Our Health

Archive for మే, 2013|Monthly archive page

17. డయాబెటిస్ లో, కాళ్ళ జాగ్రత్తలు :

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 5, 2013 at 1:04 సా.

17. డయాబెటిస్ లో కాళ్ళ జాగ్రత్తలు :

 
డయాబెటిస్ లో  పాదాల సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. దీనికి కారణం, డయాబెటిస్ చాలా కాలం కంట్రోలు లో లేక పోవడం వల్ల వచ్చే పరిణామాలతో  దెబ్బ తిన్న  నాడులు అంటే నెర్వ్. ప్రత్యేకించి పాదాలలో ఉండే నాడులు. మనం తెలుగులో సాధారణం గా నాడి చూసి మందు ఇస్తాడు డాక్టరు అని అంటాము ! ఆ నాడి ,యదార్ధానికి నాడి కాదు అంటే నెర్వ్ ( nerve ) కాదు. అది రేడియల్ ఆర్టరీ ( radial artery ) అంటే మన చేతిలోకి గుండె నుండి రక్తం సరఫరా చేసే ఒక ధమని ! ఇప్పుడు మనం నాడులు అని చెప్పుకునేది నెర్వ్ ల గురించి. ఈ నాడులు మన మెదడు నుంచి ప్రారంభం అవుతాయి. మన శరీరం లో ప్రతి భాగానికీ విస్తరించి ఉంటాయి. ఇట్లాంటి నాడులలో, కాలిలో ఉన్న నాడి  సరిగా పని చేయక పొతే , పాదాలలో స్పర్శ తెలియకుండా పోతుంది. పర్యవసానం గా కాలికి దెబ్బ తగిలినా కూడా ఎక్కువ నొప్పి కలగక పోవడం , వేడి , శీతలం లాంటి స్పర్శలు తక్కువ అవడం కూడా జరుగుతుంది ! ఈ పరిస్థితిని ‘ న్యూరొపతీ ‘ అంటారు. 
పాదాలలో చర్మం లో మార్పులు: స్పర్శ జ్ఞానం తక్కువ అవుతూ ఉండడం వల్ల , పాదం లో చర్మం ఎండి పోయినట్టు అవుతుంది అంటే డ్రై నెస్. అందువల్ల పాదాలకు ప్రత్యేకమైన ఆయింట్ మెంట్స్ పూసుకుంటూ ఉండాలి. కానీ పాదాలను ఈ ఆయింట్ మెంట్స్ తో నింప కూడదు , కారిపోయేట్టు !
పాదాల లో కాలస్ లు ఏర్పడడం :  పాదాలలో తరచూ కొంత భాగం ( ప్రత్యేకించి వత్తిడి ఎక్కువ గా ఉన్న భాగాలు ) లో చర్మం దళసరి గా అయి కొంత కాలం తరువాత, చిన్న చిన్న కంతులు లేదా బుడిపెలు గా ఏర్పడుతాయి. ఇవి స్పెషలిస్టు తో తోలిగించుకోక పొతే , పుళ్ళు గా మారుతాయి, అంటే అల్సర్ లు గా ! ఈ పుళ్ళు ఒక పట్టాన మానవు ! దానివల్ల , కోతి పుండు  బ్రంహ రాక్షసి ” అన్న చందాన ఆ పుళ్ళు సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ! చాలా మంది డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు , వ్యాధి కంట్రోలు లో లేక పోవడం వలననే ,పాదాలకు పుళ్ళు ఏర్పడినా , ” దానంతట అదే తగ్గుతుంది లే ” అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ! చాలా కేసులలో వారు వారి పాదానికి ఉన్న వేళ్ళు , పాదాలూ , ఇంకా పరిస్థితి విషమించితే , కాళ్ళూ కోల్పోయిన సందర్భాలు అనేకం ! 
పాదాలలో అల్సర్ లు,  కాలస్ లు నివారించాలంటే ఏమి చేయాలి ?: 
క్యాలస్ లు ఏర్పడితే వాటిని తోలి దశలలోనే  ఒక ప్రత్యేకమైన రాయి ( గరుకు గా ఉంటుంది ) ఆ ప్రదేశాలను ” ఆరగ తీస్తూ ” ఉండాలి !   పుళ్ళు లేదా అల్సర్ లు ఏర్పడిన తోలి దశలలొనే , వైద్యుడితో సంప్రదించి , తగిన సలహా తీసుకోవాలి !  కేవలం యాంటీ బయాటిక్స్ తీసుకోవడమే కాకుండా , రక్త పరీక్ష చేయించుకుని ,రక్తం లో షుగరు కంట్రోలు లో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అది కూడా కేవలం పరీక్ష రోజున కాకుండా పరీక్ష కు పూర్వం రెండు మూడు నెలలు, రక్తం లో షుగరు ఏమాత్రం కంట్రోలు లో ఉందో  తెలిపే పరీక్ష చేయించుకోవాలి ! అల్సర్ లు ఏర్పడినప్పుడు  ఆ అల్సర్ల మీద బరువు పడేట్టు నడవడం కూడదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడితే ,నడక మాని , పుళ్ళు మానే వరకూ విశ్రాంతి తీసుకోవాలి !  పాద రక్షలు సరియైన సైజు ఉన్నవే ఎపుడూ ధరిస్తూ ఉండాలి !  బూట్లు ధరించడం ఉత్తమం కానీ ,అవి చాలా బిగుతు గా ఉండ కూడదు. అంతే కాక  శుభ్రమైన నూలు సాక్స్ ను ప్రతి రోజూ వేసుకోవాలి , కేవలం బూట్లు మాత్రమె వేసుకోవడం మంచిది కాదు , ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్న వారు ! ఎందుకంటే , చెమట వల్ల కాళ్ళలో పుళ్ళు ఏర్పడే రిస్కు ఎక్కువ గా ఉంటుంది ! బూట్లు చిన్న చిన్న గాయాలనుంచి పాదాలను రక్షిస్తాయి కూడా ! డయాబెటిస్ ఉన్న వారు, స్మోకింగ్ చేయకూడదు. ఎందుకంటే , వారి పరిస్థితి ” గోడ దెబ్బ , చెంప దెబ్బ ” అన్న విధం గా ఉంటుంది అంటే , డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తో ,  స్మోకింగ్ వల్ల కలిగే కాంప్లికేషన్స్ తోడై ,  రక్త నాళా లనూ, నాడులనూ త్వరితం గా దెబ్బ తీస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

16. డయాబెటిస్ లో , కిడ్నీస్ జాగ్రత్త లు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 4, 2013 at 10:04 ఉద.

16. డయాబెటిస్ లో , కిడ్నీస్ జాగ్రత్త లు !

 
డయాబెటిస్ లో మూత్ర పిండాల వ్యాధి ఎవరికి ఎక్కువ గా వచ్చే రిస్కు ఉంటుంది ? 
బ్లడ్ షుగరూ , బ్లడ్ ప్రష రూ ! :  అంటే, డయాబెటిస్ వ్యాధిలో మూత్ర పిండాల వ్యాధి కి మూల కారణం,  రక్తం లో కంట్రోలు లో లేక అధికం గా ఉన్న షుగరూ ,ఇంకా  కంట్రోలు లో లేక అధికం గా ఉన్న రక్త పీడనమూ ! ఈ రెండూ కలిసి  మూత్ర పిండాల వ్యాధి కి దొహదమవుతాయి ! కొంత వరకూ వంశ పారంపర్యం గా వచ్చే మూత్ర పిండాల వ్యాధులు కూడా వాటికి తోడవుతే , కిడ్నీ వ్యాధి ఇంకా త్వరగా వచ్చే రిస్కు ఉంటుంది !
మరి తోలి దశలలో మూత్ర పిండాల వ్యాధిని ఎట్లా గుర్తించ వచ్చు ?:
మన దేహం లో అనేక అవయవాలు, మనకోసం ” త్యాగం ” చేస్తూ ఉంటాయి ! తమ శక్తి యుక్తులు, మన జీవితాంతం , మన కోసం ధార పోస్తూ ఉంటాయి ! అందుకే చాలా అవయవాలు తాము చెడి పోతూ ఉన్నప్పటికీ , వెంటనే తెలియచేయవు !  ఉదాహరణకు : మన కాలేయం తీసుకోండి ! దానినే లివర్ అనికూడా అంటారు కదా ! మానవులు అతిగా తాగే మద్యం తోనూ , ఇంకా సిగరెట్ స్మోకింగ్ తోనూ  లివర్ చాలా అవస్థ పడుతూ కూడా మన నిత్య జీవితానికి అవసరమయే అన్ని క్రియలనూ నిర్వర్తిస్తూ ఉంటుంది ! అంటే లివర్ నాలుగు భాగాలు చెడి పోయినా కూడా పని చేసే ఐదో భాగం తో  మన శరీరం లో తన క్రియలు నిర్వర్తించుతూ ఉంటుంది !అందుకే , విపరీతం గా మద్యం తాగే వారికి ఏమాత్రమూ లివర్ చెడిపోతున్న సూచనలు కనబడవు , మిగతా ఐదో భాగం కూడా చెడి పోయే దాకా ! అదే విధం గా ,కిడ్నీ కూడా చెడిపోతున్న జల్లెడలు అవే నెఫ్రాన్ లు ఎక్కువ అవుతున్నా కూడా ” తన పని , తాను చేసుకుంటూ పోతుంది , అందువల్ల చాలా భాగం కిడ్నీ చెడి పొతే కానీ మనకు ఆ సూచనలు తెలియవు ! ఒక మాదిరి గా కిడ్నీ పని చేయనప్పుడు , కడుపు లో వికారం , ఆకలి లేక పోవడమూ, బలహీనతా , ఏపని లో ఏకాగ్రత లేక పోవడమూ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ! గమనించ వలసినది , ఈ లక్షణాలు మిగతా జబ్బులలో కూడా కనిపిస్తాయి కదా ! అంటే ఇవి కేవలం కిడ్నీ సరిగా పని చేయ నప్పుడే కనపడవు కదా ! అందువల్ల అప్రమత్తత తో తగిన స్పెషలిస్టు ను సంప్రదించి , అవసరమైన పరీక్ష లు చేయించు కోవాలి ! 
మరి డయాబెటిస్ లో కిడ్నీ జబ్బును నివారించ గలమా ?:
అనేక పరిశోధనల వల్ల  స్పష్టమైనది ఏమిటంటే ,  ఖచ్చితమైన షుగరు కంట్రోలు తో , మూత్ర పిండాలను ” బ్రంహాండం గా పని చేసేట్టు ” చూసుకోవచ్చు  అని ! అంటే , మిగతా అవయవాల లాగానే , మూత్ర పిండాలు కూడా ఖచ్చితమైన బ్లడ్ షుగర్ కంట్రోలు ఉంటే , చక్కగా పని చేస్తూ ఉంటాయి అని !వైద్య నిపుణులు సూచించిన మందులు కూడా క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి ! ప్రత్యేకించి , రక్త పీడనం కంట్రోలు కు ఇచ్చిన మందులు ! కొందరు నిపుణులు , ప్రోటీను, అంటే మాంస కృత్తులు రోజూ మనం తినే ఆహారం లో తక్కువ గా ఉంటే కూడా కిడ్నీస్ చాలా కాలం పాటు సరిగా పని చేస్తాయని అభిప్రాయ పడతారు ! 
రెండు కిడ్నీలూ ” చేతులెత్తేస్తే ”, మానవుల గతి ఏమిటి ?: 
వైద్య శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది  చాలా !  కిడ్నీ లు రెండూ చాలా వరకూ చెడిపోయినా కూడా డయాలసిస్ అనే ప్రక్రియతో ” చెడి పోయిన రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ శరీరం లో, శుభ్ర పరిచిన రక్తాన్ని ప్రవేశ పెడతారు ! అంటే  డయాలసిస్ యంత్రం మన కిడ్నీ లాగా పని చేస్తుందన్న మాట ! ఇక కిడ్నీలు రెండూ వంద శాతం చెడి పొతే , అప్పుడు  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అంటే చెడిపోయిన కిడ్నీ ని తొలగించి , ఆరోగ్య వంతమైన కిడ్నీ ని దాతల దగ్గర నుంచి తీసుకుని , శరీరం లో పెడతారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

15. డయాబెటీసూ, కిడ్నీసూ, కాంప్లికేషన్సూ !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 3, 2013 at 10:29 సా.

15. డయాబె టీసూ,   కిడ్నీసూ, కాంప్లికేషన్సూ ! 

పైన ఉన్న చిత్రం , మన మూత్ర పిండాలలో ఉండే  అనేక లక్షల అతి సూక్ష్మ ” జల్లెడ ” లలో ఒకటి.  దీనిని శాస్త్రీయం గా  ”నెఫ్రాను ”  అని  పిలుస్తారు. ( ఒక్కో కిడ్నీ లో ఈ నెఫ్రాను లు , లేదా ” జల్లెడలు ” ఎనిమిది నుంచి పదిహేను లక్షల సంఖ్య లో ఉంటాయి !  ).

 
డయాబెటిస్ ,అంటే  మధుమేహం లో కిడ్నీస్ లో వచ్చే కాంప్లికేషన్ లు ఏమిటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ! 
కంట్రోలు లో లేని డయాబెటిస్, దేహం లో అన్ని భాగాలకూ హాని చేస్తుంది, క్రమేణా ! మరి మూత్రపిండాలకు ఎందుకు కన్సెషన్ ఇస్తుంది , ఆ ఎక్కువైన షుగరు ?!!!కిడ్నీ పరీక్షలు, ఒక క్రమ పధ్ధతి లో చేయించుకుంటూ ఉండడం అందువల్ల నే ఉత్తమం !
ముఖ్యం గా డయాబెటిస్ ఉన్న వారూ , కొత్తగా గుర్తించ బడిన వారూ  గుర్తు ఉంచుకోవలసినది:  మూత్ర పిండాలు , అంటే కిడ్నీలు తొలిదశలో డయాబెటిస్ వల్ల చూపించే మార్పులు ,  సరిఅయిన సమయం లో కనుక గుర్తించి , తగిన జాగ్రత్తలు తీసుకునేట్టయితే ,  ఆ మార్పులు  అక్కడే ఆగి , కిడ్నీ ఫెయిల్యూర్  నివారింప బడుతుంది ! తొలిదశలో ఏకారణం చేతనైనా ఆ మార్పులను గుర్తించక పొతే, లేదా గుర్తించిన మార్పులను అశ్రద్ధ చేస్తే , కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది ! కిడ్నీ ఫెయిల్యూర్ అంటే , కిడ్నీస్,  ” ఇక మావల్ల కాదు మానవా  ” అని  ” చేతులెత్తేయడమే” !
డయాబెటిస్ లో కిడ్నీ చెడి పోయే రిస్కు ఎట్లా ఎక్కువ అవుతుంది ? :
మనకందరికీ తెలుసు కిడ్నీసు  మన రక్తాన్ని శుద్ధి చేస్తాయని. ఎట్లాగంటే , మూత్రపిండాలలో ఉండే నిర్మాణాలు మన దేహం లో ఉండే అతి సున్నితమైనా , అతి సూక్ష్మ మైనా జల్లెడ ల లాగా పని చేసి , రక్తంలో , మన దేహానికి అవసరమయే పదార్ధాలను రక్తం లోనే ఉంచి , అనవసరమైనా లేదా హానికరమైన పదార్ధాలను మూత్రం ద్వారా బయటికి పంపుతాయి ! దీనినే మూత్ర విసర్జన అని అంటాము. మన రక్తం లో షుగరు ఎక్కువ అయినప్పుడు , మన కిడ్నీస్ ఎక్కువ గా అంటే కష్టపడి పనిచేసి ,రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ! విపరీతం గా ఈ క్రియలో కష్ట పడుతున్నమూత్రపిండాల లోని జల్లెడలు కొన్ని చోట్ల ” చిన్న చిన్న చిల్లులు ” పడిన విధం గా తయారవుతాయి !  దానితో , మన దేహానికి ఉపయోగకరమైన పదార్ధాలు కూడా దేహం లోకి పోకుండా , ఈ ” చిల్లులు పడ్డ జల్లెడల ” ద్వారా మూత్రం లో బయటకు వస్తాయి ! కిడ్నీస్ లో ఈ చిల్లులు పెద్దవీ , ఎక్కువ సంఖ్య లో ఏర్పడుతున్న కొద్దీ , ఎక్కువ ఉపయోగ కర పదార్ధాలు బయటకు విసర్జింప బడడం జరుగుతూ ఉంటుంది !దానితో మూత్రపిండాలు చెడి పోవడమే కాకుండా , మనిషి కూడా బలహీన పడడం జరుగుతుంది ! 
అంతే కాకుండా , కాల క్రమేణా , ఈ జల్లెడలు సరిగా పని చేయక పోవడం ఎక్కువ అవుతూ , దేహానికి ఉపయోగం లేని , హాని కర పదార్ధాలు, మూత్రం ద్వారా బయటకు వెళ్ళ కుండా , దేహం లోనే ఉండడం వల్ల , అంటే మన రక్తం లోనే ఉండి పోతూ ఉండడం వల్ల , ఆ విష పూరిత పదార్ధాలు చేసే హాని మన శరీరం లోనూ కనిపిస్తూ ఉంటుంది ! ఉదాహరణ కు : యూరియా , క్రియాటినిన్ , లాంటి పదార్ధాలు ! ఇవి రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే  అంత రక్తాన్ని కలుషితం చేస్తాయి !  రక్తం మన దేహం లో ప్రవహించని ప్రదేశం ఏదీ లేదు కదా ! దాని వల్ల మన మెదడు కూడా సరిగా పని చేయలేక పోవచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

14. డయాబెటిస్ లో, స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మే 2, 2013 at 7:28 సా.

14. డయాబెటిస్ లో స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:

 
డయాబెటిస్ వ్యాధి లో వ్యాధి తీవ్రం గా ఉంటే , అంటే ,  చాలా సంవత్సరాలు గా ఉండి , మందులకు లొంగకుండా మొండికేసిన డయాబెటిస్ లో  పక్ష వాతం లేదా స్ట్రోకు వచ్చే అవకాశాలు , డయాబెటిస్ లేని వారి లో స్ట్రోకు , పక్ష వాతం వచ్చే అవకాశాల కంటే ఎక్కువ గా ఉంటాయి ! ఈ అవకాశాలు కనీసం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ గా ఉంటాయి , డయాబెటిస్ ఉన్న వారిలో !  కానీ తగు జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకుంటూ ఆరోగ్యం చూసుకుంటూ ఉంటే , డయాబెటిస్ ఉన్నా కూడా , ఈ అవకాశాలను తగ్గించు కోవచ్చు ! అందుకే కదా !  ఈ వివరాలన్నీ తెలియచేసేది 
మరి మీలో పక్ష వాతం , లేదా స్ట్రోకు వచ్చే రిస్కు ఎక్కువ ఉందో లేదో ఎట్లా తెలుసుకోగలరు ?
1. మీ వయసు యాభై అయిదు దాటితే 
2. మీరు ఊబకాయం కలిగి ఉంటే అంటే ఒబీసిటీ,
3. మీ కుటుంబం లో ఎవరికైనా పక్ష వాతం వచ్చి ఉంటే, 
4. మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే,  
5. మీకు హై బీపీ , అధిక రక్త పీడనం ఉంటే 
6. మీకు ఇంతకు ముందే మినీస్ట్రోకు లేదా TIA లేదా తాత్కాలిక పక్ష వాతం కనుక వచ్చి ఉన్నట్టయితే, 
7. మీకు గుండె జబ్బులు వచ్చి ఉన్నట్టయితే ,
8. మీ కొలెస్ట రాల్ అతలా కుతలం అయి ఉంటే , అంటే HDL తక్కువ గానూ , LDL ఎక్కువ గానూ ఉన్నట్టయితే !, 
గమనించండి పైన ఉన్న రిస్కులలో చాలా వరకూ మీ చేతులలో ఉన్నవే అంటే స్వయం కృతా లే ! అంటే వాటి  జననం , వాటి కంట్రోలూ  పూర్తి గా మీ ఆధీనం లోనే ఉంటాయి ! 
మరి పక్ష వాత సూచనలు ఏమిటి ?
1. శరీరం లో ఒక పక్క భాగాలన్నీ ఒక్క సారిగా బలహీనం అయి పోతూ ఉండడం లేదా ఉపయోగించ లేక పోవడం ! 
2. ఆకస్మికం గా మాట్లాడలేక పోవడం లేదా , మాట్లాడ డానికి ప్రయత్నిస్తే తడబడడం !
3. ఆకస్మికం గా  కన్ఫ్యూజ్ అవడం , లేదా ఎదుటి వారు చెప్పేవి ఏవీ అర్ధం కాక పోవడం ! 
4. అకస్మాత్తుగా కళ్ళు తిరగడం , కాళ్ళ మీద స్థిమితం గా నిలవ లేక పోవడం లేదా నడక లో పట్టు కోల్పోవడం !
5. ఒక కంటిలో కానీ రెండు కళ్ళతో కానీ ఆకస్మికం గా చూపు బాగా తగ్గి పోవడం లేదా కోల్పోవడం 
6. తీవ్రమైన తలనొప్పి రావడం, 
7. ఒక వస్తువు కానీ , వ్యక్తి కానీ రెండు గా కనిపించడం ! 
 
పై సూచనలన్నీ ఒక వ్యక్తి లోనే రావు. కొన్ని సూచనలు కొందరి లో రావడం జరుగుతూ ఉంటుంది. కానీ  ఈ సూచనలు అందరూ తెలుసుకోవడం ఎందుకు మంచిదంటే ,శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కదా ! అందుకు ! అంటే ఇప్పుడు పై సూచనలు ఎవరిలోనైనా గమనించిన వెంటనే కనుక నిపుణు లతో అంటే స్పెషలిస్టు లతో చికిత్స చేయించు కుంటే , పక్ష వాతాన్ని కూడా చాలా వరకూ నివారించి , చేతులూ కాళ్ళూ పడి పోకుండా నివారించవచ్చు ! అదే ఆధునిక వైద్య విజ్ఞాన మహిమ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

13. డయాబెటిస్ ఉన్న వారు ABC లతో, వారి గుండె ను ఎట్లా జాగ్రత్త గా చూసుకోవచ్చు ?

In మన ఆరోగ్యం., Our Health on మే 1, 2013 at 11:30 సా.
13. డయాబెటిస్ ఉన్న వారు ABC లతో వారి గుండె ను ఎట్లా జాగ్రత్త గా చూసుకోవచ్చు ? 
కొత్త గా డయాబెటిస్ వచ్చిన వారు కానీ , కొంత కాలం డయాబెటిస్ ఉన్న వారు కానీ, వారి గుండె జాగ్రత్త లో ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసినది కేవలం మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు !  వాటి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ! 
1. A  అంటే Hb A 1C  లో A:   అంటే  మనం ఈ పరీక్ష గురించి క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఈ పరీక్ష , రక్తం లో చెక్కర లేదా షుగర్ శాతాన్ని తెలియచేస్తుంది కనీసం పరీక్ష కు ముందు  షుమారు మూడు నెలల క్రితం వరకూ ఆ చెక్కెర శాతం ఎంత ఉందో ! అంటే ఈ పరీక్ష రక్తం లో చెక్కెర ఏ మాత్రం కంట్రోలు లో ఉందో తెలియ చేస్తుంది ! కేవలం అది తెలుసుకోవడం తోనే జాగ్రత్త తీసుకున్నట్టు కాదు కదా !  ఆ శాతం ఎప్పుడూ 6. 5 కూ , 7 కూ మధ్య ఉండేట్టు ప్రయత్నించాలి !అంటే, తదనుగుణం గా ఆహారం విషయం లోనూ పథ్యం విషయం లోనూ అన్ని జాగ్రత్తలూ , అన్ని వేళలా తీసుకోవాలి (  ఆహారం విషయం వివరం గా ముందు ముందు తెలుసుకుందాం ! ) అప్పుడే  మీరు A  ను అశ్రద్ధ చేయట్లేదని తెలిసేది !
2. B  : ఈ రెండో అక్షరం B  అంటే బ్లడ్ ప్రెషర్ అదే రక్త పీడనం ! డయాబెటిస్ ఉన్న ప్రతి వారూ కూడా వారి బీ పీ ఎప్పుడూ తగిన కంట్రోలు లో ఉండడానికి లక్ష్యం పెట్టుకోవాలి ! క్రమం గా బీ పీ పరీక్ష చేయించుకుంటూ ఆ బీ పీ 130/80 ఉండేట్టు చూసుకోవాలి ! 
3. C : ఇక మూడో అక్షరం C  అంటే , కొలెస్టరాల్ !  ఈ కొలెస్టరాల్ నిష్పత్తి కనుక మారి చెడు కొలెస్టరాల్ అదే LDL కొలెస్టరాల్ రక్తం లో ఎక్కువ అయి , HDL అదే మంచి కొలెస్టరాల్ అంటే మన దేహానికి ఉపయోగ పడే కొలెస్టరాల్ కనుక తక్కువ అవుతే వాటి పరిణామాలు తీవ్రం గా ఉంటాయి కదా ! 
ఈ LDL  కొలెస్టరాల్ మన దేహం లో ఏ విధం గా చెడు పరిణామాలకు కారణం అవుతుందో , కొన్ని నెలల క్రితం టపాలలో మంచి చిత్రాలతో వివరం గా తెలియచేయడం జరిగింది. మీకు జ్ఞాపకం ఉంటే , తెలియ చేయండి , లేదా ఆ టపాలు చూడండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !