Our Health

Archive for జనవరి 26th, 2013|Daily archive page

యాంటీ బయాటిక్స్( పని చేయక పొతే ) ప్రళయం !

In మానసికం, Our Health, Our minds on జనవరి 26, 2013 at 10:34 ఉద.

యాంటీ బయాటిక్స్( పని చేయక పొతే ) ప్రళయం ! 

The hospital superbug MRSA

 
ఇది అన్నది ఎవరో  చదువు రాని  వారు కాదు !  ఇంగ్లండు దేశానికి ప్రధాన వైద్య అధికారిణి  డేం సాల్లీ డేవిస్  నిన్న ఇంగ్లండు పార్ల మెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్న మాటలు ! 
అంతే  కాక , పార్లమెంటు సభ్యులు ,  అత్యవసర ప్రాతిపదికన  తదనుగుణం గా చర్యలు చేపట్టాలి అని కూడా ఆమె  అన్నది ! అంటే , అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టడం ! ఇట్లా చాలా అరుదు గా అంటే వేల  సంఖ్య  లో అంటువ్యాధుల వల్ల  ప్రజలు మరణించే ప్రమాదం ఉన్నప్పుడు. ఇటీవల , స్వైన్ ఫ్లూ ప్రమాదం సంభవించి నప్పుడు కూడా , అనేక దేశాలలో అత్యవసరం గా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. సాల్లీ డేవిస్  మరి ఇంగ్లండు దేశ ప్రజలకు అత్యవసరం అయ్యే ఈ యాంటీ బయాటిక్స్ ప్రళయం కలిగిస్తాయని ఎందుకు అన్నదో  తెలుసుకుందాం ! 
ఆమె ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ పరిణామాల పరిస్థితిని , ఒక పెద్ద విపత్కర వరద పరిస్థితి తోనూ , ఫ్లూ పాన్ డెమిక్  తోనూ , లేదా ఉగ్రవాదులు  ఎక్కువ మంది ప్రజలను పొట్టన పెట్టుకోవడం తోనూ పోల్చింది.(  ఇంగ్లండు లో పైన చెప్పిన పరిస్థితులలో , అత్యవసర పరిస్థితి ప్రకటించి వివిధ చర్యలు చేపట్టడం కూడా జరిగింది ). 
అయినప్పటికీ , ఇంగ్లండు లో యాంటీ బయాటిక్స్ విరివి గా వాడుతూ  ఉండడం వల్ల , వాటి ప్రభావం తగ్గి పోతుందని తెలుస్తుంది. ఇట్లా యాంటీ బయాటిక్స్ పని చేయక పోవడం అనేది కొన్ని వందల పేషెంట్ లలో జరిగి వారి ప్రాణాలు పోవడం జరిగింది.అంతే  కాక ఇట్లా యాంటీ బయాటిక్స్ తీసుకుంటున్న వారి లో అవి పని చేయక పోవడం క్రమేణా  ఎక్కువ అవుతుంది. ఇదే పరిస్థితి కొన  సాగితే , వచ్చే ఇరవై ఏళ్ల  లో , మనుషులు సాధారణ ఆపరేషన్ లు చేయించుకున్నా ,ఇన్ఫెక్షన్ కనుక సోకితే ,ఇచ్చే యాంటీ బయాటిక్స్  పని చేయక , ప్రాణాలు కోల్పోవడం సామాన్యం అవుతుందని ఆమె అన్నది. ఈ యాంటీ బయాటిక్  రెసి స్టెన్స్  అనే విషయం కొత్తదేమీ కాదు.  యాంటీ బయాటిక్స్ కనుక్కున్నప్పటి నుంచీ , ఉన్నది. అంటే అవి వాడగా వాడగా , వాటితో  పోటీకా  అన్నట్టు , వివిధ రోగ కారక బాక్టీరియా లు కూడా , కొత్త కొత్త రకాలు గా వాటి లో నిరోధక శక్తిని  కలిగించుకుంటాయి. అందువల్ల , బ్యాక్టీరియా లు నాశనం అవక ,మన శరీరం లో ఇన్ఫెక్షన్ ను ఎక్కువ చేసి , మానవ మరణాలకు కారణమవుతాయి. MRSA ఎమ్మారెస్సె  అనే యాంటీ బయాటిక్స్ కు లొంగని ఇన్ఫెక్షన్ కూడా , ప్రస్తుతం ఇంగ్లండు లో అనేక ఆసుపత్రులలో పెద్ద తలనొప్పి గా పరిణమించింది ! 
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , కొత్త కొత్త మందులు కనుక్కోవడం వల్ల , ఈ బ్యాక్టీరియా లను కూడా నిర్మూలించే అవకాశం ఉండేది ఇప్పటి వరకూ ! కానీ అత్యంత  శక్తివంతమైన కార్బిపెనెమ్  అనే యాంటీ బయాటిక్ కు కూడా, అది పని చేయక , బ్యాక్టీరియా ల లో నిరోధక శక్తి పెరిగినట్టు ఇటీవల తెలిసింది.అంతే కాక క్యాన్సర్ చికిత్స కు అనేక కొత్త మందులు కనుక్కుంటూ ఉండడం తో , అవి కూడా  శరీరం లో రోగ నిరోధక శక్తి ని తగ్గిస్తాయి. ఇది కూడా బ్యాక్తీరియాలు విజ్రుభించ డానికి , ఒక కారణం.
రోగ కారక బ్యాక్టీరియా లు  ఇదివరలో లా కాక ఇప్పుడు యాంటీ బయాటిక్స్ కు అసలే  లొంగడం లేదనడానికి ఇంకో ఉదాహరణ : గనేరియా. గనేరియా ఒక సుఖ వ్యాధి. అంటే ఈ వ్యాధి ఉన్న పురుషుడి తో( ఆరోగ్యం గా ఉన్న )  స్త్రీ కానీ , లేదా ఈ వ్యాధి ఉన్న స్త్రీతో  ( ఆరోగ్యం గా ఉన్న ) పురుషుడు కానీ సంభోగం జరిపితే గానీ వస్తుంది. ఇప్పటి వరకూ , ఈ గనేరియా వ్యాధి , టెట్రా సైక్లిన్ , పెనిసిలిన్ , అనే మనకు పరిచితమైన యాంటీ బయాటిక్స్ కనుక వాడితే చప్పున నయమయేది.కానీ  ప్రస్తుతం , 80 శాతం  కేసులలో ఈ వ్యాధి ఆ యాంటీ  బయాటిక్స్ కు  నిర్మూలనం అవడం లేదు !  అందువల్ల కొత్త యాంటీ బయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఇంకో ఆందోళన కర పరిణామం ఏమిటంటే , ఇంత  వరకూ , మల్టీ డ్రగ్  చికిత్స కు చప్పున నయమవుతున్న  టీబీ ( TB ) వ్యాధి కూడా ఆ మందులకు నయ మవ్వక తిరగబడడం మొదలు పెట్టింది. 
భారత దేశం లో ప్రజలూ , వైద్య అధికారులూ ,  ఈ మార్పులను అవగాహన చేసికొని తదనుగుణం గా చర్యలు తీసుకోవాలి ! ముఖ్యం గా ప్రజలు, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు , కనీసం జ్వరం వచ్చినా , యాంటీ బయాటిక్స్ డాక్టర్ రాయక పొతే తృప్తి పడరు. ” ఆ డాక్టరు , మళ్ళీ రావాలని , తన చుట్టూ తిప్పించుకుని , డబ్బులు లాగాలని చూస్తున్నాడు ” అని అనుకుంటారు ! వెంటనే చికిత్స కు యాంటీ బయాటిక్స్ ఇవ్వాలని అనుకునే వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు.  ఈ ఆలోచనా ధోరణి లో మార్పు రావాలి. ఇంగ్లండు దేశం లో సామాన్యం గా యాంటీ బయాటిక్స్ ఎడా పెడా  ఎవరు బడితే వారు ప్రిస్క్రైబ్ చెయ్యరు.  అంటే యాంటీ బయాటిక్స్ ను వాడమని చెప్పే వారు తప్పని సరిగా డాక్టర్లూ , స్పెషలిస్టు డాక్టర్లు అయి ఉండాలి ( భారత దేశం లో ,విచ్చల విడిగా, ఎవరు పడితే వారు, ఆఖరికి , చాలా సందర్భాలలో మందుల షాపు లో పని చేసే వారు కూడా యాంటీ బయాటిక్స్ వాడమని సలహా ఇస్తారు ! ఇక నర్సింగ్ హోము లలో అయితే సరే సరి !  ఆ ఇచ్చే యాంటీ బయాటిక్స్ ను వీలు చేసుకుని  ఏ  సెలైన్ బాటిల్ ఇచ్చిన తరువాతో , లేదా ఏ  గ్లూకోజు బాటిల్ నరం లోకి ఎక్కించిన తరువాతో , పేషెంట్ ల నరాలలోకి ఎక్కిస్తారు !  )
( తరచూ , చీటికీ , మాటికీ , అనవసరం గా యాంటీ బయాటిక్స్ కనుక తీసుకుంటూ ఉంటే ,  మనలో రోగనిరోధక శక్తి తగ్గి పోయి , ఇన్ఫెక్షన్ కారకమైన బ్యాక్టీరియా లలో నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఆ బ్యాక్టీరియా లు  మనం తీసుకునే యాంటీ బయాటిక్స్ కు నశించక  పోగా, వృద్ధి చెందుతూ , రోగ తీవ్రత కు కారణ మావుతాయనే యదార్ధాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలి ! )
 
ఈ క్రింద ఉన్న ప్రకటన చూడండి ! ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయం లో వచ్చినది. కానీ ఇప్పటికీ వర్తిస్తుంది ! 
      వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  
%d bloggers like this: