్రమేణా  అతి బరువు గా మారుతుంది. దీనినే ఓవర్ వెయిట్ అంటారు కదా ! ఈ అతి బరువు కాస్తా  ఇంకా ఇంకా పెరిగి ఊబకాయం గా రూపాంతరం చెందుతుంది.  అతి బరువు  కొంత వరకూ అనారోగ్య హేతువు ! ఊబకాయం  తప్పని సరిగా అనారోగ్య హేతువు ! ఇదే అతి బరువు కూ  ఊబ కాయానికీ ఉన్న తేడా !  
ప్రపంచ వ్యాప్తం గా  బాల బాలికలు తీసుకునే ఆహారం లో వచ్చిన మార్పులు :  ఎక్కువ శక్తి ఉన్న  క్రొవ్వు , ప్రోటీన్ల తో చేసిన ఆహారం తినడం , పోషక విలువలు అంటే విటమిన్లు , ఖనిజాలు , ఉండి  తక్కువ శక్తి అంటే క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తక్కువ గా తినడం !
ఇంకా ముఖ్యం గా  శారీరిక శ్రమ ను ఏమాత్రం చేయకుండా , కనీసం నడవడానికి కూడా వేనుకాడుతూ , అన్ని ప్రదేశాలకూ వాహనాల లో ప్రయాణించడం కూడా , తీసుకున్న ఆహారాన్నీ , క్యాలరీలనూ కరిగించక , మన శరీరాలను క్రొవ్వు నిలువ చేసుకునే గిడ్డంగులు గా మార్చు తున్నాయి. 
పై విషయాల ద్వారా మనకు విశదం  అయ్యేది ఏమిటంటే ,  నవీన మానవ జీవన శైలిలో వచ్చిన  హేతుబద్ధం గాని  ధోరణు లే , మానవ అనారోగ్యానికి మూలం అవుతున్నాయి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: