చదువుకోవడం ఎట్లా ?. 15.పాఠ్య పుస్తకాలు ఎట్లా చదివితే ఎక్కువ ఉపయోగం ?
Archive for నవంబర్, 2013|Monthly archive page
చదువుకోవడం ఎట్లా ?. 15.పాఠ్య పుస్తకాలు ఎట్లా చదివితే, ఎక్కువ ఉపయోగం ?
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 30, 2013 at 10:27 ఉద.మునుపటి టపాలలో చదువుకు కావలసిన సరంజామా గురించీ , క్లాసు లో చెప్పే పాఠాల నోట్సు తీసుకునే పధ్ధతి గురించీ , తెలుసుకున్నాం కదా ! మనం తెలుసుకునే విషయాలన్నీ కూడా , మన లక్ష్యాన్ని అంటే బాగా చదువుకుని , మంచి ఫలితాలు పొందాలనే లక్ష్యాన్ని , చేరుకోవడానికి , ఎంతో సహాయ పడతాయి ! మంచి ఫలితాలు అంటే అవి కేవలం , పరీక్షలలో , మంచి మార్కులు రావడానికే పరిమితం అవకుండా , జీవితాలలో కూడా , చేసే ప్రతి పని లో నూ , ఒక పధ్ధతి ఏర్పడి , విజయం పొందే లా ఉంటాయి , ఆ ఫలితాలు ! ఇప్పుడు పాఠ్య పుస్తకాలు చదివే విధానం గురించి శాస్త్రీయం గా తెలుసుకుందాం ! చాలా మంది అనుభవజ్ఞులు తమ సంతానానికి , ‘ బాగా చదవాలి ‘ కష్ట పడి చదవాలి ‘ అనీ , పాఠ్య పుస్తకాలన్నీ , వల్లె వేయాలి , ‘ కంఠ తా పట్టాలి ‘ అని సాధారణ సలహాలు ఇస్తూ ఉంటారు ! అవన్నీ నిజమే , కానీ ఆ చదివే పద్ధతుల గురించి విద్యార్ధులకు తెలియ జేయరు ! దానితో , పాఠ్య పుస్తకాలను చూడగానే , విద్యార్ధులకు ఒక రకమైన గుబులు పుట్టుకుంటుంది ! ‘ ఇదంతా నేను చదవాలా ? ‘ అని ఆందోళన పడుతూ ఉంటారు !
ఈ క్రింది సూచనలు గమనించి , వాటిని అనుసరించడం అలవాటు చేసుకుంటే , పెద్ద పెద్ద పాఠ్య పుస్తకాలు చదివి ఆకళింపు చేసుకోవడం కూడా చాలా సులువు అవుతుంది !
ప్రధమ సూత్రం : S Q R 4 : ఈ అక్షరాలనూ , అంకె నూ , ‘ ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ‘ అని, అనేక సార్లు వల్లించి, అది మీ మనసులో నాటుకునేట్టు అంటే మీరు మీ జీవితం లో ఎప్పుడూ మర్చిపోకుండా , నేర్చుకోండి !
S అంటే సర్వే : ( survey ) : అంటే మీరు చదవ బోయే పాఠమైనా , మొదట గా చూడగానే కంగారు పడకుండా , ఆ పాఠాన్ని , మొదలు నుంచి , ముగింపు దాకా ఒక సర్వే చేయండి ! అంటే ఉదాహరణకు : ఒక పాఠం అయిదు పేజీలలో ఉంటే , మొదటి పేజీ లో ముందుగా ఆ పాఠం పరిచయం ఎట్లా చేశారు ? ఆ పాఠం దేని గురించి ? , అనే విషయం తెలుసుకోండి ! తరువాత ఆ పాఠం లో తెలుసుకోవలసిన విషయాలను ఏదైనా సైడ్ హెడింగ్స్ రూపం లో ఇచ్చారా? ఇస్తే , ఆ సైడ్ హెడింగ్స్ ఏమిటి ? అనే విషయం గమనించండి ! చివరగా , ఆ పాఠం చివర గా ఇచ్చిన సంగ్రహ వాక్యాలు అంటే సమ్మరీ కూడా చదవండి ! ఇట్లా సర్వే చేయడం వల్ల మీకు , ఆ పాఠం తో మీకు రచయిత ఏమి బోధించ దలుచుకున్నాడో అర్ధం అవుతుంది ! గుర్తు ఉంచుకోండి : మీరు ఈ సర్వే లో కేవలం ఆ పాఠం గురించి ఒక స్థూలమైన అంటే జెనరల్ అభిప్రాయం ఏర్పరుచు కుంటున్నారన్న మాట !
Q అంటే క్వశ్చన్ : లేదా ప్రశ్న : ఇది మీరు చదివే ఏ పాఠమైనా , తప్పని సరిగా ఉండవలసిన లక్షణాలలో ఇంకొకటి ! ఒక సారి మీరు చదివే పాఠాన్ని సర్వే చేశాక , మీరు ఆ పాఠాన్ని , అనేక రకాలు గా ప్రశ్నించాలి. అంటే , ఆ పాఠం , మిమ్మల్ని , రచయిత ఎందుకు నేర్చుకోమంటున్నాడు ? ఆ పాఠం లో ప్రధాన విషయం ఏమిటి ? అనే ప్రశ్నలన్నీ మీకై మీరు వేసుకోవాలి ! అంటే చదివే సమయం లో, ఈ ప్రశ్నలకు జవాబులు అన్నీ మీరు ఆ పాఠం లో వెదకాలి !
ఈ ప్రశలన్నీ కూడా తేలిక గా గుర్తు ఉంచుకోవడానికి what? where? why? how? when? who? ఈ ఆరు ప్రశ్నలనూ మీరు ప్రతి పాఠం నేర్చుకునే సమయం లో తప్పని సరిగా మీకై మీరే వేసుకుని , వాటి సమాధానాల కోసం ప్రయత్నించాలి ! మీరు ఆ సమాధానాలన్నింటినీ , రాబట్టుకున్నారంటే , మీరు మీ పాఠం , చాలా వరకు నేర్చుకున్నారనే చెప్ప వచ్చు ! విజ్ఞానం సంపాదించుకోవడానికి , లేదా చదువుకుని విద్యావంతులవడానికీ , ఈ ఆరు ప్రశ్నలూ , అతి ముఖ్యమైనవి ! మీరు ఏ సబ్జెక్ట్ చదువు దామనుకున్నా కూడా !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !
చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 29, 2013 at 5:50 సా.చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?
పోలికలు మంచిదే ! :
క్రితం టపాలో, నోట్సు ఎట్లా తీసుకోవాలనే విషయం చాలా వరకూ తెలుసుకున్నాం కదా ! విద్యార్ధులు, కేవలం వారి కోసమై నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నా , ఇంకొన్ని ముఖ్యమైన విషయాల మీద కూడా దృష్టి పెడితే , వారు రాసుకున్న నోట్సు తో అత్యధికం గా లాభం పొందుతారు ! ఆ విషయాల లో ఒకటి , తాము రాసిన నోట్సు ను , తోటి విద్యార్ధుల నోట్సు తో పోల్చుకోవడం. ఇట్లా చేయడం వల్ల అనేకమైన ఉపయోగాలున్నాయి ! సామాన్యం గా , ఒక విద్యార్ధి , కేవలం తను ఒక రోజో లేదా కొన్ని రోజులో , స్కూలు కు కానీ , కాలేజీ కి కానీ వెళ్లక పోవడం వల్లనే , ఇతర స్నేహితుల వద్దనుంచీ , తోటి విద్యార్ధుల నుంచీ ,నోట్సు తీసుకుంటారు ! కానీ ఈ అలవాటును ఒక క్రమ పధ్ధతి లో చేస్తే , అంటే , ప్రతి వారమూ , తోటి విద్యార్ధుల నుంచి నోట్సు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ! ఈ పధ్ధతి తో , తాము మిస్ అయిన ముఖ్యమైన విషయాలను ఇతర విద్యార్ధుల నోట్సు తో పోల్చుకుని , ఆ పాయింట్స్ కూడా తమ నోట్సు లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ! ముఖ్యం గా, తోటి విద్యార్ధులు ఆ పాఠాన్ని ఎట్లా అర్ధం చేసుకుంటున్నారు ? , తమ కన్నా భిన్నం గా ? అని ఒక అంచనా కూడా వేసుకోవచ్చు ! తమ నోట్సు ను ఆ రకం గా ఇంకా బాగా రాసుకోవడం చేయవచ్చు ! వారు పాఠాన్ని వినే సమయం లో ఇంకేవైనా విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలా లేదా అన్న విషయం కూడా వారికి బోధ పడుతుంది , ఇతర విద్యార్ధుల నోట్స్ తో వారి నోట్స్ ను పోల్చుకుంటే ! వారిలో స్నేహ భావం కూడా అలవడుతుంది ! పోటీ స్వభావం కూడా పెంపొందుతుంది ! ఈ పోటీ , కేవలం ఒక ఆరోగ్యదాయకమైన పోటీ గానే ఉండాలి కానీ , అసూయా ద్వేషాలకు అవకాశం ఇవ్వ కూడదు !
సమీక్షించడం ( రివ్యూ ) , మళ్ళీ మళ్ళీ రాసుకోవడం ! మెరుగులు దిద్దడం :
ఒక సారి, ప్రతి పాఠం చెప్పే సమయం లోనూ నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నాక , ఇంకో అతి ముఖ్యమైన విషయం కూడా విద్యార్ధులు ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి ! అది, నోట్సు రాసుకోవడం అనేది ఒక్క సారి చేశాక , మీ పని అయి పోయిందని , చేతులు దులుపు కో కూడదు ! అంటే ఒక సారి రాసిన నోట్సు , ఫైనల్ కాకూడదు ! ఇంటికి వచ్చాక , ఆ నోట్సు ను అనేక సార్లు సమీక్షించుకోవాలి ! అంటే , ఆ విషయం మీద, మీరు రాసుకున్న నోట్సు , సంపూర్ణం గా ఉందో లేదో , తరచి చూసుకుంటూ ఉండాలి ! ఇట్లా చూసుకోవడం, అనేక మార్లు చేయాలి , అవసరమైతే ! ఈ చర్యలో పైన ఉదహరించిన , ఇతర విద్యార్ధుల నోట్సు తో పోలికే కాక ,ఒక పాఠ్య పుస్తకం నుంచి కూడా రిఫర్ చేసి కొన్ని ముఖ్యమైన విషయాలను , నోట్సు లో రాసుకోవచ్చు ! అంతే కాక , మీరు రాసుకున్న విషయాలను ఒక పధ్ధతి లో ఆర్గనైజ్ చేసుకోవాలి మీరు మీ నోట్సు లో ! ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే , మీరు రాసుకున్న నోట్సు సులభం గా అర్ధం అవుతుంది ! కొన్ని సమయాలలో మీరు కొన్ని పటాలు కూడా చేర్చు కోవలసిన అవసరం ఉండ వచ్చు , మీ నోట్సు లో ! మీరు, మళ్ళీ ,మళ్ళీ, నోట్సు ను రివైజ్ చేసి, కుదించి , మెరుగులు దిద్దుతూ ఉండడం వల్ల , మీకు మీరు రాసుకున్న నోట్సు లో ఉన్న విషయాలు చాలా వరకు అర్ధం కావడమే కాక , మీరు ఎక్కువ కాలం గుర్తు ఉంచుకో గలుగుతారు కూడా ! ఇట్లా చేయడం అలవాటు చేసుకుంటే , విద్యార్ధులకు చిన్న తనం నుంచే , తాము ( పాఠం లో ) గ్రహిస్తున్న విషయాలను , తరచి చూసి , సునిశితం గా పరిశీలించే , పరిశీలనా జ్ఞానం కూడా పెంపొందుతుంది ! చదివే ఏ చదువు లక్ష్యం అయినా అదే కదా ! చివరగా , ఇట్లా మీరు శ్రమ పడి , అనేక రకాలు గా విషయాలను సేకరించి , రాసుకున్న నోట్సు ను జాగ్రత్తగా , ఒక ఫైల్ లో నో ఫోల్డర్ లోనో , బైండర్ లోనో పెట్టుకోండి !
నోట్సు తీసుకోవడం ఎప్పుడూ, ఒక పధ్ధతి గా ఎట్లా చేయాలో సులభం గా గుర్తుంచు కోవడానికి 5R లు అంటే అయిదు R లు : Record,Reduce, Recite, Reflect, and Review ఉపయోగ పడతాయి , విద్యార్ధి జీవితం లో !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
చదువుకోడం ఎట్లా? 13. నోట్స్ ఎట్లా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ?
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 28, 2013 at 2:06 సా.చదువుకోడం ఎట్లా? 13. నోట్స్ ఎట్లా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ?
నిన్నటి టపాలో నోట్స్ తీసుకోవడం ఎందుకో తెలుసుకున్నాం కదా ! మరి నోట్స్ ఎట్లా తీసుకోవాలి ?
కావలసినవి : చిన్న క్లాసులలో : రెండో మూడో పెన్నులూ లేదా పెన్సిళ్ళూ , ఇంకా రాసుకునేందుకు తెల్ల కాగితాల నోటు పుస్తకం ఇవి కనీస అవసరాలు ! పెద్ద క్లాసులు , లేదా కాలేజీ లో లెక్చర్లకు : కూడా పెన్నులూ , నోట్ పుస్తకాల తో పాటుగా , మీరు లెక్చర్ ను కనుక టేప్ చేసుకోవాలని అనుకుంటే అదోకటీ ! కానీ ముందుగా లెక్చరర్ అనుమతి తీసుకోవాలి ! దీనివల్ల ఉపయోగం : లెక్చర్ నోట్ చేసుకొనే సమయం లో ఏమైనా ముఖ్యమైన వివరాలు నోట్ చేసుకోలేక పోయినా , తరువాత టేప్ విని , వాటిని మననం చేసుకోవడం కానీ , లేదా మళ్ళీ నోట్స్ లో నోట్ చేసుకోవడం కానీ చేయవచ్చు ! ఏ క్లాసు లో ఉండి చదువుకుంటున్నా , ముఖ్యం గా కావలసినది , మీ కృత నిశ్చయమూ , మీ ఏకాగ్రతా , మీ ఓపికా కూడా ! ఇంకో ముఖ్య విషయం : క్లాసు లో చెప్పే పాఠం వినపడక పోయినా , లేదా అర్ధం కాక పోయినా , చాలా మంది విద్యార్ధులు వారి నోట్ పుస్తకం లో, బొమ్మలు గీస్తూ ( నేనూ చేశాను, కొన్ని క్లాసులలో ఇట్లా ! ) , లేదా అమ్మాయిలయితే , ముగ్గులు వేసుకుంటూ నో కాల యాపన చేస్తూ ఉంటారు ! కానీ అనుభవ పూర్వకం గా తెలుసుకున్నదేంటంటే , ఇది మంచి పధ్ధతి కాదు అని ! క్లాసు లో పాఠాన్ని వీలైనంత అర్ధం చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించాలి ! కొన్ని సమయాలలో పాఠం అర్ధం కాక పోయినా , ఆ పాఠం లో మనకు కనీసం , కొత్త పదాలు తెలుస్తాయి !
శ్రవణ కుమారులవ్వాలి, విద్యార్ధు లందరూ ! : అంటే మీరు చెప్పే మాటలను శ్రద్ధ గా వినడం అలవాటు చేసుకోవాలి ! ఒక తరగతి లో కానీ , లెక్చర్ హాలు లో కానీ , అనేక రకాలైన శబ్దాలు అవుతూ ఉంటాయి ! కొన్ని అనివార్యమూ , కొన్ని కావాలని చేసే శబ్దాలూ ! బోధించే వారి గొంతు నే ఏకాగ్రత తో వినడం అలవాటు చేసుకోవాలి ! మిగతా శబ్దాలను మీరు, మనసు తో ఫిల్టర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ! ఎందుకంటే , చెవులు సహజం గానే , వినబడే శబ్దాలనన్నిటినీ , రిసీవ్ చేసుకుంటాయి ! ఈ చర్య కు కేవలం మనం చెవులప్పగించి వినడమే ! కానీ ఏ శబ్దాలను పట్టించుకోవాలి ? ! అంటే , మనసుకు పట్టించుకోవాలి , వేటిని పట్టించుకోకూడదు ? అనే విషయాలను మనమే నిర్ణయించుకోవాలి ! అనేక రకాల అవరోధాలు ఉన్నా కూడా , ఏకాగ్రత తో కేవలం లెక్చరర్ చెప్పేదే , లేదా టీచర్ చెప్పేదే వినే అలవాటు చేసుకోవాలి ! అంతే కాకుండా , కేవలం బోధించేది విని , త్వర త్వర గా అంతా రాసుకోవడానికి తంటాలు పడనవసరం లేదు ! ఆ ప్రయత్నం లో , వినడం శ్రద్ధగా వినలేక పోవచ్చు ! కానీ శ్రద్ధ గా విని , అవసరమైన పదాలనే ,లేదా వాక్యాలనే రాసుకోవాలి ! ప్రతి సబ్జెక్ట్ లోనూ కొన్ని కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి , ప్రతి విషయం లోనూ ! ఆ పదాలను తప్పని సరిగా నోట్ చేసుకోవాలి !
మీదైన శైలి ని అభివృద్ధి చేసుకోండి ! ( అదరాలి మీ స్టైల్ ! ) : నోట్స్ తీసుకోవడం ఏ ఒక్కరి ఆస్థీ కాదు ! ఏ ఒక్కరి హక్కూ కాదు ! విద్యార్ధులు తరచు గా ‘ ఆ అమ్మాయి నోట్స్ బాగా రాస్తుంది ! అనో , లేదా , ఆ అబ్బాయి బాగా రాస్తాడు ‘ అనో ఇతర విద్యార్ధులను అభినందించే పని లోనే ఉంటారు , కానీ వారంతట వారే ఆ పని చేయరు ! అది చాలా పొరపాటు ! విద్యార్ధులంతా కూడా చక్కటి నోట్స్ రాయ గలరు ! ఎందుకంటే ప్రతి ఒక్కరి కీ రెండు చక్కగా పని చేసే చెవులూ , చక్కగా రాయగలిగే ఒక చేయీ ఉన్నాయి కనుక ! వాటికి మీ మనసు ను తోడు చేస్తే, మంచి నోట్స్ మీదే ! కొన్ని సూచనలు : నోట్స్ లో టీచర్ చెప్పే ప్రతి విషయాన్నీ రాసుకోవాలనే ప్రయత్నం చేయకండి , ఇది చాలా శ్రమ తో కూడినదే కాక , మీ ఏకాగ్రతను కూడా పరీక్షిస్తుంది ! 2. మీ కోసమే , మీరు సంక్షిప్త పదాలను లేదా అక్షరాలను రాసుకోండి ! అంటే భారత దేశం అని బోధిస్తూ ఉంటే , Ind అని నోట్ చేసుకోవచ్చు ! అట్లాగే, విద్యార్ధులు అని బోధిస్తూ ఉంటే , stu. అని నోట్ చేసుకుని గుర్తుంచుకోండి ! ఈ రకం గా చేస్తే , మీరు విషయాలు అన్నీ నోట్ చేసుకోగలుగు తారు ! ఉన్న సమయం లో ! తక్కువ శ్రమ తో ! కానీ ఈ సంక్షిప్త పదాలు , ఇంటికి వచ్చాక, మీకు ఆ పదం పూర్తిగా గుర్తు వచ్చేయాలి ! ఇంకొన్ని ఉదాహరణలు : mathematics ను maths అనీ , chemistry ని chem అనీ , relative density అని ఉంటే re.d అనీ రాసుకోవచ్చు కదా ! ఈ రకం గా, పెద్ద పెద్ద వాక్యాలకు షార్ట్ ఫాం లు మీరే ఏర్పరుచుకుని , నోట్స్ తీసుకునే సమయం లో వాటిని వాడితే , కాస్త మెదడు కు మేత లా ఉంటుంది ! అంతే కాకుండా , మీరు బోధించే విషయాలన్నీ కూడా గ్రహించ డానికి అవకాశం హెచ్చుతుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
చదువుకోవడం ఎట్లా ? 12. నోట్స్ ఎందుకు రాసుకోవాలి ?
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 26, 2013 at 8:01 సా.చదువుకోవడం ఎట్లా ? 10. నోట్స్ ఎందుకు రాసుకోవాలి ?
మునుపటి టపాలలో , మనం చదువుకోవడానికి , కావలసిన ప్రధాన సరంజామా ఏమేమి ఉండాలో , ఎట్లా ఉండాలో కూడా తెలుసుకున్నాం కదా ! ఈ సరంజామాలో ప్రధానమైనది, ఏకాగ్రతత ! అంటే, మనకున్న మెదడును పూర్తి గా అప్రమత్తత తో ఉంచి , చదివే విషయాల మీదే ఏకాగ్రత అంటే ఫోకస్ చేసి అంటే పూర్తిగా కేంద్రీకరించి , వాటిని అర్ధం చేసుకోవడమూ , అర్ధం చేసుకున్న విషయాలను మన మెదడు బ్యాంకు లో అంటే, మన మెమరీ స్టోర్ లో జాగ్రత్త గా పెట్టుకోవడమూ ! ఇంత వరకూ బాగానే ఉంది ! మరి చదివిన విషయాలనూ , లేదా క్లాసు లో కానీ , కాలేజీ లో, లెక్చర్ హాల్ లో కానీ , తెలుసుకున్న విషయాలు వెంటనే మెమరీ స్టోర్ , అదే మన మెదడు బ్యాంకు లో వేసుకోవడం కాస్త కష్టమైన పనే కదా ! మరి అప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి ?: ఆ సమయం లోనే మనకు ఆపత్బంధువు లా పనికి వచ్చేది, మనం రాసుకునే నోట్స్ ! మరి ఈ నోట్సు , కధా కమామీషు తెలుసుకుందాం !
నోట్స్ ఎందుకు రాసుకోవాలి ? : భాష, మానవ సంస్కృతి కి ఎట్లా జీవనాడి గా పరిగణించ బడుతుందో , రాత ( లేదా వ్రాత ) కూడా మానవుల మేధ ను కాగితం మీద కనబడేట్టు చేసే ఒక ఉత్తమ సాధనం ! మనం, ఒక తెల్ల కాగితం మీద ఒక పెన్నుతో కానీ , పెన్సిల్ తో కానీ ఎడా పెడా , ఒక చివర నుంచి ఇంకో చివరకు కొన్ని గీతలు గీసి , ఆ గీతలను, ఎవరికైనా చూపించి , వాటి భావం తెలియ చేయమంటే , పెద్దగా తడుము కోకుండా , ‘ ఇవేవో పిచ్చి గీతల్లా ఉన్నాయని ‘ చెప్పేస్తారు ! అదే, ఇంకో తెల్ల కాగితం మీద చక్కని దస్తూరీ తో అంటే చేతి రాత తో ముత్యాల్లాంటి అక్షరాలలో , ఒక మనసుకు హత్తుకునే వాక్యం కానీ , సూక్తి కానీ , లేదా కధ కానీ రాస్తే ,చూసిన వారు వెంటనే , చదివినది అర్ధం చేసుకుని , అది రాసిన వారి భావం తెలుసుకోగలరు ! అంటే కేవలం వారి చేతి రాత తో , ఎదుటి వారి భావాలను స్పష్టం గా తెలుసుకో గలుగుతున్నారన్న మాట ! పరీక్ష ల లో రాసే పేపర్ లో కూడా , విద్యార్ధి చదివిన విషయాలను సమాధానాల రూపం లో తెలుసుకుని , వాటి విలువ ను లెక్క కట్టేది , కేవలం విద్యార్ధి రాసే రాత చూసే కదా ! మీరు నోట్స్ తీసుకున్తున్నారంటే , ఆ నోట్స్ మీకు ఆ పాఠం ఎంతవరకూ అర్ధమయిందో తెలిపే రికార్డు ! అంతా తెలిస్తే నోట్స్ బాగా ఉంటుంది ! కొంతే తెలుస్తే , మీకు అది కూడా రికార్డు గా ఉంటుంది , తరువాత , తెలుసుకోవలసినది తెలుసుకోవడానికి !
మరి నోట్స్ తీసుకోవడం లో జరిగే లాభం ఏమిటి ? : ఒక సారి , మీరు నోట్స్ తప్పని సరిగా తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటే ! అనేక చర్యలు, అంటే మీరు చదువుకోడానికి , చదువుకున్నదీ , తెలుసుకున్నదీ , అర్ధం అవడానికీ , అర్ధమయింది , మెదడులో ముద్ర వేయడానికీ , ఉపయోగ పడతాయి ! అది ఎట్లాగో చూద్దాము !
పాఠం వింటున్నప్పుడు , మీరు కనుక ఒక నోట్ బుక్ , పెన్నూ , చేతిలో పెట్టుకుని సిద్ధం గా ఉంటే , మీరు మొట్ట మొదటగా వినేది , ఆ రోజు పాఠం గురించి ! అది మీరు నోట్ చేసుకుంటారు , ఆ రోజు డేట్ రాసుకుని , టీచర్ పేరు , లేదా లెక్చరర్ పేరూ , పాఠం పేరూ , మీరు రాసుకుంటారు ! మీరు రాసుకోలేక పొతే ,మీరు వినలేక పోవడం , లేదా , ఏకాగ్రత చూపక పోవడం , లేదా ఆ రెండూ చేసినా , నిర్లక్ష్యం తో రాసుకోక పోవడం ! అంటే నోట్ చేసుకోక పోవడం ! జరుగుతాయి ! అంటే , మీరు రాసే నోట్స్ , మీరు ఎంత అప్రమత్తం గా మీ పాఠాలు వింటున్నారో , తెలియ చేసే , సాధనం అన్న మాట ! అట్లాగే , పాఠం లో సామాన్యం గా ఉండే , ముందు మాట అంటే ఇంట్రడక్షన్ , ఇంకా అసలు పాఠం , కొన్ని ఉదాహరణలూ , ముగింపూ ఇవన్నీ కూడా , మీరు మీ మనసు లగ్నం చేసి , ఏకాగ్రత లో పాఠం వినక పొతే , నోట్ చేసుకోలేరు ! కానీ ఏకాగ్రత తో పాఠం మీద ఫోకస్ చేసి విన్నట్టయితే , ఒక క్రమ పధ్ధతి లో నోట్ చేసుకోగలరు ! ఆ చర్య తో , ఆ పాఠం , మీ మెదడు లో ‘ నానుతుంది ‘ కొన్ని అర్ధం కాని పదాలున్నా కూడా , వాటిని కూడా మీరు నోట్ చేసుకుంటే , తరువాత , వాటి గురించి తెలుసుకోవడానికి , మీకు అవకాశం ఉంటుంది ! ఇంకో ముఖ్య విషయం , మీకు పాఠం చెప్పే టీచర్ కానీ లెక్చరర్ కానీ , ఏ ఏ విషయాలమీద ఎక్కువ దృష్టి పెట్టి మీకు ,బోధిస్తున్నారో , కూడా , మీరు తెలుసుకోవచ్చు ! అంటే , వారు, పాఠ్య పుస్తకాలను ‘ జల్లెడ ‘ పట్టి పాఠాన్ని మీకు సంగ్రహం గా బోధిస్తున్నారు కదా , మీరు ఆ అధ్యాయం అంతా , టెక్స్ట్ బుక్ లో, పొల్లు పోకుండా చదివి , మీ విలువైన సమయాన్ని వృధా చేసుకో నవసరం ఉండదు ! కేవలం పాఠం లో చెప్పిన వాటినే , టెక్స్ట్ బుక్ లో వెదికి , ఆ విషయాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేయ వచ్చు ! అంటే తక్కువ సమయం లో ఎక్కువ లాభం మీకు, ప్రతి పాఠానికీ తప్పని సరిగా నోట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే ! నోట్స్ తీసుకుంటే ఇంకో ఉపయోగం కూడా ఉంది ! పరీక్ష రోజులకు ముందు కూడా మనకు ఉండేది ఇరవై నాలుగు గంటలే కదా ! ఆ రోజుల్లో కూడా మనం నిద్ర కూడా పోవలసినదే కదా, రాత్రి అవుతే ! మరి సంవత్సరమంతా చదివిన పాఠాలు పెద్ద పాఠ్య పుస్తకాలన్నీ , అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ , పరీక్షల ముందు రోజుల్లో మళ్ళీ రివైజ్ చేయడం అంటే పునశ్చరణం చేయడం అయ్యే పనేనా ! ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానానికి మనకు కొన్ని క్షణాలే కదా పట్టేది ! మరి ఆ పరీక్షా సమయాలలోనే , మీరు రాసుకున్న నోట్స్ , మహా విష్ణువు రూపం లో వచ్చి , ఉపయోగ పడి , ‘ పరీక్షా మోక్షం ‘ కలిగిస్తాయి ! లేక పొతే , విద్యార్ధి గజేంద్రు లను , పరీక్షా మొసళ్ళు పట్టి , ‘ సప్లిమెంటరీ సముద్రం ‘ లోకి లాగుతూ ఉంటాయి !
ఇక వచ్చే టపాలో నోట్స్ ఎట్లా తీసుకోవాలో తెలుసుకుందాం !
చదువు కోవడం ఎట్లా ? 11. సమయ పాలన లో మిగతా విషయాలు !
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 24, 2013 at 10:56 ఉద.చదువు కోవడం ఎట్లా ? 11. సమయ పాలన లో మిగతా విషయాలు !
చదువుకునేందుకు చోటు ఎట్లా ఉండాలి ?
సామాన్యం గా విద్యార్ధులు, తమ తోటి విద్యార్ధులతో , కేవలం చదువు మాత్రం తప్ప , మిగతా విషయాలన్నీ మాట్లాడడమూ , అంటే క్యాంటీన్ లో గప్పా లు కొట్టడమూ , సినిమాలో సరదా గా ఎంజాయ్ చేయడమూ , రోడ్ల మీద నడిచి కానీ వివిధ రకాలైన వాహనాలలో కానీ, తిరగడమూ చేస్తారు ! అవన్నీ , విద్యార్ధి దశలో సామాన్యమైనవే ! కానీ చదువు విషయానికొస్తే , తమ చదువు తాము , ఏకాంతం గా చదువుకోవడం చేస్తారు ! కొంత వరకూ , తమ అసలు ‘ సరుకు ‘ ఎక్కడ బయట పడుతుందో అని అనుకుంటూ ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది ! ఆ ‘ సరుకు ‘ వారు బాగా చదువుతున్న వారవుతే , విలువైనది గానూ , చదువు అశ్రద్ధ చేసే వారైతే , విలువ ఎక్కువ లేనిది గానూ ఉంటుంది ! కొంత మంది విద్యార్ధులు , తాము బాగా చదువుతున్నామని ఇతర విద్యార్ధులకు తెలిస్తే , వారు గేలి చేస్తారనీ , ఆట పట్టిస్తారనీ , చదువు విషయం ఏమీ బయటకు చెప్పుకోరు ! కొందరు విద్యార్ధులు ఇతర విద్యార్ధులకు ఎక్కువ విషయాలు తెలియక పొతే , లేదా వారు కొన్ని సబ్జెక్ట్ లు కష్టం గా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే ,తమకు , ఆ సబ్జెక్ట్ బాగా బోధ పడుతున్నా కూడా , ఆ సంగతి తెలియ చేయకుండా , మిగతా వారితో వంత పాడతారు ! తమకూ ఆ సబ్జెక్ట్ కష్టం గా ఉన్నట్టు ! కానీ పరీక్షలో అత్యధికం గా మార్కులు సంపాదించు కుంటూ ఉంటారు !
మరి చదువుకునేందుకు చోటు ఎట్లా ఉండాలి ? విద్యార్ధుల మనస్తత్వాలు, ఎవరివి , ఎట్లా ఉన్నా కూడా , కనీసం ముగ్గురు కానీ అంత కన్నా ఎక్కువ మంది కానీ , కలిసి చదువుకోవడం ఉత్తమం ! మరీ ఎక్కువ మంది అయితే , ప్రయోజనం ఉండదు ! అది ఒక క్లాస్ రూం లా తయారవుతుంది ! ప్రత్యేకించి, ఏకాంతం గా చదివే విద్యార్ధులు కూడా , ఇట్లా స్కూల్ లోనూ , కాలేజీ లోనూ చేరిన వెంటనే , ఇట్లా తమ కు నచ్చిన వారితో ఒక గ్రూప్ ను ఏర్పరుచుకోవడం మంచిది ! ఇంటి దగ్గరే ఉంటున్న వారూ , హాస్టల్ లో ఉంటున్న వారూ , లేదా కాలేజీ లో కలిసే వారూ,ఇట్లా ఎవరి వీలు ను బట్టి వారు, గ్రూప్ ను ఏర్పరుచుకోవాలి !
గ్రూప్ వల్ల ప్రయోజనాలు ఏమిటి ? : ఒక స్థిరమైన, ఉత్సాహ భరితమైన , ప్రేరణా పూరితమైన , చదువు వాతావరణం ఏర్పడుతుంది ! పోటీ తత్వం పెరుగుతుంది ! ఇతర విద్యార్ధులు ఓపెన్ గా అన్ని విషయాలూ చర్చించు కుంటూ ఉంటే , ఆత్మ విశ్వాసం పెరుగుతుంది ! ముఖ్యం గా చదవాలనీ , బాగా మార్కులు తెచ్చుకోవాలనీ కూడా పట్టుదల పెరుగుతుంది ! మంచి స్నేహితులు గా మారే అవకాశం ఉంది ! వారి మనస్తత్వాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జీవిత గమనం లో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ! అంటే ఒకే దేశం లో పని చేయడమో , లేదా ఒకే సంస్థ లో పనిచేయడమో కూడా జరగవచ్చు , చాలా సందర్భాలలో ! ఆత్మ న్యూనతా భావం తగ్గి పోతుంది ! డిప్రెషన్ కు అవకాశాలు తగ్గుతాయి ! వారికి తెలియ కుండానే , ఇతర స్నేహితులను గౌరవించడం , వారి అవసరాలకు కూడా ప్రాధాన్యత నివ్వడం , అలవాటు అవుతాయి ! ఈ గుణాలు , ముందు ముందు , వారు చదివే పై చదువుల్లోనూ , లేదా చేయ బోయే ఉద్యోగాల్లో నూ ఎంత గానో ఉపయోగ పడతాయి ! ఇట్లా , ఎన్నో లాభాలున్నాయి , కలిసి చదువుకుంటే !
కలిసి చదువుకుంటే, కలిగే చెడు ప్రభావాలు ఏమిటి ? : చాలా సమయాలలో , ఆ గ్రూప్ లో ఉన్న ఒక్కరైనా స్మోకింగ్ అలవాటు చేసుకుంటే , ఆ ప్రభావం మిగతా విద్యార్ధుల మీద పడుతుంది ! ఒకటి : వారు తమ సహ విద్యార్ధులు స్మోకింగ్ చేస్తుంటే , తాము చెయ్యట్లేదు , ఆ గ్రూప్ లోనుంచి వెలి వేస్తారనే భయం తో , మానసిక వత్తిడి తో , వారూ స్మోకింగ్ మొదలు పెట్టే ప్రమాదం ఉంది ! ఒక వేళ , మొదలు పెట్టక పోయనా , గ్రూప్ లో ఉన్న ఇతర విద్యార్ధులు స్మోకింగ్ చేస్తుంటే , ఆ స్మోక్ తమకు సోకి , వారూ వివిధ రోగాలూ , క్యాన్సర్ ల బారిన పడే ప్రమాదం ఉంది ( దీనిని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు , ఇది శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! ) ఇట్లా గే మిగతా చెడు అలవాట్లు కూడా ! ఈ అలవాట్లు లేని విద్యార్ధులు , మొదటి దశాలలోనే అప్రమత్తమవాలి ! జాగ్రత్త గా, ఈ అలవాట్లు లేని వారితోనే , జత కట్టాలి ! గమనించ వలసినది , మీరు కేవలం , ‘ ఆ అలవాట్లను ‘ మాత్రమే , అసహ్యించు కుంటున్నారు ! ఆ అలవాట్లున్న మీ స్నేహితులను కాదు ! ఇక ఇట్లా జత కట్టిన వారు, చదువుకోవలసిన చోట్లు అనేకం అవ్వచ్చు ! స్కూల్ లైబ్రరీ , కాలేజీ లైబ్రరీ , లేదా ఒక మాదిరి గా బిజీ గా ఉన్న కాఫీ హోటల్ , లేదా క్యాంటీన్ , ఇట్లా ఏ స్థలమైనా పవిత్రమవుతుంది , ఏకాగ్రత తో మీరు అక్కడ చదువు కొన సాగిస్తే ! ఒక్కో చోటు, మీ స్మృతి పధం లో శాశ్వతం గా , మీ జీవితాంతం ఉండి పోతుంది , మీరు ప్రయోజకులయ్యాక !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
( మీకు తెలుసా? ఈ టపా మీకు నచ్చితే , ప్రింట్ చేసుకోవచ్చు ! నచ్చక పొతే ,తెలియ చేయ వచ్చు ! ఈ టపా మీద, ‘మీ ప్రత్యేకమైన ముద్ర ‘ వేయండి ! మీ స్పందన తెలియ చేయండి ! మన తెలుగు లో కానీ , ఆంగ్లం లో కానీ ! )
చదువు కోవడం ఎట్లా ? 10. సమయ పాలన. ( టైం మేనేజ్ మెంట్ ).
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 23, 2013 at 11:59 ఉద.చదువు కోవడం ఎట్లా ? 10. సమయ పాలన. ( టైం మేనేజ్ మెంట్ ).
మునుపటి టపాలో, సరైన సమయం లో ఆప్రమత్తమై , తీసుకునే నిర్ణయాలు , ఎంత మేలు కలిగిస్తాయో ( మూడు చేపల కధ ద్వారా ) తెలుసుకున్నాం కదా ! భారతీయులలో చాలా మందికి , కర్మ సిద్ధాంతం బాగా వంట బట్టి ఉంటుంది ! కానీ చాలా మంది, ఈ కర్మ సిద్ధాంతాన్ని వక్రీకరించి , ‘ ఎప్పుడు ఏది జరగాలని ఉంటే , అది జరుగుతుంది ‘ అది మన చేతుల్లో ఏమీ లేదు ‘ అని భాష్యం చెప్పడమే , మనం వింటూంటాం కానీ ‘ అసలు కర్మ సిద్ధాంతం ‘ నీవు చేయ వలసిన కర్మలను త్రికరణ శుద్ధి గా చేయి ! ఫలితం నీ చేతులలో లేదు ! అనే కదా ! కానీ విద్యార్ధుల విషయం లో కొస్తే , చాలా మంది విద్యార్ధులు , పరీక్షల కోసం వారు చేయ వలసినది చేయకుండా , కేవలం మంచి ఫలితాలు మాత్రమే రావాలని కోరుకుంటారు ! ఇట్లా ఆలోచించడం ఎంత వరకు సమంజసం ? ఈ ఆలోచనా ధోరణి తో కేవలం , బాధనూ , కష్టాలనూ కొని తెచ్చుకోవడమే అవుతుంది ! అందుకే , ప్రతి విద్యార్ధీ , తమ కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చి పోకూడదు !
ఇప్పుడు సమయ పాలన లో మిగతా విషయాలు తెలుసుకుందాం !
1. మొదట ఎంత సమయం , ఏ సబ్జెక్ట్ కు వినియోగించాలి అనే విషయం నిర్ణయించు కున్నాక , ఆ విషయాలు విపులం గా ఒకే చోట మీకు గుర్తు గా ఉండే చోట నోట్ చేసుకోండి. ఉదాహరణకు , మంగళ వారం సాయింత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సైన్సు చదవాలని నిర్ణయించు కుంటే ఆ రోజుకూ ఆ సమయానికీ మీరు బద్ధులై ఉండాలి. అంటే ఎట్టి పరిస్థితి లోనూ ఆ నిర్ణయించిన సమయం లో వేరే పనులు ఏవీ చేయకుండా , కేవలం సైన్సు చదవడం కోసమే ఉపయోగించాలి. ఇట్లా మీరు , బాగా ఆలోచించి వేసుకున్న టైం టేబుల్ ను సాధ్యమైనంత వరకూ , పూర్తి గా ఆచరించడం అలవాటు చేసుకోవాలి ! ఒక సారి మీరు ఈ పధ్ధతి కి అలవాటు పడితే , మీరే గమనిస్తారు , మీకు చదవడం ఎంత సులువు అవుతుందో !
2. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి ?: పైన చెప్పిన విధం గా మీరు ఒక ‘ గాడి ‘ లో పడ్డాక , అంటే ఒక నిర్ణీత మైన చదువు సమయాలకు అలవాటు పడ్డాక , ఏ సబ్జెక్ట్ లకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాలి ! ఆ విషయం , మీకే బాగా తెలుస్తుంది ! అంటే అది ఒకరు చెప్పేది కాదు , మీకు ఏ సబ్జెక్ట్ లు తేలిక గా ఉన్నాయో , వాటికి తక్కువ సమయమూ , ఏవి కష్టమని పిస్తున్నాయో , వాటికి ఎక్కువ సమయమూ కేటాయించడం చేయాలి !
3. స్కూల్ లోనూ , కాలేజీలో నూ ఉండే వివిధ వ్యాపకాలకు సిద్ధ పడండి ! : స్కూల్ జీవితమూ , విద్యార్ధి దశా , ప్రతి ఒక్కరి జీవితం లో నూ మధురానుభూతులు ! ఆ సమయం లో అనేక కార్య క్రమాలు , ప్రతి విద్యార్ధి కీ ఆనంద దాయకం గానూ , మరచి పోలేనివి గానూ ఉంటాయి ! కానీ ప్రతి విద్యార్ధీ ఎప్పుడూ గుర్తు ఉంచుకోవలసిన విషయం , వారి చదువు , వారి చదువును ఒక ప్రధాన విషయం గా భావించాలి ! మిగతా వ్యాపకాలన్నీ కూడా తరువాతే ! పైన చెప్పిన విధం గా, ఒక చదువు పధకానికి అలవాటు పడ్డాక , ఒక వారం ఆ పధ్ధతి లో చదివాక , కొంత సమయాన్ని , అందుకు , అంటే వారమంతా చదువుకున్నందుకు ప్రతి ఫలం గా , మీ కు ఇష్టమైన వ్యాపకం లో మీరు రిలాక్స్ అవ్వ వచ్చు ! అంటే, మీరు ఒక వారం చదివాక , మీకు తోచిన విధం గా విశ్రమిస్తున్నారన్న మాట. అది అనేక రకాలు గా ఉండవచ్చు ! ఆడుకోవడమో , లేదా , స్నేహితులతో ఒక సినిమా కు వెళ్లడమో , లేదా ఒక కొత్త ప్రదేశాన్ని చూడడమో , లాంటివి ! ఇవి కేవలం మీ ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉంటాయి ! గమనించ వలసినది , మీరు ఇట్లా చేస్తూ , మీ చదువును కేంద్ర బిందువు గా నిర్ణయించి , మిగతా విషయాలు ఆ పరిధిలో , చదువు చుట్టూ ‘ తిరిగేట్టు ‘ నిర్ణయించు కుంటున్నారు ! చాలా మంది విద్యార్ధులు , వివిధ వ్యాపకాలను కేంద్ర బిందువు గా చేసికొని , చదువును కేవలం ఆ వ్యాపకాల పరిధిలో ఉండేట్టు నిర్ణయించు కుంటారు ! ఇట్లా చేయడం తో, చదువు ఎప్పుడూ , వారికి దూరం గా ‘ పరిభ్రమిస్తూ ఉంటుంది ‘ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
చదవడం ఎట్లా ? 9. సమయ పాలన ! ( టైం మేనేజ్ మెంట్ )
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 22, 2013 at 8:27 సా.చదవడం ఎట్లా ? 9. సమయ పాలన ! ( టైం మేనేజ్ మెంట్ )
క్రితం టపాలో చదువుకోవడానికి టైం చార్ట్ లు వేసుకోవడం, విద్యార్ధికి ఎంత ఉపయోగ కరం గా ఉంటుందో తెలుసుకున్నాం కదా ! ఈ టైం చార్ట్ వేసుకోవడం , బాల బాలికల బాల్యం నుంచీ , నేర్పించాలి తప్పని సరిగా , వారి తల్లి దండ్రులు , కేవలం పరీక్ష ల ముందు రోజుల్లో కాక ! అట్లా చేస్తే , కేవలం చదువు కే కాక , బాల బాలికలు , వారి జీవితం లో చేయ బోయే ప్రతి పనినీ ఆలోచించి, తదనుగుణం గా ఒక ప్లాన్ లేదా పధకం వేసుకుని , దానిని ఆచరించడానికి అలవాటు పడతారు ! అంటే , వారు మూడు చేపల కధ లో దీర్ఘ దర్శులవుతారు ! ( మూడు చేపల కధ తెలియని వారికి : ఒక చెరువులో ఒక మూడు చేపలు చాలా స్నేహం గా ఉంటాయి ! ఆడుతూ పాడుతూ హాయిగా కాలం గడుపుతూ ఉంటాయి ! ఆ ఏడాది వానలు పడలేదు ! చెరువు ఎండడం మొదలు పెట్టింది ! ఆ మూడు చేపలలో ఒక చేప దీర్ఘ దర్శి , మిగతా చేపలతో ‘ మనం ఇంత కాలం సఖ్యత తో ఆడుతూ పాడుతూ , ఈ చెరువులో ఆనందం గా గడుపుతున్నాం , మీరు గమనించారో లేదో , ఈ ఏడాది , వానలు సరిగా పడక పోగా, ఎండలు కూడా మండి పోతున్నాయ్ ! తిండి లేక ఎక్కువ మంది బెస్త వారు మన చెరువు కే వస్తున్నారు మనల్ని పట్టుకోవడానికి , తేలిక గా దొరుకుతామని ! ఈ పరిస్థితి విషమించే లోగా మనం, ఇంకో లోతైన చెరువు కు మనమంతా ఇప్పుడే వెళ్ళక పొతే , మన మనుగడ కష్టం ‘ అని ప్రబోధం చేసింది ! మిగతా రెండు చేపలూ అందుకు ఒప్పుకోలేదు ! రెండో చేప ‘ ప్రాప్త కాలజ్ఞుడు ‘ , ‘ ఆ పరిస్థితి వస్తే అప్పుడు చూసుకుందాం లే ‘ ! అని ధీమా చూపింది ! ఇక మూడో చేప, ‘ హ్రస్వ దృష్టి ‘ ‘ నీవు చెప్పేది నాకు నమ్మ దగ్గది గా అనిపించట్లేదు ‘ ! అని ఇంకా ధీమా గా, ఒక్క ఎగురు ఎగిరింది ఆ చేరువులోనే ! దీర్ఘ దర్శి , మిగతా చేపలతో ఇక పెట్టుకోకుండా , పక్క చెరువులోకి చేరుకుంది ! కొన్ని రోజులయ్యాక , బెస్త వారు ఆ చెరువు మీద వలలతో దండెత్తారు ! మొదట, నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసిన ‘ ప్రాప్త కాలజ్ఞుడు ‘ , చెరువులో అలల మీద బెస్త వారి వలలు చేసే సందడి కి అప్రమత్తమై , వలలో చిక్కుకోక ముందే , వల నుంచి చెంగున , ప్రక్కన ఉన్న చెరువు లో దూకింది ! ఇక చెరువులో వేసవి ఎండలకు , చెరువు అడుగుకు చేరుకొని , ఆద మరచి, సేద తీరుతున్న ఉన్న హ్రస్వ దృష్టి , అప్పనం గా వలలో ఊయల ఊగుతూ , బెస్తవారి కి, ఆ పూటకు ఆహారం అయింది ! ) చిన్న కధే అయినా , సమయ పాలన ప్రాముఖ్యత ను చక్కగా వివరిస్తుంది కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
చదువుకోవడం ఎట్లా ? 8. చదువుకు పధకమేమిటి ? ( ఐదు వందలవ టపా ! )
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 21, 2013 at 7:06 సా.చదువుకోవడం ఎట్లా ?8. చదువుకు పధకమేమిటి ?
టైం చార్ట్ వేసుకోవడం :
ముందుగా , ఒక వారం రోజుల కోసం, మీ రోజు వారీ కార్యక్రమాలను రాసుకోండి ! ఉదాహరణ కు : సోమ వారం , ఉదయం 6 గంటలకు లేవడం , ఒక గంట చదువుకోవడం , స్నానాదికాలు ముగించుకోవడం , ఫల హారం ( బ్రేక్ ఫాస్ట్ ) చేయడం , స్కూలు కు బయలు దేరడం నాలుగు గంటలకు ఇంటికి బయలు దేరడం 5.30 సాయింత్రానికి, ఇంటికి చేరుకొని , 7 గంటల వరకూ ఆడుకుని , ఏడున్నర కు భోజనం చేసి తొమ్మిదిన్నర వరకూ చదువుకోవడం ! పదింటికి పడుకోవడం ! స్కూల్ కు వెళ్ళే రోజుల్లో ఇంచు మించుగా ఇట్లాగే ఉంటుంది కదా, రోజు వారీ కార్యక్రమం ! ప్రతి రోజూ , ప్రతి పనికీ పట్టే సమయం ఎంత అవుతుందో , ఏ టైం నుంచి ఏ టైం వరకూ ఆ పని చేస్తున్నారో కూడా ఒక నోట్ బుక్ లో ( అతి చౌక అయిన డైరీ కదా ! ) తేదీ లవారీ గా రాసుకోవడం చేయాలి ! ఇక శలవు దినాల్లో , కుటుంబ సభ్యులతో , గడపడం , బయటకు వెళ్ళడం , లాంటివి చేర్చ వచ్చు ! ఒక వారం రోజులు ఇట్లా చేసి , తీరిక గా పరిశీలించు కుంటే , ఏ ఏ పనులకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో స్పష్ట పడుతుంది ! మనకు కావలసినది ఏమిటి ? ఇట్లా పరిశీలించిన డైరీ లో ఎన్ని గంటలు , వారానికి , ఇంటి దగ్గర చదువు కోవడానికి కేటాయిస్తున్నారో తెలుస్తుంది ! అంటే , మీ చదువు అవసరాలకు , ఈ సమయం సరిపోతుందో లేదో మీకు తెలుస్తుంది ! ఇప్పుడు మీరు రోజూ ఎన్ని గంటలు , చదువు కు ఉపయోగించాలో నిర్ణయించుకోవాలి ! అంటే , సోమ వారం రెండు గంటలు అవుతే , మంగళ వారం మూడు గంటలు , బుధ వారం ఒక గంట , గురు వారం మూడు గంటలూ , ఇట్లా , ఒక క్రమ పధ్ధతి లో చదువుకు కేటాయించాలి. గమనించ వలసినది , ఈ గంటలు , సామాన్యం గా స్కూల్ లో చదివే సమయం కాకుండా !
ఇప్పుడు మీ చదువు లక్ష్యాలు నిర్ణయించు కోండి : ఒక సారి మీరు , రోజూ , ఇంటి దగ్గర , కొన్ని గంటలు చదవాలని అనుకున్నాక , వారం మొదటి రోజున , మీ చదువు లక్ష్యాలు నిర్ణయించుకోండి . ఈ లక్ష్యాలు అనేక రకాలు గా ఉండ వచ్చు ! సాధారణం గా , ఒక క్రమ పధ్ధతి లో రోజూ చదివేది , ఏ రోజు క్లాస్ లో చెప్పిన పాఠాలు , ఆరోజు , ఇంటి దగ్గర చదువు కోవడానికి, లేదా పరీక్షల ముందు , పరీక్షలకు సిద్ధం అవడానికి , లేదా , కాస్త కష్టం గా అనిపించిన సబ్జెక్ట్ లు ఇంకాస్త శ్రద్ధ గా చదవడం కోసం ! లేదా ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధం అవడం కోసం ! ఇట్లా దేనికోసం అయితే చదువుదామను కుంటున్నారో , ఆ లక్ష్యం కోసం, మీరు కేటాయించిన సమయం లో ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా నిర్ణయించుకోండి ! ఉదా: లెక్కల పరీక్ష కు కనుక సిద్ధం అవుతూ ఉంటే , ఒక అయిదు అధ్యాయాలు ఉన్న లెక్కల సబ్జెక్ట్ లో ప్రతి అధ్యాయం లో లెక్కలను నేర్చుకోవడానికి , రోజూ ఒక గంట ఉపయోగించడం చేయ వచ్చు ! బాగా కష్టం అనిపిస్తే , మీరే ఆ సమయాన్ని రెండు గంటలు గా మార్చుకోవచ్చు ! లేదా ఇంగ్లీషు సబ్జెక్ట్ అవుతే , గ్రామర్ కోసం వారం లో రెండు గంటలు , వ్రాత ప్రాక్టిస్ చేయడానికి వారం లో ఒక గంట , ఇట్లా మీ మీ అవసరాల బట్టి , మీరు సమయాన్ని వెచ్చించడం నిర్ణయించుకోవాలి ! ఇట్లా వేసుకున్న చదువు పధకాన్ని, మీరు క్రమం తప్పకుండా ,కనీసం, కొన్ని వారాలు ఆచరించడం అలవాటు చేసుకోవాలి ! అప్పుడు , మీకు ఏమైనా మార్పులు అవసరం అవుతాయో లేదో తెలుస్తుంది ! ఆ తరువాత మీకు నచ్చితే , అంటే మీకు బాగా ఉపయోగ పడుతుంటే , ఆ పధ్ధతినే కొనసాగించ వచ్చు !
మరి సమయం అంతా చదువు కేనా ? :
విద్యార్ధి దశ జీవితం లో అతి ముఖ్యమైన దశ ! అతి ఆనంద దాయకమైన దశ కూడా ! ఎందుకంటే , నూటికి తొంభై శాతం మంది విద్యార్ధులకు , డబ్బు సంపాదించడం గురించి ఆలోచించ నవసరం లేదు ! వారి తల్లి దండ్రులు అవసరమైన డబ్బును సమకూరుస్తారు ! విద్యార్ధులు గా చేయవలసినది బాగా చదువుకోవడమే ! ఇంకా ఆనందించడం ! చదువును అశ్రద్ధ చేయకుండా , మిగతా వ్యాపకాలను కూడా విద్యార్ధులు కొనసాగించాలి , కేవలం, పుస్తకాల పురుగుల్లా ఉండక ! వారి మిత్రులతో కలిసి సమయం గడపడమూ , కుటుంబ సభ్యులతో గడపడమూ , వారి ప్రత్యేకమైన హాబీలు ఉంటే వాటిని కొన సాగించ డమో , లేదా అభివృద్ధి చేసుకోవడమో కూడా చేయాలి ! తప్పని సరిగా ! ఇంకో ముఖ్యమైన అశ్రద్ధ చేయకూడని విషయం : తమ ఆరోగ్యం ! అంటే క్రమం తప్పకుండా , వ్యాయామం చేయడమూ , వారికి ఇష్టమైన ఆటలు ఆడడమూ కూడా కొనసాగించాలి , అందుకు ఒక క్రమ పధ్ధతి లో సమయం కేటాయించాలి కూడా వారి డైరీ లో ! అప్పుడే , విద్యార్ధి దశ ఆనంద దాయకం అవుతుంది !
కంప్యూటర్ లు ఉన్న విద్యార్ధులు ఈక్రింద చూపిన సైట్ కు వెళితే , ఆన్ లైన్ లోనే మీ డైరీ వాడుకోవచ్చు ! ఉచితం గా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
చదువుకోవడం ఎట్లా?7. చదువుకు పధకం ఏమిటి ?
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2013 at 10:15 సా.చదువుకోవడం ఎట్లా?7. చదువుకు పధకం ఏమిటి ?
ప్రతి పనికీ, వేసుకో పధకం !
నీ జీవితం లో, నీవే ప్రధమం !
పధకం చేస్తుంది ,
నీ లక్ష్యం, సుగమం !
క్రితం టపాలలో , చదువుకోవడానికి కావలసిన కనీసపు ‘ ముడి సరుకులు ‘ ఏమిటో తెలుసుకున్నాం కదా ! ముఖ్యం గా కావలసినది, చదువుకోవాలనే నిరంతర ‘ తపన ‘ , కృత నిశ్చయం ! వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ , ఆ తపనా , దీక్షా , బలమవుతూ ఉంటుంది ! కానీ చిన్న వయసులలోనే , చదువంటే , ఉత్సాహం కలిగించి , అన్ని విధాలా బాల బాలికలకు , అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వ వలసినది , తల్లి దండ్రులే , ఆ తరువాత ఉపాధ్యాయులు ! గుర్తు ఉంచుకోవలసిన విషయం : తల్లి తండ్రులు , ఆ రకమైన ప్రోత్సాహం , ఉత్సాహం , తమ పిల్లలలో కలిగించ డానికి , వారు చదువు కున్న వారవనవసరం లేదు ! డబ్బు బాగా ఉన్న వారూ అవనవసరం లేదు ! తమ శక్తి యుక్తులు సర్వస్వం , తమ సంతానం కోసం ధార పోసి , వారు ‘ నాలుగు అక్షరం ముక్కలు నేర్చి , నాలుగు రాళ్ళు సంపాదించుకుని , వారి కాళ్ళ మీద వారు నిలబడితే చూద్దామని , వేచి ఉండే తల్లి దండ్రులూ , వితంతువులైన తల్లులూ , భార్య లను కోల్పోయిన తండ్రులూ కూడా , మన భారతావని లో, అనేక లక్షల మంది ఉన్నారు ! అందుకే అంటారు కదా ‘ జననీ , జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి ‘ అని ! మరి చదువుకు పధకం ఏమిటి ? స్టడీ ప్లాన్ ఏమిటి ? దాని ఉపయోగం ఏమిటి ? మరి ఆ పధకాన్ని ఎట్లా వేసుకోవాలి ? ఆ పధకం వేసుకుని , విద్యార్ధులు చదవడం లోనూ , వారిని ఒక పధకం ప్రకారం చదివించడం లోనూ , వారి తల్లి దండ్రులు ఏంచేయాలి ?
చదువుకు పధకం ఏమిటి ? :
మన జీవితం లో మనం చేరుకోవాలనే ప్రతి లక్ష్యానికీ , ఒక పధకం మనకు ఉండాలి ! పధకం లేని ప్రయాణం నడి సముద్రం లో నావ లా ఉంటుంది ! అంటే లక్ష్య సాధన కు పధకం తప్పని సరిగా ఉండాలి ! బాగా చదువుకోవాలనే లక్ష్యం మనకుంటే , అందుకు తగిన పధకం కూడా మనం సిద్ధం చేసుకోవాలి ! ఒక ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉంటే , అందుకూ పధకం తప్పని సరి ! పధకం అంటే కేవలం, మన ఆలోచనలను , ఆచరణలో పెట్టే , ఒక క్రమ పధ్ధతి ! ఆర్గనైజేషన్ ! ఏ పధకం వేసుకున్నా , తాత్కాలికం గానూ , దీర్ఘకాలికం గానూ చేయవలసినది ఒక క్రమ పధ్ధతి లో చేస్తూ పొతే , పధకం విజయవంతం అవుతుంది !
ఉదాహరణకు, చదువు: రోజు వారీ చదువు , స్కూల్ నుంచీ , లేదా కాలేజ్ నుంచీ, ఇంటికి వచ్చాక , ఎంత సేపు చదువుకోవాలి ? ఏ ఏ సబ్జెక్ట్ లు చదువుకోవాలి అనే విషయాలు , విద్యార్ధులు ముందే , ఒక అవగాహన కు వచ్చి , తదనుగుణం గా సిద్ధం అవాలి ఆ సబ్జెక్ట్ విషయాలు తెలుసుకోవ డానికి ! నూటికి ఎనభై శాతం విద్యార్ధులు , సరిగా ఫలితాలు సాధించ లేక పోవడానికి ప్రధాన కారణం , కేవలం ఒక పధకం లేక పోవడమే ! విద్యార్ధులకు చదువుకోడానికి సమయం కొదువ ఉండదు కదా ! అట్లాగే , అవకాశం కూడా ఇవ్వ బడితేనే కదా బడి లో కానీ , కళాశాల లో కానీ ప్రవేశించ గలిగేది ! మరి ఫలితాలు సరిగా ఉండడానికి వారు చేయవలసినది కేవలం , ఒక పధకం తో చదవడమే ! మరి ఆ పధకం వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం ! ఇది తెలుసుకోవడం , కేవలం విద్యార్థులకే కాక ,వారి ని చదివిస్తున్న తల్లి దండ్రులకు కూడా ఎంతో ఉపయోగకరం !
చదువుకోడం ఎట్లా? 6. ఆలస్యం, అమృతం విషం !
In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind, Our minds on నవంబర్ 18, 2013 at 6:33 సా.చదువుకోడం ఎట్లా? 6.

ఆలస్యం, అమృతం విషం ! : ( దీని అర్ధం , ఆలస్యం అమృతమూ ,విషమూ కూడా అని కాదు , ఆలస్యం చేస్తే , అమృతం కూడా విషం అవుతుంది అని ! ) చదువుకునే విద్యార్ధులకు సమయ పాలన గురించి , వారికి తెలిసినా , తెలియక పోయినా , తెలియ చేయ వలసిన బాధ్యత , బోధించే గురువుల మీద ఉంది ! సామాన్యం గా , బడికి వెళ్ళే విద్యార్ధులను ‘ చిన్న క్లాసులే కదా ‘ చిన్న పిల్లలు కదా ‘ కిండర్ గార్టెన్ ‘ చదువులే కదా ! అనే ఒక రకమైన ముద్దూ , ఇంకో రకమైన నిర్లిప్తతనూ, తల్లి దండ్రులూ , ఇతర పెద్దలూ , ఏర్పరుచుకుంటారు ( ఉపాధ్యాయులు కూడా! ) ఒక రకం గా, ఆ భావనలన్నీ యదార్ధాలే ! కేవలం ఆకారణం చేత , వారికి సమయం యొక్క ప్రాముఖ్యతా , సమయ పాలనా , నేర్పించడం మానకూడదు ! సమయ పాలన తో ముఖ్యం గా అలవాడే ఒక గుణం , క్రమ శిక్షణ ! మనం దైనందిన జీవితాలలో , సమయానికి పనులు చేయక పొతే , పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఊహించుకోండి ! ఈ సమయ పాలన, చిన్న తనం నుంచీ , బాల బాలికలకు ఒక ముఖ్య విధి గా నేర్పించాలి ! సమయ పాలనకూ, క్రమ శిక్షణ కూ, ప్రతి విద్యార్ధీ , అలవాటు పడాలి , లేదా ప్రతి అధ్యాపకుడూ , వారికి ఆ గుణం అలవాటు చేయాలి ఎందుకంటే , మానవుల కందరికీ , ప్రతి రోజు లోనూ ఉండేవి 24 గంటలే !
మరి చదువు లోనూ , పరీక్షలకు సిద్దమవడం లోనూ , ఈ సమయ పాలన ప్రాముఖ్యం ఏమిటి ? : చిన్న తనంలో, తల్లి దండ్రులు తరచూ తమ సంతానానికి చెప్పే మాటలు, ” ఏరోజు పాఠాలు, ఆ రోజే నేర్చుకో ” అని ! ఇది చాలా చిన్న సలహా అయినా , ఎంతో విలువైన సలహా ! ఈ సలహాలో నిగూఢ మైన అర్ధం , ‘ ఆలస్యం చేయవద్దు’ అని ! ఒక క్రమమైన పద్ధతిలో, రోజూ కొంత సమయం కేటాయించి , చదువుకుంటే , చదివినది అర్ధం అవడమే కాక , మస్తిష్కం , అంటే మెదడు లోకి ‘ ఎక్కుతుంది ‘ ఈ మెదడు లోకి ఎక్కడం అంటే ఏమిటి ? : మన జ్ఞాపక శక్తి నిలువ లోకి , చదివినది వెళుతుంది ! అంటే జ్ఞాపక శక్తి స్టోర్ అన్న మాట ! ఈ ‘ స్టోర్’ లోకి వెళ్ళిన విషయాలు ఒక పట్టాన ‘ చెరిగి పోవు ‘ ! ( మనం, ముందు ముందు , మనం చదివింది, బాగా మెదడులో ‘ ముద్రింప ‘ బడడానికి ఏం చేయాలో ( అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ చేసుకోడానికి ఏం చేయాలో ) కూడా తెలుసుకుందాం ! )
ఇక పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ , ఒక్కో విద్యార్ధీ , త్వర త్వరగా , రెండు వారాలలో చదవ వలసినది , ఒక వారం రోజుల లోనో , లేదా నెల లో చదవ వలసినది , రెండు వారాల లోనో చదివేసి ‘ తమ పని పూర్తి ‘ అయిందనిపించుకుంటారు ! కానీ వారు చేస్తున్నది, వారికి మానసికం గా తృప్తి ఇస్తుందేమో కానీ , చదివిన సంగతులు మాత్రం , మెదడు లో ఎక్కువ కాలం నిలువవు ! తీరా పరీక్ష రోజున , చదివిన విషయాలన్నీ కూడా స్పష్టత లోపించి , దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆకాశం లా అవుతుంది పరిస్థితి ! పరీక్ష సరిగా రాయకుండా , ఆ తరువాత వారి కన్నీరు ‘ వర్షించి నా ‘ కూడా వారికి మార్కులు ఎక్కువ రావు కదా ! ఫలితం , విఫలమవడమో ( అంటే ఫెయిల్ అవడమో ) లేదా చాలా తక్కువ మార్కులు రావడమో జరుగుతుంది కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !