2013 లో, సోమరి తనం సందు లోంచి స్ఫూర్తి రాజ బాట లోకి ఎట్లా వెళ్ళ గలం ?:
కొత్త సంవత్సరం మొదటి రోజు ! గత సంవత్సరం లో మన విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ పురోగమించ వలసిన సమయం ! అట్లాగే మన అపజయాలనూ మననం చేసుకుంటూ , అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడే సమయం కూడా ! ఎవరికి ఏ విధమైన సమస్యలు ఉన్నా , మానవులనందరినీ బాధించే ప్రధాన సమస్య , సోమరితనం ! అదే లెజీనెస్స్ లేదా ఇండో లెన్స్ ! మరి ఈ సోమరి తనాన్ని వదిలించు కునే మార్గాలు తెలుసుకుని, 2013 లో విజయ పధం లో ప్రయాణానికి సన్నద్ధుల మవుదామా !
1.మిమ్మల్ని వెనక్కి లాగుతున్నది ఏంటో కనుక్కోండి : ప్రతి సారీ మీ స్ఫూర్తి ని కబళించ డానికి సోమరి రక్కసి ప్రయత్నిస్తున్నప్పుడల్లా , మీరు ఆలోచించు కొండి , మీరు ఆ పని లో ఉన్న సాధక బాధకాలు. అంటే ప్రత్యేకించి ఏ విషయం మీకు సమస్య గానూ , అవరోధం గానో , ఉందో ! ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవలసిన పదం ఒక్కటే ! ” పట్టుదల”
ఒక ఉదాహరణ: థామస్ ఆల్వా ఎడిసన్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు అనేక వందల శాస్త్రీయ ఆవిష్కారాలు చేశాడు. మనం ఇంట్లో ప్రతి రోజూ వాడే విద్యుత్ బల్బ్ వాటిలో ఒకటి మాత్రమే ! ఈ ఆవిష్కారాలన్నీ ఆయన అనేక వేల సార్లు విఫలం చెందినా ” పట్టుదల ” తో చివరికి సాధించినవే ! ఆయన ” కష్టపడి పని చేయడాన్ని మించిన మంత్రం లేదు విజయానికి ” అని అన్నాడు ! మీరు చేయవలసింది , పట్టుదల వీడకుండా మీరు అనుకున్న పని సాధించడం !
2. సాధించ గలిగిన లక్ష్యాలను పెట్టుకోండి :
జీవితం లో ప్రతి సమయం లో ఒక్కో ప్రత్యేకమైన లక్ష్యం ఏర్పరుచుకోవడం ఎందుకంటే , మనం ఆ లక్ష్యం వైపు ఉత్సాహం తో పరుగెత్తుతూ ఉంటాం ! ఆ లక్ష్యం చేరుకోవడానికి శ్రమిస్తూ ఉంటాం ! ఆ లక్ష్యాలు మనం చేరుకో గలవి గానే ఉండాలి. అంతే కాక అవి మన శక్తి సామర్ధ్యాల ను పరీక్షించేవి గానూ ఉండాలి ! మనం ఇట్లా లక్ష్యాలను రెండు రకాలు గా ఏర్పరుచు కోవచ్చు ! తాత్కాలిక లక్ష్యాలు, దీర్ఘ కాలిక లక్ష్యాలు ! ఉదా: మనం చదువుతున్న చదువు చక్కగా చదివి జ్ఞానాన్ని సంపాదించుకుని పరీక్షల్లో సఫలం అవడం ! ఇక దీర్ఘ కాల లక్ష్యం , ఒక మంచి ఉద్యోగం సంపాదించి, ఒక మంచి జీవిత భాగస్వామి తో జత కట్టడం , ఒక ” ఇంటి ” వారవడం ! ఒక ఇల్లు, కారూ కొనుక్కోవడం ! లాంటివి. ఇంకో బిల్ గేట్స్ , జుకర్బర్గ్ , లేదా రతన్ టాటా లేదా నారాయణ మూర్తి అవుదామనుకోవడం లో కూడా తప్పు లేదు ! అట్లాగే ( నీతి, నిజాయితీ ఉన్న ) ” నేత” కావాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నా తప్పు లేదు కదా !
కొందరు మానసిక శాస్త్ర వేత్తలు ఈ లక్ష్య నిర్దేశనం కోసం మీరు ఒక డైరీ లాంటిది ఏర్పాటు చేసుకుని , రోజూ అది పరిశీలిస్తూ కూడా ఉంటే , అది మనకు బాగా ఉపయోగ పడుతుందంటారు ! అట్లాగే మన లక్ష్యాలను పదాలతో రాసుకోవడం గానీ , లేదా చిత్రాలతో గీసుకోవడం కూడా చేసుకోవచ్చంటారు ! ( గుర్తుంచు కొండి, మనం చిత్ర కారులం కానవసరం లేదు దీనికి ! కేవలం మన భావి జీవిత చిత్రకారులం కావాలి. మన జీవిత గీత లను అందం గా గీసుకో గలిగేది మనమే కదా ! )
3. తరచూ లక్ష్యావలోకనం చేసుకోండి : ఇల్లలక గానే పండగ కాదు కదా ! మనం ఏర్పరుచుకునే ప్రతి లక్ష్యమూ, మన ప్రమేయం లేకుండా మనం ఎట్లా సాధించ గలం ? అందువల్ల తరచూ మనం లక్ష్యం దిశగా పోతున్నప్పుడు , అందుకోసం మనం రోజూ చేస్తున్నది సరిపోతుందా లేదా , వస్తున్న అవరోధాలను సరిగా అధిగమించ గలుగు తున్నామా , లేకపోతే అందుకు మన పధకాలను మార్చుకో వలసిన అవసరం ఉందా , ఉంటే , ఏవిదం గా మార్చుకోగలం అని తరచూ ” లక్ష్యావలోకనం ” చేసుకుంటూ ఉండాలి !
4. మీకు మీరే ” నేను ఈ పని చేయగలను ” అని ధైర్యం చెప్పుకోండి : సోమరి తనానికి విరుగుడు కర్తవ్యం ! అంటే క్రియా శీలురం అవడమే కదా ! చిన్న తనం లో సోమరి గా కనుక ఉన్నట్టయితే , పెరిగే సమయం లో కూడా అట్లాగే పెరగ నవసరం లేదు కదా ! ఒక విధం గా చెప్పాలంటే , మీకు ఇక సోమరి గా కాక స్ఫూర్తి దాయకం గా ఎందుకు ఉండాలో కూడా బాగా తెలిసేది అప్పుడే !
5. నాంది ( అంటే మొదలెట్టడం ) : జీవితం అంటే అనేక సమస్యల , అనేక అనుభూతుల , అనేక అందాల సమ్మేళనం. కేవలం సమస్యల నే పదే పదే వల్లె వేస్తూ , ఏదో ఒక సాకు చెబుతూ , కర్తవ్యాన్ని దాటవేస్తూ ఉంటే మన లక్ష్యం నిర్లక్ష్యం చేసిన వారమవుతాము ! అపుడు నష్ట పోయేదీ మనమే కదా ! అందువల్ల మన సమస్యలను సమర్ధ వంతం గా ఎదుర్కొని , మన లక్ష్యాలను చేరుకోవడానికి సంనద్దులం కావాలి. అందుకు మనం శారీరకం గానూ ఫిట్ గా ఉండాలి. అందుకు సరి అయిన సమయం లో సరిపడినంత ఆరోగ్య కరమైన ఆహారం తినాలి, అట్లాగే అవసరమైనంత వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి !
మిగతా సంగతులు వచ్చే టపాలో !
కష్టపడితే ఉపయోగం లేదండి ఇష్టపడితేనే… దాని మీద ఏకాగ్రత కుదిరితేనే…అదే తపస్సు..పిచ్చి… అప్పుడే విజయం…
అది యదార్ధం కదా !