Our Health

Archive for నవంబర్ 23rd, 2013|Daily archive page

చదువు కోవడం ఎట్లా ? 10. సమయ పాలన. ( టైం మేనేజ్ మెంట్ ).

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 23, 2013 at 11:59 ఉద.

చదువు కోవడం ఎట్లా ? 10. సమయ పాలన. ( టైం మేనేజ్ మెంట్ ).

 

మునుపటి టపాలో, సరైన సమయం లో ఆప్రమత్తమై , తీసుకునే నిర్ణయాలు ,  ఎంత మేలు కలిగిస్తాయో ( మూడు చేపల కధ ద్వారా ) తెలుసుకున్నాం కదా ! భారతీయులలో చాలా మందికి , కర్మ సిద్ధాంతం బాగా వంట బట్టి ఉంటుంది ! కానీ చాలా మంది, ఈ కర్మ సిద్ధాంతాన్ని వక్రీకరించి , ‘ ఎప్పుడు ఏది జరగాలని ఉంటే , అది జరుగుతుంది ‘ అది మన చేతుల్లో ఏమీ లేదు ‘   అని భాష్యం చెప్పడమే , మనం వింటూంటాం కానీ ‘ అసలు కర్మ సిద్ధాంతం ‘  నీవు చేయ వలసిన కర్మలను త్రికరణ శుద్ధి గా చేయి ! ఫలితం నీ చేతులలో లేదు ! అనే కదా !   కానీ విద్యార్ధుల విషయం లో కొస్తే , చాలా మంది విద్యార్ధులు ,  పరీక్షల కోసం వారు చేయ వలసినది చేయకుండా , కేవలం మంచి ఫలితాలు మాత్రమే రావాలని కోరుకుంటారు !  ఇట్లా ఆలోచించడం ఎంత వరకు సమంజసం ? ఈ ఆలోచనా ధోరణి తో  కేవలం , బాధనూ , కష్టాలనూ కొని తెచ్చుకోవడమే అవుతుంది ! అందుకే , ప్రతి విద్యార్ధీ , తమ కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చి పోకూడదు ! 
ఇప్పుడు సమయ పాలన లో మిగతా విషయాలు తెలుసుకుందాం ! 
1. మొదట ఎంత సమయం , ఏ సబ్జెక్ట్ కు వినియోగించాలి అనే విషయం నిర్ణయించు కున్నాక , ఆ విషయాలు విపులం గా ఒకే చోట మీకు గుర్తు గా ఉండే చోట నోట్ చేసుకోండి. ఉదాహరణకు ,  మంగళ వారం సాయింత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు  సైన్సు చదవాలని నిర్ణయించు కుంటే  ఆ రోజుకూ ఆ సమయానికీ మీరు బద్ధులై ఉండాలి. అంటే ఎట్టి  పరిస్థితి లోనూ  ఆ నిర్ణయించిన సమయం లో వేరే పనులు ఏవీ చేయకుండా , కేవలం సైన్సు చదవడం కోసమే ఉపయోగించాలి. ఇట్లా మీరు , బాగా ఆలోచించి వేసుకున్న టైం టేబుల్ ను సాధ్యమైనంత వరకూ , పూర్తి గా ఆచరించడం అలవాటు చేసుకోవాలి !  ఒక సారి మీరు ఈ పధ్ధతి కి అలవాటు పడితే ,  మీరే గమనిస్తారు , మీకు చదవడం ఎంత సులువు అవుతుందో !  
2. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి ?: పైన చెప్పిన విధం గా మీరు ఒక ‘ గాడి ‘ లో పడ్డాక , అంటే ఒక నిర్ణీత మైన చదువు సమయాలకు అలవాటు పడ్డాక ,   ఏ  సబ్జెక్ట్ లకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాలి ! ఆ విషయం , మీకే బాగా తెలుస్తుంది ! అంటే అది ఒకరు చెప్పేది కాదు , మీకు ఏ సబ్జెక్ట్ లు తేలిక గా ఉన్నాయో , వాటికి తక్కువ సమయమూ , ఏవి కష్టమని పిస్తున్నాయో , వాటికి ఎక్కువ సమయమూ కేటాయించడం చేయాలి ! 
3. స్కూల్ లోనూ , కాలేజీలో నూ ఉండే వివిధ వ్యాపకాలకు సిద్ధ పడండి ! : స్కూల్ జీవితమూ , విద్యార్ధి దశా , ప్రతి ఒక్కరి జీవితం లో నూ  మధురానుభూతులు ! ఆ సమయం లో అనేక కార్య క్రమాలు , ప్రతి విద్యార్ధి కీ ఆనంద దాయకం గానూ , మరచి పోలేనివి గానూ ఉంటాయి ! కానీ ప్రతి విద్యార్ధీ ఎప్పుడూ గుర్తు ఉంచుకోవలసిన విషయం ,  వారి చదువు , వారి చదువును ఒక ప్రధాన విషయం గా భావించాలి ! మిగతా వ్యాపకాలన్నీ కూడా తరువాతే !  పైన చెప్పిన విధం గా,  ఒక చదువు పధకానికి అలవాటు పడ్డాక , ఒక వారం ఆ పధ్ధతి లో చదివాక , కొంత సమయాన్ని , అందుకు , అంటే వారమంతా చదువుకున్నందుకు ప్రతి ఫలం గా , మీ కు ఇష్టమైన వ్యాపకం లో మీరు రిలాక్స్ అవ్వ వచ్చు ! అంటే, మీరు ఒక వారం చదివాక , మీకు తోచిన విధం గా విశ్రమిస్తున్నారన్న మాట. అది అనేక రకాలు గా ఉండవచ్చు ! ఆడుకోవడమో , లేదా , స్నేహితులతో ఒక సినిమా కు వెళ్లడమో , లేదా ఒక కొత్త ప్రదేశాన్ని చూడడమో , లాంటివి ! ఇవి కేవలం మీ ఇష్టాయిష్టాల మీద ఆధార పడి  ఉంటాయి !  గమనించ వలసినది , మీరు ఇట్లా చేస్తూ , మీ చదువును కేంద్ర బిందువు గా నిర్ణయించి , మిగతా విషయాలు ఆ పరిధిలో , చదువు చుట్టూ ‘ తిరిగేట్టు ‘ నిర్ణయించు కుంటున్నారు ! చాలా మంది విద్యార్ధులు , వివిధ వ్యాపకాలను కేంద్ర బిందువు గా చేసికొని , చదువును  కేవలం ఆ వ్యాపకాల పరిధిలో ఉండేట్టు నిర్ణయించు కుంటారు !  ఇట్లా చేయడం తో, చదువు  ఎప్పుడూ , వారికి దూరం గా ‘ పరిభ్రమిస్తూ ఉంటుంది ‘ ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

 

%d bloggers like this: