ప్రేమించడం ఎట్లా ? 3.
ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే ప్రయత్నం లో , ఏది ప్రేమ అనిపించుకోదో తెలుసుకున్నాం కదా , క్రితం టపాలలో ! ప్రేమించడం నేర్చుకునే ముందు ప్రప్రధమం గా చేయ వలసినది, మనలను మనం ప్రేమించడం ! మీరు మిమ్మల్ని , ప్రేమించడం తెలుసుకుంటేనే , ఇతరులను ప్రేమించ గలరు ! అంటే , మనం మనలను ప్రేమించడం లోనే , ప్రేమ స్వభావాన్ని సరిగా అర్ధం చేసుకోగలం !
ఉదా: ప్రమోద్ ఒక మాదిరిగా చదువు కుని , ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ, బొటా బొటీ జీతం తో జీవితం గడుపుతుంటాడు ! పెళ్లి వయసు కు పెళ్లి చేసుకున్నాడు , తాను ‘ప్రేమించిన’ యువతినే ! తన ప్రేమను ఆమె కు తనదైన రీతి లో చూపించే వాడు మొదట్లో ! క్రమేణా , ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక ‘ మద్యం ‘ తాగడం మొదలు పెట్టాడు ! తన ‘ వత్తిడులు ‘ తప్పించుకోవడం కోసం ! క్రమేణా , ఈ రకం గా ‘ వత్తిడులు ‘ తప్పించుకోవడం, ఎక్కువ సమయం చేయడం మొదలు పెట్టాడు అంటే తరచు గా తాగడం ! తాను ప్రేమించిన యువతిని అశ్రద్ధ చేయడమే కాకుండా ,చీటికీ మాటికీ , సూటి పోటి మాటలతో , ఆమెను అవమాన పరుస్తూ , అప్పుడప్పుడూ చేయి చేసుకుంటూ కూడా , మందు ప్రభావం దిగి నప్పుడు ‘ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ‘ అని ఆమె ‘ గాయాలకు ‘ వెన్న పూసే ప్రయత్నం చేస్తాడు ! మరి ప్రమోద్ ప్రేమ ఏమైంది ? ప్రమోద్ ప్రేమిస్తున్నాడా ? లేదా మందు ప్రభావం లో పడి మాత్రమే , ప్రమోద్ , తన ‘ ప్రేయసి ని మానసికం గానూ , శారీరికం గానూ హింసిస్తున్నాడా ?
విశ్లేషణ: ప్రమోద్ ఒక సగటు మనిషి . అందులో ఏ తప్పూ లేదు కదా ! విశాల ప్రపంచం లో ఎంతో మంది సగటు మనుషులు ఉన్నారు ! కానీ , క్రమేణా , పెళ్లి చేసుకున్నాక , ఎదురయే సమస్యలను , పరిష్కార మార్గం కనుక్కోలేక , తాత్కాలిక ఉపశమనాలకు , మద్యం అలవాటు చేసుకున్నాడు ! క్రమేణా మద్యం తరచూ తాగడం మొదలెట్టాడు ! చీకాకులూ , ఆందోళన లూ సామాన్యం అయ్యాయి , ప్రమోద్ జీవితం లో ! దానితో , విచక్షణా జ్ఞానం కొర వడింది ! , వాటితో పాటుగా , ప్రమోద్ లో, తాను ఆశక్తుడి ననే , ఆత్మ న్యూనతా భావాలు ఎక్కువ అయ్యాయి ! తనంటే తనకు ఏహ్య భావం కలుగుతుంది ! కానీ ఆ విషయాన్ని , తను అంగీకరించే పరిస్థితి లో లేడు ! అగ్నికి ఆజ్యం తోడైనట్టు , మద్యం ఆ పరిస్థితిని ఇంకా అధ్వాన్నం చేసింది ! తన చీకాకులూ, కోప తాపాలూ , తాను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మీద చూపించడం మొదలు పెట్టాడు ! ప్రతి సారీ , తన ప్రతాపం, ప్రేయసి మీద చూపించాక , విపరీతం గా పశ్చాతాప పడుతూ , ఏడుస్తాడు ! తన జీవితం తో పాటు గా , తన ప్రేయసి జీవితాన్ని కూడా , ఒక విష వలయం లోకి లాక్కున్నాడు ! తన బలహీనతలూ , తన బాధలూ , తన ప్రేయసి మీద చూపిస్తూ , తన సమస్యలకు తాత్కాలిక ఉపశమనం , మద్యం తోనూ , తన భార్య మీద తన ఆధిపత్యం తోనూ , చేసుకుంటున్నాడు ! ఆ రకం గా చేయి జారిన తన పరిస్థితులు , తన నియంత్రణ లోనే లోనే ఉన్నాయనే ప్రమాద కరమైన భ్రమ లో జీవితం గడుపుతాడు ప్రమోద్ !
ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి మనం ! ప్రమోద్ పరిస్థితి ని గమనిస్తూ , అతనిలోని మార్పులను పరిశీలిస్తూ కూడా ఏమీ చేయ లేని అసహాయ స్థితి లో భార్య కుమిలి పోతుందే కానీ , క్రియాశీలం గా ఆ పరిస్థితి నుంచి తాను బయటపడ డానికి , లేదా ప్రమోద్ ను బయట పడేయడానికీ ఏ రకమైన ప్రయత్నమూ చెయ్యట్లేదు ! అందుకు కారణం ఏమిటి ? మీరు చెప్ప గలరా ? ముందు ముందు తెలుసు కుందాం !
మనలను మనం ప్రేమించడం అంటే , మన అవసరాలు , ఇతరుల అవసరాల కన్నా ముందు ఉండాలనే తాపత్రయం కాదు ! మన మీద మనకు ఆత్మ విశ్వాసం ఏర్పరుచుకుని , మన బలాలను మనం ప్రశంశించు కుంటూ , బలహీనతలను అంగీకరిస్తూ , ఆ బలహీనతలను కేవలం కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేయకుండా , వాటిని వీలైనంత వరకూ సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ , ఆ బలహీనతలను ఇతరుల మీదకు ఏదో విధం గా రుద్దే ప్రయత్నం చేయకుండా, జీవితం గడపడం నేర్చుకోవాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !