Vitamin B2 or రైబో ఫ్లావిన్ :



రైబో ఫ్లావిన్ B విటమిన్లకు చెందుతుంది. ఇది ఈ విటమిన్ల వరస లో రెండవది. ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ కూడా నీటిలో కరిగే విటమిన్ ( B కాంప్లెక్స్ విటమిన్లన్నీ నీటిలో కరిగే విటమిన్లే ! ).
ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ మన శరీరానికి అందక పొతే ఏమవుతుంది?:
FAD , FMN అనే రెండు కో ఫ్యాక్టర్ లు రెండు ఉన్నాయి. ప్రస్తుతానికి వీటి మూలాలకు వెళ్ళకుండా , ఇవి రెండు జీవ రసాయన పదార్ధాలు అని తెలుసుకుంటే చాలు. ఈ కో ఫ్యాక్టర్స్ మన శరీరం లో ప్రోటీన్లు , అంటే మాంస క్రుత్తులు , పిండి పదార్ధాలు , అంటే కార్బో హైడ్రేట్ లూ , ఇంకా కొవ్వు పదార్ధాలూ అంటే ఫాట్స్ , ఇవన్నీ మన దేహం లో వివిధ రసాయన చర్యలు చెంది , ఎనర్జీ గా అంటే శక్తి గా మారడానికి , ఈ రెండు కోఫాక్టర్స్ అనివార్యం. ఈ రెండు కో ఫాక్టర్స్ తయారీ కీ రైబో ఫ్లావిన్ ముఖ్యమైన ముడి పదార్ధం. అంటే ఈ రెండు కో ఫాక్టర్స్ నిర్మాణానికీ రైబో ఫ్లావిన్ విటమిన్ తప్పని సరిగా మన శరీరానికి అందాలి !
మరి రైబో ఫ్లావిన్ లోపం మనలో ఎట్లా కనిపిస్తుంది? : ( పైన ఉన్నచిత్రమూ , ఫోటోలూ గమనించండి )
పెదవులు పగలడం: మన పెదవులు చిట్లి పోయి , మధ్య లోనూ , చివరలలోనూ ” పగిలి పోతాయి మన పెదవులు ”. ( angular cheilitis )
నోటిలో పూత రావడం : మన నోరు ” పూత పోసి ” కారం నోటిలో ఉన్నప్పుడు మనకు ఎట్లా అనుభూతి ఆవుతుందో , ఆ విధం గా నోరు ” పుండు ” లా తయారవుతుంది.నాలుక కూడా ఎరుపు గా మారి ” పుండు ” లా తయారవుతుంది. అప్పుడు అతి చల్ల ని పదార్ధాలు కానీ , అతి వేడి పదార్ధాలు కానీ నోటి లో ఉన్నప్పుడు , బాధ కలుగుతుంది ( ఇట్లాంటి పరిస్థితులలో సామాన్యం గా మన ఇళ్ళలో నేయి పూసుకుంటే ఆ లక్షణాలు తగ్గుతాయి అని ” చిట్కా వైద్యాలు ” చెపుతూ ఉంటారు మన పెద్ద వాళ్ళు నిజమే, నేయి కానీ వెన్న కానీ పూసుకుంటే అది ఆయింట్ మెంట్ లా పని చేసి కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆ లక్షణాలకు నివారణ నెయ్యీ , వెన్నా కాదు కదా , ( రైబో ఫ్లావిన్ కావాలి ! ) .
చర్మం లో మార్పులు : మన చర్మం పొలుసులు గా ఊడిపోవడం , చిట్లి పోవడం , కూడా జరుగుతుంది.
కళ్ళలో మార్పులు : మన కళ్ళు కూడా రైబో ఫ్లావిన్ విటమిన్ లోపించినప్పుడు , ఎప్పుడూ ఎర్రగా వాచి ఉంటాయి. కాంతి ని చూడడం కష్టమవడం జరుగుతుంది. దీనిని ఫోటో ఫోబియా అంటారు. ఇంతే కాక రక్త హీనత అంటే అనీమియా కూడా రైబో ఫ్లావిన్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.గమనించ వలసిన విషయం ఏమిటంటే రైబో ఫ్లావిన్ విటమిన్ లోపం ఉన్న సమయం లో అనివార్యం గా మిగతా విటమిన్ల లోపం కూడా ఉంటుంది.
ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ ఏ ఏ పదార్ధాలలో ఉంటుంది? :
పాలు , జున్ను , ఆకు పచ్చని ఆకు కూరలు , ఈస్ట్ , తినగలిగే పుట్ట గొడుగులు ( వీటినే మష్ రూమ్స్ అంటారు ) పప్పు దినుసులు ( వీటినే లెగూమ్స్ అంటారు ) ఇంకా ఆల్మండ్స్ అనే పప్పులు కూడా రైబో ఫ్లావిన్ ఎక్కువ గా ఉండే ఆహార పదార్ధాలు. ఇక మాంస హారులకు కాలేయం , మూత్ర పిండాలు అంటే లివర్ అండ్ కిడ్నీ లు కూడా ఈ రైబో ఫ్లావిన్ విటమిన్ ఎక్కువ గా ఉండే అవయవాలు.
( ఫ్లావిన్ అంటే పసుపు పచ్చని పదార్ధము అని అర్ధం. మీరు గమనించారో లేదో , B కాంప్లెక్స్ విటమిన్ వేసుకున్నప్పుడు , మన మూత్రం పసుపు పచ్చ గా వస్తుంది దానికి కారణం ఈ రైబో ఫ్లావిన్ లేదా B 2 విటమిన్ వల్లనే ! )
వచ్చే టపాలో ఇంకో విటమిన్ !
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…