Our Health

Archive for డిసెంబర్, 2012|Monthly archive page

B 1, థయమిన్ లోపానికి కారణాలు ఏమిటి ?:

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 16, 2012 at 11:33 ఉద.

B 1 థయమిన్ లోపానికి కారణాలు ఏమిటి ?:

పైన ఉన్న చిత్రం ఒక స్పార్క్ ప్లగ్ ది. థయమిన్ విటమిన్ కూ , మన ఆరోగ్యానికీ , వాహనాలలో ఉండే ఈ స్పార్క్ ప్లగ్ కూ ఉన్న సంబంధం ఏమిటి అనుకుంటున్నారు కదూ ! ఏ వాహనం నడవాలన్నా , పరిగేట్టాలన్నా , స్పార్క్ ప్లగ్ లో నిప్పు రవ్వ రానిదే , సాధ్య మవ్వదు. అంటే ప్రతి వాహనానికీ , ఈ స్పార్క్ ప్లగ్ అత్యంత ముఖ్యమైన భాగం. అదే విధం గా థయమిన్ విటమిన్ కూడా మన శరీరం లో జరిగే కీలక జీవ రసాయన చర్యలకు స్పార్క్ ప్లగ్ లా పని చేస్తుందని ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. మన జీవిత ” వాహనం ” కూడా ఆరోగ్యం గా, సవ్యం గా సాగాలంటే , ఈ థయమిన్ విటమిన్  స్పార్క్ ప్లగ్ లాగా పని చేస్తుంది  ! దీనితో మనకు ఈ థయమిన్ విటమిన్ ప్రాముఖ్యత అర్ధం అయింది కదా !

మనం మన ఆహారం సంపూర్ణం గా అంటే అన్ని పప్పులూ , ఆకు కూరలూ , కూరగాయలూ తింటున్నా కూడా , మనం ఆ ఆహారాలనూ , వంటలనూ , తయారు చేసుకోవడం లోనూ , లేదా ఇతర పదార్ధాలతో తినడడం వల్ల నో , మన శరీరం లో థయమిన్ ప్రవేశించినా , మన శరీర కణాలకు చేరుకోక , వ్యర్ధం అవుతుంది. ఆ కారణం గా మనలో థయమిన్ లోపం , ఆ లోప లక్షణాలు కూడా కనిపించ వచ్చు. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము :

వంటలో లోపాలు : ధాన్యాలు అంటే , గోధుమ , వరి , జొన్నలు , మినుములు , కంది పప్పు , పెసర పప్పు, ఇట్లాంటి పప్పు దినుసులు , వాటి పోట్టులోనే ఈ B విటమిన్ అత్యధికం గా ఉంటుంది. కానీ సామాన్యం గా ఆకర్షణీయం గా ఉండడం కోసం చాలా దుకాణాలలో ఈ ధాన్యాలను పాలిష్ చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాక వాటిని కొన్న తరువాత వంట గదిలో అనేక సార్లు కడిగి ఉడికిన తరువాత తెల్లగా కనపడ డానికీ , పొట్టు వాసన రాకుండా ఉండడానికీ అనేక ప్రయత్నాలు చేసి , ఆ ధాన్యాలలో ఉన్న పోషక విలువలు, విటమిన్లు , వృధా చేస్తుంటాము.
అంతే కాక , అత్యధిక వేడి లో , ఎక్కువ సమయం ఉడికిస్తే కూడా పోషక విలువలు తగ్గి పోతాయి. ముఖ్యం గా ఆకు కూరలూ , కూర గాయలూ ఇట్లా ఎక్కువ సమయం , అధిక వేడి లో వండడం వల్ల వాటిలో ఉన్న విటమిన్లు కోల్పోతాయి.
కాఫీలూ , టీలూ , వక్క పొడి : టీలూ కాఫీలూ ఎక్కువ గా తాగితే , జర్దా, వక్కపొడి ఎల్లకాలం నములుతూ ఉంటే కూడా మనం తీసుకునే ఆహారం లో ఉన్న థయమిన్ విటమిన్ మనకు అంటే మన శరీరం లోని కణాలకు అందదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది.టీ లోనూ , కాఫీ లోనూ , ఇంకా వక్క పొడి , జర్దా లలో ఉండే కొన్ని రసాయన పదార్ధాలు , థయమిన్ విటమిన్ ను విరిచేస్తాయి అంటే దానిని పనికి రాకుండా చేస్తాయి ( అప్పుడు పాలు విరిగితే మనకు ఆ విరిగిన పాలు ఎట్లా ఉపయోగ పడవో , అట్లా అవుతుంది థయమిన్ విటమిన్ ! )

సరిగా వండని చేపలు : కొన్ని రకాల చేపలలో ( ప్రత్యేకించి చెరువు చేపలలో ) థయమిన్ విటమిన్ ను విరిచేసే తయమినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనివల్ల థయమిన్ విటమిన్ అంతా విరిచి వేయబడి మనకు ఏ విధం గానూ పనికి రాకుండా పోతుంది.

మరి ఆల్కహాలికులలో ( అంటే అతిగా మద్యం సేవించే వారిలో ) థయమిన్ లోపం ఎందుకు ఉంటుంది?:దీనికి చాలా కారణాలు ఉన్నాయి :

1. సాధారణం గా అతిగా మద్యం సేవించే వారు , వారి కడుపులో పోషక విలువలున్న ఆహారాన్ని కాక , ప్రధానం గా మద్యం తో నింపు తారు.
2. దానితో మన జీర్ణ కోశం లో ఉండే కణాలు మద్యం లో మునిగి పోయి , ఆహారం లో ఉండే థయమిన్ ను ” పీల్చుకో ” లేవు.
3. అతిగా సేవించే మద్యం కాలేయం అంటే లివర్ లోని కణాలను కూడా పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం లో ప్రవేశించే థయమిన్ నిలువ అవ్వడానికి వీలు పడదు ( సామాన్యం గా మనం మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ థయమిన్ ఆహారం లో తీసుకుంటే , అది మన కాలేయం అంటే లివర్ లో నిలువ చేయబడుతుంది )
4.అంతే కాక మద్యం థయమిన్ ను మన శరీర కణాలకు చేర నీయదు.

గమనించ వలసిన విషయం ఏమిటంటే , ఈ మార్పులు , చాలాకాలం , ఎక్కువ గా మద్య పానం చేసే వారిలో వస్తాయి. ఒక సారి ఈ మార్పులు వచ్చాక వారు మతి మరుపు తెచ్చుకుంటారు , కంఫ్యుస్ అవుతూ ఉంటారు. తికమక పడుతూ ఉంటారు.ఏకాగ్రత కోల్పోతారు. చీటికీ మాటికీ విసుక్కుంటూ ఉంటారు , చుట్టూ ఉన్న వారి బుర్ర తినేస్తూ ఉంటారు , ఎందుకంటే , వారి బుర్ర , నిరంతరం మద్యం లో ” మునిగి ” విటమిన్లు లోపించి సరిగా పని చేయదు కనుక ! కానీ వారు ఈ విషయాన్ని ఒప్పుకునే పరిస్థితి లో ఉండరు. మీరు గమనించారో లేదో , అతి గా తాగే వారు , వారి పరిస్థితిని అంత తేలిక గా ఒప్పుకోరు. వారి నిస్సహాయ స్థితిని వారి కోప తాపాలనూ , వారి కుటుంబ సభ్యుల మీదా , ( తల్లి తండ్రులూ , భార్య ల మీదా ) అమాయకులైన తమ సంతానం మీదా అంటే చిన్నారుల మీదా చూపిస్తూ ఉంటారు. ఇది చాలా విచార కర పరిస్థితి.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

( విటమిన్ B 1 ) థయమిన్ మనలో తక్కువవుతే పరవాలేదా ? !!!

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 15, 2012 at 11:35 ఉద.

( విటమిన్ B 1 ) థయమిన్ మనలో తక్కువవుతే పరవాలేదా ? !!!

( విటమిన్ B 1 ) విటమిన్ ను ‘ థయమిన్ ‘ అని కూడా అంటారు. ఈ థయమిన్ B విటమిన్ లలో మొదటిది. ‘థయ’ అంటే గంధకం. ఈ గంధకపు అణువు కలిగి ఉన్న విటమిన్ కాబట్టి దీనికి థయమిన్ అని పేరు వచ్చింది. ఈ థయమిన్ లేదా B1 విటమిన్ కేవలం బాక్టీరియా లూ , ఫంగస్ లూ ( శిలీంధ్రాలు అని కూడా అంటారు అంటే పుట్టగొడుగుల జాతి కి చెందినవి ) ఇంకా మొక్కలు మాత్రమే ఈ థయమిన్ విటమిన్ ను తయారు చేయ గలవు. కానీ మానవులకు ( జంతువులకు కూడా ) ఈ B 1 విటమిన్ లేదా థయమిన్ చాలా ముఖ్యం.
ఈ థయమిన్ లోపం మనలో ఎట్లా కనిపించ వచ్చు ?:
మనం తీసుకునే ఆహారం లో థయమిన్ లోపం ఏదో రూపం లో ఉంటే ఆ లోప లక్షణాలు మనలో కనిపిస్తాయి.
మన దేహం లో అనేక అవయవాలు సరిగా పనిచేయడానికి ఈ థయమిన్ చాలా కీలకమైనది. కానీ మన నాడీ వ్యవస్థ లో ఈ విటమిన్ లోపం చాలా త్వరగానూ , ప్రస్ఫుటం గానూ కనిపిస్తుంది. ఎందుచేతనంటే , మన నాడీ మండలం లో అంటే ప్రతి నాడీ కణం లోనూ అనునిత్యం అంటే మన జీవితాంతం నిరంతరం గా జరిగే జీవ రసాయన చర్యలకు , ఈ థయమిన్ అవసరం తప్పని సరిగా ఉంటుంది.మిగతా అన్ని విటమిన్ల లానే కేవలం కొన్ని మిల్లీ గ్రాములలోనే ఈ విటమిన్ కూడా మనకు అవసరం అవుతుంది రోజూ ! కానీ ఆ కొన్ని మిల్లీ గ్రాములు కూడా లోపిస్తే , అదే మన ప్రాణాల మీదకు తెస్తుంది.
మన నాడీ మండలం లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపిస్తుంది ?:
కళ్ళు: ముఖ్యం గా కళ్ళు బైర్లు కమ్మడం , రంగులు సరిగా గుర్తించ లేక పోవడం , మొదటి దశలలో జరుగుతాయి. తరువాత , తరువాత , థయమిన్ లోపం సరిచేయక పొతే , రెండు కళ్ళ చూపూ మందగించి , విటమిన్ లోపం తీవ్రం గా ఉంటే అంధత్వం కూడా రావచ్చు. ఇట్లా అంధత్వం రావడం ‘ ఆప్టిక్ అట్రోఫీ ‘ అనబడుతుంది. అంటే కంటి లోపలి సున్నితమైన పొరలు పాడవుతాయి.
పెరిఫెరల్ న్యూ రోపతీ అంటే ఏమిటి ?: మన దేహం లో మెదడులో కాక , అవయవాల చివరల గా ఉన్న నాడులలో తిమ్మిరులూ , మంటలూ పుట్టిస్తుంది ఈ విటమిన్ లోపం. ఎందుకంటే ఈ విటమిన్ లోపం వల్ల ఆయా నాడులు సరిగా పని చేయక మంటలు పుట్టడం , తిమ్మిరులు కలగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యం గా శాక హారులలో , వయో వృద్ధులలో , ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో , మన పెద్ద వాళ్ళు , కాళ్ళు మంటలు పుడుతున్నాయని వారికి నచ్చిన నువ్వులనూనో , కొబ్బరి నూనో బాగా కాళ్ళకు పట్టించి మర్దనా అంటే మాసాజ్ చేసుకుంటూ ఉంటారు. అది కేవలం వృధా ప్రయాసే ! ఎందుకంటే వారి లక్షణాలకు కారణం విటమిన్ లోపం కదా !
మన గుండె లో థయమిన్ లోపం ఏ లక్షణాలు చూపుతుంది?:
ఈ విటమిన్ లోపం అధికం గా ఉంటె, వారి గుండె కూడా ” వాచి ” పోతుంది. అంటే గుండె సామాన్యం గా ఉండే సైజు కన్నా పెద్దగా అవుతుంది. కానీ ఇట్లా పెద్దగా అవడం, ఆరోగ్య కరం గా కాక విటమిన్ B 1 లేక థయమిన్ లోపం వల్ల కలిగే ” అనారోగ్య వాపు ‘ దీనినే ” కార్డియో మెగాలీ ”  అంటారు. అంతే కాక గుండె నీరసం గా కొట్టుకుని , కాళ్ళ వాపు రావడం జరుగుతుంది. అంటే కాళ్ళలో నీరు చేరుతుంది.

వచ్చే టపాలో మరి మనం రోజూ బాగానే తింటున్నా కూడా కొన్ని పరిస్థితులలో విటమిన్ B 1 లోపం ఎందుకు , ఏ యే పరిస్థితులలో జరుగుతుందో కూడా తెలుసుకుందాం !

B కాంప్లెక్స్ విటమిన్లు చాలా కాంప్లి కే టెడా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 14, 2012 at 10:50 సా.

B కాంప్లెక్స్ విటమిన్లు చాలా కాంప్లి కే టెడా ?:

B కాంప్లెక్స్ విటమిన్లు : ఈ రకమైన విటమిన్లు ముఖ్యం గా ఎనిమిది రకాలు.

1. విటమిన్ B 1 లేదా థియమిన్ విటమిన్ Vitamin B1 (thiamine) :
2. విటమిన్ B 2 లేదా రిబోఫ్లావిన్ Vitamin B2 (riboflavin)
3. విటమిన్ B 3 లేదా నియాసిన్ లేక నియాసినమైడ్ విటమిన్ ( Vitamin B3 – niacin or niacinamide)
4. విటమిన్ B 5 లేదా పాంటో తేనిక్ యాసిడ్ విటమిన్ ( Vitamin B5 (pantothenic acid)
5.విటమిన్ B 6 లేదా పైరిడాక్సిన్ విటమిన్ ( Vitamin B6 -pyridoxine, pyridoxal, or pyridoxamine, or pyridoxine hydrochloride)
6. విటమిన్ B 7 లేదా బయోటిన్ విటమిన్ ( Vitamin B7 – biotin)
7.విటమిన్ B 9 లేదా ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( Vitamin B9 – folic acid)
8. విటమిన్ B 12 లేదా కోబాలమిన్ విటమిన్లు ( Vitamin B12 – various cobalamins; commonly cyanocobalamin in vitamin supplements)

మరి B కాంప్లెక్స్ విటమిన్లు అన్ని ఎందుకు ఉన్నాయి ?:
మొదట్లో B విటమిన్లన్నీ ఒకే రసాయన నిర్మాణం ఉన్నవి గా అనుకున్నారు శాస్త్రజ్ఞులు. కాల క్రమేణా వీటి రసాయన నిర్మాణం లో స్పష్టమైన తేడాలు గమనించారు. అంతే కాక వివిధ రకాలకు చెందిన B విటమిన్లు మన దేహం లో వివిధ కీలక జీవ రసాయన చర్యలలో ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలుసుకున్నారు. ఇట్లా తెలుసుకోవడం శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది , రసాయన నిర్మాణాలను విశ్లేషించే అవకాశం కలిగినందుకు. ఒక్కో రసాయన నిర్మాణం కనుక్కున్నప్పుడల్లా  ఆ  B  విటమిన్ కు తోకలు తగిలించడం మొదలెట్టారు 1,2,3,5, 6,7,9 అని. అందు వల్ల  ఇన్ని B  విటమిన్లు  ఊడి  పడ్డాయి, మన తల తినెయ్య డానికి అని అనుకోకండి , నిజానికి ఈ B  విటమిన్లు మన బుర్రలు సరిగా పని చేయడానికి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఈ B  విటమిన్లు ( ఏ  కారణం చేతనైనా ) తక్కువ అయిన వాళ్ళు , వారి చుట్టూ ఉన్న వారి ” బుర్ర ” తినేస్తారు ! ఇది ఎట్లా జరుగుతుందో కూడా మనం వివరం గా తెలుసుకుందాం ! 
నవీన మానవ జీవితం లో ఈ విటమిన్ల అంటే ప్రత్యేకించి B విటమిన్ల పాత్ర చాలా ముఖ్యమైనది. కేవలం మనం B విటమిన్లు మన శరీరానికి అవసరమనే కాకుండా ఎందుకు అవసరమో వివరం గా తెలుసుకుంటే , మనకు , మన ఆరోగ్యానికీ ఈ విషయం చాలా ఉపయోగ పడుతుంది. కేవలం మనకు ఈ విటమిన్లు అవసరమైనంత మాత్రాన వెంటనే మందుల షాపు కు వెళ్లి కొనుక్కువడం చేయకుండా , సహజ సిద్ధమైన ఆహారం లో ఈ విటమిన్లు మనకు ఎట్లా ఉపయోగ పడతాయో కూడా మనం గ్రహించాలి. అంతే కాక మద్యం , పొగాకు , మన దేహం లో ఈ విటమిన్లను ఎట్లా హరింప చేస్తాయో కూడా మనం వివరం గా తెలుసుకుంటే , అప్పుడు మనం మద్యం తీసుకోవడం , అదే మందు పుచ్చుకోవడం , లేదా పొగాకు పీల్చడం కూడా అసలు చేయవచ్చో లేదో కూడా గ్రహించ డానికి , మనకు ఒక రకం గా ” జ్ఞానోదయం ” అవుతుంది.

మరి వచ్చే టపా నుంచి ఈ B కాంప్లెక్స్ విటమిన్లు ఒకదాని తరువాత ఒకటి గా తెలుసుకుందాం !

విటమిన్ A – అనావృష్టి ( లోపం ). 5.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 10, 2012 at 6:53 సా.

విటమిన్ A – అనావృష్టి ( లోపం ). 5.

క్రితం టపాలో మనం విటమిన్ A ఉన్న వివిధ జంతువుల కాలేయాలు ( అంటే కోడి , మేక , బాతు, లేదా చేపల కాలేయాలు ) వాటితో చేసిన వంటకాలు ,అతిగా తినడం వల్ల , మన దేహం లో విటమిన్ A ఎక్కువ గా నిలువ అయి , దాని వల్ల కలిగే దుష్పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా తెలుసుకున్నాం కదా ! కాక పొతే ఇట్లా అతి విటమిన్ A అంటే హైపర్ విటమినోసిస్ అనే పరిస్థితి సామాన్యం గా జరగదు, ఈ విటమిన్ లోపం తో పోలిస్తే ! అంటే ఈ A విటమిన్ లోపం వల్ల బాధ పడే వాళ్ళే ఎక్కువ గా ఉంటారు.
ఇప్పుడు విటమిన్ A లోపం గురించి తెలుసుకుందాం !

File:Vitamin A deficiency.PNG

( source : World Health Organisation )
ప్రపంచం లో విటమిన్ A లోపం , చాలా ప్రబలం గా ఉంది. ముఖ్యం గా అభివృద్ధి చెందుతున్న దేశాలలో. ప్రతి ఏటా , ఒక అంచనా ప్రకారం ఆరు లక్షల మంది కి పైగా పిల్లలు ( అయిదేళ్ళ లోపు వయసు వారు ) మరణిస్తున్నారు , ఇంకా మూడున్నర లక్షల మంది కి పైగా చిన్నారులు అంధులు అవుతున్నారు , కేవలం విటమిన్ A లోపం తోనే ! వారి కళ్ళ తో ఈ అందమైన ప్రపంచాన్ని చూడ లేక పోతున్నారు ! కేవలం సంవత్సరం లో రెండు మార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి విటమిన్ A గుళిక ను అంటే కాప్స్యుల్ ను చిన్న పిల్లలకు ఇవ్వడం ద్వారా , వారి అంధత్వం నివారించవచ్చు. వారి మరణాలను కూడా నివారించ వచ్చు.
చికిత్స :
విటమిన్ A లోపం నివారణ చేస్తే , అంధత్వం తో పాటుగా , చిన్న పిల్లల మరణాలను కూడా తగ్గించ వచ్చని తెలిసింది అనేక పరిశీలనల వల్ల . చికిత్స ముఖ్యం గా మూడు రకాలు గా ఉంటుంది.
ఒకటి: విటమిన్ A గుళికలను అంటే క్యాప్సుల్స్ ను మూడు నాలుగు నెలలకు ఒకసారి చిన్న పిల్లలకు వేస్తె వారి లో ఈ విటమిన్ లోపం మాయ మవుతుంది. అంటే వారి చూపు చక్కగా ఉంటుంది, రేచీకట్లు మానిపోతాయి. వారికి ప్రపంచం అంతా మళ్ళీ అందం గా కనిపిస్తుంది ! ఈ రకమైన చికిత్స పిల్లలకు ఆ వయసు లో వచ్చే అతి సార వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అంతే కాక , వారికి మీజుల్స్ ( measles ) అనే వైరస్ వల్ల వచ్చే జబ్బు కూడా చాలా తక్కువ గా వస్తుందని తెలిసింది.
రెండు: విటమిన్ A లోపం విస్తృతం గా ఉన్న దేశాలలో , అక్కడి ప్రజలు తినే ఆహారం లో అంటే , ఉదాహరణకు , వెన్న , వంట నూనెలు , చపాతీలకు ఉపయోగించే గోధుమ పిండిలోనూ , ఈ విటమిన్ A ను కలిపి , ఆ యా పదార్ధాలను ప్రజలు తినడం ద్వారా కూడా ఈ విటమిన్ లోపం నివారిస్తున్నారు.
మూడు : ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చి : గమనించ వలసిన విషయం ఏమిటంటే , మనకు అవసరమయే విటమిన్ A , సహజ సిద్ధమైన ఆకు కూరలలోనూ, దుంప కూరలలోనూ , ముఖ్యం గా క్యారట్, చిలగడ దుంప లలో కావలసినంత లభ్యం అవుతుంది.
మనం కానీ , ఎవరైనా కానీ చేయవలసిందల్లా , వారి ఆహారపు అలవాట్లు మార్పు చేసుకుని , ఈ సహజ సిద్ధమైన వాటిని తరచూ వారి వారి ఆహారం లో తింటూ , అంధత్వాన్ని నివారించడమే కాకుండా , ఆరోగ్యం గా కూడా ఉండ వచ్చు !

ఆల్కహాలు అతి గా సేవించే వారికీ విటమిన్ A లోపానికీ సంబంధం ఉందా ?:

కొన్ని సంక్లిష్టమైన జీవ రసాయన చర్యలలో ( అతి గా, చాలా కాలం గా సేవించే ) మద్యం ” ప్రముఖ పాత్ర ” వహించి అనేక B విటమిన్ల తో పాటుగా ( వీటి గురించి ముందు తెలుసుకుందాం ) A విటమిన్ లోపానికి కూడా కారణ ‘భూతం” అవుతుంది !

మరి చిన్న పిల్లలలో అంధత్వ నివారణకు మనం ఏమైనా చేయ గలమా ?:

ఉత్సాహం ఉన్న వారు వారి వారి దేశాలలో జరుగుతున్న అంధత్వ నివారణ సేవా కార్యక్రమాలలో తమ వంతు ఎంతో కొంత చేయ వచ్చు ! 

హెలెన్ కెల్లర్ అనే అమెరికన్ స్త్రీ , ( చిన్నతనం లో ఒక వైరస్ వ్యాధి సోకి , తన చూపు , వినికిడీ కోల్పోయినా ) , పట్టుదలతో చదువుకుని , తన పేరున ఒక సేవా సంస్థ ను షుమారు వందేళ్ళ క్రితమే స్థాపించి , తన సేవా కార్యక్రమాల ద్వారా , ప్రపంచం లోని అనేక లక్షల మందికి చూపు ప్రసాదించింది ! మీలో ఎవరికైనా కొంత డొనేట్ చేయాలనే ఉద్దేశం ఉంటే హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్ డాట్ ఆర్గ్ ( http://www.hki.org ) చూడండి !

( The leading cause of childhood blindness is vitamin A deficiency. Every year, it is estimated that 670,000 children will die of vitamin A deficiency, and 350,000 children will go blind. Vitamin A supplementation is considered to be the most cost effective, high-priority public health treatment in the world, costing just $1.00 per child per year.Twice-yearly treatments of vitamin A can prevent blindness in children and save their lives; last year, HKI delivered over 85 million vitamin A capsules to children. )

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

విటమిన్ A – అనావృష్టీ , అతి వ్రుష్టీ !.4.

In ప్ర.జ.లు., మానసికం, Our mind, Our minds on డిసెంబర్ 9, 2012 at 2:23 సా.

విటమిన్ A – అనావృష్టీ , అతి వ్రుష్టీ !.4.

క్రితం టపాలలో మనం మన నిత్య జీవితం లో మన కళ్ళ ఆరోగ్యానికీ , మన శరీర చర్మ ఆరోగ్యానికీ, విటమిన్ A  ఎంత ముఖ్యమైన విటమినో తెలుసుకున్నాం కదా ! అసలు విటమిన్లన్నీ మన దేహానికి చాలా తక్కువ పాళ్ళ లో క్రమం తప్పకుండా అందుతూ ఉండాలి ! ఒకవేళ మనకు అన్నీ ఉండి అంటే , మనం ఒక మాదిరిగా ధనవంతులమై ఉండి, రోజూ లక్షణం గా ” షడ్ర సోపేతం గా ” అన్నీ వేసుకుని తినడం చేస్తూ ఉన్నప్పుడు , మనకు కావలసినంత కన్నా ఎక్కువ విటమిన్లు మనకు అందవచ్చు ! ఆ పరిస్థితిలో అట్లా ఎక్కువ గా లభించిన విటమిన్లు ముఖ్యం గా విటమిన్ A మన శరీరం లో లివర్ దానినే కాలేయం అంటారు కదా తెలుగులో , అందులో నిలువ చేయ బడతాయి. కానీ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే , విటమిన్ A , ఇంకా విటమిన్ E, D, K ( ముందు ముందు తెలుసుకుందాం ) మన దేహం లో ఉండవలసిన దానికన్నా ఎక్కువ గా ఉంటే , ఆ పరిణామాలు కూడా విపరీతం గా ఉంటాయి. అంటే అప్పుడు వచ్చే లక్షణాలు చెడు గా ఉంటాయి.

ఇట్లా అతి వృష్టి ( విటమిన్ A ) ఏ ఏ పరిస్థితులలో జరుగుతుంది ?: 

సామాన్యం గా షాపులలో దొరికే విటమిన్ మాత్రలు లేదా మల్టీ విటమిన్ మాత్రలు, విటమిన్ లోపం ఎప్పుడు వస్తుందో అన్న ఆందోళన, కంగారులో , అతిగా వేసుకోవడం వల్ల ,( అంటే డాక్టర్ సలహా ప్రకారం కాకుండా ఆరోగ్యం మీద అత్యాశ కు పోయి ) జరగ వచ్చు.
అలాగే ముఖ్యం గా ( ముఖ్యం గా మాంసాహారుల ) తల్లి దండ్రులు తమ పిల్లలు తెలివిగానూ , ఆరోగ్యం గానూ , త్వరగానూ ( ! ) పెరగాలని , తరచూ కాలేయం , లేదా లివర్ తో చేసిన వంటలను , తినిపిస్తున్నప్పుడు కూడా ఈ విటమిన్ A కాస్తా ” అతి విటమిన్ A ” అవవచ్చు.
ఈ పరిస్థితిని ” హైపర్ విటమినోసిస్ ” అని అంటారు. గమనించ వలసిన విషయం ఏమిటంటే , శాకాహారుల ఆహారం లో ఇట్లాంటి పరిస్థితి చాలా అరుదు గా వస్తుంది. ఎందుకంటే జంతువుల కాలేయం లేదా లివర్ లోనే విటమిన్ A అధిక శాతం లో ఉంటుంది. క్యా రెట్ లలో కూడా ఉంటుంది కానీ రోజూ ఎక్కువ క్యారట్ లు తిన్న వారికి   ( అట్లా నెలల తరబడి తింటూ ఉంటే నే ) కూడా ఈ అతి విటమిన్ A లక్షణాలు రావడానికి అవకాశం ఉంది .
మరి ఈ హైపర్ విటమినోసిస్ A లక్షణాలు ఎట్లా ఉంటాయి ?:

శాక హారులైనా , లేదా మాంస హారులైనా ఈ విటమిన్ A కావలసిన దానికన్నా ఎక్కువ గా మన శరీరం లో నిలువ ఉన్నప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:
1. చర్మం గరుకు గా అయి పొలుసులు పొలుసులు గా ఊడిపోవడం ( దీనిని ఇంగ్లీషు లో desquamation డి స్క్వామేషన్ అంటారు ).
2. మన ఎముకలు పెళుసు గా తయారై నొప్పులు రావడం
3. లివర్ లేదా కాలేయం సరిగా పని చేయక
4. పచ్చ కామెర్ల లాగా చర్మం రంగు మారడం
5. వెంట్రుకలు ఎక్కువ గా ఊడిపోవడం

ఇంకా వికారం గా కళ్ళు తిరగడం , బీ పీ పెరగడం , ఏకాగ్రత లేక పోవడం కూడా జరుగుతుంటాయి.
మరి చికిత్స ఏమిటి ?: చికిత్స ఈ విటమిన్ A శరీరం లో ఎంత ఎక్కువ గా నిలువ ఉన్నదీ అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. ఈ అనుమానం ఉన్నపుడు , వెంటనే స్పెషలిస్టు డాక్టరు ను సంప్రదించాలి.
వచ్చే టపాలో విటమిన్ A ( లోపం ) అనావృష్టి ని ఎట్లా చికిత్స తో నివారించ వచ్చు వాటి వివరాలు తెలుసుకుందాం !

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2012 at 7:16 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.3.


విటమిన్ A : విటమిన్ A మన శరీరానికి అవసరమయే అతి ముఖ్య విటమిన్. ” సర్వేంద్రియానాం నయనం ప్రధానం ” అంటారు. అట్లాంటి కంటిలో ఇంకో అతి ముఖ్య మైన భాగం రెటినా . ఈ రెటినా సరిగా పనిచేయక పొతే , మనం చూస్తున్నవి సరిగా కనిపించవు. రెటినా లో మనం కళ్ళు తెరిచి చూసే కాంతి ని గ్రహించే శక్తి కేవలం మనం క్రమం గా మన ఆహారం లో తీసుకునే విటమిన్ A వల్లనే వస్తుంది !
విటమిన్ A లోపం తో మన చర్మం లో ఉండే ఎపితీలియల్ కణాలూ , ఇంకా ఇతర కణాల పెరుగుదలకు ఒక గ్రోత్ హార్మోన్ లా పనిచేసి , వాటి ని ఆరోగ్యం గా అంటే చర్మాన్ని , ఆరోగ్యం గా ఉంచుతుంది. అంతే కాక మన కణాలలో జరిగే అనేక జన్యు పరమైన చర్యలకు కూడా విటమిన్ A అతి ముఖ్యమైనది.
మరి మనకు రోజూ ఎంత అవసరం ఈ విటమిన్ A ?
పిల్లల నుంచి పెద్ద వారి వరకూ రోజుకు కావలసిన విటమిన్ A కేవలం ఆరు వందలనుంచి , మూడు వేల మైక్రో గ్రాములు మాత్రమె .గుర్తు ఉంచుకోండి ,మైక్రోగ్రామ్ అంటే మిల్లీ గ్రాము లో వెయ్యో వంతు , లేదా గ్రాములో లక్షో వంతు మాత్రమె ! కానీ ఈ కాస్త కూడా మన శరీరానికి రోజూ లభ్యం కాక పొతే పరిణామాలు ( పైన చెప్పిన విధం గా ) తీవ్రం గా ఉంటాయి !
మరి ఈ విటమిన్ పుష్కలం గా వేటిలో ఉంటుంది ? :

శాక హారులైతే : పాలకూర , బచ్చలి కూర, చుక్క కూర , తోట కూర , లాంటి ఆకు కూరల్లో నూ , కారట్ , బ్రాకోలీ , చిలగడ దుంప లలోనూ , పచ్చి బటానీ లోనూ ,కొంత వరకూ గేదె పాలల్లోనూ ఉంటుంది !
మాంస హారులైతే : కోడి, మేక , చేప , ఈ జంతువుల కాలేయం అంటే లివర్ లో ఎక్కువ శాతం విటమిన్ A ఉంటుంది. కోడి గుడ్డు లో కొంత శాతం ఉంటుంది.
మంచి వెన్న లో నూ జున్నులో కూడా సరిపడినంత విటమిన్ A లభిస్తుంది !

మరి ఈ ఆకు కూరలనూ , కూర గాయలనూ ఎట్లా తింటే , వాటిలోనుంచి , మన శరీరానికి , వీలైనంత విటమిన్ A అందుతుంది ?

సామాన్యం గా విటమిన్ A కొవ్వులో కరుగుతుంది అంటే నూనె పదార్ధాలలో , అందువల్ల కొద్దిగా నూనెలో కానీ, వెన్న , లేదా నెయ్యి తో తాలింపు వేస్తూ ఉంటారు ,మన తల్లులూ , అమ్మమ్మలూ ( భార్యలు కూడా ఇట్లా చేయక పొతే , ఇక ముందు నుంచీ చేయడం మంచిది ! ) ఇట్లా చేయడం వల్ల కేవలం ఆ ఆకు కూరలు, కూర గాయాలతో చేసిన వంటలు , రుచి గా ఉండడమే కాకుండా , వాటిలో ఉన్న విటమిన్లు ముఖ్యం గా నూనె లో కరిగే విటమిన్ A ఎక్కువ శాతం శరీరానికి లభ్యం అవుతుంది ! చూశారా , తల్లులు సదా తమ సంతానం యొక్క ఆరోగ్యం కోరుకునే ఎంత దూర దృష్టి కలవారో !

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.2 .

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 7, 2012 at 7:28 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.2 .

జవాబు : క్రితం టపాలో ప్రశ్న వివరం గా చదివారు కదా ! కానీ ఆశ్చర్యమేమిటంటే , వందల మంది ఈ టపాను చూసినా ఒక్కరు కూడా తమ సమాధానం పోస్ట్ చేయలేదు ! కారణాలు తెలియదు !
ఈ టపాను కేవలం ఇంట రాక్టివ్ గా చేసి వీలైనంత ఎక్కువ మంది కి ఉపయోగ కరం గా ఉండాలనే ఉద్దేశం తోనే ఈ ప్రశ్న ను అడగడం జరిగింది.
పరవాలేదు , ఇక సమాధానం చూడండి :
లత చిన్నప్పటినుంచీ ఆహారం విషయం లో తన ఇష్టా ఇష్టాలతో , కొన్ని ప్రత్యేకమైన ఆహారాలే తిన్నది. లత తల్లి దండ్రులు కూడా , ఆమె ఇష్టా ఇష్టాలకే తల ఒగ్గి , కనీసం ఎదో కొంత తింటుందని , సంతృప్తి చెందారు ! ఒక్క గానొక్క కూతురు లత మీద వారికి ఉన్న ప్రేమ , లత ఆహారం విషయం లో, తల్లిదండ్రులు గా వారి బాధ్యతను విస్మరింప చేసింది !
గమనించ వలసినదేమిటంటే , లత సహజ పోషకాలున్న ఆకు కూరలు , కూరగాయలు తినడం దాదాపు మానేసింది ! కేవలం బంగాళా దుంపల్లో , చక్కగా పెరుగుతున్న లతకు కావలసిన పోషకాలన్నీ లభ్యం అవడం లేదు !
ముఖ్యం గా రక్త వృద్ధి కి కావలసిన ఇనుము , అంటే ఐరన్ , లత శరీరానికి అందట్లేదు ! ఇక విటమిన్లు కూడా శరీరం లో తగిన పరిమాణం లో లేవు ! ముఖ్యమైన విటమిన్ A లోపం కూడా క్రమేణా లోపిస్తూ ఉంది లత శరీరం లో !
శాకాహారి అయిన లతకు ఆహారం లో విటమిన్లూ , ఇనుమూ పుష్కలం గా ఉండే ఆకు కూరలు , కూరగాయలు కూడా తినక పోవడం తో వాటి లోపం లక్షణాలు, కాలక్రమాన కనిపించాయి లతలో ! దానితో కొంతవరకూ లాభం ఉండే కోడి గుడ్డు కూడా తినలేక పోయే సరికి , లత ఇంకా బలహీన మైంది !
గమనించ వలసిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే , రజస్వల అయినప్పటి నుంచీ , స్త్రీలలో ఋతు స్రావం జరిగి , రక్త హీనత అంటే రక్తం లో హీమోగ్లోబిన్ తక్కువ అయి , రక్తం పలుచ బడుతుంది ! రక్తం పలచ బడితే ( అంటే రక్తం లో ఉండే హీమోగ్లోబిన్ అనే పదార్ధం ఇనుము లోపం వల్ల అవసరమైనంత తయారవదు ) , మన శరీరం లో వివిధ భాగాలకు , ముఖ్యం గా మెదడుకు , ప్రాణ వాయువు అంద వలసినంత అందక , విపరీతమైన అలసటా , ఏకాగ్రత కోల్పోవడం కూడా జరుగుతుంది ! కళ్ళు తిరిగినట్టు అనిపించడం , చాలా సేపు నిలబడ లేక పోవడం కూడా జరుగుతుంది ! రక్త హీనత వల్ల కూడా మన చర్మం పాలిపోయి తెలుపు రంగుకు వస్తుంది. కానీ ఈ తెలుపు ఆరోగ్య కరమైన తెలుపు కాదు ! మన ఆహారం లో ఇనుము అంటే ఐరన్ లోపించడం వల్ల  హీమోగ్లోబిన్ మనకు సరిపడినంత తయారు అవదు.  ఆ కారణం గా మనలో కనిపించే లక్షణాలు అనీమియా ( anaemia ) లేదా రక్త హీనత వ్యాధి  లక్షణాలే ! 
ఇక విటమిన్ A లోపం వల్ల చర్మం లో కణాలు సరిగా పెరగక , పగుళ్ళు రావడం , గరుకు గా అనిపించడం కూడా జరుగుతుంది ! ఈ పరిస్తితులలో ముఖం మీద పూసుకునే క్రీములూ , ఫేస్ లూ చేసే లాభం శూన్యం ! ఎందుకంటే అవి కేవలం, పగుళ్ళను కనపడకుండా కవర్ చేస్తాయి కానీ , కారణాన్ని పరిష్కారం చేయవు ! ముఖ్యం గా రాత్రి సమయాలలో చూపు మందగించడం ( దీనినే ” రే చీకట్లు ” అంటారు ) సున్నితమైన కంటి పొరల మీద చిన్న చిన్న పొక్కులు గా రావడం కూడా జరుగుతుంది ! ఇంకా అశ్రద్ధ చేస్తే దృష్టి లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంది ! 

వచ్చే టపాలో చికిత్సా వివరాలు తెలుసు కుందాం !

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.1.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 6, 2012 at 8:10 సా.

విటమిన్లూ , ( ఖ ) నిజాలూ.1.

ప్రశ్న: లత పందొమ్మిది ఏళ్ల వయసున్న అమ్మాయి. ఒక్క గానొక్క కూతురవడం తో , గారాల పట్టి లా , పెరిగింది. చామన ఛాయ తో ,చాక్లెట్ లా ఉండేది ! చిన్నప్పటినుంచీ , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇష్టా ఇష్టాలు ఉండేవి , మిగతా తన వయసు పిల్లల లాగానే ! ఒక్కతే కూతురవడం చేత లత కు ఇంకా ఎక్కువ గా ఉండేవి ఈ ఇష్టా ఇష్టాలు !
చిన్నప్పటినుంచీ , క్రమం గా ఇంటి తిండి ఎక్కువ రుచించ కుండా పోయింది. అమ్మ ఎంత కమ్మగా వండినా , ఎక్కువ గా తినేది కాదు. ప్రత్యేకించి , ఆకు కూరలు , కూరగాయల తో చేసిన వంటకాలు అసలు తినేది కాదు ! ఎప్పుడు తిన్నా , పెరుగన్నం , కొద్ది గా బంగాళా దుంపల కూర తినేది ! తల్లి కనీసం అవైనా తింటుందని ప్రేమ తో చాలా తరచుగా , బంగాళా దుంపల తో వివిధ వంటకాలు చేసి పెడుతూ ఉండేది లతకు ! స్వతహా గా కుటుంబమంతా శాక హారులు కూడా ! కొంత కాలం , కోడి గుడ్డు అలవాటు చేద్దామనుకుని ప్రయత్నించారు ఇంట్లో ! కోడి గుడ్డు అలవాటు సంగతి అటుంచి , వాంతులూ వికారాలతో లత పరిస్థితి అధ్వాన్నం గా తయారయింది ! ఇంట్లో తిండి సరిగా తినడం లేదని , నాన్న గారు హోటల్ కు తీసుకు వెళ్లి , పల హారాలు తినిపించేవారు ! అట్లాగైనా కాస్త బలం గా ఉంటుందని ! క్రమేణా కాస్త బరువు పెరిగి చూడడానికి , నిజం గానే లతలా చక్కగా ఉండేది లత !
పద్నాలుగేళ్ళ వయసు లో లత , రజస్వల , అదే ” పెద్ద మనిషి ” అయింది. చక్కగా పొడుగు పెరుగుతూంది పేరు కు తగ్గట్టు లతలా సుకుమారం గా అనేక అందాలు సంతరించుకుంటుంది లత ! వక్షోజాలు పెరుగుతూ , లతలో సహజం గా ఆడ పిల్లలకు ఉండే సిగ్గు ఇంకాస్త ఎక్కువ చేశాయి ! రెప రెపలాడే ఓణీ కూడా లత అందాలను తన చాటున దాచుకోడానికి చేసే ప్రయత్నాలు తరచుగా విఫల మయ్యేవి ! కూడా లత పరువాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలలో పరికిణీలు కూడా ఒడి పొయేవి ! ఎందుకంటే , పరికిణీ లలో లత బాపు బొమ్మ లా ఇంకా అందం గా కనిపించేది ! తన సహజమైన చాక్లెట్ రంగు క్రమేణా మారి పోయి , లత తెల్ల బడడం మొదలైంది ! తల్లి దండ్రులిద్దరూ చామన ఛాయ తో ఉన్నా , లత రంగు చూసి ఆనంద పడేవారు , పెద్దమనిషి అయింది కదా , అట్లాంటి మార్పులు సహజమే నేమో అనుకున్నారు. లత చదువులో కూడా బాగా రాణించేది ! బాగా కష్టపడి చదివేది కూడా ! , అవసరమైతే రాత్రులూ , పగలూ కూడా ! క్రమేణా లతకు అలసట ఎక్కువయింది ! చీటికీ మాటికీ కళ్ళు తిరగడం , బస్ స్టాప్ లో ఎక్కువ సేపు నిలబడ లేక పోవడం , పడిపోతానేమో నన్న భయం తో వెంటనే కూర్చోవడం కూడా చేస్తుంది ! ఇదివరకటి లా ఎక్కువ సమయం చదవ లేక పోతుంది, ఏకాగ్రత ఉండట్లేదు ఇది వరకు లా ! రాత్రులలో చూపు కూడా కొద్దిగా మందగిస్తూ ఉంది !
తన లేత చర్మం కాస్తా చీటికీ మాటికీ చిన్న చిన్న పగుళ్ళు వచ్చి మంటలు పుడుతున్నాయి అప్పుడప్పుడూ ! వెంటనే తల్లి దండ్రులు , పెళ్లి వయసు లో ఉన్న అమ్మాయి , చర్మ సౌందర్యం బాగో లేక పొతే , ఇంకేమన్నా ఉందా అని కంగారు పడుతూ , అత్యవసరం గా మార్కెట్ లో ఉన్న ఓ డజను క్రీములూ, ఫేస్ ప్యాక్   లూ
కొని వాడించారు లత చేత ! ఏమాత్రం ఇంప్రూవ్ మెంటు లేక పోగా , లత మానసికం గా పోవడం మొదలు పెట్టింది , తల్లి దండ్రుల పరిస్థితి సరే సరి !

లత లో వచ్చిన ఈ మార్పులకు కారణం, లేదా కారణాలు ఏమిటి ? మీరు లతకూ , ఆమె తల్లి తండ్రులకూ ఏమి సలహా ఇస్తారు ? ప్రత్యేకించి ఏ జాగ్రత్తలు సూచిస్తారు ?

వచ్చే టపాలో వివరాలు తెలుసుకుందాం !

విటమిన్లూ ( ఖ ) నిజాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 5, 2012 at 8:10 సా.

విటమిన్లూ ( ఖ ) నిజాలూ ! :


విటమిన్లు, ఖనిజాలూ, మన దేహం లో ఉండవలసిన అతి ముఖ్యమైన పదార్ధాలు ! అవి మనం రోజూ తినే ఆహారం ద్వారా మన శరీరం లో ప్రవేశిస్తాయి. అన్నం, పప్పు, కూరలు ,లాగా మనకు కనిపించే పరిమాణం లో కాక చాలా సూక్ష్మ పరిమాణం లో మన శరీరానికి అందాలి విటమిన్లూ , ఖనిజాలూ ! అంటే మిల్లీ గ్రాములూ , మైక్రో గ్రాముల పరిమాణం లో ఇవి మనకు కావాలి ! కానీ ఈ సూక్ష్మ పరిమాణం లో కూడా మనకు రోజూ అంద వలసిన విటమిన్లూ , ఖనిజాలూ మనకు ఏ కారణం చేతనైనా అందక పొతే , వాటి పరిణామాలు విపరీతం గా ఉంటాయి ! అంతేకాదు , మన ప్రాణాలకే ముప్పు కావచ్చు , ఈ విటమిన్లూ , ఖనిజాలూ మన దేహం లో ఉండ వలసిన పరిమాణం కన్నా తక్కువ గా ఉంటే !
మనం కొంత కాలం ఆహారం లేక పోయినా , బలహీన పడతాము కానీ పరిస్థితులు చాలా రోజుల వరకూ విషమించవు , కానీ విటమిన్లూ ఖనిజాలూ – వీటి లోపం తీవ్రం గా ఉంటే , చాలా తక్కువ సమయం లోనే తీవ్ర పరిణామాలను మన దేహం ఎదుర్కోవలసి వస్తుంది !
ఇంకో ముఖ్య విషయం : విటమిన్లూ , ఖనిజాలూ కేవలం వయసు మీరిన వారికే కాక , అన్ని వయసుల వారి ఆరోగ్యానికీ అత్యవసరం ! అందు వల్ల అందరూ ఈ విటమిన్లూ , ( ఖ ) నిజాలూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది !

వచ్చే టపా నుంచి ఈ విషయాలు తెలుసుకుందాం ! మన ఆరోగ్యం కోసం ! మన బాగు కోసం !

కలలూ – వాటి అంతరార్ధాలూ. 8.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 2, 2012 at 5:32 సా.

కలలూ – వాటి అంతరార్ధాలూ. 8.

పక్షులు కలలో కనిపిస్తే: ఈ రకమైన కలలు అనేక విధాలు గా అర్ధం చెపుతాయి. సామాన్యం గా ఒక పక్షుల గుంపు కనక కలలో కనిపిస్తే , అది మీరు కోరుకునే స్వేచ్చ , స్వాతంత్ర్యానికి ప్రతీక ! మీకు ( కలలో ) కనిపించే పక్షులు కనుక తెలుపు రంగులో ఉంటే అది మీ ప్రేమ, దయా గుణాలను సూచిస్తుంది. పక్షులు నల్ల రంగులో ఉంటే మీరు మంచి వార్తలను , చెడు వార్తలను కూడా త్వరలో విన బోతున్నారని సంకేతం ! ఎర్ర రంకులో కనుక ఆ పక్షులు వుంటే అది మీ హృదయాన్ని తెలుపుతుంది , మీ హృదయం విశాలమైనదని కూడా తెలుపుతుంది. నీలం రంగు పక్షులను కలలో చూస్తే , అది మీ భవిష్యత్తు దిశా నిర్దేశనం చేస్తున్నట్టు ! పసుపు పచ్చని పక్షులు కలలో వస్తే , అది ఆనందాన్నే కాకుండా , కొంత పిరికి తనాన్ని కూడా తెలుపుతుంది , సందర్భాన్ని బట్టి ! పక్షుల గుడ్లు కనుక కలలో కనిపిస్తే మీకు త్వరలో ధన యోగం ఉందని అర్ధం. అంటే మీకు ధనం చేకూరుతుంది త్వరలో !
పడక గది : పడక గది మీకు కలలో కనిపిస్తే , అది మీలో ఉన్న , నిగూఢ మైన , రహస్యమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అంతే కాక అది మీ లో ఉన్న సృజనాత్మక శక్తి ని కూడా తెలుపుతుంది. పడక గది లో ఇంకో వ్యక్తి తో కనుక ప్రణయం , రతి క్రియలో పాల్గొన్నట్టు కల వస్తే , మీకు ఆ వ్యక్తి తో ఉన్న గాఢ సంబంధాన్ని సూచిస్తుంది. మీ సృజనాత్మక శక్తి ని కూడా ప్రతి బింబిస్తుంది. అదే మీరు మీ పడక మీద నిద్ర సరిగా పోక , పీడ కలలు వస్తూ ఉంటే , మీ ఇరువురి మధ్య , ఉన్న కలతలను , సమస్యలను సూచిస్తుంది.

పడవ : మీ కలలో మీరు పడవ మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తే , మీ హృదయాంత రాళాల ను , మీరు తరచి చూసుకుంటున్నారని అర్ధం ! అంటే మీ మనసు మూలల్లో ఉన్న అనేక అనుభూతుల పరంపరను మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేయడానికి పూనుకుంటున్నట్టు ! మీరు ఆ పడవ తో పాటుగా నీటి లోతుల్లోకి పోతూ ఉంటే , మీ ఎమోషన్స్ ను సరిగా విశ్లేషించు తున్నట్టు , అదే మీరు , అలల తాకిడి కి తట్టుకుని , ఆ పడవలో తీరాలకు పోతూ ఉంటే , మీ లో ఉన్న వివిధ అనుభూతులను, భావోద్రేకాలనూ, అధిగమించి , తీరాన్ని చేరుకున్తున్నట్టు సూచన ! అదే పడవ ఆటు పోట్లకు తట్టుకో లేక ముక్కలయినట్టు కల వస్తే , మీరు, మీ ప్రణయ సంబంధాలలో , తొందర పడుతున్నారనడానికి సూచన. అప్పుడు , మీరు , ఆచి , తూచి, అడుగులు వేయాలి , నిర్ణయాలు తొందర పడకుండా, తీసుకోవాలి !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

%d bloggers like this: