Our Health

Archive for నవంబర్, 2013|Monthly archive page

చదువుకోడం ఎట్లా? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 16, 2013 at 9:43 సా.
చదువుకోడం ఎట్లా? 5. 
 ( ‘ విజయం సాధించాలనే తపన నాలో బలం గా ఉంటే , అపజయం నన్ను ఎప్పుడూ  ఓడించ లేదు ! ‘ ) 
స్వీయ విమర్శ ,నిర్మాణాత్మకం గా ఉండాలి ! :  క్రితం టపాలో మనం తెలుసుకున్నాం , విద్యార్ధి ఎప్పుడూ , తన చదువు విషయం లో ఆశావహ దృక్పధం తో  ఎందుకు  ఉండాలో !  తెలియని సంగతులు తెలుసుకోవడం తప్పు కాదు !  పాఠాలు త్వరగా గ్రహించ లేక పోవడమూ తప్పు కాదు !  కానీ , చదివిన విషయాలు అర్ధం కావడం లో జాప్యం జరుగుతూ ఉంటే , అందుకు తమను తాము నిందించు కోవడమూ ,  ‘తమకు ఎప్పుడూ చదువు అబ్బదు ‘ అనే  నిరుత్సాహ పూరితమైన ‘ ముద్ర ‘ వేసుకోవడం తప్పు !  మనకు మన మా తృ భాష లో( ఆ మాటకొస్తే , ఏ భాష లోనైనా ) ఒక వాక్యం రాయాలంటే , ముందు గా చేయవలసినది , ఆ భాష లో ఉన్న అక్షరాలను తెలుసుకోవాలి ! ఆ తరువాత , ఆ అక్షరాలతో , పదాలు రాయడం నేర్చు కోవాలి ! ఆ తరువాత , ఆ పదాలతో వాక్యాలు రాయడం  నేర్చుకోవాలి ! ఇట్లా, ప్రతి  సబ్జెక్ట్ లోనూ , ఆ సబ్జెక్ట్ కు చెందిన భాష ఉంటుంది ! అది,  అక్షరాలకు బదులు గా పదాలు , అంటే, సాంకేతిక పదాలు గా ఉంటుంది !  ఆ పదాలను తెలుసుకోకుండా , ఆ సబ్జెక్ట్ ను  పూర్తి గా అర్ధం చేసుకోవడం కష్టమే మరి !  పైన ఉన్న ఉదాహరణలు ఎందుకు రాయడం జరుగుతుందంటే ,  నేర్చుకోవడం అనేది,  అనేక దశలు గా జరుగుతుంది ! ప్రతి దశా అతి ముఖ్యమైనదే !  విద్యార్ధులు , కేవలం వారిని వారు నిందించు కోకుండా , ఏ దశ లో పొరపాట్లు జరుగుతున్నాయో గ్రహించాలి ! అంతే కానీ,  వారు  ‘ నాకు ఇక చదువు రాదు ‘  అనే విపరీతమైన నిరాశా  ఫలితాలు, వ్యాఖ్యానాలూ , ఆపాదించుకో కూడదు ! 
లోపాలు, పొరపాట్లు , శాశ్వతం కాదు ! : చాలా మంది విద్యార్ధుల లో తరచూ కలిగే ఇంకో సాధారణ అభిప్రాయం  :  కొన్ని వారాల లో పరీక్ష ఉంటే  ‘ నా పరిస్థితి అధ్వాన్నం గా ఉంది ఇప్పుడు , నాకు చదవడానికి టైం లేదు ఇప్పుడు , పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నేను అందుకోలేను , పరీక్ష సరిగా రాయ లేను ‘ అని  ,  పూర్తి గా నిరాశా దృక్పధం తో , మిగతా సమయాన్ని కూడా , చదవ కుండా , దుర్వినియోగం చేస్తారు !  ఈ మానసిక పరిస్థితి నుంచి జరిగి, ‘ నేను కాస్త ఆలస్యం గా మొదలు పెడుతున్నాను , పరీక్షలకు చదవడం , అందువల్ల నేను ఇంకా జాగ్రత్త గా చదువుకోవాలి , నాకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ‘ అనే ఆశావహ దృక్పధం తో ఇంకొద్దిగా శ్రమ పడడానికి పూనుకోవాలి !  ఒక వేళ ,  బాగా శ్రమ పడ్డా , పరీక్ష లో ఫలితాలు సరిగా రాక పొతే  ‘ నేను ఎప్పుడూ ఇంతే !  పరీక్ష లు చెడ గొడతాను ‘ అనే శాశ్వత నిరాశా ఫలితాల ముద్ర తమంత తామే వేసుకోకూడదు !  నింపాది గా, జరిగిన సంఘటనను విశ్లేషించుకుని , అవసరమైతే , తల్లి దండ్రులతో నో , లేదా ఉపాధ్యాయులతోనో , చర్చించి ,  ‘ ఆ లోపాలు ఉండడం వల్ల , నేను అనుకున్నంత బాగా చేయలేక పోయాను పరీక్షలో ‘  ఆ లోపాలు సరి దిద్దుకోవడం , నా చేతుల్లోనే ఉంది, ఈ సారి ఇంకా ఎక్కువ దీక్షతో ప్రయత్నిస్తాను’  ! అని  ప్రతిజ్ఞ పట్టాలి ! విద్యా సరస్వతి, చేరదీసి, ఆదరించిన వారెవరి దగ్గరకైనా వస్తుంది ! ధనికులూ , పేదలూ అనే తారతమ్యం లేదు ఆమెకు !  ‘ నేను ఎప్పుడూ ఇంతే , సరిగా చదవను ‘  అని,  తమకు తామే తీర్పు ఇచ్చుకున్న  వారు కేవలం,  ఆ సరస్వతీ దేవిని ‘ నా దగ్గరకు రావద్దు తల్లీ ‘ అంటున్నట్టే  కదా !  
పోలికలు, ఆరోగ్యకరం , ప్రమాద కరం కూడా ! :   చదువు కు పోటీ ఉండడం మంచిదే , అది ఒక ఆరోగ్య కరమైన పరిస్థితి !  పోటీ ఉంటే , చదువు కోవాలనీ , బాగా చదువుకోవాలనీ , ఉత్తేజం కలుగుతుంది !  మిగతా పరిస్థితులన్నీ , సమానం గా లేక పోయినా , చిన్న వయసులో , తన ఈడు వారు చదువు కుంటూ ఉంటే , ఎట్లాగైనా తామూ చదువుకుని , వృద్ధి లోకి రావాలనే తాపత్రయం , పట్టుదలా వస్తాయి , పెరుగుతాయి కూడా ! కానీ, ఈ పోటీ ఎప్పుడూ , ఇంకా ,ఇంకా పట్టు దలతో , చదువు కోవాలనే దీక్ష ను శక్తి వంతం చేయాలి. ఉత్సాహాన్ని నీరు కారుస్తూ , నిరాశా దృక్పధం లోకి నెడుతూ , ఆత్మ న్యూనతా భావాన్ని కలుగ చేయకూడదు !  అంటే,  పోటీ, విద్యార్ధులలో, పట్టుదలను పెంచేది గా ఉండాలి కానీ  చదువు మీద తమ ‘ పట్టు ‘ సడలించి , పలాయనం చిత్తగింప చేసేది గా ఉండ కూడదు ! అందుకే , ఎక్కువ శ్రమ పడి చదువు తున్నప్పుడు , ఇతర విద్యార్ధులతో , పోల్చు కోకూడదు ! తమ ఏకాగ్రత అంతా, చదువు మీదా వచ్చే పరీక్ష మీదా మాత్రమే కేంద్రీకరించాలి !   
‘ నా శక్తులన్నీ ఉపయోగించి , వీలైనంత బాగా చేస్తాను నేను , చదువు లోనూ , పరీక్ష లోనూ ‘ అనే కృత  నిశ్చయమే  ఎప్పుడూ విద్యార్ధి మనసులో ఉండాలి , ఒక మంత్రం లా !   ఆ మంత్రం , ఎంతో శక్తి వంతం గా వారికి మేలు చేస్తుంది ! వారి జీవితాంతం ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోడం ఎట్లా ? 4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 14, 2013 at 9:28 సా.

చదువుకోడం ఎట్లా ? 4. 

( పైన ఉన్న చిత్రం పరిశీలించండి : బీహారు లో ఒక గ్రామం లో , ఒక నిరు పేద కుటుంబం లో , బాలుడూ, బాలికలు , అమర్చిన అక్క లైటు వెలుతురు లో , ఒకే మంచం మీద ముగ్గురూ , ఎంత దీక్షతో చదువుకుంటున్నారో ! చదువుకోవాలనే వారి సంకల్పం ముందు , చదివే స్థానమూ , చదివే సమయమూ , పట్టించు కొనవసరం లేదు కదా !  వారిని చూస్తూ , అంత పేదరికం లోనూ , వారి తండ్రి పొందుతున్న  ఆనందం ఎంత స్వ చ్చం గా ఉందో ! ) 
క్రితం టపాలలో చదువు కోడానికి అనుకూలమైన సమయం, స్థానం గురించి తెలుసుకున్నాం కదా !  అవి సామాన్యమైన అనుకూల సమయాలూ , స్థానాలూ !  కానీ  భౌతిక శాస్త్రం లో ఎన్నో నూతన ఆవిష్కరణలకు కారకుడైన మైకేల్ ఫారడే , తాను పని చేసే పుస్తకాల దుకాణం లో ఉన్న పుస్తకాలను ఔపోసన పట్టేశాడు ! స్థానం అనుకూలం గా లేక పోయినా, జిజ్ఞాస  బలం గొప్పది అయి , పురోగమింప చేసింది , ఫారడే ను ! మరి మనకు తెలిసిన ఇటీవలి  విద్యా భగీ రధుల గురించి మనం తరచూ , వార్తా పత్రికలలో చదువుతూనే ఉంటాము ! ఉదాహరణకు కొన్ని : 1. పదిహేనేళ్ళ అమ్మాయి , మన ఆంధ్ర ప్రదేశ్ లో , ఒక జిల్లాలో , తండ్రికి ఒకతే కూతురు ! తండ్రి కి సహాయం చేస్తూ , పొలం లో అరక దున్నుతూ చదువుకుని , పదవ తరగతిలో  స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంది ! ఐ ఏ ఎస్ టాపర్ ఒక అమ్మాయి కూడా , తన తండ్రి మరణించిన పదో రోజు కూడా  ఐ ఏ ఎస్ మెయిన్స్ పరీక్షలు రాసి దేశం మొత్తం మీద టాపర్ గా విజయం సాధించింది !  చదివి, సాధించాలనే , కృత నిశ్చయం ముందు , సమయాలూ , స్థానాలూ దిగదుడుపే , అంటే , ఏ  సమయమూ , ఏ స్థానమూ అనే విషయాలు పెద్దగా పరిగణన లోకి రావు !  
ఇక చదువుకోడానికి కావలసిన కనీస వస్తు సామగ్రి ఏమిటి ? :  ముఖ్యం గా అవసరమైన పుస్తకాలు , నోట్ బుక్స్ ,  పెన్నులు మొదలైనవి !  ఏకాగ్రత కు భంగం కలిగించే , సెల్ ఫోనులూ , మ్యూజిక్ సిస్టం లూ ,  కంప్యూటర్ లూ , చదివే సమయం లో దూరం గా ఉంచడం మంచిది ! కనీసం మిగతా వ్యాపకాల వైపు దృష్టి మళ్ళించ నంత వరకూ ! ప్రత్యేకించి , క్రింది తరగతులు చదివే విద్యార్ధులకు , కనీస అవసరాలు సరిపోతాయి !  ముందు ముందు , చిన్న తరగతుల నుంచీ కూడా  అధునాతన సాంకేతిక సామగ్రి ని ఉపయోగించడం సాధారణ మూ , తప్పని సరీ  అవుతుంది !  అప్పుడు విద్యార్ధులు కేవలం  చదువుకోడానికే , ఆ గ్యాడ్ జెట్ లను ఉపయోగించు కోవడం అలవాటు చేసుకోవాలి !  కనీసం చదుకు కునే సమయం లో !  

ఆశావహ దృక్పధం ! : చదువు ,విద్యార్ధికి శాపం అవకూడదు ! తెలియనివి తెలుసుకోవడమే చదువు ! అందుకు  విద్యార్ధి  మానసికం గా సిద్ధ మయి ఉండాలి !  అంటే , చదువును ఒక గుది బండ లా భావించకుండా ,  ఆశావాద దృక్పధం తో అంటే పాజిటివ్ యాటి ట్యూ డ్  కలిగి ఉండాలి ! చదువుతున్నంత కాలమూ ! ప్రత్యేకించి , కష్టమనిపించిన సబ్జెక్ట్ లు చదువుతున్నప్పుడు , ఈ ఆశావాద దృక్పధం ఎంతగానో తోడ్పడుతుంది !   ఈ దృక్పధం తో అనేక మెళుకువలు తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది ! దానితో అతి కష్టమైన సబ్జెక్ట్ లు కూడా సులభం అవుతాయి ! నిరాశ గా  చదివే విషయాన్ని యాదాలాపం గా చదువుతూ ఉంటే , ఆ చదువు వంట బట్టక పోగా , రాను రాను ,ఇంకా కష్ట మవుతుంది, నేర్చుకోవడం ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోడం ఎట్లా ? 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 11, 2013 at 9:46 సా.

చదువుకోడం ఎట్లా ? 3. 

( పైన ఉన్న చిత్రం లో , తల క్రిందులు గా ఫుట్ బాల్ ను కిక్ చేస్తున్నది , ప్రఖ్యాత బ్రెజిలియన్ ఆట గాడు , పెలె ! తను సృష్టించిన ఈ ‘ బైసికిల్ కిక్ ‘ తో అనేక గోల్స్ చేశాడు !  ఈ కిక్ ప్రత్యేకకత ఏమిటంటే, గాలి లో ఎగురుతున్న బాల్ ను అలవోక గా , ఒక్క ఎగురు ఎగిరి , కాళ్ళ తోనే తన్ని , గోల్ సాధించడమే కాకుండా ,  ఆ కిక్ చేసిన తరువాత , ఏ మాత్రమూ గాయ పడకుండా , గాలి లో నే ఒక పల్టీ కొట్టి మళ్ళీ గ్రౌండ్ మీద కాళ్ళు ఆనించ గలడం  ! ఆ పని కేవలం పెలె  మాత్రమే చేయ గలిగాడు ! అందుకే పెలె ను ఫుట్ బాల్ మాంత్రికుడు అని కూడా పిలుస్తారు ! తన టీం తో ఫుట్ బాల్ ప్రపంచ కప్ కూడా సాధించాడు !  మీకు ఉత్సాహం ఉంటే , ఈ బైసికిల్ కిక్ , పెలె ఎట్లా చేశాడో , యూ ట్యూబ్ లో చూడండి ! )
స్థానం :  చదివే స్థానం , ప్రశాంతం గానూ , శబ్ద కాలుష్యం లేకుండా ఉంటే, చదువు మీద మనసు లగ్నం చేసి , పాఠాలను  గ్రహించడానికి తక్కువ సమయం పడుతుంది !  ప్రచార సాధనాలకు దూరం గా ఉంటే  ఉత్తమం ! అంటే రేడియో , టీవీ , టెలి ఫోను , మ్యూజిక్ సిస్టం , వీటికి ! మరీ పిన్ డ్రాప్ సైలెన్స్  అవసరం లేదు !    కావలసినది , ఇంద్రియాలకు , అంటే,  చూసే కళ్ళకూ , వినే చెవులకూ , కూడా ఇతరత్రా  ప్రేరణ లు అంటే స్టిమ్యులస్  లు ( బహు వచనం లో స్టిమ్యులై అని అంటారు, ఖచ్చితం గా చెప్పుకోవాలంటే ! ) లేకుండా ఉంటే , ( చదువు మీద ) ఏకాగ్రత హెచ్చుతుంది ! ఏకాగ్రత తో, తక్కువ సమయం లోనే, ఎక్కువ విషయాలు గ్రహించ వచ్చు !  కాస్త పెరుగుతున్న కొద్దీ , మీ మీ ప్రత్యేకత లతో , అంటే మీకు ఎక్కడ కూర్చుని చదువుకుంటే , బాగా అనుకూలం గా ఉంటుందో , మీరే నిర్ణయించుకుని , ఆ ఏర్పాట్లు చూసుకోవచ్చు ! 
అన్ని సౌకర్యాలూ ఉన్నవారు :  ప్రత్యేకమైన గది లోనో , లేక ప్రశాంతం గా ఉండే ఇంకో గది లోనో , కూర్చుని చదువు కోవచ్చు !  కుటుంబం లో జరుగుతున్న రోజు వారీ సంఘటనలకు , ‘ దూరం ‘ గా !  
సౌకర్యాలు తక్కువ ఉన్న వారు :  వీరు కూడా , తగిన ప్రశాంత వాతావరణం చూసుకోవడం మంచిది !  సామాన్యం గా , ఇంట్లో అయితే ,  నిశ్శబ్ద వాతావరణం లోనో , లేదా  స్కూల్ / కాలేజీ లైబ్రరీ లోనో ఒక స్థానం చూసుకుని , చదువు కొనసాగించడం మంచిది !   కాస్త పెరిగిన విద్యార్దులైతే , ఇంటికి దగ్గరలో ఉన్న , రద్దీగా లేనీ కాఫీ హోటల్ లో ఒక మూల కూర్చుని కానీ , ఇంటి దగ్గర లో ఉన్న పబ్లిక్ పార్క్ లో కానీ , చదువు కోవచ్చు ! చాలా సమయాలలో , సౌకర్యాలు  తక్కువ గా ఉంటే , ఏకాగ్రత ఎక్కువ గా ఉండ వచ్చు , వారి  దిశా నిర్దేశనం  సరిగా వారికి అర్ధం అయి ఉంటే !  కాదేదీ చదువు కనర్హం , ఔనౌను  చదువు  అమూల్యం !  కుటుంబానికంతా ,  ఒక్క గదే ఉంటే , చదువు కు ప్రాముఖ్యం , ఇస్తూ , తల్లి దండ్రులు , తగ్గు స్వరం లో మాట్లాడడమూ , వాదోప వాదాలను ( అవి అవసరం అనుకునే సందర్భాలలో ! )  ‘ వాయిదా  ‘ వేసుకోవడమూ చేయాలి , వారి భవిష్యత్తు కోసమూ , వారి పిల్లల భవిష్యత్తు కోసమూ !   
సమయం :   మిగతా పనులు ఏవి చేసినా సమయం సందర్భం చూసుకుని , చేసినట్టే , చదువు కు కూడా, ఒక నియమిత మైన సమయం  నిర్ణయించుకుని , క్రమ పధ్ధతి లో చదువుతూ ఉంటే ,  ఎక్కువ నేర్చుకో గలుగుతాము ! వారం లో ఏడు రోజులూ , లేదా అయిదు రోజులూ ,  రోజుకు మూడు గంటలో , ఆరు గంటలో , చదువు కు కేటాయించడం మంచిది ! ఈ సమయం , స్కూలు , కాలేజీ లో చదివే సమయం కాకుండా !  అక్కడ చదివే పాఠాల వివరాలు నోట్ చేసుకున్నట్టు గానే , ఇంటి దగ్గర చదువుకునే పాఠాలను కూడా ఒక క్రమ పధ్ధతి లో నోట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే , ఉపయోగ కరం గా ఉంటుంది !  ఏక బిగిన మూడు నాలుగు గంటలు చదవడం చేయకుండా , ఒక గంటకో , ముప్పావు గంటకో , ఒక చిన్న బ్రేక్ , అంటే విరామం తీసుకుంటే , అది లాభ దాయకం !  ఒకటి :  మనం దృష్టి పెట్టి  తదేకం గా పుస్తకాలను చూస్తున్నా  కూడా , ప్రతి పది , పదిహేను నిమిషాలకొక సారి , ఒక  ( కంటి కి ) ఆహ్లాద కరమైన ఆకు పచ్చని పచ్చిక బయలు ప్రదేశాన్ని కానీ , లేదా నీలి రంగులో ఉన్న ఆకాశాన్ని కానీ చూస్తూ ఉండడం అలవాటు చేసుకుంటే , చూపు దెబ్బ తిని , కళ్ళద్దాలు రాకుండా , నివారించు కోవచ్చు !  అట్లాగే , విరామం లో , మీకు నచ్చిన చిరు తిళ్ళు  ( నియమితం గా ) తినడం వలన, ఎప్పటికప్పుడు , శక్తి కలిగి ఉండి , ఎక్కువ విషయాలను , సరిగా ఆకళింపు చేసుకోవడం జరుగుతుంది ! 
చాలా సమయాలలో కడుపు మాడుతూ ఉన్నా కూడా , కృత నిశ్చయం తో చదివే వారు కూడా అనూహ్యం గా, ఎక్కువ విషయాలు ఆకళింపు చేసుకో గలుగుతారు ! 
తరువాతి టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ?2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 11, 2013 at 6:54 ఉద.

చదువుకోవడం ఎట్లా ?2. 

సమయం, స్థానం, చూసుకుని, దీక్ష తో  చదువుకో ! 
నీ జీవిత గమ్యాన్ని , సమయానికే చేరుకో ! 
 
దిశా నిర్దేశనం :
 
చదువు లక్ష్యం, చిన్న తనం నుంచే , విద్యార్ధులకు తెలియ చేయాలి ! ముఖ్యం గా వారి తల్లి దండ్రులు !   చదువు విజ్ఞానం కోసం అనే భావన  బాగా నాటుకోవాలి , వారి పసి మనసులలో !  సామాన్యం గా తల్లిదండ్రులు వారి మనసులో , తమ సంతానం బాగా చదివి , డాక్టరో ఇంజనీరో కావాలని, లేదా కంప్యూటర్  ఇంజనీరో కావాలని , ముఖ్యం గా బాగా సంపాదించి ,వృద్ధి చెందాలనీ , తమకు పేరు తీసుకు రావాలనీ ఆశిస్తారు ! కలలు కంటారు ! కానీ , చిన్నారి మనసుల మీద, వారి ఆశల , ఆశయాల ముద్రలు , బలవంతం గా వేయకూడదు !  ఇది చాలా సున్నితమైన విషయం ! అంటే  ‘ చిన్న తనం నుంచే ‘ నీవు డాక్టర్ వి కావాలి , ఇంజనీర్ వి కావాలి ! అని పిల్లల మీద వారి ఆశయాలను ,బలవంతం గా రుద్దడం చేయకూడదు !  కేవలం ఆ చిన్నారుల దృష్టి అంతా , వారు నేర్చుకోవడం మీదనే లగ్నమై ఉండేట్టు చూడాలి ! అంటే , కేవలం విజ్ఞాన సముపార్జన !  ఆ చిన్నారులు , ఒక ఆహ్లాద కర వాతావరణం లో , ప్రపంచాన్ని తెలుసు కుంటూ ఉంటారు !   వారికి బడులూ , తరగతులూ , ఇతర విద్యార్ధులూ , పుస్తకాలూ , యూనిఫామ్ ,  లంచ్ బాక్స్ ,  ఇతర రాత పరికరాలూ , ఇదంతా , కొత్తగానూ , ఆందోళన కలిగించేది గానూ కూడా ఉంటుంది ! ప్రత్యేకించి , ఇళ్ళలో సహజం గానే గారాబం గా పెరుగుతున్న బాల బాలికలకు !  తడబడుతూ తప్పటడుగులు వేస్తున్న ఆ చిన్నారులకు చేయూత నిచ్చి నడపాలి !  అంతే కానీ , నడకే సరిగా రాని వారికి, గమ్యం గురించి , ఆ వయసులో చెప్పడం ఎంత వరకూ సమంజసం ?
చదువు లక్ష్యం , ఆ వయసు లో కేవలం , ఒక క్రమ శిక్షణ తో చదువుకోవడానికీ , కొత్త విషయాలు తెలుసుకోవడానికీ , మాత్రమే అనే అభిప్రాయం కలిగించాలి ! వారి సునిశితమైన పరిశీలనా శక్తి కూడా  పెంచే విధం గా చదువు చెప్పడమూ , తదనుగుణం గా , బడిలోనూ , ఇంటి దగ్గరా కూడా ప్రోత్సాహం ఇవ్వడమూ జరగాలి !  ప్రత్యేకించి చిన్న తరగతులలో ఉన్న బాల బాలికలకు , వారు ఇంటికి వచ్చాక , తప్పని సరిగా , వారికి ( వారు నిద్ర కు ఉపక్రమించక ముందే ! )  వారి తల్లి దండ్రులు , కొంత సమయాన్ని కేటాయించి ,  ఆ రోజు బడి లో జరిగిన సంగతులన్నీ కూడా ఓపిక గా , విని , తెలుసుకోవడం చేయాలి , వారి సంగతంతా , టీచర్లే చూసుకుంటారు ‘ అనే ‘ భ్రమ ‘ లో ఉండక ! 
దీని వల్ల ,  ఏదో సాధించాలనే , వత్తిడి , ఉండక ,  కేవలం , కొత్త పాఠాలూ , పద్ధతులూ , తెలుసుకోవడమే చేస్తారు , అదీ త్వర త్వరగా !  ఈ లక్షణాలే, వారి దిశా నిర్దేశం చేస్తాయి, వారి భవిష్యత్తు లో కూడా ! చదువు లక్ష్యం కేవలం డాక్టర్ అవడమూ , ఇంజనీర్ అవడమూ మాత్రమే కాకూడదు !  ప్రపంచమంతా కూడా కేవలం , డాక్టర్ లతోనూ , ఇంజనీర్ల తోనూ మాత్రమే నడవట్లేదు కదా ! 
 
స్కూల్ లో సరిగా అడ్జస్ట్ అవలేక పోతున్న పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?  :  నోట్లో  వేళ్ళు ఎప్పుడూ పెట్టుకోవడమో , తరచూ క్లాసు లో మూత్ర విసర్జన , లేదా మల విసర్జన బట్టలలోనే చేయడమో , తరచూ కడుపు నొప్పి అనో , లేదా లంచ్ లో సరిగా తినక పోవడమూ , లాంటి ప్రవర్తన కనబరుస్తూ ఉంటారు. ఆ సందర్భాలలో , ఎక్కువ గా దండించ డమూ , విపరీతం గా కోపపడ డమూ చేయకూడదు ! ప్రత్యేకించి తల్లి దండ్రులు , అప్రమత్తత తో  ,  జరుగుతున్న విషయాలు గ్రహించాలి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదవడం ఎట్లా? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 10, 2013 at 3:24 సా.

చదవడం ఎట్లా? 1. 

 
 
అవకాశాలు శూన్యమైనా, చదువుతారు కొందరు ! 
అవకాశాలు ఎన్నో ఉన్నా, చదువుకోరు కొందరు ! 
అవకాశాలు కల్పించుకుని చదివేది ,కొందరు ! 
చదువు లేక, అవకాశాలు అందుకోనిది ఎందరో ! 
 
చదువు !    ప్రతి  విద్యార్ధి మనసులో మెదిలే పదం ! ప్రతి తల్లిదండ్రి ఆకాంక్ష , ప్రతి యువతీ యువకుల  ఆశయం , చదువుకోవాలనీ , బాగా చదువుకోవాలనీ , ఆ చదువు తో జీవితం లో ముందుకు పోవాలనీ ! చదువు ప్రతి మానవుడికీ ప్రాధమిక హక్కు కూడా, ఆరోగ్యం తో పాటుగా ! 
ఇంత  అమూల్యమైన విద్యార్జన, చేసే సమయం లో  చాలా మంది విద్యార్ధులు , ఏ రకమైన పధకమూ లేకుండా ,   చదువుతారు ! వారిలో  చదవాలనే కాంక్ష , పట్టుదల ఉన్నా కూడా , సరిఅయిన  అవగాహన లేకుండా , చదువుతూ , అత్యంత శ్రమ పడుతూ , ‘ బండ  చదువు ‘ చదువుతూ ఉంటారు ! తమ అమూల్యమైన సమయం వెచ్చిస్తూ కూడా , పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోలేక , బాధ పడుతూ ఉంటారు , తమ శ్రమ కు తగ్గ ఫలితం దక్క లేదనే , విచారం తో  కొందరు విద్యార్ధులు , చదువంటే విరక్తి కూడా చెందుతారు ! ఇక విద్యార్ధుల తల్లి దండ్రులు కూడా , ప్రత్యేకించి , వారు పెద్దగా చదువుకున్న వారు కానట్టయితే ,  అనేక శ్రమల కోర్చి ,  తమ ఆదాయం లో అధిక భాగాన్ని , తమ పిల్లల చదువులకై వెచ్చించి , చదివిస్తూ ఉంటారు ! కానీ చదివే పద్ధతులు అవగాహన చేసుకోక పోవడం వలన , తమ సంతానానికి , ఒక పధ్ధతి లో చదువు చెప్ప లేక పోతారు ! తాము,  తమ సంతానం తో ఎక్కువ సమయం ఇంటి వద్ద గడుపుతున్నా కూడా ! అట్లాంటి విద్యార్ధులకూ , తల్లిదండ్రులకూ , కొద్దిగానైనా ఉపయోగ పడాలనే ఉద్దేశం తో ,  ఈ టపాలను వేయడం జరుగుతుంది !  ఈ రోజుల్లో ,వయోజన విద్య కూడా  చాలా ప్రాచుర్యం పొందింది !  ఎందరో  ఉద్యోగులు కూడా తమ తమ వృత్తిలోనూ , ఉద్యోగాలలోనూ , ఇంకా పురోగమించాలని , చదువు కొనసాగిస్తూ ఉన్నారు కదా ! అట్లాగే ,అనేకమంది ఉపాధ్యాయులు కూడా ,   కేవలం బోధనే పరమార్ధం గా పెట్టుకున్నా ,  విద్యార్ధులకు ఏ విధం గా తమ బోధనను   వారి మెదడులో  కలకాలం ఉండేట్టు చేయాలో తెలియక , బోధన తో తమ పని అయిపోయినట్టు  ప్రవర్తిస్తారు !  వారికీ ఈ టపాలు  ఉపయోగ కరం గా ఉంటాయని ఆశిస్తున్నా ! 
ఇంకొన్ని సంగతులు వచ్చే టపాలో ! 

విరహ వేదన తైలం గా ఆశాదీపం వెలిగించడం ఎట్లా? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 9, 2013 at 3:17 సా.

విరహ వేదన  తైలం గా ఆశాదీపం వెలిగించడం ఎట్లా? 5. 

మీ  అంతర్మధనాన్ని అర్ధం చేసుకోండి :

ప్రేమ విఫలం అయ్యాక , మీ పునరుద్ధానం లో భాగం గా కొన్ని సలహాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు, మీ మదిలో చెల రేగే ఆలోచనలూ , భావోద్వేగాలను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి ! అంటే , మీ ప్రేమ విఫలం అయ్యాక , అనేక రకాలుగా మీరు, అంటే , మీ మనసు స్పందిస్తూ ఉంటుంది , ఆ తదనంతర పరిమాణాలకు !  పరి పరి విధాలు గా,  ఆ సంఘర్షణ   కు  గురి అవుతూ ఉంటుంది . మీరు, ఆ పరిమాణాలను , విశ్లేషించి ,  తగిన రీతి గా   ప్రవర్తించక పొతే , ఆ యా అనుభూతులు  మీ మనసు లోనుంచి  ఒక పట్టాన మాయమవ్వవు !  ఈ భావోద్వేగాలు మీ మనసు తలుపు తట్టే ,  పోస్ట్ మెన్ లు ! మీరు తలుపు తీయనంత వరకూ , తలుపు తడుతూనే ఉంటాయి !  మీరు,  ఆ పరిస్థితి నుంచి తప్పుకోవాలంటే ,  మీ మనసు తలుపు పదే , పదే తడుతున్న , ఆ  అనుభూతులను ఆహ్వానించి , విశ్లేషించుకుని , మీలో తగిన మార్పులు చేసుకోవడమే ఉత్తమం ! ఇట్లా చేయడం కష్టమైన పనే ! ప్రత్యేకించి , మీ లో కలిగే , క్రోధమూ , ఆందోళనా , అవమానాలను దిగ మింగుతూ , ముందుకు పోవడానికి ప్రయత్నించడం ! కానీ ఆ పని అసాధ్యం కాదు ! 

మీ మీద మీరు పూర్తి విశ్వాసం , నమ్మకం తో ఉండండి ! : 

ప్రేమ విఫలం అవగానే ,  మీకు ప్రపంచమంతా , శూన్యం గా కనిపిస్తుంది ! చీకటి గా కనిపిస్తుంది !  ఆ పరిస్థితులలో , మీరు ‘ మీ గత ప్రియురాలి నే , లేదా గత ప్రియుడు ఒక్కడినే  ప్రేమించ గలరు , ఇక  జీవితం లో ఇంకెవ్వరినీ ప్రేమించ లేరు ‘ అనే   ‘ మాయ వల ‘ లో పడి  విలవిల లాడే ప్రమాదం ఉంది ! మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది ? మీరు  మీ ప్రేమ విఫలం అయ్యిందనే  వాస్తవాన్ని  మీ మనసు మూలల్లో ఆమోదించ లేక పోవడం వల్లనా ? , లేదా  మీరు ( ప్రేమ విఫలం అవడం వలన) మీలో కలిగిన చెడు ప్రభావాల వలన, మీరు భయ పడడం జరుగుతుందా ?  ఆ రకమైన భయాందోళనలు ,  మీలో ఆ చెడు భావనలను ఎక్కువ కాలం ఉంచి ,  మీ మనసును ఎక్కువ బరువు గా చేస్తాయి ! వీటికి పరిష్కారం కూడా మీ చేతులలోనే ఉంది ! మీలో ఏర్పడిన ఈ నిరాసక్తత నూ , నిస్సత్తువ నూ , వదిలించు కోవాలంటే , 

1. మీ భవితను ఒక అందమైన  ఉద్యానవనం గా ఊహించుకోండి .

2. మీరు అందులో నడుస్తున్నట్టూ , ఆ వనం గేటును ,  మీరు సునాయాసం గా తెరుస్తూన్నట్టు ఊహించుకోండి ! 

3. మీరు చక్కగా మీకు ఇష్టమైన దుస్తుల్లో , ఆ వనం లో నడుస్తూ , ఆనందం గా , మీరు  కొత్త జీవితం లో ప్రవేశించి , ఒక నూతన అధ్యాయాన్ని ,  కొత్త ప్రేమికులతో  ప్రారంభించ బోతున్నట్టు ఊహించుకోండి !  మీరు ఊహించే ఈ సందర్భాలూ , సమయాలూ , సంఘటనలూ , వీలైనంత స్పష్టం గా మీకు , మీ మనసు చిత్రం లో కనిపించాలి ! అవి మీలో చెరగని ముద్రలు గా ఆవిష్కారం అవ్వాలి ! ఒక్కరితో ప్రేమ విఫలం అయితే , ప్రపంచం లో ఆ ఒక్కరు,  కేవలం  ఆరు బిలియన్ల మంది లో ఒక్కరే ! అంటే మిగతా అవకాశాలను మీరు విస్మరించ కూడదు ! మీ జీవితం ఎంతో విలువైనది !  మీ జీవితం లో ప్రతి క్షణం విలువైనది ! మీ జీవితం ఒక్కటే ! మీ జీవితం ప్రత్యేకమైనది !  ఆశావాదం తో , కృత నిశ్చయం తో , ముందడుగు వేయండి , విజయాన్ని  వరించండి ! 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ? 4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 8, 2013 at 9:09 సా.

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ? 4. 

క్రితం టపాలలో కొన్ని  సూచనలు, సలహాలు తెలుసుకున్నాం  కదా ! 
మరి మీ ప్రేమ విఫలం అయితే,   మీ మనసులో,  ప్రేమ పటం లో ‘ ఆ బొమ్మను’  చెరిపేయడం ఎట్లా ? : ప్రేమ పాకం లో పడుతూ ఉంటే , ‘ ఆ బొమ్మ’  ప్రేమికులలో  రూపు దిద్దుకుంటూ ఉంటుంది ! 
ఏ బొమ్మ ?  అతడికి : ఆ మందస్మిత వదనం , ఆ కలువ కళ్ళు , ఆ మరులు గొలిపే కురులు,  చిలిపి చూపులు , ఆ ఓర చూపులు , ఆ కట్టుకున్న చిలక పచ్చ చీరతో,  ఆకట్టుకున్న ఆమె  అందం !  ఆమె నడకలో ,  ఒక రకమైన వయ్యారం తో కలబోసిన హుందా తనం, రాజసం ఉట్టి పడుతున్న ఆమె నడక ! ఇట్లా ఒక్కొక్క పురుషుడి   మది లో , ఒక్కొక్క విలక్షణమైన రీతి లో  లో దోబూచులాడే, కదిలే ‘ ప్రేమ బొమ్మ ‘
ఆమెకు :  ఆ చిరునవ్వు , ఆ చిలిపి చూపులూ , ఆ  నిర్లక్ష్యం చేసిన గడ్డం , ఆ సీరియస్ నెస్ ! ఇట్లా , ప్రతి యువతి మదిలో ఒక్కో రకం గా  ప్రేమ బొమ్మ ! తలచుకోగానే  రీ ప్లే అయ్యే ప్రేమ బొమ్మ ! 
ఇక్కడి వరకూ కధ బాగానే ఉంది !  మరి మనసులు విరిగితే , ప్రేమ  విఫలం అయితే , ఈ ప్రేమ బొమ్మల మాటేంటి ? ఆ బొమ్మలు మనో  వేదన కలిగిస్తూనే ఉండాలా ? ఆ వేదన చెందుతూ నే ఉండాలా ? ఇప్పుడే మీ లో ఉన్న దర్శకత్వ ప్రతిభ ను వెలికి తీయాలి ! అది ఎట్లాగో చూద్దాం !
మీరు, మీ  ప్రియులను  ( ప్రేమ విఫలం అయితే )  తలుచుకోగానే , మీ మది లో మెదిలే వారి చిత్రాలు ఎట్లా ఉంటాయి ? అంటే , ఎంత పెద్ద చిత్రం , ఎంత దూరం లో మీ మనోచిత్రం గా మీకు దర్శనమిస్తుంది ? ఆ మనోచిత్రం రూపు రేఖలేంటి ?  ఏ రంగు లో ఉందా చిత్రం ? ఎంత పెద్దగా ఉంది ? ఏ వస్త్ర ధారణ తో కనబడుతుందా చిత్రం ? ఇట్లా , పదే , పదే , మీ ముందు కదలాడుతున్నమీ మనోచిత్రం స్వభావాలు మీకు వెంటనే స్ఫురణ కు వస్తే , మీ పని సులువు అవుతుంది !
ఇప్పుడు మీరు చేయవలసినది , మీ మనోచిత్రం లో మీకు స్పష్టం గా కనబడుతున్న ‘ ఆ చిత్రం ‘ రంగులన్నీ ఒక్క సారిగా ,కడిగేసి నట్టు ఊహించుకోండి , మీ దర్శక ప్రతిభతో , ఆ పని మీరు చేయగలరు , ఎందుకంటే , మీ మనోచిత్రాన్ని చేరిపివేసుకోగల  సామర్ధ్యం మీకు మాత్రమే  ఉంది !  మీ మనసు, మీ  స్వాధీనం లోనే ఉంటుంది కనుక ! క్రమేణా , మీరు మీ మనో ఫలకం మీద, పదే , పదే  ఊహించుకుంటున్న  ‘ ఆ చిత్రాన్ని ‘ ఇప్పుడు పంచ రంగులలో కాక ,కేవలం , నలుపూ , తెలుపూ రంగులలోకి మార్చివేశారు ! ఆ తరువాత , మీరు చూస్తున్న ఆ చిత్రం పరిమాణం అంటే సైజు , పది రెట్లు తగ్గించి , ఊహించుకోండి ! ఆ తరువాత , మీరు చూస్తున్న చాలా చిన్న, నలుపూ , తెలుపూ మనోచిత్రాన్ని , ఇంకా , ఇంకా దూరం గా ఉన్నట్టు ,చివరకు  ఒక చుక్క పరిమాణం లోనే ఉన్నట్టు ఊహించుకోండి ! ఇక్కడ ,  మీరు కేవలం,  మీ మనో చిత్రాలతో ఎట్లా ప్రభావితమవుతారో , ఆ ప్రభావాన్ని మీకై మీరే ఎట్లా మార్చుకోగలరో ,ప్రయోగాత్మకం గా తెలుసుకుంటున్నారు ! మానవులకు , వివిధ సమయాలలో , వివిధ రకాలైన , హావ భావాలను, ప్రేమానుభూతులనూ , కేవలం సజీవమైన , సప్త వర్ణాల మనోచిత్రాలు ఎంతగానో  ప్రభావితం చేస్తాయి !  ఈ సజీవ చిత్రాలను , కేవలం మనో నిశ్చయం తో , దృఢ చిత్తం తో , మీ దర్శక ప్రతిభ తో కేవలం, కళావిహీనమైన , వర్ణ రహితమైన , సూక్ష్మ చిత్రాలు గా మీరు ఎడిట్ చేసుకుంటే , ఆ చిత్రాల ప్రభావం, ఒక్క సారిగా శక్తి హీనం అవుతుంది !  ఆ చిత్రాలపైన మీ అనుభూతులూ , హావ భావాలూ , కూడా తదనుగుణం గా తగ్గి పోతాయి ! మీరు పొందే వేదన , విషాదాలు కూడా క్రమేణా తగ్గుతూ ఉంటాయి ! సజీవమైన చిత్రాలు, మది లో కదులుతూ ఉన్నప్పుడు కలిగే భావానుభూతులు తీవ్రమైనవి గానూ ఉ ధృతం  గానూ ఉండే  మనోచిత్రం, అసష్టమైనది గానూ , పొగ బారి నట్టు అయి ,  సూక్ష్మమైనప్పుడు , బలహీనబడి, మనోఫలకం మీద నుంచి అదృశ్యం అవుతుంది ! మొదటి దశలో , మీరు చేసినది , మీ విఫల ప్రేమ కు కారకులైన ప్రియుడిని , ప్రియురాలినీ , మీ మనోఫలకం మీద నుంచి , ఒక క్రమ పధ్ధతి తో చేరిపివేస్తున్నారు ! వారిని , మిమ్మల్ని , ఇక వర్తమానం లో కానీ , భవిష్యత్తు లో కానీ , ఏ రకం గానూ ప్రభావితం చేయలేని శక్తి హీనులుగా , మార్చి వేస్తున్నారు ! ఇక రెండవ దశలో , మీరు మీ సంబంధం వారితో బాగున్నప్పుడు , గడిపిన ఆనంద మయ సన్నివేశాలను ఒక ఐదింటిని స్మరించుకోండి ! వాటిని కూడా , పైన ఉదహరించిన పధ్ధతి లో క్రమేణా , మీ మనోఫలకం మీద నుంచి తుడిపి వేయండి ! 
మూడవ దశలో , మీకు, వారికి కలిగిన తీవ్రమైన వాదోప వాదాలూ , ప్రత్యేకించి  , ఏ యే  సంఘటనలు మీకు తీవ్రం గా వారంటే , విముఖత కలిగించి , అసహ్యం కలిగించాయో , కూడా నోట్ చేసుకోండి ! ఇప్పుడు పైన చెప్పినట్టు ఆ సంఘటనలు , చెరిపి వేయడం కాకుండా ,  మళ్ళీ , మళ్ళీ , స్ఫురణ కు తెచ్చుకొని , ఆ జ్ఞాపకాలను బలవంతం చేసుకోండి ! పైన చెప్పిన పధ్ధతి  దీనినే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు !  ఈ పధ్ధతి సరిగా అనుసరించడానికి ,  కనీసం రెండు వారాలు పడుతుంది !  సంగ్రహం గా ఈ పద్ధతిలో , మీకు తీవ్రం గా మనోవేదన కలిగించి , మీ ప్రేమ విఫలం అవడానికి కారకులైన వారిని మొదటి దశలో , వారి మనోచిత్రాన్నీ , రెండవ దశలో వారితో కలిసి మీరు గడిపిన ఆనంద క్షణాల మనో చలన చిత్రాలనూ , తుడిపి వేస్తున్నారు ! మూడవ దశలో , వారితో గడిపిన ఘర్షణా పూరిత చలన చిత్రాలను , దృఢ మైనవి గా మార్చుకుని , మీ నిర్ణయాన్ని మీరే ఆమోదించుకుని ,  ప్రమాదం అంచు నుండి దూరం గా జరిగి ప్రమోదం తో పురోగమించ గలుగుతున్నారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

విరహ వేదనా తైలం తో, ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 5, 2013 at 8:35 సా.

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?3. 

క్రితం టపా లో ఆలోచనా ధోరణిని  ఆశావహం గా ఎట్లా మార్చుకోవచ్చో , ఎందుకు మార్చుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా ! మనం  బయటి ప్రపంచాన్ని ఏ ఫ్రేం లో అవుతే చూస్తామో , ఆ ఫ్రేం ను మార్చుకోవడం వల్ల , బయటి ప్రపంచం మనకు నూతనం గా కనబడుతుంది ! మనసు ‘ విరిగి ‘ పోయి నిరాశా దృక్పధం తో మీరు చూసే ఫ్రేం ను మార్చుకుని , మీరు జీవితాన్ని ఇంకో కొత్త కోణం లో , కొత్త ఫ్రేం లో చూడగలగడం అలవాటు చేసుకుంటే , మీరు  విమోచన పొందిన అనుభూతి చెందగలరు ! 
4. మరి, ఈ కొత్త ఫ్రేం లో నుంచి మీ జీవితాన్నీ , మీ కొత్త ప్రపంచాన్నీ  చూడగలగడం ఎట్లా ? 
మీ ప్రేమ , లేదా సంబంధం విఫలం అయినప్పుడు , మీరు, మీ గురించీ , మీ తో అంత వరకూ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గురించీ , మీ  అభిప్రాయాలేంటి ?  ఈ విఫలమైన సంబంధం పర్యవసానం గా , మీ గురించీ , ఆ వ్యక్తి గురించీ మీరు ఏ యే నిర్ణయాలు చేసుకున్నారు ? అంటే, మీ గురించీ , ఆ వ్యక్తి గురించీ, మీ తీర్పు ఏమిటి ? తరువాత , మీకు అత్యంత ప్రీతి పాత్రమైన , మీరు అభిమానించే వ్యక్తి , మీరు ఉన్న పరిస్థితి లోనే ఉంటే , ఏ రకమైన నిర్ణయాలు తీసుకుని ఉండే వారో ఆలోచించండి ! ఇక చివర గా మీకూ , మీ తో సంబంధం చెడి పోయిన వ్యక్తి కీ,  ఏ మాత్రం తెలియని ఒక తటస్థ వ్యక్తి , మీరున్న పరిస్థితి లో ఉంటే , ఏమి చేసే వారో , ఏ విధం గా పరిస్థితిని అంచనా వేసుకునే వారో కూడా , మీరే ఆలోచించండి ! ఇప్పుడు, ఈ మూడు రకాల ఆలోచనా తీరుల్లో కనిపించే తేడా ను గమనించండి  , మీకు అత్యంత లాభదాయకమైన , అత్యంత సంతృప్తి నిచ్చిన , అభిప్రాయం ఏమిటో   చూడండి !  అప్పుడు , మీకు , ఆలోచనా రీతులు  , సమస్యను చూసే వ్యక్తి ఫ్రేం లో ఎట్లా మారుతాయో మీకు అవగాహన అవుతుంది ! ప్రేమ విఫలం అయినవారూ , సంబంధాలు తెగి పోయినవారూ , ఆ యా సంఘటనలను కేవలం ఒక చాలెంజ్ లా తీసుకుని , ముందుకు పోయిన వారు , వారి జీవిత పధం లో ముందుకు పోతూ ఉంటారు !  అట్లా కాక ,  ప్రతి తెగి పోయిన సంబంధాన్నీ ,  విఫలమైన ప్రేమనూ , వారి జీవితాలలో వచ్చిన , అతి ఘోరమైన దుర్ఘటన  గా  భావించి , కుమిలి పోయే వారు , వారు సృష్టించుకున్న అగాధం లో  పడి ‘ బయటకు ‘ రాలేక , సతమత మవుతుంటారు ! ఇక ముందుకు పోయే మార్గం ఎట్లా కనిపిస్తుంది? ! నాణానికి రెండువైపులు గా ఉన్న ఈ  ఆశా , నిరాశ  దృక్పధాలకు తేడా ఎంతో ఉంది కదా ! ఆ దృక్పధాలు ఏర్పడడానికి , మనం చూసే ఫ్రేం మార్చుకుంటే మార్గం సుగమమవుతుంది !   ఏ ఫ్రేం లో జీవితాన్నీ , ప్రపంచాన్నీ , భవిష్యత్తు నూ , చూడాలని అనుకుంటామో , అదే ఫ్రేం లో మనకు కనిపిస్తుంది కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?. 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 4, 2013 at 8:36 సా.

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?. 2. 

3. మీ ఆలోచనా ధోరణి ని మార్చు కోవడం :  తరువాతి దశ లో, మీ ఆలోచనలను మార్చుకోవడం  చేయాలి !  ‘ నా ఆలోచనలు నావే , నా ఆలోచనలు ఎన్నటికీ మార్చుకోను !’  అని  మంకు పట్టు పట్టి కూర్చుంటే ,  విరహ వేదన  , ఆనందం  గా మారదు !  మార్చుకోవడానికి  ప్రయత్నాలు చేసే ముందు , మీ ఆలోచనా ధోరణి ని అంచనా వేసుకోవడం కూడా మీరే చేయాలి !  మన  జీవితాలలో ,  క్లిష్ట మైన పరిస్థితులు ఏర్పడినప్పుడు , మన ఆలోచనా ధోరణిని  బట్టే  , మన  క్యారెక్టర్ అంటే మన ధృ ఢ చిత్తమూ , అంటే మన శీలతా తెలుస్తాయి !  ఆ పరిస్థితులలో నిరాశా జనకమైన ఆలోచనలు రావడం సహజం ! ఈ నిరాశా జనకమైన  ఆలోచనలను నెగెటివ్ కాగ్నిషన్ లు అని అంటారు ! ఈ ఆలోచనలు  ఒక సుడి గాలి లా వస్తాయి !   ప్రత్యేకించి ,  ప్రేమ విఫలం అయినప్పుడూ , లేదా పరీక్షలో విఫలం అయినప్పుడూ , లేదా ఇతర సంఘటనలు మానసికం గానూ శారీరికం గానూ తీవ్రం గా గాయ పరిచే సంఘటనలు అనుభవమైనప్పుడూ  !   అప్పుడు , జీవితం నిరాశా జనకం అనిపిస్తుంది ,   ఆ నిరాశా వాద దృక్పధాన్ని ఆది లోనే తుంచి వేయాలి ! లేక పొతే , ఆ ఆలోచనల సుడి గాలి చుట్టు ముట్టి ,  మనిషినే గల్లంతు చేసే ప్రమాదం ఏర్పడుతుంది ! ఆ పరిస్థితి లో,  సుడి గాలి , అమాంతం గా మనిషిని  ఎత్తేయక పోయినా కూడా ,  మనసులో చెల రేగే , మానసిక ఆలోచనా సంఘర్షణ ,  క్రమ క్రమం గా ఉ ధృ తమవుతూ ,  ‘ ఇక జీవించి  ప్రయోజనం లేదు ‘  ఈ జీవితాన్ని అంతం చేసుకోవడమే  శరణ్యం  అని ఆలోచింప చేసి ,  అట్లా ఆలోచిస్తున్న మనిషిని , తనకు తాను , హాని చేసుకునే పరిస్థితి కి పురి గొల్పుతుంది ! ఆ నిరాశా జనక ఆలోచనలే , ముందుకు పోనీయని సుడి గుండాలవుతాయి ! 

 అందు వల్లనే , ఈ ఆలోచనల నిజ స్వరూపం గ్రహించాలి !    అందుకు, మీ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాలి !  అందుకు  మీ దృక్కోణం మారాలి !  అంటే, మీరు చూసే చూపుల బట్టి , మీ ప్రపంచ  పరిధి కూడా మారుతుంది !  మీ దృక్కోణం, నిరాశా జనకం గానూ ,  సంకుచితమైనది గానూ  ఉంటే , మీరు చూసే ప్రపంచం కూడా మీకు సంకుచితం అవుతుంది, గాడాంధ కారం గా గోచరిస్తుంది  ! మీ దృక్కోణం , విశాలం గానూ , విస్తృతం గానూ ఉంటే , మీ ప్రపంచం, చాలా విశాలం గా , మీకు గోచరిస్తుంది ! అందులో,  మీకుండే అవకాశాలూ , పొంద గలిగే ఆనందాలూ కూడా , స్పష్టం గా కనిపిస్తాయి ! ప్రపంచం, ఆశా జనకం గా ఉంటుంది ! ఆ  దేదీప్యమానమైన ప్రపంచం లో, మీకు, మీ భవిష్యత్తు కూడా ఉజ్వలం గా గోచరిస్తుంది  ! నిరాశా మేఘావృతమైన  ఆకాశం లో ,  ఆశా కిరణాలు మీకు స్పష్టమవుతాయి !  జీవితం,  అందులో ప్రత్యేకించి , మీ జీవితం ఎంత విలువైనదో మీకు అవగతమవుతుంది !  విరహ బాధను,  మీరు ‘ గరళ కంఠు డి లా ‘ దిగమింగ గలుగుతారు !  ఆనంద జలపాతాన్ని, మీ శిరసు లో బంధించ గలుగుతారు ! కేవలం, మీ లో కలిగిన ఆలోచనా ధోరణి లో మార్పులతో ! ఆశావాద దృక్పధం తో ! అప్పుడు,  మీ జీవిత మాధుర్యం,  మీకు తెలుస్తుంది !   మీరు అనుభవించే విరహ వేదన ‘ కేవలం ‘ అంటే ఆఫ్టరాల్  ఒక్క వ్యక్తి మాత్రమే, నన్ను తృ ణీక రించడం జరిగింది ‘ అనుకుని , ఆ విషయాన్ని, మీరు,  మీ  ఆమూల్యమైన జీవిత పధం  లో, అడ్డు వచ్చిన ఒక గడ్డి పోచ లా, పక్కకు వంచి , తదేక దీక్షతో పురోగమించ గలుగుతారు  ! అంతటి శక్తి ఉంది ,  మీ ఆలోచనలకు ! మీ కర్తవ్యానికి మూల స్తంభాలైన  మీ ఆలోచనా ధోరణి లో మార్పు ,  మీ కర్తవ్యాన్ని పటిష్టం చేస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

విరహ వేదన తైలం గా, ఆశా జ్యోతి వెలిగించడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 3, 2013 at 1:41 సా.

విరహ వేదన తైలం గా, ఆశా జ్యోతి వెలిగించడం ఎట్లా ? 

 
క్రితం టపాలలో,  ప్రేమించడం ఎట్లాగో వివరం గా తెలుసుకున్నాం కదా ! మరి   పలు సందర్భాలలో ,  మనం ప్రేమించిన వ్యక్తులతో మనకున్న సంబంధం, అకస్మాత్తు గా చెడి పోవడం కానీ ,  లేదా  విపరీతమైన కోరికతో,  మనం కావాలనుకున్న వ్యక్తులు , మనకు దక్కక పోవడమే కాకుండా ,  మనలను ఏమాత్రం లెక్క చేయక పోవడం కూడా జరుగుతూ ఉంటుంది !  ఈ ‘ అనూహ్య పరిమాణాలకు తట్టుకోలేక, తల్ల డిల్లి పోతూ  ఉండడం సంభవిస్తూ ఉంటుంది !  ‘ మనకు అత్యంత ఆప్తుడూ , స్నేహితుడూ అయిన  మన ‘ మనసు ‘ గాడు  గాయ పడతాడు ! మనలో, అనేక సంక్లిష్ట  భావోద్వేగాలను సృష్టి స్తాడు !  మరి ఆ  పరిణామాలను ఎట్లా తట్టుకోవాలి? మనకు మనం హాని చేసుకుంటూ , తీవ్రమైన నిరాశా నిస్పృహ లకు బానిసలమై , జీవితం ‘ అంధకారమయం చేసుకోవడం తప్ప వేరే దారి లేదా !!??  మరి పవిత్రమైన దీపావళి రోజున ,  ఈ   నిరాశా తిమిరం తో,   మన జ్ఞాన దీపం తో సమరం  చేయడమూ , జీవితాలను దే దీప్య మానం చేసుకోవడం గురించీ తెలుసుకుందాం ! 
ప్రేమ విఫలం అవడం తో  మొట్ట మొదట జరిగే చర్య ,  అట్లా జరిగిందని అంగీక రించే స్థితి లో  ‘ మనసు ‘ లేక పోవడం !  దానితో మనసు ‘ గాయం ‘ అవుతుంది !  ‘ నాకే ఎందుకు జరగాలి ఇట్లాగా ? అనే తీవ్రమైన ఆత్మ శోధన కలుగుతుంది !  దానితో నిద్రాహారాలు మానడమూ ,  తీవ్రమైన మానసిక ఆందోళన కు గురి అవడమూ కూడా జరుగుతాయి ! 
మరి కర్తవ్యం ఏమిటి ? : 
1. నొప్పిని అంగీకరించడం :  మీలో కలిగే బాధను అంగీకరించి , ఆ బాధనూ , వేదననూ,  భరించాలనే నిర్ణయం తీసుకోండి !   మన శరీరం లో ఎక్కడైనా చిన్న గాయం అయినా , నొప్పి కలగడం , అత్యంత సహజమైన జీవ రసాయన చర్య !  మనం మానసికం గా ‘ గాయ ‘ పడినా , నొప్పి కలగడం సహజమే ! కాక పొతే ఆ నొప్పి , ఒక స్థానం లో  , ఖచ్చితం గా కనిపించదు , మానసిక వ్యాకులత కనుక !  సామాన్యం గా  చాలా మంది , ఈ మానసిక వేదనను , నిర్లక్ష్యం చేయడమే కాకుండా ,  మనో  వేదనను ఆమోదించే పరిస్థితి లో కూడా ఉండరు !  
‘ విరిగిన మనసు ‘  గత స్మృతు లను , అప్రయత్నం గానే ఆటో  రీ – ప్లే చేసుకుంటూ ఉంటుంది ! తరచూ !   ఆ గత స్మృతులు , మీరు , మీ ప్రేమను తృ ణీ కరించిన వ్యక్తి తో గడిపిన ఆనంద మయ క్షణాలు కావచ్చు , లేదా కలిసి చూసిన ప్రదేశాలూ ,  చేసిన సంభాషణలూ ,  ఆరగించిన విందులూ , ఇంకా ముందుకు పోయిన సందర్భాలలో పొందిన శారీరిక , మానసిక ఆనందమూ  కూడా , మన  జీవ కంప్యూటర్ లో ఉన్న హార్డ్ వేర్ లోనుంచి ,  పదే , పదే , ఆడియో గానూ , వీడియో గానూ , రీ – ప్లే అవుతూ ఉంటాయి !   ఆ  పరిస్థితిని ‘ చక్క బెట్టుకోవడం ‘ అలవాటు చేసుకోవాలి !  ఇది చెప్పినంత సులభం కాదు !  అట్లా చేయడం, మీరు, మీ   ‘ మధుర స్మృతులకు  ‘ విలువ కట్ట లేక పోవడమూ కాదు !  మీ (గత ) ప్రేమాను భూతులను , మీరు పట్టించుకోక పోవడమూ కాదు ! కొంత కాలం గా , మీ  జీవ కంప్యూటర్ లో ఈ సంఘటనలు అన్నీ కూడా  ప్రధాన మైనవి అవడం వల్ల ,  మీ జీవనం కూడా , ఆ సంఘటనలకూ , మీరు, తద్వారా పొందే , మధురానుభూతులకూ , అలవాటు  పడడం జరిగింది !  అంటే మీ ‘ మనసు గాడు ‘ మీతో పాటు గా , ఆ యా అనుభూతులకు ప్రోగ్రాం అయ్యాడు !  మీరు,  మీ ఇంద్రియాలతో , వర్తమానం లో ఉన్నా , మీ మనసు గాడు, ఆ యా ప్రదేశాలలో , మీరు తిరుగుతూ ఉంటే , అప్రయత్నం గానే , మీరు క్రితం అక్కడ ఉన్నప్పుడు మీరు పొందిన ఆనందాన్ని గుర్తు చేస్తాడు ! 
2. అలవాట్లు మార్చుకోవడం ! : పైన ఉదహరించిన ఈ పరిస్థితి నుంచి, క్రమ క్రమం గా మీరు దూరం అవాలంటే ,  మీ అలవాట్లను మార్చుకోవడం ముందుగా చేయాలి !  క్రమ క్రమం గా ,  ఆ ‘ గత ‘ సంఘటనలు ‘ మీలో రీ ప్లే అవుతూ ఉంటే కూడా , వాటిని పట్టించు కోకుండా , మీ వర్తమానం లో మీ మనసును , మీ శరీరం తో పాటుగా కేంద్రీకరించుకోవడం అలవాటు చేసుకోవాలి !  మీకు ఉత్సాహం కలిగించే , మీకు ఇష్టమైన, కొత్త  హాబీ  ను డెవలప్ చేసుకోవడం , అట్లాగే , ఒకే చోట కూర్చోకుండా , ప్రతి రోజూ శారీరిక వ్యాయామం చేయడం ,  కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవడం చేయడం వల్ల , మీ మానసిక వేదనను దూరం చేసుకోవడమే కాకుండా , దాని పరిణామం గా పొంచి ఉన్న ,  డిప్రెషన్ ను కూడా మీరు దూరం చేసుకుంటున్నారన్న మాటే !  నిరాశా నిస్పృహ లతో , సతమత మయ్యే , జీవ కణాలకు ప్రాణ వాయువు ను సరిపడినంత గా సమకూర్చుతుంది , మీరు,  రోజూ చేసే వ్యాయామం ! 
సూక్ష్మం గా చెప్పాలంటే , మీ గత జీవన చర్యను , మీరు మార్చుకుని ,  భావి జీవితం లో ఉత్సాహ భరితం గా ఉండడానికి మీరు  సన్నద్ధ మవుతున్నారు పై చర్యల వల్ల !  మీ జీవ కంప్యూటర్ లో కొత్త సాఫ్ట్ వేర్ అప్ లోడ్ చేసుకోవడానికి ,   మీ ‘ డిస్క్ డ్రైవ్ ‘ ను క్లీన్ చేసుకుంటున్నారు ! మీరు, మీ విలువైన జీవిత కంప్యూటర్ ను, వృధా చేద్దామనుకోవడం లేదు ! అది ఎంతో ఆనంద కరమైన నిర్ణయం ! ఎందుకంటే , మీ జీవితం ఎంతో విలువైనది !  విలువ గ్రహించ లేని వారి వల్ల , మీ జీవితం విలువ కోల్పో కూడదు ! కోల్పోదు కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !