Our Health

Archive for జనవరి, 2013|Monthly archive page

బాల బాలికలలో ఊబకాయం.

In ప్ర.జ.లు., Our Health on జనవరి 21, 2013 at 12:56 సా.

బాల బాలికలలో ఊబకాయం :

 
పల్లవి ఒక చక్కటి అమ్మాయి. ఒక్కగానొక్క కూతురు , గారాబాల పట్టి. లేక లేక కలిగిన సంతానం. తల్లిదండ్రులు అల్లారు ముద్దు గా పెంచుకుంటున్నారు.పల్లవి అమ్మ తల్లిదండ్రులు , నాన్న తల్లిదండ్రులు కూడా ! బాగా ధనవంతులు కాక పోయినా , స్తోమత కలిగినవారే !  అందుచేత , ఏలోపమూ  లేకుండా పెంచుతున్నారు పల్లవిని ! పల్లవి ఆటపాటల్లో నే కాకుండా తెలివితేటల్లో కూడా చురుకు తన క్లాసులో  మొదటి ముగ్గురిలో ఉంటుంది ఎప్పుడూ ! పల్లవి తల్లిదండ్రులు బహు ముచ్చట పడుతున్నారు, పల్లవి ప్రతిభ తో , తమ జీవిత సంగీతానికి , తమ పల్లవి, కేవలం ఒక పల్లవి మాత్రమె కాక  , ఒక ఆనందకరమైన శృతి అనుకుంటున్నారు ! పల్లవి కి  భోజ నం బహు  ఇష్టం. చిరుతిండ్లు సరే సరి. ఉదయం టిఫిన్ లో నాలుగు ఇడ్లీలు నెయ్యి వేసుకుని తింటుంది.పల్లవి తల్లి కూడా  స్కూల్ లో బాగా చదువుకోవాలి , ,ఆడు కోవాలి , పల్లవి అలసి పోతుంది , బలహీన పడుతుంది అనే ఆందోళనతో , టిఫిన్నది   బాక్స్ ను టిఫిన్ బాక్స్ లా కాకుండా , ఒక చిన్న సైజు క్యారేజీ  పెడుతుంది. ఆకుకూర పప్పు , బంగాళా దుంపల వేపుడు కూర , గడ్డ పెరుగు ఒక చిన్న బాక్స్ లో ఉంచి , అన్నం లో కలుపుకు తినమని చెపుతుంది. లంచ్ చేసిన తరువాత తినడానికి ఒక చాక్లెట్ బార్ ను కూడా ఇస్తుంది.  పల్లవి తనకు ఇచ్చిన క్యారేజీ ను ఎప్పుడూ అతి  జాగ్రత్త గా  స్కూల్ కు తీసుకు వెళ్లి , ఏవీ వదలి వేయకుండా , తింటుంది. ఇంటికి రాగానే  హార్లిక్స్ తాగుతుంది, రాత్రి భోజనం సమయం లో కూడా తనకు ఇష్టమైన బంగాళా దుంపల వేపుడు కూర ఉండాల్సిందే ! సాంబారు ఉంటే  అప్పడాలు కనీసం మూడు తినాల్సిందే !  భోజనం తరువాత , తన అమ్మమ్మ స్వహస్తాలతో చేసిన సున్ని ఉండలు కానీ , లడ్డూలు కానీ, పాల కోవా కానీ అతి ప్రేమ తో తింటుంది పల్లవి ! ఇక అమ్మా నాన్నలతో , కానీ అమ్మమ్మ తాత లతో కానీ బయటకు షాపింగుకు వెళ్లిందంటే , పిజ్జాలూ , బర్గర్ లో తప్పనిసరిగా తినాల్సిందే !  మరి షాపింగులు నెలకొక సారి కాదు కదా , కనీసం అయిదారు సార్లు వెళ్ళడం జరుగుతుంది ఏదో ఒక నెపం తో ! 
పల్లవి చాలా బొద్దుగా తయారవుతుంది , చూడడానికి అందరికీ ముచ్చటగా ఉంది , ప్రత్యేకించి పండగలకూ , పబ్బాలకూ అందరు బంధువులూ కలిసినప్పుడు కూడా , పల్లవి పట్టు లంగా  వేసుకుని , గంతులు వేస్తుంటే , అందరూ ” ముద్దు గా ” ఉంది అనుకుంటున్నారు ! పల్లవి తలిదండ్రులు కూడా చాలా ఆనంద పడుతున్నారు.  
ఇక్కడ పల్లవిని అత్యంత ప్రేమ, ఆప్యాయత లతో పెంచే పల్లవి తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తున్న విషయం , పల్లవి  ఊబకాయం గురించి ! అంటే ఒబీసిటీ  ! పల్లవి బాగా లావు అవుతుంటే , ” చిన్న పిల్ల , బొద్దు గా , బంగారు బొమ్మ లా ఉంది ” అనుకుని సంతోష పడుతున్నారు కానీ , అట్లా ఒళ్ళు రావడం అనారోగ్యం అనే వాస్తవం   గమనించ లేక పోతున్నారు ! 
 
ఈ చిన్న పిల్లలలో  వచ్చే ఊబకాయం గురించి వివరం గా , శాస్త్రీయం గా వచ్చే టపా నుంచి తెలుసుకుందాం ! 

మన ఆహారం లో కాల్షియమ్ అవసరమా? :

In ప్ర.జ.లు., Our Health on జనవరి 20, 2013 at 3:18 సా.

మన ఆహారం లో కాల్షియమ్ అవసరమా? :

 
కాల్షియమ్ కూడా ఇనుము లాగానే మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి ! 
కాల్షియమ్ వల్ల  మనకు ఉపయోగాలు ఏమిటి ? :
కాల్షియమ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది , మన ఎముకల బలానికీ , గట్టితనానికీ , అత్యంత ఉపయోగ కరమైనది. ఎముకలు ఆరోగ్యం గా పెరిగితేనే , చిన్నారుల పెరుగుదల సక్రమం గా ఉంటుంది.  ఎముకలు బలహీనం గా ఉంటే , పెరిగే వయసులో ఆ ఎముకలు వంగిపోతాయి. ఈ పరిస్థితిని రికెట్స్ అంటారు. ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఈ కాల్షియమ్ సరి పడినంత గా మనం క్రమం గా తీసుకుంటూ ఉండక పొతే , ఆస్టియో పోరోసిస్ అనే ఎముకలు పెళుసు బారే వ్యాధి వస్తుంది.  అంటే ఎముకలలో కాల్షియమ్ తగ్గి పోయి ఎముకలు బలహీనం అయి చిన్న చిన్న ప్రమాదాలకే విరిగి పోతూ ఉంటాయి ! అదే విధం గా కాల్షియమ్ మన దంతాల పెరుగుదల కు కూడా అతి ముఖ్యమైనది. కేవలం ఎముకల పెరుగుదలా , ఆరోగ్యానికే కాక , కాల్షియమ్ , మన శరీరం లో ఉన్న అనేక కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా అతి ముఖ్యమైన ఖనిజం. అందుకే గుండె కండరాల ఆరోగ్యానికి కూడా , కాల్షియమ్ అవసరం. కాకపొతే మన శరీర కండరాలకు  అవసరమయే కాల్షియమ్ అతి తక్కువ పరిమాణం లో ఉంటుంది. మన రక్తం సహజం గా గడ్డ కట్టడానికి కూడా కాల్షియమ్ అవసరం. 
మరి కాల్షియమ్ ఏ  ఏ  ఆహార పదార్ధాలలో ఉంటుంది ?:
పాలు , జున్ను , పెరుగు వీటిలో కాల్షియమ్ పుష్కలం గా ఉంటుంది. కూర గాయాలలో , కాబేజీ, బెండకాయలు , ఆకు కూరలు , బ్రాకోలీ , లలోనూ ,పప్పు దినుసులలో , సోయా విత్తనాలలోనూ , సోయా పాలలోనూ , బ్రెడ్ , ఇంకా ఇతర  పప్పు దినుసులలో కూడా కాల్షియమ్ పుష్కలం గా ఉంటుంది. చేపలలో కూడా కాల్షియమ్ సమృద్ది గా ఉంటుంది. 
మరి కాల్షియమ్ ఎంత తీసుకోవాలి రోజూ ? :
పురుషులకు రోజూ ఏడు  వందల మిల్లీ గ్రాముల కాల్షియమ్ అవసరం ఉంటుంది. బాల బాలికలకూ , గర్భావతులకూ , కొద్దిగా ఎక్కువ కాల్షియమ్ అవసరం ఉంటుంది.
కాల్షియమ్ టాబ్లెట్స్ ఎడా పెడా  వేసుకో వచ్చా ? అది బలమే కదా ? :  ఇది పొరపాటు. కాల్షియమ్ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకో కూడదు. అందువల్ల కడుపు లో నొప్పి తో పాటు గా ,  విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. రోజూ వేసుకొనే టాబ్లెట్స్ లో పదిహేను వందల మిల్లీ గ్రాముల కాల్షియమ్ కన్నా ఎక్కువ తీసుకో కూడదు. 
 
పైన ఉన్న మొదటి చిత్రం లో చిన్న పిల్లలలో కాల్షియమ్ లోపం తో వచ్చే రికెట్స్ ఎట్లా ఉంటుందో గమనించ వచ్చు. రెండో చిత్రం లో  వయసు లో ఉన్న వారికి కాల్షియమ్ లోపం తో ఎముకలు పెళుసు బారి వచ్చే  ఆస్టియో పోరోసిస్ వ్యాధి ని గమనించండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

అనీమియా ( రక్త హీనత ) కు చికిత్స ఏమిటి ?

In ప్ర.జ.లు., Our Health on జనవరి 19, 2013 at 6:01 సా.

అనీమియా కు చికిత్స ఏమిటి ?

 
రక్త హీనత కు చికిత్స  ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలంటే రక్తాన్ని ఇవ్వడమే ! కానీ రక్తాన్ని ఇవ్వడం చాలా తీవ్ర మైన పరిస్థితుల లోనే చేస్తారు. అంటే ఏదైనా ప్రమాదం లో రక్త స్రావం అంటే  రక్తం తీవ్రం గా కారిపోతే ,  ఆ పోయిన రక్తాన్ని వెంటనే ఇంకొకరి రక్తం ఇచ్చి  సరి చేస్తారు. ఇట్లా సరిచేయడం దేనికి ?: అంటే , మన శరీరం , రక్తస్రావం అంటే రక్తం ఎక్కువ పరిమాణం లో , తక్కువ సమయం లో కోల్పోతే , ఆ పరిస్థితిని తట్టుకోలేదు. అంటే సామాన్యం గా ఉండే అయిదు లీటర్ల  రక్తం  ప్రమాదం లో నాలుగు లీటర్లు కనుక అయిపోతే , మన  గుండె కు కావలసినంత రక్తం ఉండదు , మిగతా భాగాలకు పంపు చేయడానికి.  అదే విధం గా మనకు పెద్ద ఆపరేషన్ ఏదైనా చేయవలసి వచ్చినా కూడా , మనకు రక్తం వెంటనే అవసరం అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ప్రత్యేకించి పెద్ద ఆపరేషన్ ( అంటే మన శరీరం మీద పెద్ద గాటు పెట్టి ఆపరేషన్ చేయవలసి వచ్చినపుడు ) లలో ఎక్కువ గా రక్త స్రావం అవడానికి అవకాశం ఉంటుంది, సర్జన్ ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ! 
కానీ సామాన్యం గా ఎక్కువ మంది లో రక్త హీనత , ఇనుము , ఇతర పోషక పదార్ధాల లోపం వల్ల  వస్తుంది. అంతే  కాక , ఈ లోపం చాలా కాలం గా ఉంటుంది. అందువల్ల  గుండెకు కావలసిన అయిదు లీటర్ల రక్తం  తయారు అవుతుంది. కానీ ఇక్కడ గుర్తు ఉంచు కోవలసినది ఏమిటంటే , అయిదు లీటర్ల పరిమాణం ఉన్నా , అది పలుచగా ఉంటుంది. అంటే  ఆ రక్తం లో ఉండవలసిన పదమూడు పద్నాలుగు గ్రాముల హీమోగ్లోబిన్ ఉండదు.  హీమోగ్లోబిన్ సరిపడినంత ఉంటేనే , శరీరం లో అన్ని భాగాలకూ సరిపడినంత ప్రాణవాయువు అందుతుంది. మనం నాలుగు లీటర్ల పాలను ఇంకో లీటరు నీళ్ళు కలిపి అయిదు లీటర్ల పాల గా మార్చవచ్చు కదా ! కానీ ఆ అయిదు లీటర్ల పాలను మనం నీళ్ళ పాలు అంటాము కదా ! అట్లాగే అనీమియా దీర్ఘ కాలం గా ఉంటే , పరిమాణం లో లోపం ఉండక  పోయినా, పలుచ గా ఉండడం వల్ల , బలహీనం గా నే ఉండడం జరుగుతుంది. ఇట్లా దీర్ఘ కాలం గా అనీమియా ఉంటే , దానిని ఇనుము కాప్స్యుల్స్ తో సరి చేసుకోవచ్చు.  ఈ ఇనుము లేదా ఐరన్  కాప్సుల్స్ ఫెర్రస్ సల్ఫేట్ లేదా ఫెర్రస్ ఫ్యుమరేట్ అనే పేర్లతో బజారు లో దొరుకుతాయి. లేదా ఫెరడాల్  అనే  టానిక్ లా కూడా దొరుకుతుంది. 
మరి ఈ ఇనుము కాప్సుల్స్ ను ఎక్కువ గా వేసుకోవచ్చు కదా తొందరగా అనీమియా ను చికిత్స చేయవచ్చు కదా ? : అంటే  దానికి సమాధానం : ఐరన్  కాప్సుల్స్ ను  అతి గా  రోజూ వేసుకుంటే , వాటి పరిమాణాలు , ప్రత్యేకించి సైడ్ ఎఫెక్ట్స్  తీవ్రం గా ఉంటాయి. అందువల్ల , డాక్టర్ ను సంప్రదించి , డాక్టర్ చెప్పిన విధం గానే ఈ కాప్సుల్స్ ను వేసుకోవాలి. సామాన్యం గా రోజుకు మూడు పూటలు ,  వేసుకోవాలి. 
కేవలం ఇనుము కాప్సుల్స్ వేసుకుంటే సరిపోతుందా?: 
సాధారణం గా ఇనుము లోపం కేవలం ఇనుము ఆహారం లో తగినంత తీసుకోక పోవడమే కాకుండా , ఆహారం లో ప్రోటీనులు అంటే మాంస క్రుత్తులు , ఇంకా బీ కాంప్లెక్స్ విటమిన్లు లోపం ఉన్నప్పుడు కూడా అనీమియా గా కనబడుతుంది.  ప్రోటీనుల లోపం ఉంటే  ఐరన్  లేదా ఇనుము ను ” పట్టుకుని ” ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చేరవేయడానికి అవసరమయే ఫెరిటిన్  అనే పదార్ధం లోపిస్తుంది, దానితో కూడా అనీమియా వస్తుంది. అందువల్ల , అనీమియా ఉన్న వారు కేవలం ఇనుము లేదా ఐరన్  కాప్సుల్స్ వేసుకోవడం తో  చికిత్స జరుగుతున్నది బాగా అని తృప్తి చెందక , మిగతా విషయాలలో కూడా ( అంటే , ఆహారం లో రోజూ , ప్రోటీన్లు , ఆకుకూరలు , విటమిన్లు సరిపడా ఉండేట్టు ) శ్రద్ధ తీసుకోవాలి ! 
ఎంత కాలం చికిత్స జరగాలి ? : సామాన్యం గా మూడు నుంచి ఆరు నెలల వరకూ ఈ చికిత్స జరపాలి !  అప్పుడు హీమోగ్లోబిన్ పరీక్ష జరిపి , సరిగా ఉంటే  , అప్పుడు డాక్టర్ సలహా తో మానాలి చికిత్స. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

రక్త హీనత ( అనీమియా ) ను కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., Our Health on జనవరి 18, 2013 at 4:09 సా.

రక్త హీనత ( అనీమియా  ) ను కనుక్కోవడం ఎట్లా ? 

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=XqGmgWQKecs

చిన్న పిల్లలలో : 
బాల బాలికలలో అనీమియా ఈ క్రింది సూచనల వల్ల  అనుమానించ వచ్చు.
1. కనీసం వారం లో   మూడు రోజులైనా ఆకుకూరలు, పప్పు దినుసులు ,  తినక పోతూ ఉంటే , అంటే పోషకాహార లోపం వల్ల.
2. మాంసాహారులు కాక పొతే కూడా 
3. మాంసాహారులు అయినా కూడా , ఎర్రటి మాంసం , కాలేయం , లాంటి మాంసాలు కాక తెల్లటి మాంసం , చికెన్ తినడం వల్ల  కూడా రక్త హీనత కలగ వచ్చు.
4. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు ( కొందరు గ్రామీణ బాల బాలికలు ఇప్పటికీ , వారి మలం లో పురుగులను చూసి , తల్లి దండ్రులకు చెబుతూ ఉంటారు ) 
 
యుక్త వయసు వచ్చిన ( అమ్మాయి లలో ) వారిలో :
వనితలలో కూడా ఋతుస్రావం  మొదలైనప్పటి నుంచీ , రక్త హీనత కు అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి  వారు ఇనుము , మాంస క్రుత్తులు ( అంటే ప్రోటీనులు ) లోపించిన ఆహారమే తీసుకుంటూ ఉన్నప్పడు.  గమనించ వలసిన విషయం ఏమిటంటే , అనీమియా లక్షణాలు , క్రమేణా  అంటే రోజు రోజు కూ  పెరుగుతూ ఉంటాయి. అంటే మొదటి దశలలో హీమోగ్లోబిన్  పదమూడు ఉండవలసినది , పదకొండు అయినప్పుడు లక్షణాలు అంత  తీవ్రం గా ఉండవు. కానీ ఇనుము లోపం సరి చేయకుండా , అంటే ఆహారం లో ఇనుము ఎక్కువ గా ఉండే , ఆకు కూరలూ , కూరగాయలూ తీసుకోనప్పుడు , అనీమియా తీవ్రత హెచ్చి , హీమోగ్లోబిన్ కాస్తా ఏడూ ఎనిమిది కి తగ్గ వచ్చు. తగ్గుతున్న కొద్దీ  రక్తం అంటే రక్తం లో రక్త కణాలు , శరీరానికి అవసరమైనంత ప్రాణ వాయువు ను  సరఫరా చేయలేవు. అంటే మన శరీరం లో అను నిత్యం, ప్రతి జీవ కణాని కీ కావలసిన ప్రాణవాయువు అందక , కణాలు నీరస పడతాయి.  మానవ శరీరం అంతా  కణాల సముదాయమే కదా ! అందువల్ల మన శరీరం కూడా నీరస పడుతుంది. 
 
పైన ఉన్న వీడియో చూడండి ,   క్రింద ఉన్న చిత్రం లో హీమోగ్లోబిన్ ఎట్లా మన శరీరానికి ఉపయోగ పడుతుందో కూడా చూడండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health on జనవరి 17, 2013 at 7:49 సా.

రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? : 

 
రక్త హీనత ( అనీమియా )  లక్షణాలు ,  ఆ వ్యాధి వచ్చినప్పుడు ఉన్న వయసు ను బట్టి ఉంటాయి ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన ఇంకో ముఖ్య విషయం :అనీమియా కేవలం ఇనుము లోపం వల్ల నే కాకుండా , B  విటమిన్ల లోపం ఉన్నప్పుడు కూడా వస్తుంది. లోపానికి కారణం ఏదైనా , అనీమియా లక్షణాలు ఒకే రకం గా ఉంటాయి. ఆ లక్షణాల తీవ్రత కూడా అది వచ్చిన వయసు ను బట్టి మారుతుంటుంది ! 
ఉదాహరణకు : పిల్లలు పెరిగే వయసులో కనుక అనీమియా లేదా రక్త హీనత కలిగితే , పిల్లల పెరుగుదల కుంటు  పడుతుంది.
గర్భిణీ స్త్రీలలో కనుక అనీమియా ఉంటే , గర్భం లో ఉన్న శిశువు పెరుగుదల కూడా సరిగా ఉండక పోవచ్చు. 
విద్యార్ధులలో కనుక అనీమియా ఉంటే , వారు సరిగా మిగతా విద్యార్దులలా చురుకు గా ఉండక పోవడం , ఆట పాటలలో ఉత్సాహం ఉన్నా , కొద్ది సమయం లోనే అలసి పోవడం , నిరుత్సాహ పడడం  జరుగుతుంది. అంతే  కాక చదువులోనూ ఏకాగ్రత లోపించడం, పాఠాలు త్వరగా నేర్చుకోలేక పోవడం , స్తబ్దత గా ఉండడం కూడా జరుగుతుంది. అనీమియా తీవ్రం గా ఉన్నప్పుడు , పిల్లలు  మన్ను తినే అలవాటు చేసుకుంటారు , అట్లాగే బడిలో , గోడ మీద ఉన్న సున్నం  తినడం, లేదా  బలపం ( ఈ రోజులలో బడి లో , ఇంకా ఇస్తుంటే ) తినడం కూడా చేస్తుంటారు !  అప్పుడు తల్లులు వారిని  వెంటనే ” బాదకుండా ” డాక్టర్ కు చూపించడం మంచిది. ప్రత్యేకం గా ఈ లక్షణం ఉన్న చిన్నారులలో , కడుపులో  నులి పురుగులు అంటే రౌండ్ వార్మ్  ఇన్ఫెక్షన్ ఉంటే  కూడా ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కడుపులో పెరుగుతున్న నులి పురుగులు , లోపలికి తీసుకుంటున్న ఆహారాన్ని తినేసి అవి పెరుగుతూ , పిల్లలకు పోషకాహార లోపం కలిగిస్తాయి. 
ఈ విషయం లో కూడా తల్లులు శ్రద్ధ వహించాలి ! ఇంకా మలేరియా బాగా ప్రబలి ఉన్న ప్రదేశాలలో ఉన్న వారికి కూడా అనీమియా లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మలేరియా పరాన్న జీవి రక్త కణాలలో ప్రవేశించి , వాటి పోషకాలను తీసుకుని వృద్ధి చెందుతూ , మలేరియా కలిగిస్తుంది, ఆ పరిస్థితి లో కూడా రక్త హీనత కలుగుతుంది.  
పైన  ఉన్న మొదటి చిత్రం లో సహజం గా ఆరోగ్యం గా ఉన్న రక్త కణాలు చూడండి ,ఇక అనీమియా ఉన్నప్పుడు రక్త కణాలు ఎట్లా ఉంటాయో కూడా ప్రక్కన ఉన్న  చిత్రం లో గమనించండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనీమియా ( రక్త హీనత ) కీ ఇనుము కూ ఉన్న సంబంధం ఏమిటి ?:

In ప్ర.జ.లు., Our Health on జనవరి 16, 2013 at 11:26 ఉద.

అనీమియా ( రక్త హీనత ) కీ ఇనుము కూ  ఉన్న సంబంధం ఏమిటి ?:

 
మనం క్రితం టపాలలో మన దేహానికి అవసరమయే విటమిన్ల గురించి తెలుసుకున్నాం కదా , మరి మనకు అవసరమయే ఖనిజాల సంగతి కూడా చూద్దాం ! 
మనకు అవసరమయే ఖనిజాలలో ముఖ్యమైనది ఇనుము , అదే ఐరన్. మన పోషకాహారం లో ఇనుము లోపిస్తే అది  రక్త హీనత కలిగిస్తుంది.  మానవులలో సామాన్యం గా రమారమి అయిదు లీటర్ల రక్తం ఉంటుంది. మరి ఇనుము లోపం కలిగితే  అయిదు లీటర్ల రక్తం కాస్తా తగ్గిపోయి నాలుగు లీటర్లు అవుతుందా ? దీనికి సమాధానం” కాదు ”. రక్త హీనత అనగానే రక్తం తక్కువ గా ఉన్నట్టు అర్ధం వస్తుంది కానీ , ఇనుము లోపించి నప్పుడు  జరిగేది రక్తం పలుచ బడడం !  రక్తం తక్కువ అవడం అనేది , మన దేహం లో రక్తం ఏ  భాగం నుంచైనా కారిపోతూ ఉంటే  కానీ , లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ , జరుగుతుంది.  మన రక్తం పలుచ బడ దానికి ప్రధాన కారణం  మన పోషకాహారం లో ఇనుము లోపించడమే !  
ప్రశ్న : మరి ఇనుము పుష్కలం మనం ఏవిదం గా తీసుకోగలం ?
జవాబు : శాక హారులకు : 
ముదురు ఆకు పచ్చ రంగులో ఉండే ఏ ఆకు కూరలైనా , లేదా కూరగాయలైనా .
బీన్స్, సోయా బీన్స్, ధాన్యాలు ,  పప్పులు కూడా ఇనుము ఉండే పదార్దాలే ! 
మాంసాహారులు : మాంసం , కాలేయం  లో ఇనుము బాగా ఉంటుంది. 
ప్రశ్న: మనకు రోజూ ఎంత ఇనుము అవసరం ?
జవాబు : పురుషులకు ఎనిమిది మిల్లీ గ్రాములకు పైగా నూ , స్త్రీలకూ పద్నాలుగు మిల్లీ గ్రాములకు పైగానూ అవసరం ఉంటుంది.  
ప్రశ్న: ఈ రోజుల్లో రక్త హీనత మనకు ఏవిధం  గా వస్తుంది? : 
జవాబు: రోజూ చిన్న పిల్లలకు  ఆకు కూరలు లేని వంటలు వండి పెట్టడం వల్ల . అంతే కాకుండా , వారికి బజారులో దొరికే  ” చెత్త తిండి ” లేదా జంక్ ఫుడ్ ” అలవాటు చేయడం వల్ల . బర్గర్లూ  , పిజ్జా లూ , కేవలం  అనారోగ్య కరమైన కానీ రుచికరం అయిన కాలరీలు ఇస్తాయి కానీ ,  పోషక విలువలు ఏవీ ఉండవు.  
ప్రశ్న : స్త్రీలలో రక్త హీనత ఏవిధం  గా వస్తుంది ?! : 
జవాబు : స్త్రీలలో సామాన్యం గా రెండు విధాలు గా రక్త హీనత కలుగుతుంది. సహజమైన ఋతుక్రమం  లో  కలిగే రక్త స్రావం వల్ల , ఇనుము లోపిస్తుంది. ఇట్లా లోపం సహజం గా ఉన్నప్పుడు కనుక ఇనుము ను పోషకాహారం లో కూడా తీసుకోక పొతే , ఆ లోపం ఎక్కువ అవుతుంది. అది  అనీమియా లక్షణాలు గా కనిపిస్తుంది. 
 
ఈ రక్త హీనత లక్షణాలను గురించి వివరం గా వచ్చే టపాలో తెలుసుకుందాం ! 
 

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

In మానసికం, Our minds on జనవరి 12, 2013 at 8:31 సా.

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

 ( ” NO VIOLENCE AGAINST WOMEN ” )

కొన్ని కారణాలు చూద్దాం ! 

పితృస్వామ్యం :  తర తరాలు గా సమాజం లో  లోతు  గా నాటుకున్న పితృ స్వామ్య భావాలు .  స్త్రీ , చదువుకుని , బయటకు వెళ్లి , ఉద్యోగం చేస్తున్నప్పటికీ , , ప్రదానం గా పురుషుడి మాటే , అంటే తండ్రి మాటే  పై చేయి కావాలనుకునే  వాదం ! 

సజాతి వైరం : అంటే  పురుషుడి తో పాటు గా , గర్భం దాల్చిన ‘ తల్లి ” కూడా , పుట్ట బోయేది ఆడ శిశువు అన్న విషయం తెలిసినప్పటి నుంచీ , ఆ విషయాన్ని అంగీకరించలేక పోవడం ,  ఆ ఆడ శిశువుకు  గర్భం లోనో లేదా  పుట్టిన తరువాతనో  ఈ భూమి మీద నుంచి ” శాశ్వతం గా ఉద్వాసన ” చెప్పే మార్గాలు అన్వేషించడం ,  లేదా ఆ  ప్రక్రియలో సఫలం అవడం ! 

ఆడపిల్ల తల్లి దండ్రులు ,  ఆడ శిశువు పుట్టగానే ,  పెరిగి  పెద్దయి నాక  ” కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి ” అందువల్ల  తమ ఆర్ధిక పరిస్థితి విషమిస్తుంది అనే  వాదన. 

తల్లి దండ్రులు , మగ శిశువును  విపరీతమైన  గారాబం తో , శ్రద్ధ తో పెంచుతూ , అదే కుటుంబం లో ఉన్న ఆడ శిశువును అశ్రద్ధ చేయడం ,  ” క్రమ శిక్షణ ” తో పెంచడం వల్ల  ,  మగ శిశువు లోనూ , పెరిగిన తరువాత  పురుషుడి లోనూ  పెరిగే అహంకార భావం , తాను  స్త్రీకన్నా  అధికం  అనే భావాలు  అలవడడం ! 

తల్లి దండ్రుల మధ్య హింస , ఒక ఇన్ఫెక్షన్ :  చిన్న వయసు నుంచీ ,  ఆడ పిల్ల లైనా , మగ పిల్లలైనా ,  సునిశితమైన పరిశీలనా శక్తి , సామర్ధ్యాలు కలిగి ఉంటారు ! 

వారి కుటుంబం లోనూ , పరిసరాలలోనూ  జరుగుతున్న సంఘటనలు ,  ఆనంద కరమైనవి కానీ , హింసా యుతమైనవి గానీ , వారి చిన్నారి హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి !   భర్త ఏ  కారణం వల్ల  నైనా , విపరీతమైన క్రోధం , తన ” ఇల్లాలి ” మీద చూపించి  తరచూ ” చేయి ” చేసుకుంటూ  ఉంటే  ,  అది  పరిశీలిస్తున్న  చిన్నారుల  మనస్సులో ” సామాన్యమైన సంఘటనలు ” అవుతాయి !  వారు పెరిగి పెద్ద వారై   వారి వివాహ సంబంధాలు ఏర్పరుచు కున్నప్పుడు ,వాటిలో కూడా ” హింస ” సాధారణ విషయం అవుతుంది ! 

విసర్జన కన్నా  మింగుడు మేలు :  చాలా మంది అత్యాచార సంబంధాలతో  ” వివాహ బంధం ” కోన సాగిస్తున్న స్త్రీలు ,  సామాన్యం గా , ఆ సంబంధం నుంచి విడి పోయే సమయం లో ఎదురయే భయాలూ , ఆందోళన లూ ,  తలుచుకుని , తరువాత తమకు  ” సొంత వారి నుంచీ ,  ” సమాజం ” నుంచీ ఎదురయే  సమస్యలూ ,భయాల  ను భరించడం కన్నా ,  ” చెడ్డ ” మొగుడితో  ” సంసారం ” మేలు ” అనుకునే  అభద్రతా భావం ! 

పిల్లల భవిత మీద భయాలు :  స్త్రీ   తన వివాహ బంధం లో పరిస్థితులు విషమించి  అది ” విష తుల్యం ” అయినా కూడా , నిరంతరం   పెరుగుతున్న తన పిల్లల భవిత  మీద భయాందోళన లు పెట్టుకుని , వారు ( తాను  విడిపోతే ) పడే కష్టాలను తలుచుకుని ,  విడి పోయే నిర్ణయం మానుకుంటుంది , దానితో ,హింసను  భరించడం ” అలవాటు ” చేసుకుంటుంది.

” సహన మూర్తి ” స్త్రీ ! :  తర తరాలు గా సమాజం లో  వివాహం చేసుకున్న స్త్రీ ని అనేక విధాలు గా వర్ణిస్తూ ఉంటారు అందులో ఒకటి ” ఆ ఇల్లాలు ఎంతో  ఆదర్శ వంతురాలు ”  భర్త తాగి తందనాలు వేస్తున్నా , ఎంతో  సహనం తో  పిల్లలు చదువుకుని పెద్ద వారై ,  వారి దోవల్లో వారు వెళ్లి , పెళ్ళిళ్ళు చేసుకునే వరకూ ,తానే  అంతా  బాధ్యత వహించి చేసింది ” ( స్త్రీ ,  కొవ్వత్తి అయి  కొడి గడుతున్నా పరవాలేదు సమాజానికి ! ) అనే   నల్లటి సంప్రదాయ ముసుగు  వేసుకోవడం అలవాటవుతుంది !  ఆమె  నిఘంటువులో   అన్యాయానికి ఎదురు తిరగడం , ధిక్కరించడం అనే పదాలు  ” సంప్రదాయం ” అనే నల్లటి సిరా తో  శాశ్వతం గా చెరిపి వేసి ఉంటాయి ! 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీ హింస – కారణాలు

In మానసికం, Our minds on జనవరి 11, 2013 at 9:12 సా.

స్త్రీ హింస – కారణాలు : 

 
వయసు లో ఉన్న వితంతువులు:  ఏ  కారణం చేత నైనా చిన్న వయసు లోనే వితంతువులు అవుతున్న స్త్రీల మీద కూడా హింస ఎక్కువ గా జరుగుతున్నది.వారిని , దూషణ చేయడమూ , ఆహారం సరిగా పెట్టక పోవడమూ , ఇంటెడు పనీ చేయించుకోవడమూ , ఇంట్లో జరిగే సకల అనర్దాలకూ , ఆ వితంతువే కారణమని తీవ్రం గా తిడుతూ , వారి ఆత్మ గౌరవాన్ని కించ పరచడమూ , వారిని తీవ్ర మైన ఆత్మ న్యూనత తో జీవితం గడిపెట్టు చేయడము కూడా చాలా సామాన్యం గా జరిగే సంఘటనలే ! ముఖ్యం గా దేశానికి మారు మూలల్లో ఉన్న గ్రామాలలో ఇది చాలా సాధారణం ! వారి పునర్వివాహాలను నిరశించడం , ఎంత మాత్రమూ అంగీకరించక పోవడమే కాకుండా , ఆ ప్రయత్నాలను కూడా నిరుత్సాహ పరచడం , నీరు గార్చడం కూడా జరుగుతున్నాయి. 
ఆడ శిశువును అంతం చేయడం : ఒక  విశ్వస నీయ మైన అంచనా ప్రకారం భారత దేశం లో యాభై మిలియన్ల ఆడ శిశువులు / బాలికలు/ స్త్రీలు / 
ప్రస్తుత గణాంకాల లాగానే  గర్భ విచ్చిత్తి వల్లనో , వరకట్న మరణాల వల్లనో , మరణిస్తూ పొతే , ఒక మూడు తరాలలో , కనీసం యాభై అవును అక్షరాలా యాభై మిలియన్ల మంది స్త్రీలు  ఈ భారత భూలోకం నుంచి అదృశ్యం అవుతారని  తెలిసింది. 
రిఫరెన్స్: www. 50millionmissing.wordpress.com.
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీల మీదా, బాలికల మీదా, హింస ఏ రకాలు గా ఉంటుంది ?:

In మానసికం, Our minds on జనవరి 8, 2013 at 9:13 సా.

 స్త్రీల మీదా, బాలికల మీదా హింస ఏ రకాలు గా ఉంటుంది ?:

మనం క్రితం టపాలలో ” మన ” భారత దేశం లో స్త్రీల మీద హింస గురించిన గణాంకాలు ( మచ్చు కి 2010 సంవత్సరం ) చూశాము కదా !
ఇప్పుడు మనం భారత స్త్రీల మీదా ఆడ శిశువుల మీదా ఈ హింస ఏ రకాలు గా ఉంటుందో చూద్దాం !
1. మన దేశం లో సర్వ సాధారణమైన హింస , స్త్రీల మీద జరగ దానికి ప్రధాన కారణం ” ఇచ్చిన కట్నం తో ( ” భర్త ” గానీ , భర్త తరుఫు వారు గానీ ) సంతృప్తి చెందక , ఆ కోపాలూ , అసంత్రుప్తులూ ఆ అమాయక స్త్రీ మీద నిరంతరం గా ఏదో రూపం లో చూపించడం జరుగుతుంది. అనుమాన పిశాచం తో వేధింప బడిన ” భర్త ” కానీ వారి తరుఫు వారు కానీ వివిధ తీవ్రత ల లో ” భార్య ” ను హింసించడం జరుగుతుంది. ఈ అనుమానపు పిశాచి ఆవహించిన ఒక ” భర్త ” చేసిన నిర్వాకం తండూరి మర్డర్ గా తీవ్ర సంచలనం కలిగించింది కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ లో !
( ఈ తండూరి హత్య వివరాలలోకి వెళితే , నయనా సహాని ఒక అందమైన స్త్రీ (  పైన ఉన్న ఫోటో చూడండి ) , ఆమె అనేక తీపి కలలు కంటూ , ఒక కాంగ్రెస్ నేత , ఎమ్మెల్యే కూడా అయిన సుషీల్ శర్మ ను వివాహమాడింది. నయనా సహానీ స్వతహా గా కాంగ్రెస్ కార్యకర్త . సుషీల్ శర్మ స్నేహితుడు మత్లూబ్ కరీం కూడా కాంగ్రెస్ కార్య కర్త. మత్లూబ్ కరీం కు నయనా సహానీ ముందే తెలిసి ఉండడం తో , వారి స్నేహం , సుషీల్ శర్మ లో అనుమాన పిశాచం దిన దినాభి వృద్ధి చెందడానికి దోహద పడ్డది. ఒకరోజు , ఇంటికి తిరిగి రాగానే , మద్యం సేవించి , ఫోనులో మాట్లాడుతూ ఉన్న నయనా సహానీ సుషీల్ శర్మ కంట బడ్డది ! దానితో విపరీతం గా కోపోద్రేకుడైన సుషీల్ శర్మ భార్య ఎవరికీ ఫోన్ చేసిందో నంబర్ చూసి కనుక్కున్నాడు. అది మత్లూబ్ కరీం దే ! వెంటనే సుషీల్ శర్మ తన సొంత భార్యను పిస్టల్ తో షూట్ చేసి చంపేశాడు ! తరువాత ( నయనా సహానీ శవాన్ని , తన స్నేహితుడైన కేశవ్ కుమార్ రెస్టారెంట్ ఒకటి ” బగియా ” అని ఉంది , అక్కడికి తీసుకు వెళ్ళాడు ! కేశవ్ కుమార్ ను ఉపాయం చెప్ప మన్న్నాడు శవాన్ని మాయం చేసే ఉపాయం ! తాను , తన భార్యను హత్య చేశాడనే నిప్పు లాంటి నిజాన్ని , తండూరీ నిప్పుల్లో కప్పేసి దాచేద్దామని అనుకున్నాడు ! అందుకోసం కేశవ్ కుమార్ సహాయం తో మరణించిన తన భార్య నయనా సహానీ శరీరాన్ని ముక్కలు ముక్కలు గా చేసి , తండూరి కుంపటి లో వేశాడు ! అనుమాన పిశాచి కాస్తా పూర్తిగా ఆవహించి సుషీల్ శర్మ ను ఒక మానవ పిశాచి గా, ఒక మానవ కసాయి గా మార్చేసింది ! నిజాన్ని నిప్పుల్లో కప్పేద్దామని అనుకున్న మానవ కసాయి ఎత్తు పారలేదు ! ఆ రాత్రి , కాపలా పోలీసులు ఇద్దరి కంట , ఎప్పుడూ తండూరీ పొగ గొట్టం లోనుంచి వచ్చే పొగ , ఇంకా ఎక్కువ గా , ( నర ) మాంస వాసనతో వస్తూ ఉంటే , అనుమానించి, రెస్టారెంట్ లో కి వెళ్ళారు. ఆ సమయం లో కేశవ్ కుమార్ తో సహా సుషీల్ శర్మ తప్పించుకుని పారి పోయాడు. ఒక వారం రోజుల తరువాత పోలీసులకు లొంగి పోయాడు. శవ పంచనామా ( పోస్ట్ మార్టం ) మొదటి సారి జరిపినప్పుడు దొరకని రెండు బుల్లెట్ లు , ( ? !! )  రెండో సారి ఒక ప్రొఫెసర్ జరిపిన పంచనామా లోనయనా  సహానీ తల, మెడ భాగాల లోదొరికాయి ! . దానితో సుషీల్ కుమార్ కు కోర్టు వారు మరణ దండన విధించారు కనీసం పది ఏళ్ళు గా ఆ ” పిశాచ కుమార్ ” జైలు చువ్వలు లెక్క పెడుతూ ఉన్నాడు, సుప్రీం కోర్టు తీర్పు కోసం ! )

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

రెండు వేళ్ళ ( అ ) న్యాయం !

In మానసికం, Our minds on జనవరి 6, 2013 at 12:01 సా.

రెండు వేళ్ళ ( అ ) న్యాయం !

ఢిల్లీ లో నివసిస్తున్న, లేదా సందర్శించిన నా స్నేహితు రాళ్ళు అందరికీ ఒక్కో కధ ఉంటుంది, అక్కడి పురుషుల గురించి చెప్పడానికి ! క్రిస్టీన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ఆన్త్రపాలజిస్ట్. ఆమె తన తల్లితో ఢిల్లీ లో కనాట్ ప్లేస్ లో వీధిలో నడుస్తుంది. ఆమె తన తల్లికి ( తల్లి మొదటి సారి ఢిల్లీ కి రావడం ) భారత దేశం ఎంత అత్భుతమైన దేశమో చెప్పాలని అనుకుంది. అంతలో అకస్మాత్తుగా ఒక పురుషుడు , క్రిస్టీన్ దగ్గరకు వచ్చి, ఆమె తల్లి ఎదురుగుండానే , ఆమె జననాంగ ప్రదేశాన్ని తన చేతితో తాకి, నవ్వుకుంటూ , జనం లో కలిసిపోయాడు. ఈ సంఘటనతో క్రిస్టీన్ విలపించింది. ఆమె ఇంకా బాధ పడ్డది, వేరే కారణానికి , భారత దేశం లో గ్రామాలలో ఉండే ,పేద వారూ , నిమ్న కులాల వారూ అయిన స్త్రీల పరిస్థితులు,  ఇంకా ఎంత అధ్వాన్నం గా ఉంటాయో ఊహించుకుని ! 

ఢిల్లీ భారత దేశం లో మిగతా పట్టణాలతో పోలిస్తే , ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ ఉన్న అవినీతిమయ రాజకీయాలు , మనుషుల ను కూడా అవినీతి మయం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత దేశం లో ప్రతి వెయ్యి మంది పురుషులకూ కేవలం 866 మంది మాత్రమె స్త్రీలు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది తలి దండ్రులు, ఆడ శిశువులను, పుట్టగానే చంపేస్తున్నారు ! ఢిల్లీ లో మిగతా పట్టణాలు ( ముంబాయి, చెన్నై , కలకత్తా , బెంగళూరు , హైదరాబాద్ ) అన్నిటిలోనూ జరిగే మాన భంగాల మొత్తం  కన్నా ఎక్కువ జరుగుతున్నాయి.

కేవలం, నిందితులకు తీవ్రమైన శిక్ష పడగానే , స్త్రీ హింస ఆగదు. భారత దేశ ప్రజలు, దేశం లో జరుగుతున్న కామ పరమైన అత్యాచారాల మీద సమూలం గా వారి ఆలోచనా ధోరణిని మార్చు కోవాలి ! అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు , పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసే విషయం లోనూ !
అంతే కాక , మాన భంగం చేయ బడ్డ స్త్రీ ని పరీక్షించే విధానం లో కూడా మార్పు ఉండాలి ! ప్రస్తుతం  భారత దేశం లో  ఈ పధ్ధతి చాలా లోప భూయిష్టం గా ఉంది. మాన భంగానికి గురైన స్త్రీ ని పరీక్షించే వైద్యుడు తన ఒక వేలిని ఆ స్త్రీ జననాంగం లో ప్రవేశ పెడతాడు. ఆ తరువాత , తన రెండు వేళ్ళను స్త్రీ జననాంగం లోకి అంటే వజైనా లోకి ప్రవేశ పెడతాడు. ఆ సమయం లో కనుక, ఆ స్త్రీ వజైనా వదులు గా ఉండి , ఒక వేలు కానీ , లేదా రెండు వేళ్ళు కానీ ( వజైనా ) లోపలి సులభం గా ప్రవేశింప చేయగలిగితే , ఆ వైద్యుడు , అప్పుడు ” వజైన వదులు గా ఉంది ” అని ధ్రువ పత్రం ( సర్టిఫికేట్  )ఇస్తాడు. ఇక్కడ జరుగుతున్నది, ఆ ( మాన భంగానికి గురైన ) స్త్రీ యొక్క శీలం , కేవలం , ఆమె వజైనా ఎంత వదులు గా ఉందో , దానిని బట్టి నిర్ధారించ బడుతుంది ! అంటే, పరీక్ష చేసిన ఆ వైద్యుడి రెండు వేళ్ళు కనుక ఒక స్త్రీ వజైనా లోకి ప్రవేశించ గలిగితే ,అతడు ఇచ్చే ధ్రువ పత్రం లో ” ఆ స్త్రీ కామ సంభోగానికి అప్పటికే అలవాటు పడి ఉంది ” అని ఇవ్వడం జరుగుతుంది. దీనిని సాకు గా చూపించి , ఆమె శీలం మీద సందేహాలు వెలిబుచ్చుతూ , అనేక మంది నిందితులు ” జారు కుంటున్నారు ”, చట్టం నుంచి !
ఈ ” రెండు వేళ్ళ ( అ )న్యాయం సాక్ష్యం గా పరిగణించ కూడదని భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం గా చెప్పినా , అనేక రాష్ట్రాలు  ఇంకా  , అత్యాచార నిందితుల విచారణ లో ఈ ” రెండు వేళ్ళ ( అ ) న్యాయ ” పద్ధతినే అనుసరిస్తున్నాయి ! అందు వల్ల నే మూడు వంతుల ( అత్యాచార ) కేసులలో, నిందితులు ” నిర్దోషులై ” సమాజం లో ” కలుస్తున్నారు ” !
చాలా మంది స్త్రీలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే జంకుతారు ! నా స్నేహితుడు ఒకడు భారత దేశం లో  ఒక సినీ నిర్మాత. ఇటీవల జరిగిన సంఘటన ను అతను నాకు చెప్పాడు. అతని అకౌంటెంట్ , తన డబ్బు దుర్వినియోగం చేసి పరారయ్యాడు. అప్పుడు ఆ నిర్మాత పోలీసు లకు రిపోర్ట్ చేశాడు ఆ విషయం. అప్పుడు పోలీసులు , వెంటనే ఆ అకౌంటెంట్ ను పట్టుకో లేక పోయారు. వెంటనే వారు ఆ నిందితుని చెల్లెలు ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ నిర్మాత ఆ పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ” ప్రస్తుతం మీ అకౌంటెంట్ చెల్లెలు ను ఇక్కడ లాకప్ లో ఉంచాం. మీరు ఆమెను ” మీ ఇష్టం వచ్చినట్టు , ఏమైనా చేయ వచ్చు ” అని  ,” భరోసా ” ఇచ్చాడు. అప్పుడు ఆ నిర్మాత ఆ ” చెల్లెలు ” పరిస్థితి కి విపరీతం గా ఆందోళన చెంది, తన సొంత మనుషులను పోలీస్ స్టేషన్ లో పగలూ రాత్రీ ” ఆమెకు రక్షణ గా కాపలా ఉంచాల్సి వచ్చింది !

ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆరుగురు ప్రస్తుత ఎమేల్సీ లు మానభంగ కేసులలో నిందితులు. ఇరువురు పార్లమెంట్ సభ్యులూ , ముప్పై ఆరుగురు రాష్ట్ర శాసన సభ సభ్యులూ , స్త్రీ హింసా నేరాలలో నిందితులు !

ఇటీవల గన్ కంట్రోల్ విషయం లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఇట్లా అన్నారు ” అమెరికన్ ప్రజల ప్రమేయం లేకుండా ” ఈ విషయం లో ఏమీ చేయ లేము ” అని. అదే విధం గా భారత దేశం లో కూడా స్త్రీ ల పై అత్యాచారాల విషయం లో , భారత దేశ ప్రజలు ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వక పొతే, ఈ పరిస్థితులలో ఏ విధమైన మార్పూ ఉండబోదు !

సుకేతు మెహతా , టైం తాజా వార పత్రిక నుంచి !

%d bloggers like this: