విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ? 4.
క్రితం టపాలలో కొన్ని సూచనలు, సలహాలు తెలుసుకున్నాం కదా !
మరి మీ ప్రేమ విఫలం అయితే, మీ మనసులో, ప్రేమ పటం లో ‘ ఆ బొమ్మను’ చెరిపేయడం ఎట్లా ? : ప్రేమ పాకం లో పడుతూ ఉంటే , ‘ ఆ బొమ్మ’ ప్రేమికులలో రూపు దిద్దుకుంటూ ఉంటుంది !
ఏ బొమ్మ ? అతడికి : ఆ మందస్మిత వదనం , ఆ కలువ కళ్ళు , ఆ మరులు గొలిపే కురులు, చిలిపి చూపులు , ఆ ఓర చూపులు , ఆ కట్టుకున్న చిలక పచ్చ చీరతో, ఆకట్టుకున్న ఆమె అందం ! ఆమె నడకలో , ఒక రకమైన వయ్యారం తో కలబోసిన హుందా తనం, రాజసం ఉట్టి పడుతున్న ఆమె నడక ! ఇట్లా ఒక్కొక్క పురుషుడి మది లో , ఒక్కొక్క విలక్షణమైన రీతి లో లో దోబూచులాడే, కదిలే ‘ ప్రేమ బొమ్మ ‘
ఆమెకు : ఆ చిరునవ్వు , ఆ చిలిపి చూపులూ , ఆ నిర్లక్ష్యం చేసిన గడ్డం , ఆ సీరియస్ నెస్ ! ఇట్లా , ప్రతి యువతి మదిలో ఒక్కో రకం గా ప్రేమ బొమ్మ ! తలచుకోగానే రీ ప్లే అయ్యే ప్రేమ బొమ్మ !
ఇక్కడి వరకూ కధ బాగానే ఉంది ! మరి మనసులు విరిగితే , ప్రేమ విఫలం అయితే , ఈ ప్రేమ బొమ్మల మాటేంటి ? ఆ బొమ్మలు మనో వేదన కలిగిస్తూనే ఉండాలా ? ఆ వేదన చెందుతూ నే ఉండాలా ? ఇప్పుడే మీ లో ఉన్న దర్శకత్వ ప్రతిభ ను వెలికి తీయాలి ! అది ఎట్లాగో చూద్దాం !
మీరు, మీ ప్రియులను ( ప్రేమ విఫలం అయితే ) తలుచుకోగానే , మీ మది లో మెదిలే వారి చిత్రాలు ఎట్లా ఉంటాయి ? అంటే , ఎంత పెద్ద చిత్రం , ఎంత దూరం లో మీ మనోచిత్రం గా మీకు దర్శనమిస్తుంది ? ఆ మనోచిత్రం రూపు రేఖలేంటి ? ఏ రంగు లో ఉందా చిత్రం ? ఎంత పెద్దగా ఉంది ? ఏ వస్త్ర ధారణ తో కనబడుతుందా చిత్రం ? ఇట్లా , పదే , పదే , మీ ముందు కదలాడుతున్నమీ మనోచిత్రం స్వభావాలు మీకు వెంటనే స్ఫురణ కు వస్తే , మీ పని సులువు అవుతుంది !
ఇప్పుడు మీరు చేయవలసినది , మీ మనోచిత్రం లో మీకు స్పష్టం గా కనబడుతున్న ‘ ఆ చిత్రం ‘ రంగులన్నీ ఒక్క సారిగా ,కడిగేసి నట్టు ఊహించుకోండి , మీ దర్శక ప్రతిభతో , ఆ పని మీరు చేయగలరు , ఎందుకంటే , మీ మనోచిత్రాన్ని చేరిపివేసుకోగల సామర్ధ్యం మీకు మాత్రమే ఉంది ! మీ మనసు, మీ స్వాధీనం లోనే ఉంటుంది కనుక ! క్రమేణా , మీరు మీ మనో ఫలకం మీద, పదే , పదే ఊహించుకుంటున్న ‘ ఆ చిత్రాన్ని ‘ ఇప్పుడు పంచ రంగులలో కాక ,కేవలం , నలుపూ , తెలుపూ రంగులలోకి మార్చివేశారు ! ఆ తరువాత , మీరు చూస్తున్న ఆ చిత్రం పరిమాణం అంటే సైజు , పది రెట్లు తగ్గించి , ఊహించుకోండి ! ఆ తరువాత , మీరు చూస్తున్న చాలా చిన్న, నలుపూ , తెలుపూ మనోచిత్రాన్ని , ఇంకా , ఇంకా దూరం గా ఉన్నట్టు ,చివరకు ఒక చుక్క పరిమాణం లోనే ఉన్నట్టు ఊహించుకోండి ! ఇక్కడ , మీరు కేవలం, మీ మనో చిత్రాలతో ఎట్లా ప్రభావితమవుతారో , ఆ ప్రభావాన్ని మీకై మీరే ఎట్లా మార్చుకోగలరో ,ప్రయోగాత్మకం గా తెలుసుకుంటున్నారు ! మానవులకు , వివిధ సమయాలలో , వివిధ రకాలైన , హావ భావాలను, ప్రేమానుభూతులనూ , కేవలం సజీవమైన , సప్త వర్ణాల మనోచిత్రాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయి ! ఈ సజీవ చిత్రాలను , కేవలం మనో నిశ్చయం తో , దృఢ చిత్తం తో , మీ దర్శక ప్రతిభ తో కేవలం, కళావిహీనమైన , వర్ణ రహితమైన , సూక్ష్మ చిత్రాలు గా మీరు ఎడిట్ చేసుకుంటే , ఆ చిత్రాల ప్రభావం, ఒక్క సారిగా శక్తి హీనం అవుతుంది ! ఆ చిత్రాలపైన మీ అనుభూతులూ , హావ భావాలూ , కూడా తదనుగుణం గా తగ్గి పోతాయి ! మీరు పొందే వేదన , విషాదాలు కూడా క్రమేణా తగ్గుతూ ఉంటాయి ! సజీవమైన చిత్రాలు, మది లో కదులుతూ ఉన్నప్పుడు కలిగే భావానుభూతులు తీవ్రమైనవి గానూ ఉ ధృతం గానూ ఉండే మనోచిత్రం, అసష్టమైనది గానూ , పొగ బారి నట్టు అయి , సూక్ష్మమైనప్పుడు , బలహీనబడి, మనోఫలకం మీద నుంచి అదృశ్యం అవుతుంది ! మొదటి దశలో , మీరు చేసినది , మీ విఫల ప్రేమ కు కారకులైన ప్రియుడిని , ప్రియురాలినీ , మీ మనోఫలకం మీద నుంచి , ఒక క్రమ పధ్ధతి తో చేరిపివేస్తున్నారు ! వారిని , మిమ్మల్ని , ఇక వర్తమానం లో కానీ , భవిష్యత్తు లో కానీ , ఏ రకం గానూ ప్రభావితం చేయలేని శక్తి హీనులుగా , మార్చి వేస్తున్నారు ! ఇక రెండవ దశలో , మీరు మీ సంబంధం వారితో బాగున్నప్పుడు , గడిపిన ఆనంద మయ సన్నివేశాలను ఒక ఐదింటిని స్మరించుకోండి ! వాటిని కూడా , పైన ఉదహరించిన పధ్ధతి లో క్రమేణా , మీ మనోఫలకం మీద నుంచి తుడిపి వేయండి !
మూడవ దశలో , మీకు, వారికి కలిగిన తీవ్రమైన వాదోప వాదాలూ , ప్రత్యేకించి , ఏ యే సంఘటనలు మీకు తీవ్రం గా వారంటే , విముఖత కలిగించి , అసహ్యం కలిగించాయో , కూడా నోట్ చేసుకోండి ! ఇప్పుడు పైన చెప్పినట్టు ఆ సంఘటనలు , చెరిపి వేయడం కాకుండా , మళ్ళీ , మళ్ళీ , స్ఫురణ కు తెచ్చుకొని , ఆ జ్ఞాపకాలను బలవంతం చేసుకోండి ! పైన చెప్పిన పధ్ధతి దీనినే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు ! ఈ పధ్ధతి సరిగా అనుసరించడానికి , కనీసం రెండు వారాలు పడుతుంది ! సంగ్రహం గా ఈ పద్ధతిలో , మీకు తీవ్రం గా మనోవేదన కలిగించి , మీ ప్రేమ విఫలం అవడానికి కారకులైన వారిని మొదటి దశలో , వారి మనోచిత్రాన్నీ , రెండవ దశలో వారితో కలిసి మీరు గడిపిన ఆనంద క్షణాల మనో చలన చిత్రాలనూ , తుడిపి వేస్తున్నారు ! మూడవ దశలో , వారితో గడిపిన ఘర్షణా పూరిత చలన చిత్రాలను , దృఢ మైనవి గా మార్చుకుని , మీ నిర్ణయాన్ని మీరే ఆమోదించుకుని , ప్రమాదం అంచు నుండి దూరం గా జరిగి ప్రమోదం తో పురోగమించ గలుగుతున్నారు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !