మరి ప్రేమించడం ఎట్లా ? 1.
క్రితం టపాలలో, మానవులకు సంక్రమించిన అమూల్యమైన లక్షణాలలో ఒకటైన ప్రేమ వల్ల, అంటే ప్రేమించడం వల్ల కలిగే శారీరిక , మానసిక లాభాలు తెలుసుకున్నాం కదా ! మరి ఎట్లా ప్రేమిద్దాం ? ! అంటే ప్రేమించడం ఎట్లా ? ఈ విషయం చాలా మంది ని, వారి వారి జీవిత గమనం లో , అనేక దశలలో సందిగ్ధం లో పడ వేస్తుంది ! వివిధ సందర్భాలలో అనేక రకాలు గా మధన పడుతూ కూడా ఉంటాం , మన అనుభూతులు మనం వ్యక్తం చేస్తున్నప్పుడు , మనలో జనించేది ప్రేమా కాదా అనే విషయం కూడా తెలియక తిక మక పడుతూ ఉంటాం ! మరి అది తెలుసుకునే ముందు , ఏది ప్రేమ అవుతుందో ఏది ప్రేమ కాదో తెలుసుకోవడం ముఖ్యమే కదా !
ప్రేమ అంటే ప్రణయం మాత్రమే కాదు !
ప్రేమను కేవలం ప్రణయం తోనే ముడి వేస్తే , ప్రేమ సింధువు లో కేవలం ఒక బిందువును మాత్రమే ఆస్వాదించడం తో పోల్చ వచ్చు ! ప్రేమ ఒక సుందరమైన అనుభూతి ! ఆ అనుభూతిని మనం సామాన్యం గా ఇతర వ్యక్తుల తో పరస్పరం స్పందన, ప్రతి స్పందన ల లో పొందుతాము ! వివిధ పరిస్థితులలో , వివిధ సందర్భాలలో కూడా, వివిధ మానవ సంబంధాలలో కూడా మనం ఈ ప్రేమానుభూతిని చెందవచ్చు !
ప్రేమ వివిధ వ్యక్తుల మధ్య పంచుకోబడుతుంది: ప్రియులు , సోదరులు సోదరీ మణులు , బంధువులు , స్నేహితులు , సన్నిహితులు , ఆప్తులు , ఇట్లా అన్ని తరహాల వ్యక్తుల మధ్యా ప్రేమ పంచుకోవచ్చు !
ప్రేమ మనం చేసే వివిధ పనుల లో కూడా మనం పొందుతాము: మనం చేసే పని లో పూర్తి గా నిమగ్నమై చేసినా , లేదా మనకు చాలా ఇష్టమైన ( దానినే ‘ప్రియమైన’ అని కూడా అంటారు కదా ! ) హాబీ లేదా వ్యాపకం , అది చిత్ర లేఖనం కావచ్చు , నృత్యం , సంగీతమైనా కావచ్చు , ఆ యా వ్యాపకాలను పూర్తి గా నిమగ్నమై సృజనాత్మకత తో , కొనసాగిస్తున్నప్పుడు కూడా ఆ వ్యాపకాలను ప్రేమిస్తూ , ఫలితాన్ని పొంది ఆనంద పడతాము ! దీనినే మానసిక శాస్త్ర రీత్యా ‘ flow ‘ లేదా ఫ్లో అని అంటారు. ఈ ఫ్లో గురించి వివరం గా క్రితం టపాల లో తెలియ చేయడం జరిగింది ( ఉత్సాహం ఉన్న వారు, బాగు ఆర్కైవ్ లలో వెదికితే దొరుకుతాయి ).
సృష్టి రహస్యాలు తెలుసు కుంటున్నప్పుడు , ఈ విశ్వం ఎంత విశాలమైనదో , ఎంత సంక్లిష్టమైనదో , ఎంత జటిలమైనదో , వివిధ అనుభవాల ద్వారా తెలుసు కుంటున్నప్పుడు కూడా మనం, జీవితాన్నీ , మన జీవితాన్నీ ప్రేమించడం అలవాటు చేసుకుంటాం ! జీవితం విలువ గ్రహిస్తూ !
ప్రేమ ను పొందడం , ప్రకృతి ని ఆరాధిస్తూ , ఆస్వాదిస్తూ , ఈ ప్రకృతి లో ఉన్న వివిధ జీవ జంతు జాలాల జీవన శైలి గమనిస్తూ , భూత దయ చూపిస్తూ ఉన్నప్పుడు కూడా జరగ వచ్చు !
ప్రేమను, కేవలం ఇవ్వడం ద్వారా కూడా పొంద వచ్చు : ఏమీ ఇతరులనుంచి కానీ , ఇతర వస్తువులనుంచి కానీ తీసుకోక పోయినా , ఆశించక పోయినా కూడా ! అంటే ప్రేమ స్వభావం ఎప్పుడూ భౌతిక లాభం కోసమే కాదు ! ఈ రకం గా ప్రేమ ఎప్పుడూ ఒక్క గుణమే కలిగి ఉండదు ! మన హృదయం స్పందింప చేసే ఏ సంఘటన , ఏ వ్యక్తులు , అయినా కూడా , మనలో ప్రేమ ను పొంగిస్తాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !