ప్రేమించడం ఎట్లా ? 8. మంచి నేస్తం !
క్షమించడం , క్షమించ బడడం : ప్రేమ లో , ఇష్టాలూ , అయిష్టాలూ , పలకరింపులూ , మూతి విరుపులూ కూడా ఉంటూ ఉంటాయి , కాలాను గుణం గానూ , పరిస్థితులను బట్టీ , అట్లాగే , మనసు విరిచే మాటలూ , సంఘటనలూ కూడా చోటు చేసుకుంటాయి ! తప్పిదాలూ జరుగుతూ ఉంటాయి ! అవి మీ వల్ల జరిగితే , మీరు ఆత్మ న్యూనతా భావం తో కుమిలి పోకుండా , హుందా గా మీ తప్పిదాలను అంగీకరించే పరిస్థితి లో ఉండాలి ! అట్లాగే, మీరు ప్రేమించిన వారు కనుక తప్పిదాలు చేయడమో , లేదా మీ మనసు ‘ గాయ ‘ పరచడమో చేస్తే , మీరు అప్పుడు కూడా ‘ క్షమా గుణం ‘ అనే బ్యాండేజ్ వేసుకుని గాయం మాన్చు కునే చర్యలు తీసుకోవాలి ! ఆ అనుభవాల సారాంశం , మీ భావి జీవితం లో మీరు ఉపయోగించు కోవాలి !
మంచికి పోటీ : ఉన్నమైన విలువలు కలిగిన ప్రేమ లో, పరస్పరం, మంచికి పోటీ పడుతూ ఉంటారు ! ప్రేమికులిద్దరూ , వారి వారి ఆశయాల నూ , ఆకాంక్ష లనూ పరస్పరం గౌరవించుకోవడమే కాకుండా , ఆ ఆశయాలూ , లక్ష్యాలూ వారు చేరుకోవడానికి అవతలి వారు , వారి శాయ శక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు , ప్రేమ పూర్వకం గా ! అంటే వారు పరస్పరం , తమ మంచితనాన్నంతా , వారి ప్రేమలో పెట్టుబడి పెడతారు ! ఒకరి కన్నా ఎక్కువ గా , ఇంకొకరు తమ మంచి తనాన్ని చూపించడం లో పోటీ పడతారు ! ఈ పోటీ, కేవలం ఒకరు గెలవాలనే లక్ష్యం తో కాకుండా , వారిరువురూ , తమ గమ్యాలూ , లక్ష్యాలూ , చేరుకొని , ప్రేమ మయ జీవితాలు గడపడం కోసమే !
మంచి నేస్తం : ప్రేమ లో ముద్దూ మురిపాలు ముఖ్యమైనా కూడా , ఇంకో ముఖ్య విషయం , మీరు ప్రేమించిన వారితో ఒక మంచి నేస్తం గా ఉండి పోవాలి ! సదా,వారి శ్రేయస్సు కోరే, ఒక మంచి మిత్రులు గా ఉండాలి ! జీవితాంతం ! మీ ప్రేమ భౌతికమైనదైనా , లేదా కేవలం హృదయ స్పందన తో కూడినదైనా ( అంటే ప్లాటోనిక్ ప్రేమ ! ) అయినా , మీ ప్రేమ సఫలం అయినా , విఫలం అయినా కూడా , మీరు ప్రేమించిన వారికి, మీరు ఒక గొప్ప స్నేహితులు గా అవ్వాలి ! వారి కష్ట కాలం లో మీ భుజం మీద తల ఆనించి సేద తీర్చుకునే విధం గా మీ ‘ భుజం ‘ సిద్ధం కావాలి ! ప్రేమ విలువలు దేదీప్య మానం గా వెలిగేది అప్పుడే !
ప్రేమ, అతి సులభం !
ప్రేమ, అతి జటిలం !
ప్రేమ అతి సున్నితం !
ప్రేమ,అతి మధురం !
ప్రేమ, విచిత్రం !
ప్రేమ, పవిత్రం !
ప్రేమ, సౌందర్యం !
ప్రేమ, జీవితం !
ప్రేమ, శాంతి !
ప్రేమ, కాంతి !
వచ్చే టపాలో కలుద్దాం !