Our Health

Archive for డిసెంబర్ 20th, 2012|Daily archive page

గర్భవతులలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( B 9 ) లోపం ఉంటే ఏమవుతుంది ?:

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 20, 2012 at 5:29 సా.

గర్భవతులలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ( B 9 ) లోపం ఉంటే ఏమవుతుంది ?:

ఫోలిక్ యాసిడ్ విటమిన్ కూడా B కాంప్లెక్స్ ” కుటుంబానికి ” చెందిన విటమినే . దీనిని B9 విటమిన్ అనికూడా అంటారు.మన దేహం లో ఫోలిక్ యాసిడ్ ఏ ఏ పనులు చేస్తుందో తెలుసుకుందాం !
1. DNA నిర్మాణానికి: మన దేహం లో ప్రతి కణం లోనూ జన్యు పదార్ధం ఉంటుంది. దీనినే డీ ఎన్ ఏ అని అంటారు. ఈ జన్యు పదార్ధం ప్రతి కణం నిర్మించినప్పుడు అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యు పదార్ధం నిర్మాణం లో అనేక మైన జీవ రసాయన చర్యలు జరిగుతున్నప్పుడు , వివిధ దశలలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ అవసరం అనివార్య మవుతుంది.
2. DNA రిపేరు కు : అట్లాగే DNA కొంత పాత బడుతున్నప్పుడు , దానిని కొన్ని జీవ రసాయన చర్యల ద్వారా పునరుజ్జీవింప చేయడం కూడా ఫోలిక్ యాసిడ్ చేస్తుంది.
3. కణ విభజనకు : మన దేహం లో ప్రతి కణమూ కొత్త కణాలను ” కణ విభజన ” అనే చర్య ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఈ పని కి కూడా ఫోలిక్ యాసిడ్ అనివార్యం.
4. వివిధ కణాల పెరుగుదలకు:  కణాలు ఒక సారి ఏర్పడిన తరువాత వాటి పెరుగుదలకు కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం తప్పనిసరి.

గర్భ వతులలో మరి ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువ గా అవసరం అవుతుంది?:
వీరిలో గమనించ వలసినది ఏమిటంటే , తమకే కాకుండా తమ గర్భం లో పెరుగుతున్న పిండానికీ , వివిధ దశలలో పిండం నుంచి మారిన శిశువు కు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అవసరం అనివార్యం. అందువల్ల వీరు మామూలు గా అవసరానికంటే ఎక్కువ గా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి !
గర్భ వతులలో ఫోలిక్ యాసిడ్ తగినంత తీసుకోక పొతే ఆ లోపం ఏవిదం గా కనిపిస్తుంది ? :
ఫోలిక్ యాసిడ్ లోపం తీవ్రం గా ఉంటే వారికి సంతానం కలగడం కూడా ఆలస్యం అవుతుందని పరిశోధనల వల్ల తెలిసింది. దీనికి కారణం ఫోలిక్ యాసిడ్ లోపించి నప్పుడు స్త్రీలలో అండం సరిగా పెరగదు. ఇక గర్భం ధరించిన వారిలో రక్త హీనత కలుగుతుంది. ( మాక్రో సైటిక్ అనీమియా ) అంటే రక్తము పలచ పడుతుంది. అంటే చిక్క గా ఉండదు ! మరి ఈ చిక్క గా ఉండడం ఏమిటి , పలుచ గా ఉండడం ఏమిటి , చిక్కటి కాఫీ , నీళ్ళ కాఫీ లాగా ? అని మీరు సందేహ పడవచ్చు. నీళ్ళ కాఫీ తాగొచ్చేమో కానీ , మన రక్తం పలుచ బడితే అనారోగ్యం ఖాయం ! ఎందుకో చూడండి: రక్తం లో తగినన్ని ఎర్ర రక్త కణాలు ఉంటే నే రక్తం చిక్కగా ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాలు మన దేహం లో ప్రతి భాగానికీ , ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే ప్రతి కణానికీ ప్రాణ వాయువును సరఫరా చేస్తాయి, మన జీవితాంతం. మనలో, ముఖ్యం గా గర్భ వతులలో రక్తం ఏ కారణం చేతనైనా పలుచ బడినప్పుడు , వారికి తగినంత ప్రాణ వాయువు అందక , అలసట , బలహీనం , ఆయాసం , మొదలైన లక్షణాలు కలుగుతాయి. అంతే కాక వారి కాళ్ళు తిమ్మిరులు కలగడం , మొద్దు బారినట్టు అవడం కూడా అవుతుంటుంది. శిశువు పెరుగుదల సరిగా ఉండక పోవడం కూడా జరుగుతుంది.ఇక నెలలు నిండిన కొద్దీ , గర్భాశయం లో మావి ( ప్లాసేంటా అంటారు ) సరిగా అమరక పోవడం లేదా త్వరగా శిశువు నుంచి విడిపోవడం కూడా జరగ వచ్చు.
ముఖ్యం గా గర్భం లో పెరిగే పిండం లోనూ , పెరిగే శిశువు లోనూ ఫోలిక్ యాసిడ్ లోపం ఎట్లా కనిపిస్తుంది ?:
అవయవ లోపాలతో పుట్టడం , ముఖ్యం గా న్యూ రల్ ట్యూబ్ డిఫెక్త్స్ అంటే నాడీ వ్యవస్థ లో లోపాల తో పుట్టడం జరుగుతుంది.( Neural tube defects ( న్యూరల్  ట్యూబ్  డిఫెక్ట్ లు ) ( పైన ఉన్న చిత్రం చూడండి ):  గర్భం లో ఒక సారి  స్త్రీ నుంచి విడుదలైన అండం  పురుషుడి  వీర్యం లోని వీర్య కణం తో కలిసినపుడు  పిండం ఏర్పడుతుందని మనకందరికీ తెలుసు కదా ! పిండం  అభివృద్ధి చెందుతున్న తొలి  దశలలో  ( అంటే ముఖ్యం గా మొదటి మూడు నాలుగు నెలల గర్భం లో ) భవిష్యత్తులో  శిశువులో  రూపం దాల్చనున్న వివిధ అవయవాలు  పిండం మీద మొగ్గల లాగా ఏర్పడతాయి. అట్లా ఏర్పడేదే  న్యూరల్  ట్యూబ్  అంటే  నాడీ  గొట్టం అన  వచ్చు నేమో ! ఈ నాడీ  గొట్టమే  భవిష్యత్తులో  ఒక చివర  మన మెదడు గానూ ఇంకో చివర మన వెన్ను పూసా ( స్పైనల్ కార్డ్ )  ఇంకా మిగతా నాడులు  నిర్మాణం అవుతాయి.  మనం తెలుసుకున్నాం కదా , ఫోలిక్ యాసిడ్ ముఖ్యం గా కణాలు విభజన చెంది, కొత్త కణాలు ఏర్పడే దశ లో  అత్యవసరం అని !  అందు వల్ల  ఈ దశలో కనుక ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటె ( అంటే గర్భం దాల్చిన తోలి దశలలో , అంటే మొదటి మూడు నాలుగు నెలల గర్భం లో ) నాడీ  మండల లోపాలు , ఇంకా మిగతా అవయవ లోపాలు కలుగుతాయి. ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఫోలిక్ యాసిడ్ విటమిన్ ప్రాముఖ్యత !  ) 

గుండె కవాటాలలో అవక తవకలు కలగడం కూడా జరుగుతుంది.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

%d bloggers like this: