Our Health

Archive for నవంబర్ 26th, 2013|Daily archive page

చదువుకోవడం ఎట్లా ? 12. నోట్స్ ఎందుకు రాసుకోవాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 26, 2013 at 8:01 సా.

చదువుకోవడం ఎట్లా ? 10. నోట్స్ ఎందుకు రాసుకోవాలి ?

మునుపటి టపాలలో , మనం చదువుకోవడానికి , కావలసిన ప్రధాన సరంజామా ఏమేమి ఉండాలో , ఎట్లా ఉండాలో కూడా తెలుసుకున్నాం కదా !  ఈ సరంజామాలో ప్రధానమైనది, ఏకాగ్రతత !   అంటే, మనకున్న మెదడును పూర్తి గా అప్రమత్తత తో ఉంచి , చదివే విషయాల మీదే ఏకాగ్రత అంటే ఫోకస్ చేసి అంటే పూర్తిగా కేంద్రీకరించి , వాటిని అర్ధం చేసుకోవడమూ , అర్ధం చేసుకున్న విషయాలను మన మెదడు బ్యాంకు లో అంటే, మన మెమరీ స్టోర్ లో  జాగ్రత్త గా పెట్టుకోవడమూ ! ఇంత వరకూ బాగానే ఉంది ! మరి చదివిన విషయాలనూ , లేదా క్లాసు లో కానీ , కాలేజీ లో, లెక్చర్ హాల్ లో కానీ , తెలుసుకున్న విషయాలు వెంటనే మెమరీ స్టోర్ , అదే మన మెదడు బ్యాంకు లో  వేసుకోవడం కాస్త కష్టమైన పనే కదా !  మరి అప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి ?:   ఆ సమయం లోనే మనకు ఆపత్బంధువు లా పనికి వచ్చేది,  మనం రాసుకునే నోట్స్ ! మరి ఈ నోట్సు , కధా కమామీషు తెలుసుకుందాం ! 
నోట్స్ ఎందుకు రాసుకోవాలి ? :  భాష,  మానవ  సంస్కృతి కి ఎట్లా జీవనాడి గా పరిగణించ బడుతుందో ,  రాత ( లేదా వ్రాత ) కూడా మానవుల మేధ ను  కాగితం మీద కనబడేట్టు చేసే ఒక ఉత్తమ సాధనం !   మనం, ఒక తెల్ల కాగితం మీద ఒక పెన్నుతో కానీ , పెన్సిల్ తో కానీ ఎడా పెడా , ఒక చివర నుంచి ఇంకో చివరకు కొన్ని గీతలు గీసి ,  ఆ గీతలను,  ఎవరికైనా చూపించి , వాటి భావం తెలియ చేయమంటే ,  పెద్దగా తడుము కోకుండా ,  ‘ ఇవేవో పిచ్చి గీతల్లా ఉన్నాయని ‘  చెప్పేస్తారు !  అదే, ఇంకో తెల్ల కాగితం మీద చక్కని దస్తూరీ తో అంటే చేతి రాత తో ముత్యాల్లాంటి అక్షరాలలో , ఒక  మనసుకు హత్తుకునే వాక్యం కానీ , సూక్తి కానీ , లేదా కధ కానీ రాస్తే ,చూసిన వారు వెంటనే , చదివినది అర్ధం చేసుకుని , అది రాసిన వారి భావం  తెలుసుకోగలరు !  అంటే కేవలం వారి చేతి రాత తో , ఎదుటి వారి భావాలను స్పష్టం గా తెలుసుకో గలుగుతున్నారన్న మాట !  పరీక్ష ల లో రాసే పేపర్ లో కూడా , విద్యార్ధి చదివిన విషయాలను సమాధానాల రూపం లో తెలుసుకుని , వాటి విలువ ను లెక్క కట్టేది  , కేవలం విద్యార్ధి  రాసే రాత చూసే  కదా ! మీరు నోట్స్ తీసుకున్తున్నారంటే , ఆ నోట్స్ మీకు ఆ పాఠం ఎంతవరకూ అర్ధమయిందో తెలిపే రికార్డు ! అంతా తెలిస్తే నోట్స్ బాగా ఉంటుంది ! కొంతే తెలుస్తే , మీకు అది కూడా రికార్డు గా ఉంటుంది , తరువాత , తెలుసుకోవలసినది తెలుసుకోవడానికి !
మరి నోట్స్ తీసుకోవడం లో జరిగే లాభం ఏమిటి ? :    ఒక సారి , మీరు నోట్స్ తప్పని సరిగా తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటే  !  అనేక చర్యలు, అంటే  మీరు చదువుకోడానికి ,  చదువుకున్నదీ , తెలుసుకున్నదీ , అర్ధం అవడానికీ , అర్ధమయింది , మెదడులో ముద్ర వేయడానికీ , ఉపయోగ పడతాయి ! అది ఎట్లాగో చూద్దాము !
పాఠం వింటున్నప్పుడు , మీరు కనుక ఒక నోట్ బుక్ , పెన్నూ , చేతిలో పెట్టుకుని సిద్ధం గా ఉంటే ,   మీరు మొట్ట మొదటగా వినేది ,  ఆ రోజు పాఠం గురించి !  అది మీరు నోట్ చేసుకుంటారు ,  ఆ రోజు డేట్ రాసుకుని , టీచర్ పేరు , లేదా లెక్చరర్ పేరూ , పాఠం పేరూ , మీరు రాసుకుంటారు !  మీరు రాసుకోలేక పొతే ,మీరు వినలేక పోవడం , లేదా , ఏకాగ్రత చూపక పోవడం , లేదా  ఆ రెండూ చేసినా , నిర్లక్ష్యం తో రాసుకోక పోవడం ! అంటే నోట్ చేసుకోక పోవడం ! జరుగుతాయి ! అంటే , మీరు రాసే నోట్స్ , మీరు ఎంత అప్రమత్తం గా మీ పాఠాలు వింటున్నారో , తెలియ చేసే , సాధనం అన్న మాట ! అట్లాగే , పాఠం లో సామాన్యం గా ఉండే , ముందు మాట  అంటే ఇంట్రడక్షన్ ,  ఇంకా అసలు పాఠం ,  కొన్ని ఉదాహరణలూ , ముగింపూ ఇవన్నీ కూడా , మీరు  మీ మనసు లగ్నం చేసి , ఏకాగ్రత లో  పాఠం వినక పొతే , నోట్ చేసుకోలేరు !  కానీ ఏకాగ్రత తో పాఠం మీద ఫోకస్ చేసి విన్నట్టయితే , ఒక క్రమ పధ్ధతి లో నోట్ చేసుకోగలరు ! ఆ చర్య తో , ఆ పాఠం , మీ మెదడు లో ‘ నానుతుంది ‘ కొన్ని అర్ధం కాని పదాలున్నా కూడా , వాటిని కూడా మీరు నోట్ చేసుకుంటే , తరువాత , వాటి గురించి తెలుసుకోవడానికి , మీకు అవకాశం ఉంటుంది ! ఇంకో ముఖ్య విషయం , మీకు పాఠం చెప్పే టీచర్ కానీ లెక్చరర్ కానీ , ఏ ఏ విషయాలమీద ఎక్కువ  దృష్టి పెట్టి మీకు ,బోధిస్తున్నారో , కూడా , మీరు తెలుసుకోవచ్చు ! అంటే , వారు,  పాఠ్య పుస్తకాలను  ‘ జల్లెడ ‘ పట్టి పాఠాన్ని మీకు సంగ్రహం గా బోధిస్తున్నారు కదా , మీరు  ఆ అధ్యాయం అంతా , టెక్స్ట్ బుక్ లో,  పొల్లు పోకుండా చదివి , మీ విలువైన సమయాన్ని వృధా చేసుకో నవసరం ఉండదు !  కేవలం పాఠం లో చెప్పిన వాటినే ,  టెక్స్ట్ బుక్ లో వెదికి , ఆ విషయాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేయ వచ్చు ! అంటే తక్కువ సమయం లో ఎక్కువ లాభం మీకు, ప్రతి పాఠానికీ తప్పని సరిగా  నోట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే ! నోట్స్ తీసుకుంటే ఇంకో ఉపయోగం కూడా ఉంది !  పరీక్ష రోజులకు ముందు కూడా మనకు ఉండేది ఇరవై నాలుగు గంటలే కదా !  ఆ రోజుల్లో కూడా మనం నిద్ర కూడా పోవలసినదే కదా, రాత్రి అవుతే ! మరి సంవత్సరమంతా చదివిన పాఠాలు పెద్ద పాఠ్య పుస్తకాలన్నీ , అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ , పరీక్షల ముందు రోజుల్లో మళ్ళీ రివైజ్ చేయడం అంటే పునశ్చరణం చేయడం అయ్యే పనేనా !  ఈ ప్రశ్నకు  సరి అయిన సమాధానానికి  మనకు కొన్ని క్షణాలే కదా పట్టేది ! మరి ఆ పరీక్షా  సమయాలలోనే , మీరు రాసుకున్న నోట్స్ , మహా విష్ణువు రూపం లో వచ్చి , ఉపయోగ పడి , ‘ పరీక్షా  మోక్షం ‘  కలిగిస్తాయి !  లేక పొతే ,  విద్యార్ధి గజేంద్రు లను , పరీక్షా మొసళ్ళు పట్టి , ‘ సప్లిమెంటరీ సముద్రం ‘  లోకి లాగుతూ ఉంటాయి ! 
ఇక వచ్చే టపాలో నోట్స్ ఎట్లా తీసుకోవాలో తెలుసుకుందాం !
%d bloggers like this: