Our Health

Archive for నవంబర్, 2012|Monthly archive page

కలలూ , అంతరార్ధాలూ . 6.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on నవంబర్ 30, 2012 at 7:57 సా.

కలలూ , అంతరార్ధాలూ . 6.

https://i0.wp.com/www.buzzle.com/img/articleImages/401219-109-8.jpg

1. వదిలి వేయడం  :
నిద్రలో మిమ్మల్ని మీ తల్లి దండ్రులు గానీ , స్నేహితులు గానీ , లేదా భార్య , లేదా ప్రియురాలు , లేదా ప్రియుడు ఏ ప్రదేశం లో నైనా వదిలి వెళ్లి పోతున్నట్టు మీకు కల వస్తే , అది మీలోని అభద్రతా భావాన్ని తెలియ చేస్తుంది.
మీకు సహకారమూ , సహాయమూ అవసరమని కూడా సూచన ఇస్తుంది. ఈ సహాయ సహకారాలు మీరు చేస్తున్న లేదా చేయబోయే కార్యాల లో కావచ్చు , లేదా మీ జీవిత గమనం లో కావచ్చు. లేదా నిజ జీవితం లో మీరు నిజం గా మీరు కోల్పోయిన అత్యంత విలువైన వ్యక్తులను  స్పురణ కు తెస్తూ వచ్చే కల కావచ్చు ! ఇట్లా కల రావడం మీ లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవలసిన అవసరాన్ని తెలియ చేసే సూచన కావచ్చు !
ఇట్లాంటి కల కనుక మీకు తరచూ వస్తూంటే , మీ బాల్యం నుంచీ మనసు మూలల్లో దాగున్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నట్టు భావించ వచ్చు ! ఆ సందర్భం లో మీరు ఆ కారణాలను విశ్లేషించుకుని , సరి చేసుకుంటే , అట్లా కలలు రావడం తగ్గుతుంది. అదే, మీ అంతట మీరు ఎవరి ప్రమేయమూ లేకుండా మీరు ఉన్న చోటిని కానీ , చేస్తున్న పనిని కానీ అసంపూర్ణం గా వదిలి వేసి వెళ్లి పోతున్నట్టు కల కనుక వస్తే , అది మీ బాధ్యతా రాహిత్యాన్ని చెపుతుంది ! అంటే మీరు చేస్తున్న పనిని శ్రద్ధ తో చేయకుండా ” ఆ పనిని దాటవేయ డానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా అనుకోవచ్చు. మీరు మీ జీవితం లో ముఖ్య మైన నిర్ణయాలు తీసుకోవడం లో మీరు సందిగ్ధం లో పడతారని కూడా ఇట్లాంటి కలలు తెలియ చేస్తాయి. అప్పుడు మీరు తక్షణ కర్తవ్యం గా ఆ పనిని బాధ్యతా యుతం గా చేయడానికి పూనుకోవాలి ! 

2. ఎత్తుకు పోవడం , అమాంతం గా తీసుకు పోవడం :
మీకు కలలో మిమ్మల్ని అమాంతం గా , అంటే ఒక్క సారిగా , లేదా బలవంతం గా మీరు ఉన్న చోటి నుంచి కానీ , మీరు నిద్రలో ఉన్నప్పుడు తట్టి లేపి కానీ, మీకు తెలియని చోటికి కనుక తీసుకు వెళుతున్నట్టు కల వస్తే , వెంటనే మీకు మెలకువ కూడా వచ్చి చాలా ఆందోళన పడడం కూడా జరుగుతుంది. ఈ రకమైన కల సామాన్యం గా మీకు బాగా సన్నిహితం గా ఉన్న వ్యక్తులు , మీ ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా , మీ జీవితాన్ని నియంత్రించు తున్నట్టు , లేదా తమ గుప్పెట లో పెట్టుకోవాలని చూస్తున్నట్టు అనుకోవచ్చు. ఆ పరిస్థితులలో మీరు , మీ జీవిత నావ చుక్కాని ని మీరే తీసుకుని అలలు , ఆటు పొట్ల దిశ గా కాకుండా , ఆనంద తీరాల వైపు మరల్చు కోవాలి ! అంటే , ఇతరుల ” మాయ ” మాటలకు తల ఊపకుండా , మీ సహజ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒకరు ఇంకొకరిని బలవంతం గా తీసుకు పోతుంటే , మీరు కేవలం మూడో వ్యక్తిగా ఆ ప్రదేశం లో ఏమీ చేయకుండా నుంచున్నట్టు కనుక కల వస్తే , అది మీ జీవితం లో మీరు తీసుకునే నిర్ణయాల లో మీ నిస్సహాయ స్థితిని సూచిస్తుంది.

వచ్చే టపాలో ఇంకొన్ని కలల అర్థాలు తెలుసుకుందాం !

కలలు మనకు చెప్పేదేమిటి ? 5.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 25, 2012 at 8:51 ఉద.

కలలు  మనకు చెప్పేదేమిటి ? 5. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఇప్పటి వరకూ , మన జీవితాలలో మనం కనే కలల ప్రాముఖ్యత ఇదీ అని ఖచ్చితం గా మనకు, అంటే శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు. కాక పొతే సైకాలజిస్టులు ( మానసిక శాస్త్రజ్ఞులు ) ఈ కలల విశ్లేషణను ,  జీవిత మార్గ నిర్దేశనం చేయడానికీ ,వాళ్ళు తమ దోవలు అవసరమైతే మార్చుకుని , ఆనంద మార్గాలలో పయనించడానికి కూడా ఉపయోగిస్తారు ! అంటే ఈ రోజు మనం కనే కలలు , సరి అయిన విశ్లేషణ చేసుకుంటే , రేపు మన భవిష్య నిర్దేశన చేయ గలవు ! ఒక విధం గా కలలను , మన ప్రవర్తన , వ్యక్తిత్వం , మనలో నిక్షిప్తమై , నిశ్శబ్దం గా ఉన్న మన అనుభూతులూ , సూచనలు గా చెప్పుకోవచ్చు. ఈ కలల నిజా నిజాల మీద మనలో అనేక మంది కి అనేక స్వతంత్ర అభిప్రాయాలు సహజం గానే ఉంటాయి. కానీ వీటన్నిటినీ తాత్కాలికం గా పక్కన పెట్టి , మనం కనే ఈ కలల విశ్లేషణ చేసుకుని , వాటి పరిణామాలను పరిశీలించుకుని అవలోకనం చేసుకోవడం , ఆసక్తి దాయకం గానూ , సరదాగానూ ఉంటుంది.
మనం, కలలను ఎట్లా గుర్తుంచు కోవచ్చు ?

1. డ్రీమ్ డైరీ మొదలు పెట్టడం: ఈ పధ్ధతి చాలా మంది చేస్తూ ఉంటారు. ఒక వేళ చేయకపోతే , ఇది ఒక మంచి సూచన ! డైరీ లో ప్రతి రోజూ , లేదా కల వచ్చినప్పుడల్లా , ఆ కల వివరాలు ఒక నోట్ బుక్ లో రోజు వారీ గా రాసుకుంటే ఉపయోగ కరం గా ఉంటుంది. ఇట్లా తమ కలలను జాగ్రత్త గా పుస్తకాలలో రాసుకునే వారిలో వారి జ్ఞాపక శక్తి ఎక్కువ అవడమే కాకుండా , వారికి ప్రీకాగ్నిషన్ అంటే వారి భవిష్యత్తులో వారికి జరాగాబోయే సంఘటనల మీద కూడా సూచనాశక్తి అధికం అవుతుందని తెలిసింది.
2. కలం, కాగితం: కంప్యుటర్ కన్నా కలం తో కాగితం మీద కలలను రాసుకోవడం మంచి పధ్ధతి. మనకు వచ్చే కలలను తొంభై శాతం వరకూ మనం మరచి పోతూ ఉంటాం ! అందు వల్ల కలం కాగితం బెడ్ ప్రక్కనే పెట్టుకుంటే , వెంటనే రాసుకోవడానికి వీలు గా ఉంటుంది.
3.ఏమి రాయాలి ? ఇందులో ప్రత్యేకం గా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే , కలలో కనిపించిన ప్రతి దృశ్యాన్నీ వివరం గా రాసుకోవడమే ముఖ్యం. అంటే కల జరిగిన ప్రదేశాన్నీ , ఉన్న మనుషులనూ , లేదా జంతువులనూ , కనిపించిన రంగులనూ , ఏమైనా సింబల్స్ అంటే గుర్తులు కనిపిస్తే వాటిని కూడా రాసుకోవడం మంచిది. ఆ కలను ఎంత సంపూర్ణం గా రాసుకుంటే అంత మంచిది.
4.ఎక్కువ నిద్ర , ఎక్కువ కలలు : సాధారణం గా కలలను గుర్తు తెచ్చుకోలేక పోవడానికి ఒక ముఖ్య కారణం , నిద్ర సరి అయిన సమయానికి పోకుండా , ఎక్కువ సమయం మేలుకుని ఉండడమూ , లేదా త్వరగా నిద్ర లేవడం కూడా ! మనకు రోజు కావలసిన నిద్ర అంటే రమారమి 7 నుంచి 8 గంటలు నిద్ర పోయినప్పుడు మనకు వచ్చే కలలను గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ గా ఉంటుంది.
5.నిద్ర లేచినప్పుడు : అంటే కలలు వచ్చినప్పుడు వెంటనే బెడ్ మీద నుంచి లేచి, ఆ కలలను నోట్ చేసుకోవడం అన్న మాట. మొదటిలో కష్టం గా అనిపించినా , ఈ పధ్ధతి అలవాటు అవుతే , కల రాగానే అప్రయత్నం గా పూర్తిగా మెలకువ వచ్చి , ఆ కలను చాలా వరకు గుర్తు కు తెచ్చుకో గలుగుతారు.
6.రి వైండ్ చేయడం : ఒక వేళ ఇట్లా వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుటే , మనం వీడియో టేపు ను కానీ సీడీ ని కానీ రీ వైండ్ చేసినట్టు చేసుకుని మొదటి నుంచీ గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పద్ధతిలో కల పదిలం గా గుర్తుకు వచ్చే అవకాశాలు హెచ్చుతాయి.
7.స్లో డౌన్ అండ్ రిలాక్స్ : మనలో చాలా మందికి , మెలకువ రాగానే , బెడ్ మీద నుంచి లేచి పరిగెత్తడమే పని. తయారై బ్రేక్ ఫాస్ట్ చేసి , కాలేజీ కో , ఆఫీసు కో వెళ్ళే తొందర ! కానీ కలలను గుర్తుకు తెచ్చుకోవాలంటే ఈ పధ్ధతి పనికి రాదు. మెలకువ రాగానే , మిగతా విషయాలు ఏవీ వెంటనే ఆలోచించ కుండా , కేవలం మీకు వచ్చిన కల మీదనే మీ దృష్టి అంతా కేంద్రీకరించండి ! అప్పుడు మీకు వచ్చిన కల చాలా వరకూ మీ కు గుర్తు కు వస్తుంది.

అంతర్జాలం లో ఈ కలల గురించి బోలెడన్ని సైట్లు ఇప్పటికే ఉన్నాయి , కానీ అవన్న్నీ ఆంగ్లం లో నే ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని కలల విశ్లేషణలను మీ ముందు ఉంచ దలచాను , మన తెలుగులో ! మీకు నచ్చితే , మీ కలలు కూడా తెలియ చేయండి , చూద్దాం విశ్లేషణ ఎట్లా చేయ వచ్చో ! వచ్చే టపా నుంచి మనకు వచ్చే సామాన్య మైన కలల అంతరార్ధాలు తెలుసుకుందాం !

శాస్త్రీయం గా కలలు ఏమిటి ?.4.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 23, 2012 at 5:42 సా.

శాస్త్రీయం గా కలలు ఏమిటి ?.4.

ఇప్పటి వరకూ జరిపిన అనేక పరిశోధనల మూలం గా కలలు మన నిద్ర లోని ఒక దశ అయిన REM or Rapid Eye Movement Sleep , రెమ్ స్లీప్ లో వస్తాయి. మరి ఈ రెమ్ స్లీప్ అంటే ఏమిటి ?:
రెమ్ స్లీప్ కూ NREM or Non Rapid Eye Movement sleep , ఎన్ రెమ్ కూ తేడా కేవలం కనులు వేగం గా నూ , నిదానం గానూ కదలడమే కాకుండా , రెమ్ స్లీప్ లో మనం నిద్ర పోతున్నప్పటికీ , మనసు మాత్రం , అంటే మెదడు మాత్రం పూర్తిగా నిద్రావస్థ లో కాకుండా ,అప్రమత్తత గా ఉంటుంది. అందువల్ల ఈ దశలో వచ్చిన కలలను మనం తేలిక గా గుర్తు ఉంచుకో గలమన్న మాట !
చాలా కలలు కేవలం అయిదు నుంచి ఇరవై నిమిషాలు ఉంటాయి. మన జీవిత కాలం లో మనం సరాసరి ఆరు సంవత్సరాల కాలం కలలు కంటాం ! అంటే ప్రతి నిద్రలోనూ షుమారు రెండు గంటలు ! రెమ్ స్లీప్ లో మిగతా దశల కంటే మెదడు లో నిరంతరం ఉత్పత్తి అయే నార్ ఎపినెఫ్రిన్ , సీరోటోనిన్ , ఇంకా హిస్టమిన్ అనే జీవ రసాయనాలు సప్రెస్ అవుతాయి అంటే రెమ్ స్లీప్ లో ఈ రసాయనాలు విడుదల అవ్వవు.
ఇంకో ఆశ్చర్య కర విషయం ఏమిటంటే , మనకు వచ్చే కలలు, ఎంత సేపు వస్తాయో అంత సేపూ ఆ కలలు , అనుభూతులు ఉంటాయి. అంటే నిద్రలో ఒక పది నిమిషాలు కనుక కల వస్తే, ఆ పది నిమిషాల సమయం నిజ జీవితం లో కూడా పది నిమిషాల సమయమే ! అంతే కాక మనం నిద్ర పోయినప్పుడు , మొదటి దశలో పది నిమిషాలు కనుక కల వస్తే క్రమేణా ఆ సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే , నిద్ర చివరి దశలలో కలలు ఎక్కువ సమయం అంటే ఒక అర గంట వరకూ కూడా వస్తూ ఉంటాయి. ఈ నిద్ర చివరి దశలలో వచ్చే కలలు , ఆ సమయం లో కనుక నిద్ర లేచినప్పుడు కానీ, అంటే మనంతట మనకు మెళకువ వచ్చినప్పుడు కానీ , లేదా ఎవరైనా మనలను నిద్ర నుంచి లేపినప్పుడు కానీ , షుమారు తొంభై తొమ్మిది శాతం మనకు గుర్తుకు వస్తాయని పరిశోధనల వల్ల నిర్ధారణ అయింది. అంటే మనకు వచ్చే కలలను మనం గుర్తు కు తెచ్చుకోవడం అనేది , ఆ కలలు మన నిద్రలో ఏ దశలో వస్తాయీ అన్న విషయం మీద ఆధార పడి ఉంటుందన్న మాట ! అందువల్లనే మనం కనే అన్ని కలలనూ మనం స్పష్టం గా గుర్తు తెచ్చుకోలేక తికమక పడుతూ ఉంటాం! ప్రత్యేకించి, అందమైన యువతులతోనో, లేదా యువకులతోనో , సుందరమైన ప్రదేశాలలో విహరిస్తూ ఉన్నట్టు కానీ , సమయం ఆనంద కరం గా గడుపుతున్నప్పుడు కానీ , ఆ సంఘటనలు కొన్ని సమయాలలో కేవలం ఫ్లాష్ లాగానే మనకు జ్ఞాపకం వస్తాయి తప్ప వివరాలు మనం ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావు !
అందుకే ఒక కవి ( కీర్తి శేషులు సముద్రాల రాఘవాచార్య ) శాస్త్రజ్ఞులు వివరించిన ఈ పరిస్థితిని అనేక దశాబ్దాల క్రితమే ( ఏ పరిశోధనలూ అవసరం లేకుండానే ! ) అమోఘం గా వివరించాడు , ఒక ( సినిమా ) పాట లో !
నీవేనా నను తలచినది , నీవేనా నను పిలచినది, నీవేనా?
నీవేనా నా మది లో నిలిచి హృదయము కలవర పరచినది !
నీవేలే నను తలచినది , నీవేలే నను పిలచినది ,
నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవర పరచినది , నీవేలే , నీవేలే !
కలలోనే ఒక మెలకువగా , ఆ మెలకువ లోనే ఒక కలగా !
కలయో నిజమో వైష్ణవ మాయో , తెలిసీ తెలియని అయోమయం లో !
కన్నుల వెన్నల కావించి , నా మనసున మల్లెలు పూయించి ,
కనులను మనసును కరగించి ,
మైమరపించీ , నన్నలరించి ,
నీవేలే , నీవేలే !

యూ ట్యూబ్ లో  ఈ పాట వింటే , చూస్తే , మీకు ఇంకా నచ్చుతుంది !

 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

కలల గురించి ఫ్రాయిడ్ ఏమన్నాడు ?3.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2012 at 7:06 సా.

 కలల గురించి ఫ్రాయిడ్ ఏమన్నాడు ?3.

సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన మానసిక విశ్లేషకుడు , సైకో తెరపిస్ట్. మానసిక రుగ్మతల మీదా , కలల మీదా ఆయన చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ ( ఒక వంద సంవత్సరాల తరువాత కూడా ) ప్రముఖమైనవి గా భావించ బడుతున్నాయి.
ఆయన ప్రతి పాదన ప్రకారం , కలలు మానవుల లో నిగూఢమైన తీరని కోరికలు, వారికి వచ్చే కలలకు ” మేత ” అంటే కలలకు ప్రాణం ” అని. అంతే కాక కలలు మానవుల మనో భావాలకు ( అన్ కాన్షస్ ) కు రాజ మార్గాలు ” అని
ఆయన ఉద్దేశం లో కలలు రెండు రకాలు ! ఒకటి : నిగూఢమైన కలలు, రెండు: బహిరంగమైన కలలు. నిగూఢమైన కలలు సామాన్యం గా మనసు లోతులలో మనలో దాగి ఉన్న కోరికల ఊటలు ! ఇవి కామ పరమైనవి గా ఉంటాయి. అంటే యువకుడి లో వచ్చే కలలు తనకు అత్యంత ప్రియమైన యువతి తో సరస సల్లాపాలు ఆడుతున్నట్టు కానీ , లేదా కామోత్తేజం చెంది ఆ యువతి తో కామ క్రీడలలో పాల్గొన్నట్టు కానీ అయి ఉంటాయి ! అదే విధం గా యువతిలో వచ్చే కలలు కూడా తనను ప్రేమిస్తూ , తన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ , తన కామ వాంఛ లను తీరుస్తూ , తనూ ఆనందం పొందుతున్న యువకుడి కలలు కంటుంది.ఒక విధం గా చెప్పాలంటే , మనలో దాగి ఉన్న , ముఖ్యం గా తీరని , తీవ్రమైన కామ వాంఛ లు , కోరికలూ , ఈ నిగూఢమైన కలల రూపం లో బయట పడుతూ ఉంటాయి ! ఇక బహిరంగం గా వచ్చే కలలు పెద్దగా చెప్పుకోవలసిన విషయాలు ఏవీ ఉండక అంటే ప్రాముఖ్యత ఏమీ లేనివి గా ఉంటాయి ! ఈ బహిరణమైన కలల ప్రాముఖ్యత ఏమైనా ఉందంటే , అది నిగూఢమైన కలలను తరచూ కప్పి వేయడం ! అంటే నిగూఢమైన కలలు ఈ కలల అడుగున దాగి ఉంటాయి !
ఇక ఫ్రాయిడ్ శిష్యుడు అయిన  కార్ల్ జంగ్ కూడా కలల గురించి ఏమన్నాడో తెలుసుకుందాం !
షుమారు గా గురువు గారు చెప్పిందే ఈయన ఇంకో రకం గా , తనదైన రీతి లో చెప్పాడు ! జంగ్ గారి ఆలోచన ప్రకారం కలలు, మానవుల లో నిక్షిప్తమైన కోరికలు అని ! అంతే కాక కలలు , వారికి వచ్చే సందేశాలని ! అంటే మేస్సేజెస్ ! అంటే కలలు మానవుడికి తన ఆత్మ పంపించే ఈ మెయిల్స్ అనుకోవచ్చు ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే వీడియో మెయిల్స్ ! జంగ్ గారి ప్రకారం ఈ వీడియో మెయిల్స్ ను ప్రతి మానవుడూ విశ్లేషించి , వాటిని పరిష్కరించుకోవాలని అన్నాడు ! ఈ విధం గా తమంత తాము కానీ లేదా ఎవరి సహాయం తో నైనా కానీ పరిష్కరించుకోక పొతే , కాల కాల క్రమేణా వారిలో వచ్చే అనేక రకమైన రుగ్మతలకూ , భయాలకూ ఈ కలలు కారణ భూతమవుతాయని కూడా జంగ్ అభిప్రాయ పడ్డాడు ! అంతే కాక ఇంకా ముఖ్యం గా మనకు వచ్చే కలలను కేవలం ఏవో నిద్ర సరిగా లేకనో లేదా , మనసు ఆందోళన గా ఉండడం వల్ల వచ్చి ఉంటాయని అనుకోకూడదు. కలలు ఒక దానితో ఇంకొకటి ముడి పడి , మానవులలో ఉన్న అనేక మానసిక ప్రవృత్తులను ఒక వెబ్ లాగా  ,అంటే ఒక సాలె గూడు లా ఉంటాయి అని కూడా జంగ్ అన్నాడు.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కలల గురించి ఏమనుకునే వాళ్ళు ?.2.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 18, 2012 at 3:37 సా.

కలల గురించి ఏమనుకునే వాళ్ళు ?.2.


అనాది గా మానవులకు కలల అనుభవం చిత్రం గానూ వింత గానూ ఉండేది ! అందుకే వివిధ నాగరికతలలో మానవులు అనేక విధాలు గా వివరణ ఇచ్చే వారు , నమ్మే వారు ఈ కలల అనుభవాలను !
సుమేరియన్లు క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల కాలం లోనే , కలలు మన ఆత్మ పూర్తిగా కానీ, కొంత భాగం గానీ , మనం నిద్ర పోయినప్పుడు మన శరీరం లోనుంచి ” ఎగిరి పోయి ” , మనం కలలో ” విహరించిన ” ప్రదేశాలను సందర్శించి , తిరిగి మనకు మెలకువ వచ్చే సమయం లో తిరిగి మన శరీరం లో ప్రవేశిస్తుందని నమ్మే వారు !
బాబిలోనియన్లు మనకు వచ్చే మంచి కలలను దేవతలు పంపేవి గానూ , పీడ కలలు దయ్యాలు పంపేవి గానూ అనుకునే వారు !
ఈజిప్షియన్లు కూడా ( క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ల క్రితం ) మనకు వచ్చే కలలు దేవుడి సందేశాలు గా భావించే వారు ! అంతే కాక వారు, కలలు కనడం కోసం ప్రత్యేకమైన ప్రదేశాలలో , ప్రత్యెక మైన మందిరాలలో ,కలల పానుపు ల మీద శయనించి ( అంటే డ్రీమ్ బెడ్స్ ) , కలలు కనే వారు , మనసారా, తనివి తీరా !
సుమారు వేయి సంవత్సరాల కు పూర్వం రాసిన ఉపనిషత్తులు కూడా మనం కనే కలలకు కారణం , మనలో నిక్షిప్తమైన , నిగూఢమైన కోరికలను ప్రతి బింబిస్తాయనీ , మన ఆత్మ , నిద్రలో మననుండి దూరం గా విహరించి తిరిగి వస్తూందనీ వ్యాఖ్యానించారు !
గ్రీకు తత్వవేత్త హిపోక్రేట్స్ , మనకు వచ్చే కలలు పగలు నిర్మాణం అయి , రాత్రి నిద్రలో ఆ నిర్మాణం అయిన కలల చిత్రాలు మనకు కనిపిస్తాయి అని ప్రతిపాదించాడు. ఆ తరువాత కాలం లో ఇంకో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కూడా , మన కలలు మన రోజువారీ కార్యక్రమాల మీద ఆధార పడతాయనీ , మన కు వచ్చే జబ్బులను కూడా , మనం కనే కలల ద్వారా కనుక్కోవచ్చనీ బోధించాడు !
హిబ్రూ లు , క్రిస్తియన్లు కూడా కలలు , దేవుడి సందేశాలని నమ్మే వారు , ఎందుకంటే వారి మత గ్రంధాలలో అనేకమైన కధలు , కలలకు సంబంధించినవి ఉన్నాయి !
ఇక అమెరికన్లూ , మేక్సికనులూ కూడా , మన పూర్వీకులను కలల ద్వారా సందర్శించు కోవచ్చని నమ్ముతారు !
మనం భూగోళం అంతా తిరిగాము కదా అందరూ కలల గురించి ఏమనుకునే వారో, ఏమనుకుంటారో !

వచ్చే టపాలో మానసిక శాస్త్రజ్ఞుల వివరణ తెలుసుకుందాం !

 

 

కలలు నిజమేనా?1.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 17, 2012 at 9:29 ఉద.

 కలలు నిజమేనా?.1.

కలలు నిజమో కాదో తెలుసుకునే ముందు మనం అసలు కలలు ఏమిటో చూద్దాం!
కలలు శాస్త్రీయం గా, మన అనుభూతులు, ఆలోచనలల ప్రవాహాలు. ఈ ప్రవాహాలలో అత్భుత చిత్రాలు అంటే ఇమేజెస్ ఉండవచ్చు , లేదా మనసుకు నచ్చే ( లేదా భరించ లేని ) శబ్దాలు కానీ సంగీతం గానీ ఉండవచ్చు!
ఈ వివిధ భావోద్వేగాల ప్రవాహాలు అప్రయత్నం గా అంటే మన ప్రమేయం లేకుండా నే నిద్రలో నిద్రలో ఉన్నప్పుడు వస్తుంటాయి. వీటినే మనం కలలు అంటాము !
ఈ  అనుభూతులు, అనుభవాలు కలలో ఎందుకు వస్తాయీ అన్న ప్రశ్నకు ఇంత వరకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు !
మన నిద్ర సహజం గా కొన్ని దశలలో ఉంటుంది , ఒక కారు కనక వివిధ వేగాలతో రోడ్డు మీద ప్రయాణం చేసినట్టు ! ఆ వివిధ దశలలో మన మెదడు లో కూడా తదనుగుణం గా మార్పులు వస్తూ ఉంటాయి. నిద్రలో ఒక దశను రెమ్ స్లీప్ అంటారు అంటే REM sleep or Rapid Eye Movement sleep అని. ఈ దశ మనకు ఎందుకు ముఖ్యం అంటే కలలు సామాన్యం గా ఈ దశలో నే వస్తూ ఉంటాయి. ఈ దశలో మన కళ్ళు తదేకం గా కదులుతూ ఉంటాయి మనకు తెలియ కుండానే ! నిద్రలో మిగతా దశలలో కూడా కలలు వచ్చినా అవి అస్పష్టం గా ఉండి మనం తేలిక గా మర్చిపోయే లా ఉంటాయి. అంటే ఆ కలలను మనం అంత సులువు గా స్పష్టం గా గుర్తు కు తెచ్చుకోలేము !
మరి మన కలలు ఎంత సేపు వస్తాయి ?: సామాన్యం గా కొన్ని క్షణాలు మాత్రమె ఉంటాయి ఈ స్వప్నాలు. కానీ అధికం గా ఇరవై నిమిషాల వరకూ ఉండవచ్చు కొన్ని సమయాలలో !
మనకు వచ్చే ఈ కలలు రెమ్ స్లీప్ లో కనక మనం ఆ నిద్ర నుంచి లేస్తే కానీ లేదా ఎవరైనా మనలను నిద్ర నుంచి లేపితే కానీ , ఆ సమయం లో వచ్చిన కలను మనం చాలా వరకు గుర్తు కు తెచ్చుకో గలము !
ఒక నిద్రలో ఎన్ని కలలు వస్తాయి ?: సామాన్యం గా మనం మూడు నుంచి అయిదు కలలు కంటాము ఒక నిద్ర లో కానీ కొందరు డ్రీ మర్స్ ఏడు కలలు కూడా కనగలరు !
మనం రమారమి ఎనిమిది గంటలు కనక నిద్ర పొతే , ఆ నిద్రలో కనీసం రెండు గంటలు కలల ప్రపంచం లో విహరిస్తూ ఉంటాం!

కలలు మన నిజ జీవితానికీ , మన అంతర్ముఖానికీ అంటే మన మనసులలో ( అంటే మస్తిష్కాలలో ) దాగిన అనుభూతుల, లేదా ఆలోచనల పరంపర లకు ఒక వారధి గా భావించ బడుతుంది. ఈ కలలు అనేక విధాలు గా ఉండవచ్చు. ఏవిధం గా ఉన్నా మన కలలను మనం నియంత్రించ లేము ! అంటే ఆ కలలు మన స్వాధీనం లో ఉండవు ! కేవలం ఆ కలల అనుభూతులు మాత్రమె మనకు మిగులుతాయి !
కొన్ని సమయాలలో ఆనూహ్యం గా మన కలలు, మన జీవితాలలో స్ఫూర్తి ని కలిగించి మనకు ఒక మంచి ఆలోచనను కలిగించడమో లేదా ఒక ఉన్నత భవిష్య మార్గ నిర్దేశనం చేయడమో చేస్తాయి !
ఉదా : కేకులె అనే ఒక జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు బెంజీన్ అనే ఒక రసాయన నిర్మాణం తనకు కలలో కనిపించిన్దన్నాడు. ఆ నిర్మాణం శాస్త్రీయం గా రుజువు అవడమే కాకుండా , ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా సేంద్రియ రసాయన శాస్త్రం లో జరిగిన అత్యత్భుత ఆవిష్కారం గా ఇప్పటికీ పరిగణింప బడుతుంది !

మరి ఈ కలల శాస్త్రాన్ని ఏమంటారో చెప్పలేదు కదూ , దానిని ఒనీరాలజీ అంటారు( Oneirology ) ( కంగారు పడకండి పదం చూసి , గ్రీకు బాష లో ఒనీరోస్ అంటే నిద్ర , లజీ అంటే శాస్త్రం )

 

ఇంకొన్ని వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం !

 

 

కలలు నిజమేనా ?

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 16, 2012 at 8:42 సా.

కలలు నిజమేనా ?

 

కలలు ! మానవ జీవితాలలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తాయి. కలలు కనని మానవులు ఉండరు కదా! ఆనంద స్వప్నాలు , సుందర స్వప్నాలు , మధుర స్వప్నాలు , మరచి పోలేని కలలు, మై మరపించే కలలు , చెడ్డ కలలు , పీడ కలలు , సాహస కలలు , భయానక కలలు, ఇట్లా మనకు అనేక రకాలైన కలలు మన జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అవుతూనే ఉంటాయి !
మరి ఈ కలలు నిజమేనా ! మనం కన్న కలలు నిజమవుతాయా ?! అన్ని కలలూ నిజమవుతాయా లేక కేవలం ఆనందమయ మైన కలలే యదార్దాలవుతాయా ? మరి మన పూర్వ భారత అద్యక్షులు సలహా ఇచ్చినట్టు మనం కలలు కంటూ ఉంటే మంచిదేనా?!

ఈ కలలకు ఏమైనా అర్ధం ఉందా ? కలను బట్టి మన అంతరంగాన్ని విశ్లేషించ వచ్చా? కలలు కనడం మన మానసిక , భౌతిక ఆరోగ్యానికి మంచిదేనా ? ! 

మనం ఈ ప్రశ్నలకన్నిటికీ వీలైనంత శాస్త్రీయం గా విశ్లేషణ తో వివరం గా తెలుసుకుందాం , వచ్చే టపా నుంచి !

” బాగు” సందర్శకులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 12, 2012 at 10:05 సా.

” బాగు ” సందర్శకులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

Wish you a happy Diwali ! 

నిజమైన ప్రేమ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 11, 2012 at 9:21 సా.

నిజమైన ప్రేమ.3.

ఎటాచ్ మెంట్ : నిజమైన ప్రేమ ఆప్యాయత తో నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక మాత్రు మూర్తి శిశువు తన గర్భం లో ప్రవేశించిన సమయం నుంచీ , తాను తుది శ్వాస తీసుకునే వరకూ , తన సంతానం మీద ఒకే రకమైన అవ్యాజమైన అనురాగం , ఆప్యాయత చూపిస్తూ ఉంటుంది. ఆ ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్ ఆ రకం గా వర్ధిల్లుతూ ఉంటుంది.
అదే రకం గా నిజమైన ప్రేమికుల ప్రేమ కూడా ఆప్యాయత , ఆపేక్ష తోలి చూపు నుంచి చిగురించి , దిన దిన ప్రవర్ధ మానమవుతుంది ! ఆ ఎటాచ్ మెంట్ అట్లా ప్రేమికులిరువురి లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక విధం గా చెప్పుకోవాలంటే దీర్ఘ కాలిక ప్రేమే ఎటాచ్ మెంట్ ! ప్రేమ పెరుగుతూ ఉంటే , దానితో పాటుగా ఎటాచ్ మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది !

కమిట్ మెంట్ : ప్రేమ పురోగమిస్తూ ఉన్న కొద్దీ ప్రేమికులు ఇరువురూ పరస్పరం కమిట్ మెంటు తో ( ప్రేమ ) జీవితం సాగిస్తూ ఉంటారు. ప్రేమ సాగర మధనం చేస్తూ ఉంటారు! ఎవరైనా ప్రియుడి ప్రవర్తన కామెంట్ చేసి ” అతడు ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు ” అని ఎవరైనా అంటే మీరు వెంటనే ” ఔను. అతను చాలా గంభీరం గా , ధైర్యం గా, ధీమా గా ఉంటారు ” అని అతని లోని పాజిటివ్ లక్షణాలను  తెలియ చేస్తారు, మీ ఇరువురి మధ్య ప్రేమ ఘాటు గా ఉంటే ! అంటే కమిట్ మెంటు తో ఉంటే ! అదే కమిట్ మెంటు కనుక లోపిస్తే ” అతను నాతోటీ అంతే ! ఒక పట్టాన మాట్లాడడం అతి కష్టం ! మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాడో ఏమిటో !? అని అతని నెగెటివ్ లక్షణాలను అంటే లోపాలను వల్లె వేస్తూ ఉంటారు !
ఇంటిమసీ : నిజమైన ప్రేమ అంటే సన్నిహితం కూడా ! మనసులు కలిసినప్పుడు , పరస్పరం ఇరువురూ ఎప్పుడూ సన్నిహితం కోరుకుంటూ ఉంటారు! క్రమేణా , అతని లోని ప్రతి అణువూ ఆమెకు పిండి కొట్టినట్టు , ఆమెలోని ప్రతి అణువూ అతనికి కూడా అట్లాగే సంపూర్ణం గా అవగాహన అవుతుంది. గౌరీ శంకరులలాగా లో ఒకరు మమైకం అవుతారు. సన్నిహితం , స్నేహం గా మారి ఒకరి ఊపిరి లో ఇంకొకరి ఊపిరి గా ప్రేమ ప్రాణ వాయువు అవుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !

నిజమైన ప్రేమ ఏంటి ?.2.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 9, 2012 at 9:11 సా.

 నిజమైన ప్రేమ ఏంటి ?.2.

మరి అసలైన ప్రేమ ఎట్లా ఉంటుంది?:

నిజమైన ప్రేమ అంటే కేరింగ్ ( caring ) : గ్రీకులు ప్రేమను పలు విధాలు గా నిర్వచించారు. ఆపేక్ష , వాత్సల్యం, ఆప్యాయతా , అనురక్తి – ఇట్లా అనేక రకాలు గా ప్రేమ లక్షణాలను నిర్వచించారు. ఏ లక్షణాలతో నిర్వచించి నా , ప్రేమలో అతి ముఖ్యం గా కనిపించే ప్రధాన లక్షణం ,ప్రేమించిన వారు ప్రేమించ బడుతున్న వారిని ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు. ఈ కేరింగ్ అనే ఆంగ్ల పదాన్ని సరిగ్గా తెనిగీకరించాలంటే ‘ అనురాగం ‘ అనే పదం వాడ వచ్చు నెమో ! ఈ అనురాగం నిరంతరం ఉంటుంది ప్రేమిస్తున్న వారిలో. ప్రేమించ బడుతున్న వారి మీద.
ఈ ప్రేమికులు , ప్రేమ పాత్రులు ఏ విధమైన శారీరిక లేక మానసిక బాధ కు లోనైనా తట్టుకోలేరు ‘ ప్రియా నీ వేలికి  గాయమయింది, నేను కట్టు కడతాను, ఆ వేలు నీ కుడి చేతి వేలు కూడా అయింది కదా ! నీవు ఆందోళన పడకు , ఆ గాయం మానే వరకూ నేను నీకు భోజనం స్పూన్ తో నీకు తినిపిస్తాను. సరేనా ” అంటారు. ” నీ ఒళ్ళు చూడు ఎంతగా మసిలి పోతుందో , తీవ్రం గా జ్వరం వచ్చినట్టు ఉంది, షాల్ కప్పుతాను నీ మీద , వెళ్లి పారాసేటమాల్ త్యాబ్లేట్స్ తెస్తాను వేసుకుని ఏ పనీ చేయకుండా రెస్ట్ తీసుకో బెడ్ లో అని చేతి లో చేయి వేసి తన పెదవులు ఆమె బుగ్గల మీద ఆనించి ధైర్యం చెప్పి స్వాంతన చేకూరుస్తారు ! చిన్న బాబో , పాపో పుడితే , అతి జాగ్రత్తగా వారిని తమ ఒడి లో కి తీసుకుని ముద్దాడతారు , వారి ఒడి లో ఒక అతి అందమైన ఆకర్షక పత్రాలున్న పుష్పం ఉన్నట్టు అనుభూతి చెందుతూ , ఆ ” పుష్పాన్ని ” ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ” అలాగే ప్రేమించే వారు , తమ తల్లి తండ్రులు కానీ , బంధువులు కానీ, వృద్ధులు గా ఉంటే వారిని అతి జాగ్రత్తగా నడిపించడమూ , లేదా వారికి కావలసిన పనులు శ్రద్ధ తో చేయడమూ కూడా చేస్తుంటారు. ఈ చర్యలు అన్నింటి లోనూ కేరింగ్ , లేదా అనురాగం ప్రేమించే వారిలో కలగలిసి ఉంటుంది. ఈ అనురాగం , రాగ ద్వేషాలకు అతీతం గా ఉంటుంది. సమయానుకూలం గా మారక ప్రేమించే వ్యక్తి జీవితాంతం ఉంటుంది. అది ప్రేమ లక్షణం !
నిజమైన ప్రేమ లో ఆకర్షణ ఉంటుంది ( attraction ) :
ఆకర్షణ ! ఎంతో అత్భుతమైన పదం ! సృష్టి లో ఆకర్షణ లేని జీవం , జీవితం లేదంటే అతిశయోక్తి కాదు ! ఉప్పొంగి లేచే కెరటాలు తీరం తాకడానికి ఉబలాట పడతాయి. అంటే కెరటాలు తీరం చేత ఆకర్షించ బడతాయి.
తుమ్మెద ఆకర్షణీయ మైన పుష్పం లోని మకరందం చేత ఆకర్షింప బడుతుంది. చిగురించే ప్రతి మొక్కా , ప్రతి ఆకూ , తమలో ఉత్తేజం కలిగించే , స్ఫూర్తి కలిగించే సూర్యుడి కాంతి వైపు ఆకర్షించ బడతాయి.
అంత సహజం గానే మనసు ప్రేమ మయం అయినప్పుడు , ఆకర్షణ ఆ ప్రేమలో నిక్షిప్తమై ఉంటుంది ఆమెలో ప్రతి ఆణువూ ఆకర్ష ణీయం అవుతుంది అతనికి ! ఆమె కాంతికి అతని ముఖం వికసిస్తుంది. అతని కాంతికి ఆమె హృదయం పులకరిస్తుంది. ఆమె వలపు తోట లో తీపి తలపుల పూలు విర బూస్తాయి ! నిజమైన ప్రేమలో ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య కోటి అయస్కాంతాల ఆకర్షణ పుడుతుంది. నిజమైన ప్రేమ లో వికర్షణ కు తావు ఉండదు, ఉంటే నిజమైన ప్రేమ అనిపించుకోదు !

వచ్చే టపాలో ఇంకొన్ని నిజమైన ప్రేమ లక్షణాలు తెలుసుకుందాం !

%d bloggers like this: