కేశవర్ధనం. హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు ?
స్త్రీలలో కేశవర్ధనం గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా , క్రితం టపాలలో ! మరి పురుషులలో హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారో వివరం గా తెలుసుకుందాం ! దీనిని తెలుగులో జుట్టు మార్పిడి అనచ్చేమో ! ఎందుకంటే , ఈ పద్ధతిలో ముఖ్యం గా జుట్టు బాగా పెరుగుతున్న చోటినుంచి కొంత మేర జుట్టును తీసికొని ,జుట్టు ఊడిపోతూ ఉన్న ప్రదేశం లో అంటిస్తారు ! దీనినే హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు !
ఈ క్రింది విధం గా అసలు పధ్ధతి ఉంటుంది :
1. పురుషులలో తల వెనుక భాగం లో పెరుగుతున్న జుట్టు చాలా కాలం వరకూ ఊడి పోకుండా పెరుగుతూ ఉంటుంది కదా ! అందువల్ల ఈ ప్రదేశం లోనుంచి కొంత మేర జుట్టును తొలగిస్తారు ! ఆ తొలగించడం కేవలం క్షవరం చేసి కాదు ! ఎందుకంటే, జుట్టు మొదలు మాతమే సజీవ కణం తో ఉంటుంది అంటే , వెంట్రుక మొదట్లోనే జీవం తో ఉన్న కణం ఉంటుంది దీనినే హేర్ ఫాలికిల్ అంటారు అది లేక పొతే వెంట్రుక పెరగదు ! అందువల్ల అంటించ వలసిన జుట్టును చర్మం తో సహా తీస్తారు ! అంటే ఆ తల భాగం లో నొప్పి తెలియకుండా మత్తు ఇస్తారు. దీనిని స్థానిక అనస్తీశియా అంటారు అంటే లోకల్ అనస్థీసియా అని. దీనివల్ల స్పర్శ జ్ఞానం తాత్కాలికం గా పోతుంది. దానితో నొప్పి తెలియదు. అప్పుడు సమాంతరం గా ఒక చిన్న స్కేలు మందాన తల వెనుక భాగం లో గాటు అంటే అది దీర్ఘ చతురస్రాకారం గా ఉంటుందన్న మాట ! అంత మేర చర్మాన్ని ( అంటే వెంట్రుకలతో సహా ) కట్ చేస్తారు పదునైన సర్జికల్ నైఫ్ తో ! ( ఇంకో పధ్ధతి లో చర్మాన్ని కట్ చేయకుండా కేవలం ఒక్కొక్క వెంట్రుకనూ , దాని మూలం తో సహా ‘ పెకిలిస్తారు’ జాగ్రత్త గా , ప్రత్యేకమైన పరికరం తో , దీని వివరణ పైన ఉన్న చిత్రం లో ఉంది గమనించండి ).
2. అట్లా తీసిన భాగం లో వచ్చిన గ్యాప్ ను కుట్టివేస్తారు రెండు చివరాలా కలిపి. ఈ గాయానికి అంటే , కత్తి తో చేసిన గాయానికి పైనా , క్రిందా కూడా జుట్టు సహజం గానే పెరుగుతూ ఉంటుంది కనుక , ఆ గాయం మాన గానే , అక్కడ చేసిన గాటు ద్వారా ఏర్పడిన మచ్చ కనబడదు ఎందుకంటే ఆ మచ్చ పై భాగం లో పెరుగుతూ ఉన్న జుట్టు క్రిందకు పెరిగి మచ్చను కనబడకుండా చేస్తుంది !
3. ఇపుడు దీర్ఘ చతురస్రాకారం లో తీసిన చర్మం నుంచి వెంట్రుకలను అతి జాగ్రత్తగా వేరు చేస్తారు ! అతి జాగ్రత్తగా ఎందుకంటే , ఈ వెంట్రుకలను కేవలం పీకేయ్యకుండా , వారి మొదళ్ళు కూడా ఉండేట్టు ‘ పెకిలిస్తారు ‘ మనం పైన తెలుసుకున్నాం కదా , వెంట్రుకల మొదళ్ళ లోనే సజీవ కణం ఉండేది ! ఆ కణం కనుక ప్రాణం కోల్పోతే , వెంట్రుక పెరగదు ఇక ! అందుకని ! ఇట్లా వెయ్యి నుంచి రెండు వేల వరకూ వెంట్రుకలను ఆ తల వెనుక నుంచి కత్తిరించిన చర్మ భాగం నుంచి వేరు చేస్తారు ! ఇది చాలా సమయం తీసుకుంటుంది సహజం గానే !
4. ఇట్లా వేరు చేసిన వెంట్రుకలను తల పైభాగం లో అంటే కాస్త ముందు భాగం లో ( ఎక్కడైతే బట్ట తల గా ఉంటుందో ఆ ప్రదేశం లో ) అతికిస్తారు ఒక్కటొక్కటి గా ! ‘ అతికించడం ‘ అంటే కేవలం జిగురు తో అతికించడం అనుకునేరు ! కాదు ! ఒక్కో వెంట్రుకనూ , మొదళ్ళ తో సహా అత్యంత జాగ్రత్త గా పెకిలించి , కేవలం జిగురుతో అతికిస్తే ఏం ప్రయోజనం ? వెంట్రుక మొదళ్ళ లో ఉన్న సజీవ కణం నశిస్తుంది అట్లా చేస్తే ! అందువల్ల ఒక్కొక్క వెంట్రుకనూ , మళ్ళీ ప్రత్యేక మైన శ్రద్ధ తో ఒక్కో చిన్న కత్తి గాటు పెట్టి ఆ గాటు లో , వెంట్రుక మొదలు ను అంటే ఫాలికిల్ ను ‘ పాతుతారు ‘ ఈ మొత్తం కూడా చాలా సమయమూ , శ్రమా తీసుకుంటుంది !
5. ఈ మొత్తం పధ్ధతి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పట్ట వచ్చు !
6. రెండు మూడు వారాలలో తల వెనుక చేసిన గాయమూ , తల మీద చేసిన చిన్న చిన్న గాయాలూ ( లేదా గాట్లూ ) పూర్తి గా మానుతాయి !
7. కొందరు వైద్యులు, తల మీద ఈ సమయం లో రాసుకోడానికి మినాక్సిడిల్ కూడా వాడమని సలహా ఇస్తారు ! అంతే కాక యాంటీ బయాటిక్స్ కూడా అవసరం ఉండవచ్చు , ఈ సమయం లో ! పైన ఉన్న చిత్రం లో వివరణ అంతా కనిపిస్తుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !