స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?
( ” NO VIOLENCE AGAINST WOMEN ” )
కొన్ని కారణాలు చూద్దాం !
పితృస్వామ్యం : తర తరాలు గా సమాజం లో లోతు గా నాటుకున్న పితృ స్వామ్య భావాలు . స్త్రీ , చదువుకుని , బయటకు వెళ్లి , ఉద్యోగం చేస్తున్నప్పటికీ , , ప్రదానం గా పురుషుడి మాటే , అంటే తండ్రి మాటే పై చేయి కావాలనుకునే వాదం !
సజాతి వైరం : అంటే పురుషుడి తో పాటు గా , గర్భం దాల్చిన ‘ తల్లి ” కూడా , పుట్ట బోయేది ఆడ శిశువు అన్న విషయం తెలిసినప్పటి నుంచీ , ఆ విషయాన్ని అంగీకరించలేక పోవడం , ఆ ఆడ శిశువుకు గర్భం లోనో లేదా పుట్టిన తరువాతనో ఈ భూమి మీద నుంచి ” శాశ్వతం గా ఉద్వాసన ” చెప్పే మార్గాలు అన్వేషించడం , లేదా ఆ ప్రక్రియలో సఫలం అవడం !
ఆడపిల్ల తల్లి దండ్రులు , ఆడ శిశువు పుట్టగానే , పెరిగి పెద్దయి నాక ” కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి ” అందువల్ల తమ ఆర్ధిక పరిస్థితి విషమిస్తుంది అనే వాదన.
తల్లి దండ్రులు , మగ శిశువును విపరీతమైన గారాబం తో , శ్రద్ధ తో పెంచుతూ , అదే కుటుంబం లో ఉన్న ఆడ శిశువును అశ్రద్ధ చేయడం , ” క్రమ శిక్షణ ” తో పెంచడం వల్ల , మగ శిశువు లోనూ , పెరిగిన తరువాత పురుషుడి లోనూ పెరిగే అహంకార భావం , తాను స్త్రీకన్నా అధికం అనే భావాలు అలవడడం !
తల్లి దండ్రుల మధ్య హింస , ఒక ఇన్ఫెక్షన్ : చిన్న వయసు నుంచీ , ఆడ పిల్ల లైనా , మగ పిల్లలైనా , సునిశితమైన పరిశీలనా శక్తి , సామర్ధ్యాలు కలిగి ఉంటారు !
వారి కుటుంబం లోనూ , పరిసరాలలోనూ జరుగుతున్న సంఘటనలు , ఆనంద కరమైనవి కానీ , హింసా యుతమైనవి గానీ , వారి చిన్నారి హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి ! భర్త ఏ కారణం వల్ల నైనా , విపరీతమైన క్రోధం , తన ” ఇల్లాలి ” మీద చూపించి తరచూ ” చేయి ” చేసుకుంటూ ఉంటే , అది పరిశీలిస్తున్న చిన్నారుల మనస్సులో ” సామాన్యమైన సంఘటనలు ” అవుతాయి ! వారు పెరిగి పెద్ద వారై వారి వివాహ సంబంధాలు ఏర్పరుచు కున్నప్పుడు ,వాటిలో కూడా ” హింస ” సాధారణ విషయం అవుతుంది !
విసర్జన కన్నా మింగుడు మేలు : చాలా మంది అత్యాచార సంబంధాలతో ” వివాహ బంధం ” కోన సాగిస్తున్న స్త్రీలు , సామాన్యం గా , ఆ సంబంధం నుంచి విడి పోయే సమయం లో ఎదురయే భయాలూ , ఆందోళన లూ , తలుచుకుని , తరువాత తమకు ” సొంత వారి నుంచీ , ” సమాజం ” నుంచీ ఎదురయే సమస్యలూ ,భయాల ను భరించడం కన్నా , ” చెడ్డ ” మొగుడితో ” సంసారం ” మేలు ” అనుకునే అభద్రతా భావం !
పిల్లల భవిత మీద భయాలు : స్త్రీ తన వివాహ బంధం లో పరిస్థితులు విషమించి అది ” విష తుల్యం ” అయినా కూడా , నిరంతరం పెరుగుతున్న తన పిల్లల భవిత మీద భయాందోళన లు పెట్టుకుని , వారు ( తాను విడిపోతే ) పడే కష్టాలను తలుచుకుని , విడి పోయే నిర్ణయం మానుకుంటుంది , దానితో ,హింసను భరించడం ” అలవాటు ” చేసుకుంటుంది.
” సహన మూర్తి ” స్త్రీ ! : తర తరాలు గా సమాజం లో వివాహం చేసుకున్న స్త్రీ ని అనేక విధాలు గా వర్ణిస్తూ ఉంటారు అందులో ఒకటి ” ఆ ఇల్లాలు ఎంతో ఆదర్శ వంతురాలు ” భర్త తాగి తందనాలు వేస్తున్నా , ఎంతో సహనం తో పిల్లలు చదువుకుని పెద్ద వారై , వారి దోవల్లో వారు వెళ్లి , పెళ్ళిళ్ళు చేసుకునే వరకూ ,తానే అంతా బాధ్యత వహించి చేసింది ” ( స్త్రీ , కొవ్వత్తి అయి కొడి గడుతున్నా పరవాలేదు సమాజానికి ! ) అనే నల్లటి సంప్రదాయ ముసుగు వేసుకోవడం అలవాటవుతుంది ! ఆమె నిఘంటువులో అన్యాయానికి ఎదురు తిరగడం , ధిక్కరించడం అనే పదాలు ” సంప్రదాయం ” అనే నల్లటి సిరా తో శాశ్వతం గా చెరిపి వేసి ఉంటాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !