మన ఆహారం లో కాల్షియమ్ అవసరమా? :
కాల్షియమ్ కూడా ఇనుము లాగానే మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి !
కాల్షియమ్ వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి ? :
కాల్షియమ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది , మన ఎముకల బలానికీ , గట్టితనానికీ , అత్యంత ఉపయోగ కరమైనది. ఎముకలు ఆరోగ్యం గా పెరిగితేనే , చిన్నారుల పెరుగుదల సక్రమం గా ఉంటుంది. ఎముకలు బలహీనం గా ఉంటే , పెరిగే వయసులో ఆ ఎముకలు వంగిపోతాయి. ఈ పరిస్థితిని రికెట్స్ అంటారు. ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఈ కాల్షియమ్ సరి పడినంత గా మనం క్రమం గా తీసుకుంటూ ఉండక పొతే , ఆస్టియో పోరోసిస్ అనే ఎముకలు పెళుసు బారే వ్యాధి వస్తుంది. అంటే ఎముకలలో కాల్షియమ్ తగ్గి పోయి ఎముకలు బలహీనం అయి చిన్న చిన్న ప్రమాదాలకే విరిగి పోతూ ఉంటాయి ! అదే విధం గా కాల్షియమ్ మన దంతాల పెరుగుదల కు కూడా అతి ముఖ్యమైనది. కేవలం ఎముకల పెరుగుదలా , ఆరోగ్యానికే కాక , కాల్షియమ్ , మన శరీరం లో ఉన్న అనేక కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా అతి ముఖ్యమైన ఖనిజం. అందుకే గుండె కండరాల ఆరోగ్యానికి కూడా , కాల్షియమ్ అవసరం. కాకపొతే మన శరీర కండరాలకు అవసరమయే కాల్షియమ్ అతి తక్కువ పరిమాణం లో ఉంటుంది. మన రక్తం సహజం గా గడ్డ కట్టడానికి కూడా కాల్షియమ్ అవసరం.
మరి కాల్షియమ్ ఏ ఏ ఆహార పదార్ధాలలో ఉంటుంది ?:
పాలు , జున్ను , పెరుగు వీటిలో కాల్షియమ్ పుష్కలం గా ఉంటుంది. కూర గాయాలలో , కాబేజీ, బెండకాయలు , ఆకు కూరలు , బ్రాకోలీ , లలోనూ ,పప్పు దినుసులలో , సోయా విత్తనాలలోనూ , సోయా పాలలోనూ , బ్రెడ్ , ఇంకా ఇతర పప్పు దినుసులలో కూడా కాల్షియమ్ పుష్కలం గా ఉంటుంది. చేపలలో కూడా కాల్షియమ్ సమృద్ది గా ఉంటుంది.
మరి కాల్షియమ్ ఎంత తీసుకోవాలి రోజూ ? :
పురుషులకు రోజూ ఏడు వందల మిల్లీ గ్రాముల కాల్షియమ్ అవసరం ఉంటుంది. బాల బాలికలకూ , గర్భావతులకూ , కొద్దిగా ఎక్కువ కాల్షియమ్ అవసరం ఉంటుంది.
కాల్షియమ్ టాబ్లెట్స్ ఎడా పెడా వేసుకో వచ్చా ? అది బలమే కదా ? : ఇది పొరపాటు. కాల్షియమ్ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకో కూడదు. అందువల్ల కడుపు లో నొప్పి తో పాటు గా , విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. రోజూ వేసుకొనే టాబ్లెట్స్ లో పదిహేను వందల మిల్లీ గ్రాముల కాల్షియమ్ కన్నా ఎక్కువ తీసుకో కూడదు.
పైన ఉన్న మొదటి చిత్రం లో చిన్న పిల్లలలో కాల్షియమ్ లోపం తో వచ్చే రికెట్స్ ఎట్లా ఉంటుందో గమనించ వచ్చు. రెండో చిత్రం లో వయసు లో ఉన్న వారికి కాల్షియమ్ లోపం తో ఎముకలు పెళుసు బారి వచ్చే ఆస్టియో పోరోసిస్ వ్యాధి ని గమనించండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !