10. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). రోడ్డు మీద మన కారు పొజిషన్ ఎట్లా ఉండాలి ?
‘ తప్పించుక తానొవ్వక , తిరుగు వాడు ధన్యుడు సుమతీ ‘ అని సుమతీ శతక కారుడు శతాబ్దాల క్రితమే అన్నాడు ! ఆ సూక్తి కారు డ్రైవింగ్ లోనూ పనికొస్తుంది !
ఒక సారి కారు లో కూర్చుని రోడ్డు మీద పడ్డాక , మళ్ళీ కారును ఇంటికి చేర్చే వరకూ , రోడ్డు మీద ప్రయాణం చేస్తూ కూడా , నిరంతరం , మన పొజిషన్ ను , అంచనా వేసుకుంటూ , అప్రమత్తత తో కారు డ్రైవింగ్ చేయాలి ! ఎందుకంటే , సురక్షిత కారు చోదకం , మన కారు ఒక్క దాని మీదే , ఆధార పడి ఉండదు కదా ! అనేక మైన అవాంతరాలు రోడ్డు మీద తారస పడవచ్చు మనకు ! ఈ క్రింది జాగ్రత్తలు సురక్షిత డ్రైవింగ్ కు ఎంతగానో ఉపయోగ పడతాయి :
1. ఫుట్ పాత్ కు దగ్గర గా డ్రైవింగ్ చేయకూడదు. పాద చారుల కదలికలు దృష్టి లో ఉంచుకోవాలి.
2. పార్క్ చేసి ఉన్న కార్ల మధ్య నుంచి బయటకు త్వర త్వరగా రాకూడదు.
3. ఎట్టి పరిస్థితులలోనూ , పేవ్ మెంట్, అంటే ఫుట్ పాత్ మీద డ్రైవ్ చేయకూడదు !
4. సైకిలిస్ట్ ల రూట్ లో కారు నడప కూడదు.
5. అదే విధం గా బస్సులు ఆగే చోటా కారు నడప కూడదు !
( విదేశాలలో , సైకిళ్ళూ , బస్సులూ , నడపదానికీ , ఆపడానికీ , ప్రత్యేకమైన లేన్ లు ఉంటాయి ! , భారత దేశం లో ఆ పరిస్థితి కనపడదు ! )
6. కానీ కొన్ని బారత పట్టణాలలో , కొన్ని చోట్ల , ప్రత్యేక మైన లేన్ లు గీయబడి ఉంటాయి. ఆ యా చోట్ల , లేన్ డిసిప్లిన్ తప్పని సరిగా పాటించాలి ! అందరి భద్రత కోసమూ !
ఎప్పుడు ఓవర్ టేక్ చేయాలి ?
ఈ విషయం కన్నా ఎప్పుడు ఓవర్ టేక్ చేయ కూడదో తప్పని సరిగా గుర్తు ఉంచుకోవాలి
1. మన కు ఎదురుగా వ్యూ స్పష్టం గా లేనప్పుడు , అంటే స్పష్టం గా కనిపించనప్పుడు , ఓవర్ టేక్ చేయకూడదు !
2. ఇతర డ్రైవర్ లకు మనం కానీ మన కారు కానీ కనిపించట్లేదని పించినప్పుడు మనం ఓవర్ టేక్ చేయ కూడదు ! ఇతర డ్రైవర్లు అప్రమత్తం గానే డ్రైవ్ చేస్తారు లే అనే నిర్లక్ష్యా భావం తో డ్రైవ్ చేయడం , ప్రమాదాలను ఆహ్వానించడమే !
3. ఓవర్ టేక్ చేద్దామనుకునే ఏరియా కానీ , చోటు కానీ తక్కువ గా ఉన్నప్పుడు , ఓవర్ టేక్ చేయ కూడదు !
4. మన ఎదురుగా ఉన్న రోడ్డు న్యారో గా అవుతున్నపుడు , అంటే మనం ప్రయాణిస్తున్నప్పుడు విశాలం గా ఉండి , క్రమేణా సన్న బడుతున్నప్పుడు ఓవర్ టేక్ చేయడం సురక్షితం కాదు !
5.ఇంకొద్ది దూరం లో కానీ ( లేదా ఇంకొన్ని క్షణాలలో కానీ ) జంక్షన్ ను కనుక చేరుకో బోతుంటే , ఓవర్ టేక్ చేయడం సురక్షితం కాదు ! ( అంటే జంక్షన్ లేదని ఖచ్చితం గా తెలిసి ఉంటేనే ఆ ప్రయత్నం చేయాలి )
6. మనం పల్లం అంటే దిగువ లో ప్రయాణం చేస్తూ , ఎదురు గా ఎత్తు గా ఉన్నప్పుడు ( దీనిని డెడ్ గ్రౌండ్ అంటారు ) ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం ! ఎందుకంటే ఎదురు గా రోడ్డు ఎత్తు గా ఉండడం వల్ల , మనకు వ్యతిరేక దిశ లో వచ్చే వాహనాల గురించి ఏ రకమైన అవగాహనా ఉండదు కనుక !
అంతే కాక , ఓవర్ టేక్ చేసే సమయం లో ముందు ఉన్న వాహనానికీ , మన కారు కూ మధ్య సరిపడినంత దూరం ఉండాలి ! చాలా దగ్గరగా ఉండి , ఓవర్ టేక్ చేస్తూ ఉంటే , మన కారు ముందు ఉన్న వాహనానికి , మనం ఓవర్ టేక్ చేస్తూ ఉన్నట్టు తెలియదు ! దానితో , ఆ వాహన దారు కూడా అదే సమయం లో ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తే , ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని జాగ్రత్తలు !