ప్రేమించడం ఎట్లా ? 4.
నిన్ను నీవు క్షమించుకో ! : వయసు పెరుగుతున్న కొద్దీ , మనసు కూడా పెరిగి , చాలామంది , ఆత్మ శోధన చేసుకుంటూ ఉంటారు ( రాజకీయ నాయకులు తప్ప ). ఇట్లా ఆత్మ శోధన చేసుకోవడం లో ఉద్దేశం , తాము చేసిన తప్పులు పొర పాట్లను , బేరీజు వేసుకుని , ముందు ముందు అట్లాంటి పొర పాట్లు కానీ , తప్పులు కానీ చేయకుండా జాగ్రత్త పడడానికి ! అంత వరకూ బాగానే ఉంది కానీ , ఆ చేసిన పొరపాట్లు మానవులను కృంగ దీయ కూడదు ! ఈ అనంత కాల చక్రం లో, మానవ జీవితం, లిప్త కాలమే ! అంటే ఎవరూ శాశ్వతం కాదు ! తప్పులు చేయడం , మనవల్ల తప్పులు జరుగుతూ ఉండడం కూడా సహజమే ! అవి పొరపాట్లు ఏవీ జరగక పోవడమంత సామాన్యం !
తెలిసి , తెలిసి చేసే తప్పులు క్షమించ రానివి ! అట్లాగే , కొన్ని తప్పులు తెలియకుండా కూడా జరుగుతుంటాయి ! ఈ తప్పు ఒప్పులు కూడా సాపేక్ష సూత్రాలను పాటిస్తాయి ! అంటే ఒకరికి ఒక విషయం తప్పు అనిపిస్తే , ఇంకొకరికి అది ఒప్పు అనిపిస్తుంది ! అంటే, కేవలం ఎవరికి వారు ఆ సందర్భం లో , ఆ సంఘటన ను అంచనా వేసుకుని ,తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచు కోవడం ! మరి మనల్ని , మనం కేవలం అంతా ఖచ్చితం గా తప్పులు లేకుండా జీవిస్తున్నప్పుడే , ప్రేమించు కుందామా ? అంటే అప్పుడు మనం ఆ విషయం లో తప్పు చేస్తున్నామనే చెప్పుకోవాలి ! ఇందుకు కారణాలు రెండు ! ఒకటి : ఈ భూగోళం లో తప్పులు చేయని మానవులు అంటూ ఎవరూ లేరు ! దేవుడిని నమ్మే వారుకూడా , దేవుడు కూడా చాలా రకాలు గా తప్పులు చేయడం వారి జీవితం లో ఏదో ఒక దశలో అనుభవ పూర్వకం గా తెలుసుకుంటారు ! రెండు : మీరు కనుక ఎదుటి వారెవరూ పర్ఫెక్ట్ కాదు అని ఒక అభిప్రాయం కనుక ఏర్పరుచుకుంటే , మరి ఆ అభిప్రాయానికి మీరు ఎందుకు మినహాయింపు కావాలి ? మీరు కూడా అదే ప్రమాణాన్ని పాటించాలి ! అంటే , ఇతరులలో అస్సలు తప్పే చేయని వారు లేరు అని అనుకుంటున్నప్పుడు , ఆ అభిప్రాయం మీకూ వర్తిస్తుంది ! మనం పొరపాట్లూ , తప్పులూ చేయకుండా , జ్ఞానం సముపార్జించ లేము కదా ! ముందుగా, మనం ఈ విషయాన్ని సరిగా అవగాహన చేసికొని , అంటే పొరపాట్లు, లోపాలూ , మానవ సహజం అనీ , అందుకు ఎవరూ మినహాయింపు కాదనే సత్యాన్ని అంగీకరిస్తే , అప్పుడు మనలో క్షమా గుణం చిగురిస్తుంది ! ఇతరులలో, మనకు గోచరించే తప్పులు , పొర పాట్లూ , కూడా క్షమార్హం అవుతాయి ! అంటే మనం ప్రేమించే వ్యక్తులు కూడా మన ప్రేమకు పాత్రు లవుతారు ! అంటే, మనం ప్రేమించే వారిలో మనం లోపాలు ఎత్తి చూపడం చేయం ! వారిలో మనకు అభినందనీయ గుణాలే గోచరిస్తాయి ! మనం ఇతరులను ప్రేమించ గలగడం లో ఒక ముఖ్య సూత్రం , మనల్ని మనం క్షమించుకోవడం , ఇతరుల లోపాలను క్షమించ గలగడం ! బాల రాజు కధ సినిమా లో , ఈ విషయాన్ని ముళ్ళ పూడి రమణ గారు చక్కగా చెప్పారు ఒక సూత్రం ‘ ఒక్క వేలు చూపి ఒరులను వెక్కిరింప , వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు ‘ అని !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !