13. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). మోటార్ వే లో ఎట్లా డ్రైవ్ చేయాలి ?
రక్షిత కారు చోదకం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు మోటార్ వే లలోనూ , డ్యూ ఎల్ క్యారేజ్ వే లలో ఎట్లా డ్రైవ్ చేయాలో గమనించుదాము !
మోటార్ వే : మోటార్ వే సహజం గా ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ కు కానీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీ కి కానీ ఉండే రోడ్డు. మోటార్ వే ల మీద వేగం సామాన్యం గా గంట కు 60 నుంచి 70 మైళ్ళ వేగం తో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి ! గమనించ వలసినది , గంటకు అరవై మైళ్ళు అంటే 96 కిలో మీటర్లని , అట్లాగే గంటకు 70 మైళ్ళు అంటే 112 కిలో మీటర్లని. ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , గంటకు అత్యధిక వేగం ఎట్టి పరిస్తితులల్లోనూ 112 కిలో మీటర్లు లేక 70 మైళ్ళ కు మించ కూడదు.
మరి ప్రతి కారులోనూ స్పీడో మీటర్ లో 120 – 130 మైళ్ళు కూడా కనిపిస్తుంటాయి కదా ఆ వేగం తో ప్రయాణించ కూడదా ?
కారు వేగం పెరుగుతున్న కొద్దీ , కారును నియంత్రించే సమయం , ఇంకా కారు ఆగే దూరం కూడా పెరుగుతుంది. అంటే పది మైళ్ళ వేగం తో ప్రయాణిస్తున్న కారు ను సడన్ గా బ్రేక్ వేస్తే ,ఖచ్చితం గా బ్రేక్ వేసిన చోటే ఆగుతుంది కారు. అదే వేగం ఎక్కువ గా ఉన్నపుడు అంటే నలభై కానీ యాభై మైళ్ళ వేగం లో బ్రేక్ చేస్తే , కారు , బ్రేక్ చేసిన చోటే ఆగదు. కాస్త ముందుకు వెళ్లి ఆగుతుంది. ఇట్లా వేగం పెరుగుతున్న కొద్దీ , బ్రేక్ వేసిన చోట కాకుండా ఇంకా ముందుకు , ఇంకా ముందుకు పోయి కారు ఆగుతుంది ! అంటే కారు అత్యధిక స్పీడు లో వెళుతున్నపుడు , ఏదైనా ప్రమాదాన్ని నివారించాలని బ్రేక్ వేసినా కూడా , కారు ఆగే దూరం ఎక్కువ అవడం వల్ల , ఎదురుగా ఉన్న దానికి ( అది వాహనం కానీయండి, లేదా డివైడర్ కానీయండి ) తప్పకుండా గుద్దు కుంటుంది ! ఇక్కడ డ్రైవింగ్ చేసే వారు అప్ర మత్తత తో ఉన్నా కూడా, కారు అత్యధిక వేగం తో పోతూ ఉండడం వల్ల , వారి కంట్రోలు లో ఉండదు ! అందుకే , కారు ను వేగం పరిమితి దాటి డ్రైవ్ చేయడం ప్రమాదకరం.
స్లిప్ రోడ్ నుంచి మోటార్ వే లో ఎట్లా కలవాలి ?
స్లిప్ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నపుడు , కారు వేగం తక్కువ గా ఉంటుంది. అంటే అత్యధిక వేగం , యాభై నుంచి అరవై మైళ్ళు ఉంటుంది. కానీ మోటార్ వే లో కలిసే సమయం లో వేగాన్ని ఇంకా తగ్గించ వలసి ఉంటుంది కదా ! అదే సమయం లో MSM / PSL సూత్రాన్ని పాటించాలి. ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసినది , మోటార్ వే లో అంతకు ముందే ప్రయాణం చేస్తున్న వాహనాలకు ప్రయారిటీ ఇవ్వాలి అంటే , మన కుడి వైపు న ఉన్న మిర్రర్ లోనుంచి చూస్తే , వెనుక నుంచి మోటార్ వే లో వాహనాలు కనుక వస్తూ ఉంటే , వాటి ముందు స్లిప్ రోడ్ ను వదిలి మోటార్ వే లో కలవడం అత్యంత ప్రమాదకరం ! ఎందుకంటే , అట్లా కలిసే సమయం లో మన కారు వేగం తక్కువ గా ఉండి , వెనుక నుంచి వచ్చే వాహనాల వేగం అధికం గా ఉంటుంది, దానితో ప్రమాదాలకు రిస్కు ఎక్కువ అవుతుంది ! వెనుక వాహనాలు వెళ్ళాకనే , మోటార్ వే మీదకు ఎక్కాలి ! అంతే కాకుండా ఒక సారి స్లిప్ రోడ్ వదిలాక మోటార్ వే మీద అక్కడ స్పీడ్ తో అంటే 70 మైళ్ళ వేగానికి గేర్ లు మార్చుతూ , యాక్సిలరేట్ చేయాలి కారును .
మోటార్ వే నుంచి స్లిప్ రోడ్ లోకి ఎట్లా మారాలి ?
మోటార్ వే లో వేగం అధికం గా ఉంటుంది కదా , దానిని వదిలి స్లిప్ రోడ్ లోకి ప్రవేశించే సమయం లో ముందు గానే ఇండికేటర్ తో సూచించాలి స్లిప్ రోడ్ లో ప్రవేశించ బోతున్నట్టు ! అప్పుడు వెనుక ఉన్న వాహనాలు లేన్ మార్చుకోవడమో , లేదా వేగం తగ్గించు కోవడమో చేస్తాయి ! ప్రమాద నివారణ కోసం.
ఒక సారి స్లిప్ రోడ్ లో ప్రవేశించిన తరువాత , వేగాన్ని తగ్గించు కుంటూ పోవాలి !
లేన్ డిసిప్లిన్ అంటే ఏమిటి ? :
మోటార్ వే మీద ఒక డైరెక్షన్ లో మూడు లేన్ లు కనుక ఉంటే , మనం ఎప్పుడూ ఎడమ లేన్ లోనే కారు నడపాలి ! జంక్షన్ లు సమీపిస్తున్నప్పుడు , ఎక్కువ అప్ర మత్తత తో ముందూ , ప్రక్క లా వెళ్ళే వాహనాలను గమనిస్తూ ఉండాలి ! కనీసం రెండు మూడు కార్ల దూరం ముందరి కారు నుంచి మన కారు కు ఉండడం క్షేమ దాయకం ! మోటార్ వే లో మన కారును రివర్స్ చేయడం కానీ , సెంట్రల్ రిజర్వేషన్ ను దాటే ప్రయత్నం కానీ ఎప్పుడూ చేయ కూడదు , మనం వెళ్ళే డైరెక్షన్ సరి అయినది కాక పోయినా కూడా , ( వచ్చే రౌండ్ ఎబౌట్ , అంటే కూడలి దగ్గర దాకా డ్రైవ్ చేసి , మన దిశ మార్చు కోవాలి ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !