Our Health

Archive for ఆగస్ట్, 2013|Monthly archive page

7. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ).MSM

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఆగస్ట్ 16, 2013 at 9:35 ఉద.

7. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ).

 కారు ను స్టార్ట్ చేయడం :

కారు స్టార్ట్ చేయ బోయే ముందు , వార్నింగ్ లైట్లూ , ఇండికేటర్ లూ ఏమేం తెలియ చేస్తాయో ఆ అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. కారు స్టార్ట్ చేయగానే కానీ , లేదా కారు సగం దూరం ప్రయాణం చేసినపుడు కానీ ఆ వార్నింగ్ సైన్స్ కనుక కనిపిస్తే , తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ! ఆ పరిస్థితులలో మాన్యువల్ తీసి చూడడం కన్నా , ముందే ఆ సంగతులు తెలుసుకుని ఉండడం ఉత్తమం !
స్మూత్ గా రోడ్డెక్కడం :  కారును ఒకసారి స్టార్ట్ చేసి  రోడ్డు ఎక్కించే ముందు , కారు చుట్టూ పరిసరాలను గమనించాలి : ఒక కిటుకు M S M  అంటే ఎమ్మెస్సెమ్  ఈ మూడు అక్షరాలనూ కారు ను నడిపే ముందు ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. వీటిలో మొదటి M అంటే మిర్రర్ , అంటే కారు పక్కన ఉన్న అద్దం , దీనిలోనుంచి కారు వెనుక గా నూ ,పక్కగానూ , వచ్చే వాహనాలూ , మనుషులూ  కనబడతారు కదా ! తరువాతి అక్షరం S అంటే సిగ్నల్ ఇవ్వడం. ఈ సిగ్నల్ ఇవ్వడం ఇతర దేశాలలో చేతి తో ఎప్పుడూ చేయడం కూడదు ! కేవలం కారు కు అమర్చి ఉన్న ఇండికేటర్ లైట్ లతోనే తెలపాలి ! కుడివైపు కనుక కారును తిప్పి నడుపుతే , కుడి లైట్ ను వేయాలి !
ఇటీవల బొంబాయి లో కారు డ్రైవింగ్ నేర్పేవారి ప్రోగ్రాం ఒకటి వచ్చింది బీ బీ సీ  లో ! అందులో కుడి వైపు కు లేదా ఎడమ వైపు కూ కారు తిప్పే ముందు , కేవలం డ్రైవర్ కుడి చేతి తోనే ఇండికేట్ చేయాలని , అదే కరెక్ట్ పధ్ధతి అని చెప్పడం చూశాను ! హైదరాబాదు లోనూ , ఇతర పట్టణాలలోనూ ఇదే పధ్ధతి ఉందేమో నాకు తెలియదు ! ఏమైనప్పటికీ , ఇండికేటర్ లైట్లు ఉపయోగించడం , మంచి అలవాటు ! ఇక మూడోఅక్షరం M అంటే , మెనూవర్ అంటే కారును కదిలించడం. ఈ M S M  ను కారు నడిపే అన్ని వేళల లోనూ గుర్తు ఉంచుకోవడం రక్షిత కారు చోదకానికి , అంటే సేఫ్ కార్ డ్రైవింగ్ కు ఎంతగానో సహకరిస్తుంది ! కారు స్టార్ట్ చేసే ముందు ముఖ్యం గా కారు ఏ గేరు లో ఉందో ఖచ్చితం గా తెలుసుకోవాలి ! ఆపి ఉన్న కారు ను ఎప్పుడూ న్యూట్రల్ గేర్ లో ఉంచి, హాండ్ బ్రేక్ వేసి ఉంచాలి. మర్చి పోయి కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ , కారు ఒకటో గేర్ లో ( పార్క్ చేసి ఉన్నపుడే కనుక ) ఉంటే , కారును స్టార్ట్ చేసే ముందే గమనించాలి , తప్పని సరిగా !( గేర్ నాబ్ ను కదిలించి , గేర్ న్యూట్రల్ లో ఉందో లేదా , మొదటి గేర్ లో ఉందో తెలుసుకోవచ్చు ) ఇట్లా కారు స్టార్ట్ చేసే ముందే తెలుసుకోక కారు ను స్టార్ట్ చేస్తే , అంటే ఇగ్నిషన్ లో కీ పెట్టి స్టార్ట్ చేయగానే , కారు ఒక్క ఉదుపున ముందుకు వెళుతుంది , మొదటి గేర్ లో ఉంటే కనుక ! స్థలా భావ రీత్యా , కారు ను ఒక చిన్న ప్రదేశం లో పార్క్ చేసి ఉంచినప్పుడు , కారు ఒక్క ఉదుపున ముందుకు వెళ్లి , ముందు గా ఉన్న గోడకు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది ! 
డ్రై స్టీరింగ్ అంటే ఏమిటి ? : కారు ఇంజన్ స్టార్ట్ అవక ముందే కారు స్టీరింగ్ ను తిప్పి , కారు దిశను మార్చే ప్రయత్నాలు చేయడాన్ని డ్రై స్టీరింగ్ అంటారు. ఇట్లా చేయడం మంచిది కాదు. కారు చక్రాలు , అంటే టైర్లు త్వరగా అరిగి పోతాయి , రాపిడి కి !
( ఈ టపా రాస్తున్న సమయం లోనే తెలుగు దేశం ఉపాధ్యక్షుడు ఒక కారు ప్రమాదం లో మరణించినట్టు వార్త !  కారణాలు  డ్రైవర్ మాటలలోనే 1. కారు నూట నలభై మైళ్ళ వేగం తో పోతుందని ! ( మోటార్ వే మీద కూడా అత్యధిక వేగం కేవలం డెబ్బై మైళ్లే ! ఇంగ్లండు లో ! ) 2. ప్రమాద సమయం లో వాన వస్తుందని 3. మరణించిన వ్యక్తి అంత వరకూ , సీట్ బెల్ట్ పెట్టుకుని , తీసి వేయడం జరిగిందని ! డ్రైవర్ , తాను సీట్ బెల్ట్ పెట్టుకోమని అబ్యర్ధించి నా కూడా , ఆయన పెట్టుకోలేదని , తాను బ్రతికింది కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నేననీ తెలిపాడు !  ) మితి మీరిన వేగం లో కారును కంట్రోలు చేయడం చాలా కష్టం ! దానికి వాన తోడవుతే , రోడ్డు సర్రున జారుతుంది ! మరి ఈ పరిస్థితులలో సీట్ బెల్ట్ ధరించక పోవడం !??
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

6. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రాధమిక మెయింటె నెన్స్ ఏమిటి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 15, 2013 at 2:05 సా.

6. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రాధమిక మెయింటె నెన్స్ ఏమిటి ?:

మిగతా జాగ్రత్తలు : 
విండ్ స్క్రీన్ ఇంకా విండోస్ : విండ్ స్క్రీన్ ఎప్పుడూ , మసక బారకుండా , స్పష్టం గా ఉండాలి ! దానిమీద ఏ రకమైన స్టికర్ లూ అంటించ కుండా జాగ్రత్త వహించాలి ! అంటించిన స్టికర్ లు చూపును కొన్ని కోణాలకే పరిమితం చేసి , అత్యవసర సమయాల లో రోడ్డు మీద వాహనాలను గమనించ కుండా చేసి , ప్రమాదాల రిస్కు ఎక్కువ చేస్తాయి !విండ్ స్క్రీన్ మీద తరచూ చిన్న చిన్న రాళ్ళు పడి , విండ్ స్క్రీన్ మీద చిన్న చిన్న పగుళ్ళ కు కారణమవుతాయి ! ఈ పగుళ్ళు కూడా చూపు కు అంతరాయం కలిగిస్తాయి ! పెద్ద పగుళ్ళను వెంటనే సీల్ చేయడం కానీ , లేదా విండ్ స్క్రీన్ మార్చడం కానీ చేయాలి !విండోస్ కూడా సరిగా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 
ఎలెక్ట్రి కల్ పరికరాలు చెక్ చేయడం : 
కారు లో వివిధ లైట్లూ , విండ్ స్క్రీన్ వాషర్ లూ , హారన్ లూ , ఇట్లాంటి అనేకం విద్యుత్తు బ్యాటరీ ద్వారానే పని చేస్తాయి కదా ! వాటిని పరీక్ష చేసుకోవడం కూడా ఉత్తమం ! ప్రత్యేకించి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటే ! అట్లాగే కారు బ్రేక్ నూ , స్టీరింగ్ వీల్ నూ కూడా పరీక్ష చేసుకోవాలి బయలు దేరే ముందే ! 
చాలా మంది ఇంధన టాంకు ను ఒక మాదిరి గానే నింపి , ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ! కానీ వెళ్ళే చోటు వెదకడం కానీ , లేదా ట్రాఫిక్ ఎక్కువ గా ఉండి  తరచూ గేర్లు మార్చి కారును నడపడం వల్ల కానీ ఎక్కువ ఇంధనం ఖర్చు అయి రోడ్డు మీద ఇంధనం లేక పోవడం వల్ల , కారు ఆగి పోవచ్చు ! అందువల్ల ఎప్పుడూ అనుకున్న దానికంటే ఎక్కువ ఇంధనం టాంకు లో నింపు కోవడం మంచి అలవాటు ! 
పాసెంజెర్ ల జాగ్రత్త : 
కారు నడిపే డ్రైవర్ దే , కారు లో కూర్చున్న మిగతా వారందరి బాధ్యతా కూడా ! ఈ మిగతా పాసెంజర్ లు చిన్న పిల్లలు కావచ్చు , ముదుసలులు కావచ్చు , లేదా గర్భిణీ స్త్రీలో , అనారోగ్యం తో ఉన్న వారో కూడా కావచ్చు ! అట్లాంటి వారందరి జాగ్రత్త కూడా , ప్రయాణం ముందే ఏర్పాటు చేసుకోవాలి , కారు నడిపే వారే ! ప్రత్యేకించి సీట్ బెల్ట్ లు పెట్టుకున్నారో లేదో గమనించడం , వారి బరువు కు తగ్గట్టుగా కారు టైర్ల లో గాలి నింపడం జరిగిందో లేదో అని చూసుకోవడమూ , ఇంకా వారికి కావలసిన ఆహార పానీయాల విషయాలు కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి ! వాతావరణం బాగో లేక పోయినా , లేదా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడిన సమయాలలో ,కారు ను వదిలి , రెస్టారెంట్ లో తినడం , తాగడం సంభవం కాదు కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

5. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రాధమిక మెయింటె నెన్స్ ఏమిటి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఆగస్ట్ 14, 2013 at 8:12 సా.

 5. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రాధమిక మెయింటె నెన్స్ ఏమిటి ?:

 
కారు ప్రయాణం మొదలు పెట్టే ముందు ,  ఒకసారి ఈ క్రింది విషయాలు గమనించడం మంచిది. కేవలం కారు తక్కువ ఖర్చుతో , ఎక్కువ దూరం నడప గలగడమే కాకుండా , సురక్షితం గా కూడా నడప గలం , ఈ ముందు జాగ్రత్తలు తీసుకుంటే !
1. ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవడం : ఇంజన్ ఆయిల్ ప్రతి ఇంజన్ కూ అతి ముఖ్యం. ఇంజన్ ఆయిల్ ఇంజన్ ను సరిగా లూబ్రికేట్ చేస్తుంది. మనం సాధారణం గా చూస్తూ ఉంటాము, ఏదైనా నట్టు బోల్టు లో తిరగడం ఎంత కష్టమవుతుందో , ఆ బోల్టు కూ , ఆ నట్టు కూ  మధ్య  సరిఅయిన లూబ్రికేటింగ్ గ్రీజ్ లేక పొతే ! అదే రకం గా ఇంజన్ ఆయిల్ లేని ఇంజన్ లో ఎక్కువ ఘర్షణ ఏర్పడి , ఇంజన్ త్వరగా పాడవడమే కాకుండా , డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది , ఇంధనం మీద ! అంటే , సరిగా ఇంజన్ ఆయిల్ లేని ఇంజన్ తక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది ! ముఖ్యం గా గమనించ వలసినది , ఇంజన్ ఆయిల్ ఆ కారు ఇంజన్ ను బట్టి ఒక్కో రకమైనది ఉంటుంది ! కారు స్వంత దారే , ఈ ప్రత్యేకమైన ఇంజన్ ఆయిల్ ఏమిటో తెలుసుకొని , ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి ! ఎందుకంటే , ఒక దాని బదులు ఇంకో ఇంజన్ ఆయిల్ కనుక వాడితే , ఇంజన్ చెడి  పోయే రిస్కు ఉంటుంది ! గ్యారేజీ వాడి మీద పూర్తి భారం వేసినా , సరి  అయిన ఇంజన్ ఆయిల్ పోస్తాడనే నమ్మకం లేదు , కారు ఓనర్ కే తెలియ  నపుడు ! 
2. ఇంజన్ కూలెంట్ చెక్ చేయడం : ఇంజన్ ఎంత ఎక్కువ సమయం నడిస్తే , అంత వేడెక్కుతూ ఉంటుంది కదా ! మరి ఇంజన్ నుచల్ల బరిచే కూలెంట్ కూడా రెగ్యులర్ గా పోస్తూ  ఉండాలి ! ఆ ప్రత్యేక రసాయన మిశ్రమము, ఇంజన్ ఎక్కువ గా వేడెక్క కుండా చేస్తుంది ! మ్యాన్యువల్ ను చదివి ఇంజన్ కూలెంట్ ను ఎక్కడ పోయాలో తెలుసు కోవడం కూడా మంచిదే ! 
3. టైరు వత్తిడి : కారు నాలుగు టైర్లూ ‘ మంచి ఆరోగ్యం ‘ తో ఉండేట్టు చూసుకోవాలి ! ఈ విషయం సైకిల్ టైరు ఉదాహరణ తో బాగా అర్ధం చేసుకోవచ్చు ! సైకిల్ కు ఉన్న టైరు లో వత్తిడి తగ్గితే , మనం ఎక్కువ శ్రమ పడి తొక్కడం మన అనుభవం లోనిదే కదా ! అట్లాగే సైకిల్ టైరు , పాత బడితే కానీ , లేదా ఒకటి రెండు పంచర్లు అవుతే కానీ ,పంచర్ అయిన చోట , ఒక ప్యాచ్ వేసి, టైరు లో మళ్ళీ గాలి నింపి , సైకిల్ నడిపేట్టు చేస్తాడు , రోడ్డు ప్రక్కన రిపేర్ చేసే వాడు ! అంత వరకూ బాగానే ఉంది ! కానీ పంచర్ ప్యాచ్ ఒక బుడిపె లాగా ఉబ్బి ఉండడం గమనించారా !మరి ఇప్పుడు , కారు టైరు ను కనుక సైకిల్ టైరు తో పోల్చుకుంటే , కారు టైరు లో పీడనం అంటే ప్రెషర్ తగ్గితే , ఎక్కువ పెట్రోలు తాగుతుంది ఆ కారు ! అంతే కాకుండా టైరు అతి త్వరగా  అరిగి పోతుంది ! అట్లా అరిగి, అరిగి , పంచర్ అవుతుంది ! సైకిల్ నడిపినపుడు పంచర్ అవుతే ప్రమాద తీవ్రత తక్కువ గా ఉంటుంది ,ఎందుకంటే , సైకిల్ ను ఒక మాదిరి వేగం తోనే నడుపుతాము కనుక ! అదే కారవుతే , యాభై, అరవై మైళ్ళ వేగం తో నడుపుతున్నపుడు పంచర్ అవుతే !? అప్పుడు జరిగే ప్రమాదం తీవ్రత  ఊహించు కోండి ! అందువల్ల కారు టైరు ఆరోగ్యం కేవలం టైరు లో వత్తిడి చెక్ చేసుకోవడమే కాకుండా , ఆ టైరు ఎంత అరిగి పోయిందో కూడా తరచూ గమనిస్తూ ఉండాలి ! కారు టైరు ఎంత అరిగి పోయి ఉంటే , రోడ్డు మీద ఆ కారు పట్టు ( అంటే గ్రిప్ ) అంత తక్కువ గా ఉంటుంది ! ప్రత్యేకించి , రోడ్డు నానినపుడు , కనుక బ్రేక్ చేస్తే , కారు ఆగక పోగా , ఇతర వాహనాలకు కానీ , లేదా ,గోడలకూ , చెట్ల కూ గుద్దుకుని , ప్రమాదం జరిగే రిస్కు ఎక్కువ అవుతుంది !
ఒక ముఖ్య విషయం : కారు టైరు ఎంత అరిగి పోయిందో , ఆ కారు ప్రయాణించిన దూరం తో నే అంచనా వేయకూడదు ! ఎందుకంటే తరచుగా బ్రేకు లు వేయడం వల్ల రోడ్డు మీద  రాపిడి ఎక్కువ అయి, టైర్లు అరిగి పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

4. సేఫ్ కార్ డ్రైవింగ్ లో, న్యూటన్ మొదటి సూత్రం మనకెందుకు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 13, 2013 at 11:08 ఉద.

4. సేఫ్ కార్ డ్రైవింగ్ లో, న్యూటన్ మొదటి సూత్రం మనకెందుకు ? 

 
సేఫ్ కార్ డ్రైవింగ్ అంతా కీలకమైన భౌతిక సూత్రాల మీదా , నడిపే వారి నిపుణత మీదా ఆధార పడి ఉంది అనడం లో అతిశయోక్తి లేదు ! మనమంతా చిన్న తనం లోనే చదివి ఉన్నాం కదా న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి ని , చెట్టు మీద ఉన్న యాపిల్ పండు పడినప్పుడు పైకి ఎందుకు పోవట్లేదు , క్రిందే ఎందుకు పడుతుంది ? అని ఆలోచించి , కనుక్కున్నాడని ! అంతే కాక యాంత్రిక శాస్త్రం లో  ముఖ్యమైన మూల సూత్రాలను కూడా ఆవిష్కరించాడు న్యూటన్  ! అందులో మొదటి సూత్రం , ‘ ప్రతి వస్తువూ నిశ్చల స్థితి లో కానీ , ఒక స్థిరమైన వేగం తో ప్రయాణిస్తున్నప్పుడు కానీ , ఏ బాహ్య శక్తీ దాని గతి మార్చనంత వరకూ అదే స్థితిలో ఉంటుంది ” అని. మరి వాహనాలు నడిపే సమయం లో ,ఈ న్యూటన్ మొదటి సూత్రం ప్రాముఖ్యత ఏమిటి ? అని మనం ప్రశ్నించుకుంటే అసలు విషయం బోధ పడుతుంది ! ఉదాహరణ కు మనం కారులో గంటకు ముప్పై మైళ్ళ వేగం తో ప్రయాణిస్తున్నాం అంటే దాని అర్ధం కారు తో పాటు గా మన వేగం కూడా గంటకు ముప్పై మైళ్ళ నే గా ! మనం కారులో స్థిరం గా కూర్చున్నప్పటికీ ! ఎందుకంటే , మనం కారు వేగం తో కూడా ప్రయాణిస్తున్నాం కనక ! అంటే కారు ఒక వేగం లో పోతూ ఉన్నప్పుడు , మన వేగం కూడా కారు వేగం తో  సమానం గా ఉంటుంది. 
మరి ఈ వేగాలకూ , మన సేఫ్ టీ కీ సంబంధం ఏమిటి ? : వేగం గా వెళ్ళే కారు ను అకస్మాత్తు గా, ఏ కారణం చేతనైనా ఆపడం జరిగినా , లేదా ఎదుటి వాహనం ఏదైనా , ప్రయాణిస్తున్న కారు ను గుద్దినా , కూడా కారు అకస్మాత్తు గా ఆగుతుంది కదా ! అంటే కారు వేగం ఒక్క సారిగా మారిపోయి , ఆ కారు ఆగుతుంది ! కానీ కారు వేగం తో ప్రయాణం చేస్తున్న , కారులో ఉన్న వారి వేగం మారదు ! అంటే , కారును బ్రేకు వేసి ఆపడం జరిగినా , లేదా ఎదుటి కారు వచ్చి ఆ కారును గుద్ది అకస్మాత్తు గా ఆపినా కూడా, కారు మాత్రమే ఆగుతుంది కానీ, కారు లో అంతే వేగం తో ప్రయాణం చేస్తున్న వారి వేగం  మారదు ! అందు వల్ల నే , బారత దేశం లో మోటారు వాహన ప్రమాదాలు చాలా వాటి లో ఇట్లా అకస్మాత్తు గా కారు ఆగినప్పుడు ( ప్రమాదాలలో సర్వ సామాన్యం గా జరిగేది అదే కదా ! ) ఆ కారులో ప్రయాణం చేస్తున్న వారు కూడా అంతే వేగం తో వారు కూర్చున్న స్థానం నుంచి విసిరి వెయ బడతారు ! అప్పుడు ఎదురుగా ఉన్న విండ్ స్క్రీన్ గుండా బయటకు విసిరి వేయ బడతారు ! లేదా కారు లో వెనక సీట్లో కనక ప్రయాణం చేస్తూ ఉంటే , కారు లో కానీ , లేదా పక్క విండో నుంచి కానీ టాస్ చేయ బడతారు !  దానితో ప్రమాదం తీవ్రత ఎక్కువ గా ఉంటుంది ! 
మరి ఇతర దేశాలలో ఈ ప్రమాద తీవ్రత ఎందుకు తక్కువ గా ఉంటుంది ? 
ఇతర దేశాలలో ,ముఖ్యం గా యూ రప్ దేశాలన్నిటిలో కూడా , కారు లో ప్రయాణించే ప్రతి వారూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి ! పైన ఉదహరించిన ప్రమాదాలలో , సీట్ బెల్ట్ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు ! ఎందుకంటే , అతి వేగం గా పోతూ ఉన్న  కారు ఏ  కారణం చేతనైనా , అకస్మాత్తు గా ఆగినపుడు , కారు వేగం తో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను , అంతే వేగం తో కారు నుంచి విసిరి వేయ బడకుండా నివారించే బ్రేకు ల లా పనిచేసి, వారికి ప్రమాద తీవ్రత ను నివారించ డమూ , లేదా చాలా వరకూ తగ్గించడమూ చేస్తాయి , సీట్ బెల్ట్ లు ! అనేక ప్రమాదాల పరిశీలన చేసి , ఈ విషయం నిర్ధారింప బడింది. మరి భారత దేశం లో, కార్ల ను విపరీతమైన వ్యామోహం తో కొనుక్కుంటున్నారు జనాలు ! కానీ  కారు మీద ఉండే వ్యామోహం , వారి రక్షణ మీద ఉండట్లేదు !  యురోపియన్ వాసులదైనా , భారతీయులదైనా , ప్రాణం విలువ ఒకటే కదా ! మరి భారత దేశం లో ఇటు వాహన వాడక దార్లు కానీ , అటు ప్రభుత్వం వారు కానీ ఈ శాస్త్రీయ మైన యదార్ధాన్ని పట్టించుకోవట్లేదు ఎందుకు ? 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

3. సేఫ్ కార్ డ్రైవింగ్. ప్రత్యామ్నాయ ఇంధన కార్లు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఆగస్ట్ 12, 2013 at 2:57 సా.

3. సేఫ్ కార్ డ్రైవింగ్. ప్రత్యామ్నాయ ఇంధన కార్లు ! 

పైన ఉన్న చిత్రం , పూర్తి గా విద్యుత్ శక్తి ( బ్యాటరీ చార్జింగ్ తో ) తో నడిచే చిన్న కారు , నిస్సాన్ లీఫ్ !

పెట్రోలు , డీజెల్ ధరలు పెరిగిపోతూ , సామాన్యుల జీతాలన్నీ , కారులో ఇంధనానికే పోతున్నాయి కదా ! అందుచేత ప్రపంచం  లో లో చాలా దేశాలలో , ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిపే కార్ల మీద పరిశోధనలు చేయడం , చేస్తూ ఉండడం జరుగుతుంది ! 
ఏ కారణం చేతనైనా పెట్రోలూ , డీజెల్ తో నడిచే కార్లు ఇష్టం లేని వారు , వారి ఆర్ధిక పరిస్థితి బట్టి ( కొంత కాలం ఆగి అయినా సరే ) ఈ ప్రత్యామ్నాయ కార్లను కొనుక్కోవచ్చు ! 
ఈ కోవ కు చెందిన కార్లు ముఖ్యం గా విద్యుత్ శక్తి తో నడుస్తాయి ! ఇప్పటికే మార్కెట్ లో కొంత బ్యాటరీ తోనూ , కొంత పెట్రోల్ తోనూ నడిచే హైబ్రిడ్ కార్లు అందుబాటు లో ఉన్నాయి కదా !  కానీ కొన్ని కార్లు పూర్తి గా విద్యుత్ శక్తి తో నడిచేవి కూడా మార్కెట్ లో ( ప్రత్యేకించి యూ రోపియన్ మార్కెట్ లలో ) ప్రవేశ పెట్టడం జరిగింది ! 
క్లుప్తం గా ఈ ప్రత్యామ్నాయ ఇంధన కార్ల గురించి తెలుసుకుందాం ! 
1. హైబ్రిడ్ కార్లు : ఈ కార్లు , రెండు రకాల ఇంధనాలనూ ఉపయోగించుకుంటాయి, అంటే బ్యాటరీ విద్యుత్తూ , పెట్రోలూ , లేదా డీజెల్  కలిపి వాడడం వలన కొన్ని కార్లలో ఇంధనం పొదుపు అవుతుంది ! 
2. ప్లగిన్ హైబ్రిడ్ కార్లు : ఈ కార్లలో బ్యాటరీని తరచూ చార్జ్ చేసుకోవడమే కాకుండా , దాని ఖర్చు తో పాటుగా పెట్రోలు కూడా పోయిస్తూ ఉండాలి ! ఇది అననుకూలం గా ఉండడం తో పాటుగా , ఖర్చు తో కూడిన పని ! ముందు ముందు చౌక అవుతాయేమో !
3. ఇథనాల్ కార్లు : ఈ రకమైన కార్లలో ఇథనాల్ పది నుంచి పదిహేను శాతం పెట్రోలు తో కలిపి ఉన్న ఇంధనాన్ని వాడతారు. అమెరికా లో ఇప్పటికే 80 లక్షల వాహనాలు ఈ ఇథనాల్ కలిసిన ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి కానీ , మైలేజ్ ఎక్కువ ఇవ్వక పోవడమే కాకుండా , అన్ని పెట్రోల్ స్టేషన్ లలోనూ ఈ ఇంధనం లభ్యం అవక పోవడం ఇంకో లోపం ! 
4. కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ కార్లు : ఈ ఇంధనం కూడా , స్థానికం గా పుష్కలం గా లభ్యం అయే దేశాలలో  పొదుపు గా ఉంటుంది , వాడే వారికి !
5. డీజెల్ /బయో డీజెల్ కార్లు : వీటిలో , డీజెల్ తో పాటుగా , బయో డీజెల్ ను కలుపుతారు. ఇంజన్ చాలా శబ్దం చేస్తూ ఉంటుంది ! 
6. హైడ్రో జెన్ ఇంధన కార్లు : ఈ ఇంధనం కారులో వాడితే విష వాయువు లు ఏమీ రావు కేవలం నీటి ఆవిరి తప్పితే , కానీ ఈ ఇంధనం తయారు చేసే సమయం లో బొగ్గు పులుసు వాయువు ( అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువు ) ఎక్కువ గా విడుదల అవుతుంది. అంతే కాకుండా ఈ హైడ్రోజెన్ ఇంధనం , రవాణా లోనూ , నిలువ చేయడం లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి ప్రస్తుతం ! వాటిని పరిష్కారం చేసే పని లో ఉన్నారు శాస్త్రజ్ఞులు ! 
7. బ్యాటరీ ఎలెక్ట్రిక్ కార్లు : ఈ కార్లు , చాలా తక్కువ ఖర్చు తోనే ఎక్కువ దూరం ప్రయాణం చేయకలవు పెట్రోలు , డీజెల్  తో పోలుస్తే , కానీబ్యాటరీ చార్జ్ చేసుకోవడం చాలా సమయం పడుతుంది , వాటిని కూడా పరిష్కరించే దిశలో ముందంజ వేస్తున్నారు శాస్త్రజ్ఞులు ! 
8. పూర్తి గా బయో డీజెల్ కార్లు : మొక్క జొన్న నుంచీ , లేదా ఇంట్లో వంటకు వాడి పారబోసే నూనె లాంటి నూనెలు వాడి నడిపే కార్లు ! వీటిమీద కూడా పరిశోధనలు వేగం గా జరుగుతున్నాయి ! 
పైన ఉన్న వీడియో, హయుండాయ్ వారి పూర్తి హైడ్రో జెన్ బ్యాటరీ శక్తి తో నడిచే కారు ! i 35 !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

2. సేఫ్ కార్ డ్రైవింగ్. కారు కొనే ముందు ఆలోచించ వలసిన విషయాలు ….

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 10, 2013 at 10:42 సా.

2. సేఫ్ కార్  డ్రైవింగ్. కారు కొనే ముందు ఆలోచించ వలసిన విషయాలు  …. 

రోజూ ప్రయాణం లో భాగం గా ,   A నుంచి B కి వెళ్ళే ముందు కొన్ని  నిమిషాలు ఈ క్రింది విషయాలు ఆలోచించాలి !
1. వెళ్ళే చోటు  చాలా దూరమా , లేక నడక , సైకిల్  మీద వెళ్ళ వచ్చా ? అనే విషయం. ఎందుకంటే , తక్కువ దూరాలకు , తరచూ కారులో ప్రయాణిస్తే , కారు ఎక్కువ మైలేజీ ఇవ్వక పోవడమే కాకుండా , ఇంజన్ కూడా త్వరగా పాతదవుతుంది ! తరచూ గేర్ లు మార్చుతూ యాక్సిలరేట్ చేస్తూ ఉండడం వల్ల ,  పొల్యూ షన్ , అంటే వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది ! మనం ఉండే ఏరియా లో ఎక్కువ మంది కి ఈ అవగాహన ఉంటే , ఆ ఏరియా పొల్యూ షన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. గమనించ వలసినది , ఒక్క రోజు తో మన శరీరం కాలుష్యం చెంది అనారోగ్యం పాలవడం జరగదు. వాతావరణ కాలుష్యం , అనేక నెలలూ , సంవత్సరాల తరబడి జరుగుతూ   ఉంటే , దాని పరిణామాలు ,ఆరోగ్యం  మీద  పడతాయి !
 ఇతర ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చా ? బస్సు లోకానీ , రైలు లో కానీ వెళ్ళ వచ్చా ? లేదా కారు లోనే వెళ్ళాలను కుంటే , కారును ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చా ? ( విదేశాలలో , ఆర్ధిక మాంద్యం దృష్ట్యా , కారు స్వంత దారులు, నలుగురు,  ఒకే చోటినుంచి బయలు దేరుతూ ఉంటే , వారు వంతుల వారీ గా రోజు కొకరు డ్రైవ్ చేస్తారు , వారి కారులో మిగతా వారు కూర్చుంటారు ! ఇట్లా చేయడం స్నేహాన్ని పెంచడమే కాకుండా , అందరికీ డబ్బు కూడా ఆదా అవుతుంది ! ) 
2. వాతావరణం లో కేవలం విష వాయువుల తోనే కాకుండా , శబ్ద కాలుష్యం కూడా మానవులను చీకాకు పరుస్తుంది. ఈ శభ్ద కాలుష్యం ప్రత్యేకించి , భారత దేశం లో ఎక్కువ గా ఉంటుంది. విదేశాలలో , ఒక వెయ్యి కార్లు రోడ్డు మీద ఉంటే , ఒకటో రెండో కార్లు మాత్రమే హార్న్ మోగించడం వినబడుతుంది ! భారత దేశం లో రోడ్డు  ఇక పోల్చ నవసరం లేదనుకుంటా ! 
3. కారు కొందామనే నిర్ణయం తీసుకునే ముందు ,
a. కొత్త కారు కొనడమా , లేక సెకండ్ హాండ్ కారు పరవాలేదా ? అనే విషయం. ఉదాహరణకు , పాశ్చాత్య దేశాలలో ఒక లక్ష మైళ్ళు చేసిన కారు ఏదైనా , ఒక పది వేల రూపాయలకే కొనవచ్చు ! అంటే , కొత్త కారు విలువ సంవత్సరానికి కనీసం ఇరవై శాతం పడి పోతుంది ! సరిగా సర్విసింగ్ చేయించి ఒక్కరే నడిపిన కారు కూడా తక్కువ ధరకే కొన వచ్చు ! కానీ నాలుగు చేతులు మారిన కారు , ఎక్కువ రిపేర్ లతో , ఒక తెల్ల ఏనుగు అవవచ్చు , అత్యాశకు పోయి తక్కువ ధరలో కొంటే ! 
b . ఏ రకమైన ఇంధనం తో నడిచే కారు కొనాలని ? ఎందుకంటే,  డీజల్ తో నడిచే కార్లు ఎక్కువ మైలేజీ ఇస్తాయి , కానీ మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి వస్తేనే ! 
c. పాశ్చాత్య దేశాలలో నడుపుతున్న కారు , ప్రయాణం లో ఎక్కడైనా ఏ కారణం చేత నైనా చెడిపోతే , తగిన రిపేర్ లు చేయడానికి బీమా కంపెనీలు కుక్క గొడుగుల్లా ఉంటాయి. అట్లాంటి కంపెనీ లలో ఒకదానిలో బీమా తీసుకోవడం ఉత్తమం !
d . క్రమం గా కారు సర్విసింగ్ చేయించడానికి కూడా , కొంత డబ్బు చెల్లిస్తూ ఉండాలి. ప్రత్యేకించి, పాత బడుతున్న కార్లకు ఈ జాగ్రత్త ముఖ్యం. ( కొత్త కార్లకు సామాన్యం గా కనీసం అయిదేళ్ళ వరకూ వారంటీ ఉంటుంది ! ఆ వారంటీ ఉన్న కార్లను కొనుక్కోవడం ఇంకో ఆలోచన ! ) 
e . విదేశాలలో ప్రతి కారుకూ , పాత బడుతూ ఉంటే M O T పరీక్ష ఉంటుంది ( మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ ) పరీక్ష అని అంటారు. ఈ పరీక్ష ప్రతి కారు కూ  ప్రతి సంవత్సరమూ చేయించాలి  కంపల్సరీ గా ఎందుకంటే , ఈ పరీక్ష కారు ఆరోగ్యాన్ని తెలపడమే కాకుండా , అవసరమైన రిపేర్ లు చేయించ డానికి కూడా సూచనలు ఇస్తుంది !  ఈ పరీక్ష పాసవడం , ప్రతి కారు కూ కంపల్సరీ ! దానితో , కారు నడిపే వారే కాకుండా , రోడ్డు ను వాడే ఇతరులు కూడా సురక్షితం గా ఉంటారు ! 
f . పార్కింగ్ కు క్రమం గా చెల్లించ వలసిన డబ్బు ఎంత ఉంటుంది ? 
ఈ విషయాలన్నీ ఆలోచించుకుని , ఒక నిర్ణయం తీసుకోవాలి ! ముఖ్యం గా కారు కొనమనే ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోస పోకూడదు ! ఎందుకంటే ప్రతి ప్రకటనలోనూ , కారు కేవలం ఆరు లేదా ఎనిమిది సెకండ్ల కాలం లో సున్నా నుంచి అరవై మైళ్ళ వేగం చేరుకోగలరనే చెబుతూ ఉంటారు ! కానీ బాధ్యతా రహితం గా కారు నడిపితే , కైలాసానికి కూడా అంతే వేగం గా చేరుకోగలమనే వాస్తవాన్ని మాత్రం చెప్పరు ! అంతే కాకుండా , తెప్పలు తెప్పలు గా కార్లను రోడ్ల మీద ప్రవేశ పెట్టడానికి , అనేక మైన ఆకర్షణీయమైన ప్రకటనలూ ,పధకాలూ పెడతారు కానీ , కారు నడిపే రోడ్ల గురించి ఆలోచించరు , కారు కంపెనీలు కానీ , ప్రభుత్వం వారు కానీ ! వారి ఉద్దేశం లో కారు కొనుక్కుంటే , గాలి లో ప్రయాణం చేయాలనేమో ! 
మీరు నివసిస్తున్న చోటినుంచి మీరు చేరుకోవలసిన గమ్యం లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది?  ఆ పరిస్థితి బాగు పడే అవకాశం కనీసం వచ్చే పదేళ్ళ లోనైనా ఉందా ? అనే విషయాలు ఆలోచించి , కారు కొనుక్కోవాలి ! ఇంకో ముఖ్య మైన విషయం ! కారు ఒక గ్యాలను కు నలభై మైళ్ళు ప్రయాణించ వచ్చనీ , లేదా యాభై మైళ్ళు ప్రయాణం చేయ వచ్చనీ,  అనేక ప్రలోభాలు పెడుతూ ఉంటారు ! కానీ అవన్నీ స్టాండర్డ్ , అంటే ప్రామాణికమైన పరిస్థితులలోనే , ప్రాక్టికల్ గా అతి రద్దీ గా , అతి అధ్వాన్నం గా ఉండే రోడ్ల మీద కాదు !  అధ్వాన్నం గా ఉన్న రోడ్ల మీద , అతి రద్దీ గా ఉన్న ట్రాఫిక్ లో కారు నడిపితే , చాలా తరచు గా గేర్లు మార్చడం చేత , వాడు చెప్పిన నలభై మైళ్ళూ , కారు నడుపుతే, ఒక గ్యాలన్ కు బదులు రెండు గ్యాలన్ ల ఇంధనం తప్పని సరిగా అయి , ఖర్చు కాస్తా తడిసి మోపెడవుతుంది ! ఇక ప్రత్యామ్నాయ ఇంధనాలకోసం ప్రయత్నాలు చేసి,  ఎల్ పీ జీ గ్యాస్ తో కారు నడిపే,  అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు !  అట్లా చేయడం ,కారు నాణ్యతను దెబ్బ తీయడమే కాకుండా , పర్యావరణ కాలుష్యం తో పాటుగా ,ప్రమాదాల తీవ్రత ఎక్కువ కావడానికి కూడా అవకాశం చేజేతులా కలిగించుకోవడమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

1. రక్షిత కారు చోదకం ( సేఫ్ గా కారు నడపడం) ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 10, 2013 at 10:50 ఉద.

1. రక్షిత కారు చోదకం ( సేఫ్ గా కారు నడపడం)  ఎట్లా ? 

కారు సేఫ్ గా నడపడానికి  ప్ర ప్రధమం గా కావలసినది ,( right attitude ) రైట్ యాటి ట్యూ డ్, అంటే సరి అయిన ప్రవృత్తి . మోటు గా , ఓపిక కోల్పోయి , బాధ్యతా రహితం గా కారు నడిపితే , నడిపే వారే కాక , ఆ కారులో ప్రయాణిస్తున్న వారితో పాటుగా , రోడ్డును ఉపయోగిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రతా , పాద చారుల భద్రతా కూడా  అపాయం లో పడుతుంది. ఈ రైట్ యాటి ట్యూ డ్,   అనేక శారీరిక , మానసిక పరిస్థితుల మీద ఆధార పడి  ఉంటుంది. ముఖ్యం గా, సరిపడినంత నిద్ర లేకపోవడమూ , విపరీతం గా అలసి పోయి ఉండడమూ , లేదా మద్యం , ఇతర మాదక ద్రవ్యాలు తీసుకుని ఉండడమూ , లేదా తీవ్రమైన మనస్తాపం చెందుతూ ఉండడమూ , అంటే తీవ్రమైన మానసిక వత్తిడి తో ఉండడమూ – లేదా ఆహారం కానీ పానీయాలు కానీ చాలా సమయం వరకూ తీసుకోకుండా , డ్రైవ్ చేయడమూ – ఈ కారణాలన్నీ కూడా రైట్ యాటి ట్యూ డ్ ను తీవ్రం గా ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితులలో , ఓపిక నశించి డ్రైవింగ్ పొరపాట్లు చేసే రిస్కు ఎక్కువ అవుతుంది ! 
నిద్ర లేక పోవడం , అప్రమత్తత ను తక్కువ చేస్తుంది, అట్లాగే మద్యం సేవించడం వల్ల కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది కానీ ఆ కాన్ఫిడెన్స్ కేవలం ఫాల్స్ కాన్ఫిడెన్స్ మాత్రమే ! అంటే   ( తాగి ) డ్రైవింగ్ చేస్తున్న వారు , తాము వంద మైళ్ళ వేగం తో డ్రైవింగ్ చేస్తున్నా కూడా చాలా సురక్షితం గా డ్రైవ్ చేస్తున్నామనే ఆత్మ విశ్వాసం తో ఉంటారు, యాక్సిడెంట్ అయ్యే కొద్ది క్షణాల ముందు వరకూ కూడా ! అందుకని మద్యం తాగి కారు నడపడం నిషిద్ధం ! వారు టాక్సీ లో బార్ కు కానీ పబ్ కు కానీ వెళ్లి , ఇంటికి కూడా టాక్సీ లో వెళ్ళడమే ఉత్తమం , ఎందుకంటే , కనీసం , రోడ్డు మీద ఉన్న ఇతర ప్రయాణికులు సురక్షితం గా ఉంటారు , అట్లా చేస్తే ! ( ఈ సలహా తో , మద్యం తాగడాన్ని ప్రోత్స హిస్తున్నట్టు కాదు ! ) 
ఈ క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే , భారత దేశం లో 2010 లో రోడ్డు ప్రమాదాల వివరాలు గమనించ వచ్చు ! అందులో కనీసం నలభై శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల సంభవించినవే ! 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

రక్షిత కారు చోదకం ! సేఫ్ కార్ డ్రైవింగ్ ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఆగస్ట్ 9, 2013 at 9:39 సా.

రక్షిత కారు చోదకం ! సేఫ్ కార్ డ్రైవింగ్  ఎట్లా ? 

కారు ! నిత్య జీవితం లో ఒక అవసరం !   పల్లె లలో కారు, ఒక భోగ వస్తువు, అంటే కంఫర్ట్ ! ( కొన్ని  ధన వంతమైన పల్లె లలో కారు ఒక అవసరం గా మారింది , ఎక్కువ మంది కొంటూ ఉండడం చేత ! ) 
నగరాలలోనూ , పట్టణాలలోనూ , నివశించే ప్రజలకు , ప్రపంచీకరణ పుణ్యమా అని , కారు ఒక నిత్యావసర వాహనం అయింది ! ఏడాది కేడాది కీ కారు అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. కేవలం అమ్మకాలే కాకుండా , కారు ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ! కేవలం కారు కొనుక్కోవడం తో నే సరిపుచ్చు కోకుండా , ప్రతి కారు స్వంత దారుడూ , కారు నడపడం లో ఉన్న సాధక బాధకాలు ,వివరం గా తెలుసుకోవాలి !  కారు నడపడం గురించిన సంపూర్ణమైన అవగాహన ఏర్పడితే ,  అది సురక్షితమైన కారు చోదకానికీ , ఆనంద దాయకమైన జీవితానికీ కూడా సహాయకారి అవుతుంది !
మన దేశం లో కారు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత సులభం గా వస్తుందో  అందరికీ తెలిసినదే కదా ! కానీ కారు నడపడం కేవలం లైసెన్స్ రాగానే రాదు కదా !  కారు చోదకం అనే విషయం , జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి ! ఎప్పటి కప్పుడు నిపుణతను స్వంత గానే పరీక్షించుకుంటూ , రక్షిత చోదకానికి, అంటే సేఫ్ డ్రైవింగ్ కు నిబద్ధులై ఉండాలి ప్రతి చోదకుడూ ! వచ్చే టపా నుంచి కారు సురక్షితం గా కారు నడపడం ఎట్లాగో , ఏ  ఏ  జాగ్రత్తలు అవసరమో తెలుసుకుందాం ! కారు నడపడం  అనే విషయం , మన ఆరోగ్యం తో ప్రత్యక్షం గా సంబంధించక పోయినా కూడా , నానాటికీ పెరుగుతున్న కారు ప్రమాదాల రీత్యా , అట్లాంటి ప్రమాదాల బారిన పడకుండా , నివారణ కు , ప్రతి కారు చోదకుడూ , తెలుసుకోవలసిన , డ్రైవింగ్ టిప్స్ గురించి మనం వచ్చే టపా నుంచి తెలుసుకుందాం !  కొత్తగా కారు కొనే వారికే కాకుండా , ఈ విషయాలు కారు ఇప్పటికే నడుపుతున్న వారికీ , ఎంత గానో ఉపకరిస్తాయనడం లో సందేహం లేదు ! 

 

కేశవర్ధనం. హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 6, 2013 at 9:11 సా.

కేశవర్ధనం. హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు ? 

 
స్త్రీలలో కేశవర్ధనం గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా , క్రితం టపాలలో ! మరి పురుషులలో హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారో వివరం గా తెలుసుకుందాం ! దీనిని తెలుగులో జుట్టు మార్పిడి అనచ్చేమో ! ఎందుకంటే , ఈ పద్ధతిలో ముఖ్యం గా జుట్టు బాగా పెరుగుతున్న చోటినుంచి కొంత మేర జుట్టును తీసికొని ,జుట్టు ఊడిపోతూ ఉన్న ప్రదేశం లో అంటిస్తారు ! దీనినే హేర్  ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు ! 
ఈ క్రింది విధం గా  అసలు పధ్ధతి ఉంటుంది :  
1. పురుషులలో తల వెనుక భాగం లో పెరుగుతున్న జుట్టు చాలా కాలం వరకూ ఊడి పోకుండా పెరుగుతూ ఉంటుంది కదా !  అందువల్ల ఈ ప్రదేశం లోనుంచి కొంత మేర జుట్టును తొలగిస్తారు ! ఆ తొలగించడం కేవలం క్షవరం చేసి కాదు ! ఎందుకంటే, జుట్టు మొదలు మాతమే సజీవ కణం తో ఉంటుంది అంటే , వెంట్రుక మొదట్లోనే జీవం తో ఉన్న కణం ఉంటుంది దీనినే హేర్  ఫాలికిల్ అంటారు అది లేక పొతే వెంట్రుక పెరగదు ! అందువల్ల  అంటించ వలసిన జుట్టును చర్మం తో సహా తీస్తారు ! అంటే  ఆ తల భాగం లో నొప్పి తెలియకుండా మత్తు ఇస్తారు. దీనిని స్థానిక అనస్తీశియా అంటారు అంటే లోకల్ అనస్థీసియా అని. దీనివల్ల స్పర్శ జ్ఞానం తాత్కాలికం గా పోతుంది. దానితో నొప్పి తెలియదు. అప్పుడు సమాంతరం గా ఒక చిన్న స్కేలు మందాన తల వెనుక భాగం లో గాటు అంటే అది దీర్ఘ చతురస్రాకారం గా ఉంటుందన్న మాట ! అంత మేర చర్మాన్ని ( అంటే వెంట్రుకలతో సహా ) కట్ చేస్తారు పదునైన సర్జికల్ నైఫ్ తో ! ( ఇంకో పధ్ధతి లో చర్మాన్ని కట్ చేయకుండా కేవలం ఒక్కొక్క వెంట్రుకనూ , దాని మూలం తో సహా ‘ పెకిలిస్తారు’ జాగ్రత్త గా , ప్రత్యేకమైన పరికరం తో , దీని వివరణ పైన ఉన్న చిత్రం లో ఉంది గమనించండి ).
2. అట్లా తీసిన భాగం లో వచ్చిన గ్యాప్ ను కుట్టివేస్తారు రెండు చివరాలా కలిపి. ఈ గాయానికి అంటే , కత్తి  తో చేసిన గాయానికి పైనా , క్రిందా కూడా జుట్టు సహజం గానే పెరుగుతూ ఉంటుంది కనుక , ఆ గాయం మాన గానే , అక్కడ చేసిన గాటు ద్వారా ఏర్పడిన మచ్చ కనబడదు ఎందుకంటే ఆ మచ్చ పై భాగం లో పెరుగుతూ ఉన్న జుట్టు క్రిందకు పెరిగి మచ్చను కనబడకుండా చేస్తుంది ! 
3. ఇపుడు దీర్ఘ చతురస్రాకారం లో తీసిన చర్మం నుంచి వెంట్రుకలను అతి జాగ్రత్తగా వేరు చేస్తారు ! అతి జాగ్రత్తగా ఎందుకంటే , ఈ వెంట్రుకలను కేవలం పీకేయ్యకుండా , వారి మొదళ్ళు కూడా ఉండేట్టు ‘ పెకిలిస్తారు ‘ మనం పైన తెలుసుకున్నాం కదా , వెంట్రుకల మొదళ్ళ లోనే సజీవ కణం ఉండేది ! ఆ కణం కనుక ప్రాణం కోల్పోతే , వెంట్రుక పెరగదు ఇక ! అందుకని ! ఇట్లా వెయ్యి నుంచి  రెండు వేల వరకూ వెంట్రుకలను ఆ తల వెనుక నుంచి  కత్తిరించిన చర్మ భాగం నుంచి వేరు చేస్తారు ! ఇది చాలా సమయం తీసుకుంటుంది సహజం గానే ! 
4. ఇట్లా వేరు చేసిన వెంట్రుకలను తల పైభాగం లో అంటే కాస్త ముందు భాగం లో ( ఎక్కడైతే బట్ట తల గా ఉంటుందో ఆ ప్రదేశం లో ) అతికిస్తారు ఒక్కటొక్కటి గా !  ‘ అతికించడం ‘ అంటే కేవలం జిగురు తో అతికించడం అనుకునేరు ! కాదు !  ఒక్కో వెంట్రుకనూ , మొదళ్ళ తో సహా అత్యంత జాగ్రత్త గా పెకిలించి , కేవలం జిగురుతో అతికిస్తే ఏం ప్రయోజనం ? వెంట్రుక మొదళ్ళ లో ఉన్న సజీవ కణం నశిస్తుంది అట్లా చేస్తే ! అందువల్ల ఒక్కొక్క వెంట్రుకనూ , మళ్ళీ  ప్రత్యేక మైన శ్రద్ధ తో ఒక్కో చిన్న కత్తి గాటు పెట్టి ఆ గాటు లో , వెంట్రుక మొదలు ను అంటే ఫాలికిల్ ను ‘ పాతుతారు ‘ ఈ మొత్తం కూడా చాలా సమయమూ , శ్రమా తీసుకుంటుంది ! 
5. ఈ మొత్తం పధ్ధతి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పట్ట వచ్చు ! 
6. రెండు మూడు వారాలలో తల వెనుక చేసిన గాయమూ , తల మీద చేసిన చిన్న చిన్న గాయాలూ ( లేదా గాట్లూ ) పూర్తి గా మానుతాయి ! 
7. కొందరు వైద్యులు, తల మీద ఈ సమయం లో రాసుకోడానికి మినాక్సిడిల్  కూడా వాడమని సలహా ఇస్తారు ! అంతే కాక యాంటీ బయాటిక్స్ కూడా అవసరం ఉండవచ్చు , ఈ సమయం లో ! పైన ఉన్న చిత్రం లో వివరణ అంతా కనిపిస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో కేశవర్ధనం. 8. మినాక్సిడిల్ మంచిదేనా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 3, 2013 at 11:51 ఉద.

స్త్రీలలో కేశవర్ధనం. 8. మినాక్సిడిల్  మంచిదేనా ? 

 
స్త్రీలలో జుట్టు పలుచ బడడం నివారించడానికి మార్కెట్ లో అనేక మందులు లభ్యం అవుతున్నాయి కదా ? అందులో ఏవి మోసం, ఏవి నిజం ?  ఈ సంగతులు వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఎవరూ చెప్పరు, కొనే వారికి ! ఎందుకంటే , వారికి కావలసినది కేవలం మీ డబ్బే కదా ! మరి మీరు జాగ్రత్త వహించి , ఆ మందులు నిజం గా పనిచేస్తాయో లేదో  తెలుసుకోవాలి. 
అమెరికాలో భారత దేశం లో లాగా కాక , మార్కెట్ లో అమ్మే ప్రతి మందునూ , పరీక్ష చేసి , ఆమందు నిజం గా నే ఉపయోగకరమో లేదో నిర్ణయించి దానిని మాత్రమే అప్రూవ్ చేస్తారు.  స్త్రీలలో జుట్టు పలుచ బడడానికి  అలోపీశియా ఏరి యేటా అనే జబ్బు ఒక ముఖ్య కారణం. ( దీనిని గురించి వివరం గా క్రిందటి టపాల లో తెలుసుకున్నాం కదా ! ) ఈ కండిషన్ లో తల మీద ఏ ఒక్క భాగం లోనో కాకుండా , తలంతా జుట్టు పలుచ బడుతుంది అంటే ఒత్తు గా ఉన్న జుట్టు పలుచ బడుతుంది. దీనికి వివిధ మందుల తో అవసరం లేని నివారణ చర్యలే కాకుండా , మందులతో కూడా చికిత్స చేయ వచ్చు ! 
అమెరికా వారు దీనికోసం అప్రూవ్ చేసిన మందు ఒకటంటే ఒకటే ! దానిపేరు మినాక్సిడిల్. దీని గురించి తెలుసుకుందాం ఇప్పడు . 
మినాక్సిడిల్  మొదట అధిక రక్త పీడనం , అంటే హై బీపీ ని తక్కువ చేయడానికి కనుక్కో బడ్డది. అధిక రక్త పీడనం తక్కువ చేయడం లో చికిత్స గా తీసుకుంటున్న వారిలో , కొత్త వెంట్రుకలు మొలవడం శాస్త్రజ్ఞులు గమనించారు ! దానితో తరువాత పరిశోధనలు కూడా చేసి , మినాక్సిడిల్ ను జుట్టు పెరగడం కోసం ఉపయోగించుకునే విధం గా ,మార్కెట్ లో ,హేర్ ఆయిల్ రూపం లో ప్రవేశ పెట్టారు. ఈ మినాక్సిడిల్ మార్కెట్ లో, రొగైన్ అనే పేరుతొ అమ్మ బడుతుంది. గుర్తుంచుకోవలసిన విషయం : ఈ మినాక్సిడిల్ రెండు శాతం మాత్రమే ఉండాలి, కొనే మందులలో.  కొన్ని బ్రాండ్ లలో అయిదు శాతం మినాక్సిడిల్  అమ్ముతారు. అయిదు శాతం మినాక్సిడిల్ ఉండే హేర్  టానిక్ లకు అమెరికా వారు లైసెన్స్ ఇవ్వలేదు. అందువల్ల కొనే సమయం లో కేవలం రెండు శాతం మినాక్సిడిల్ ఉన్న బ్రాండ్ లే కొనుక్కోవాలి , అయిదు శాతం మందు ఉంటే  ఎక్కువ జుట్టు వస్తుందేమో అని అత్యాశ కు పోకుండా ! ఎక్కువ శాతం అంటే రెండు శాతం కన్నా ఎక్కువ శాతం మినాక్సిడిల్  కనుక పూసుకుంటే , రక్త పీడనం తగ్గి లో బీపీ వచ్చి కళ్ళు తిరగడమూ , లేదా సొమ్మసిలి పడి పోవడమూ జరగ వచ్చు. ఎందుకంటే  మినాక్సిడిల్ , తల మీద పూసుకున్నపుడు , చర్మం ద్వారా శరీరం లోకి పీల్చబడి రక్త పీడనాన్ని తగ్గిస్తుంది ! 
మరి మినాక్సిడిల్ నిజంగానే స్త్రీలలో ఉపయోగ పడుతుందా ?: ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవలసినది, ఆ మందు వాడుదామనుకునే వారే ! ఎందుకంటే   ఈ మినాక్సిడిల్  మీద చేసిన పరిశోధన ఈ క్రింది విధం గా ఉంది :
1. మినాక్సిడిల్ వాడిన వారి వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంది. 
2. వారికి మైల్డ్ నుంచి మోడరేట్ గా జుట్టు పలుచబడి ఉంది ( అంటే కొద్ది నుంచి ఒక మోస్తరు గా పలుచబడి ఉంది )
3. వారికి ఎనిమిది నెలలు మినాక్సిడిల్ ఇవ్వబడింది అంటే తల మీద రాసుకునే రెండు శాతం మందు గా . 
4. అట్లా వాడిన వారిలో 40 శాతం మందికి కొద్దిగానూ , 19 శాతం మందికి ఒక మాదిరి గానూ జుట్టు పెరిగినట్టు గమనించారు. అంటే వంద మంది వాడితే , రమారమి అరవై మందికి, ఎనిమిది నెలల తరువాత జుట్టు కొంత వరకూ పెరిగింది, మినాక్సిడిల్ తో ! 
5. అదే సమయం లో ఆ మందు అప్లై చేసుకోకుండా కేవలం తల నూనె పెట్టుకున్న వారికి కూడా 7 శాతం మంది లో ఒక మాదిరిగానూ , 33 శాతం మందికి కొద్ది గానూ జుట్టు పెరిగింది ! అంటే వంద మంది ఏ మందూ వాడక పోయినా కూడా నలభై  మందిలో జుట్టు కొంత వరకూ పెరిగినట్టు గమనించడం జరిగింది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
%d bloggers like this: