చదువుకోవడం ఎట్లా ?. 15.పాఠ్య పుస్తకాలు ఎట్లా చదివితే ఎక్కువ ఉపయోగం ?
మునుపటి టపాలలో చదువుకు కావలసిన సరంజామా గురించీ , క్లాసు లో చెప్పే పాఠాల నోట్సు తీసుకునే పధ్ధతి గురించీ , తెలుసుకున్నాం కదా ! మనం తెలుసుకునే విషయాలన్నీ కూడా , మన లక్ష్యాన్ని అంటే బాగా చదువుకుని , మంచి ఫలితాలు పొందాలనే లక్ష్యాన్ని , చేరుకోవడానికి , ఎంతో సహాయ పడతాయి ! మంచి ఫలితాలు అంటే అవి కేవలం , పరీక్షలలో , మంచి మార్కులు రావడానికే పరిమితం అవకుండా , జీవితాలలో కూడా , చేసే ప్రతి పని లో నూ , ఒక పధ్ధతి ఏర్పడి , విజయం పొందే లా ఉంటాయి , ఆ ఫలితాలు ! ఇప్పుడు పాఠ్య పుస్తకాలు చదివే విధానం గురించి శాస్త్రీయం గా తెలుసుకుందాం ! చాలా మంది అనుభవజ్ఞులు తమ సంతానానికి , ‘ బాగా చదవాలి ‘ కష్ట పడి చదవాలి ‘ అనీ , పాఠ్య పుస్తకాలన్నీ , వల్లె వేయాలి , ‘ కంఠ తా పట్టాలి ‘ అని సాధారణ సలహాలు ఇస్తూ ఉంటారు ! అవన్నీ నిజమే , కానీ ఆ చదివే పద్ధతుల గురించి విద్యార్ధులకు తెలియ జేయరు ! దానితో , పాఠ్య పుస్తకాలను చూడగానే , విద్యార్ధులకు ఒక రకమైన గుబులు పుట్టుకుంటుంది ! ‘ ఇదంతా నేను చదవాలా ? ‘ అని ఆందోళన పడుతూ ఉంటారు !
ఈ క్రింది సూచనలు గమనించి , వాటిని అనుసరించడం అలవాటు చేసుకుంటే , పెద్ద పెద్ద పాఠ్య పుస్తకాలు చదివి ఆకళింపు చేసుకోవడం కూడా చాలా సులువు అవుతుంది !
ప్రధమ సూత్రం : S Q R 4 : ఈ అక్షరాలనూ , అంకె నూ , ‘ ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ‘ అని, అనేక సార్లు వల్లించి, అది మీ మనసులో నాటుకునేట్టు అంటే మీరు మీ జీవితం లో ఎప్పుడూ మర్చిపోకుండా , నేర్చుకోండి !
S అంటే సర్వే : ( survey ) : అంటే మీరు చదవ బోయే పాఠమైనా , మొదట గా చూడగానే కంగారు పడకుండా , ఆ పాఠాన్ని , మొదలు నుంచి , ముగింపు దాకా ఒక సర్వే చేయండి ! అంటే ఉదాహరణకు : ఒక పాఠం అయిదు పేజీలలో ఉంటే , మొదటి పేజీ లో ముందుగా ఆ పాఠం పరిచయం ఎట్లా చేశారు ? ఆ పాఠం దేని గురించి ? , అనే విషయం తెలుసుకోండి ! తరువాత ఆ పాఠం లో తెలుసుకోవలసిన విషయాలను ఏదైనా సైడ్ హెడింగ్స్ రూపం లో ఇచ్చారా? ఇస్తే , ఆ సైడ్ హెడింగ్స్ ఏమిటి ? అనే విషయం గమనించండి ! చివరగా , ఆ పాఠం చివర గా ఇచ్చిన సంగ్రహ వాక్యాలు అంటే సమ్మరీ కూడా చదవండి ! ఇట్లా సర్వే చేయడం వల్ల మీకు , ఆ పాఠం తో మీకు రచయిత ఏమి బోధించ దలుచుకున్నాడో అర్ధం అవుతుంది ! గుర్తు ఉంచుకోండి : మీరు ఈ సర్వే లో కేవలం ఆ పాఠం గురించి ఒక స్థూలమైన అంటే జెనరల్ అభిప్రాయం ఏర్పరుచు కుంటున్నారన్న మాట !
Q అంటే క్వశ్చన్ : లేదా ప్రశ్న : ఇది మీరు చదివే ఏ పాఠమైనా , తప్పని సరిగా ఉండవలసిన లక్షణాలలో ఇంకొకటి ! ఒక సారి మీరు చదివే పాఠాన్ని సర్వే చేశాక , మీరు ఆ పాఠాన్ని , అనేక రకాలు గా ప్రశ్నించాలి. అంటే , ఆ పాఠం , మిమ్మల్ని , రచయిత ఎందుకు నేర్చుకోమంటున్నాడు ? ఆ పాఠం లో ప్రధాన విషయం ఏమిటి ? అనే ప్రశ్నలన్నీ మీకై మీరు వేసుకోవాలి ! అంటే చదివే సమయం లో, ఈ ప్రశ్నలకు జవాబులు అన్నీ మీరు ఆ పాఠం లో వెదకాలి !
ఈ ప్రశలన్నీ కూడా తేలిక గా గుర్తు ఉంచుకోవడానికి what? where? why? how? when? who? ఈ ఆరు ప్రశ్నలనూ మీరు ప్రతి పాఠం నేర్చుకునే సమయం లో తప్పని సరిగా మీకై మీరే వేసుకుని , వాటి సమాధానాల కోసం ప్రయత్నించాలి ! మీరు ఆ సమాధానాలన్నింటినీ , రాబట్టుకున్నారంటే , మీరు మీ పాఠం , చాలా వరకు నేర్చుకున్నారనే చెప్ప వచ్చు ! విజ్ఞానం సంపాదించుకోవడానికి , లేదా చదువుకుని విద్యావంతులవడానికీ , ఈ ఆరు ప్రశ్నలూ , అతి ముఖ్యమైనవి ! మీరు ఏ సబ్జెక్ట్ చదువు దామనుకున్నా కూడా !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !