తస్మాత్ ! , జాగ్రత్త !
కుగ్రామం,
మహానగరం,
ప్రాచ్యం,
పాశ్చాత్యం,
ఎక్కడైనా,
ఉదయం,
మధ్యాహ్నం,
సాయింత్రం,
నిశా రాత్రి ,
ఎప్పుడైనా,
బాల్యం,
యవ్వనం,
వార్ధక్యం,
వయసు తేడా లేదు !
నీవు స్త్రీ వైతే చాలు !
బీదవైతే మేలు !
‘కుల హీనం’ ఐతే, నీవు
అతి బలహీనం !
నీ శీలాన్ని,
రాహువై కబళించడానికి,
వీలుంటే ,
సామూహికం గా చెరచడానికి,
ఆపై
నీ గర్భం లో స్త్రీ శిశువును ,
హతమార్చడానికి,
నీ ఆస్తిత్వం పై ,కర్కశం గా ,
కరాళ నృత్యం చేయడానికి ,
నీ స్వేఛ్చ కు సదా సంకెళ్ళు గా,
నిను వేశ్యను చేసే కామాంధులు గా,
నీ శ్రమ రక్తం పీల్చే రాబందులు గా,
అబల వైన నీపై గెలుపు కోసం,
ఆక్రోశించే పిరికి పందలు గా ,
దోషం అంతా స్వయం కృతమని ,
వికృతం గా నిను హేళన చేస్తూ,
పరిణామం చెందుతూంది,
మగతనం, మృగ తనం గా !
నీతి తప్పిన మృగ జాతిగా !
విజ్రుంభిస్తూంది , విశృంఖలంగా !
అవుతున్నాయి మద్యం, మాదకం,
ఈ మగతనం కామాగ్నికి ఆజ్యం,
నీ శీలాంత్యక్రియలకు ,గంగోదకం !
మానవ సృష్టికే జననివి నీవు కాదనుకునే ఉన్మాదం !
జాతి ఉనికికే ప్రమాదం !
తస్మాత్ !, జాగ్రత్త !
( ఇటీవల ఢిల్లీ లో జరిగిన యువతి సామూహిక మాన భంగాన్ని నిరశిస్తూ రాసినది ! )