Our Health

Archive for ఆగస్ట్, 2013|Monthly archive page

15. సేఫ్ డ్రైవింగ్. స్కిడ్డింగ్ , ఆక్వా ప్లేనింగ్ ల గురించి ప్రతి కారు డ్రైవరూ ఎందుకు తెలుసుకోవాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 31, 2013 at 2:42 సా.

15. సేఫ్ డ్రైవింగ్. స్కిడ్డింగ్ , ఆక్వా ప్లేనింగ్ ల గురించి ప్రతి  కారు డ్రైవరూ ఎందుకు తెలుసుకోవాలి ? 

స్కిడ్డింగ్ అంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న కారు పట్టు తప్పి రోడ్డు మీదే జారుతూ ప్రయాణం చేయడం ! కారు డ్రైవింగ్ సమయం లో స్కిడ్డింగ్ జరిగుతున్న సమయం లో కారును సరిగా కంట్రోలు చేయలేక పొతే , కారు సరి అయిన సమయం లో , సరి అయిన చోట ఆగదు ! దానితో ప్రమాదాల రిస్కు ఎక్కువ అవుతుంది ! 
స్కిడ్డింగ్ ఏ పరిస్థితులలో జరుగుతుంది ? 
1. కారు ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద వాన కురుస్తూ ఉంటే, 
2. కారు ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద మంచు కురవడం కానీ స్నో పడడం కానీ జరిగితే ,
3. కారు ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద  ఫ్రాస్టు ఉండడం వల్ల ,
4. కారు ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద  ఆయిల్ కానీ డీజెల్ కానీ పడడం వల్ల ! 
5. కారు ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద  ఎక్కువ గా గులక రాళ్ళు ఉంటే కూడా ! 
పైన చెప్పుకున్న పరిస్థితులు భారత దేశం లో రోడ్ల మీద చాలా వరకూ కనిపిస్తూ నే ఉంటాయి , కాక పొతే మంచు ఎక్కువ గా ఉత్తర భారత దేశం లో కనిపిస్తుంది !  
4, 5 కారణాలు తప్ప మిగతా పరిస్తితు లన్నిటి లో కూడా కారు చక్రానికీ , అంటే టైరు కూ , రోడ్డు కూ మధ్య ఒక పలుచని నీటి పొర ఏర్పడుతుంది ! దానితో , కారు టైర్లు ప్రయాణం చేసే రోడ్డు మీద పట్టు అంటే గ్రిప్ కోల్పోతాయి !  ఆ పరిస్థితులలో కనుక బ్రేకులు వేసినా కూడా , కారు వెంటనే ఆగదు , అందువల్ల ప్రమాదాలు ఎక్కువ గా జరుగుతూ ఉంటాయి ! ప్రత్యేకించి ఇట్లా రోడ్డు తేమ గా ఉన్నపుడు , కారు వేగం తగ్గించక , మామూలు వేగం తో పోతూ ఉంటే , ఇట్లా ప్రమాదాలు జరగడానికి ఎక్కువ రిస్కు ఉంటుంది ! గమనించ వలసినది , పైన చెప్పిన కారణాలు అన్నీ కూడా స్పష్టం గా కనబడక పోవచ్చు రోడ్డు మీద , భోరున వాన పడుతుంటే తప్ప ! అందుకే ప్రతి డ్రైవరూ , కారు నడిపే సమయం లో అత్యంత అప్రమత్తత తో డ్రైవ్ చేయాలి ! వాన పడుతున్న సమయం లో కూడా కారు చక్రాల కూ రోడ్డు కూ  మధ్య ఎక్కువ నీరు ఉండి , కారు టైరు ను గాలి లో తెల్చేస్తుంది ! కారు అదుపు తప్పేది కూడా , ఆ కారణం చేతనే ! 
మరి స్కిడ్డింగ్ ను ఎట్లా నివారించాలి?
మనం కారు నడుపుతున్నప్పుడు , వాన ఎప్పుడు వస్తుందో , ఎప్పుడు ఎక్కువ అవుతుందో ఖచ్చితం గా చెప్పలేము కదా ! అప్ర మత్తత అతి ముఖ్యమైన లక్షణం. అప్రమత్తత తో మనం కారు నడిపే రోడ్డును నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి ! తేమ ఎక్కువ గా ఉన్నా , లేదా రోడ్డు మీద నీరు నిలిచినా కూడా , ఈ క్రింద సూచించిన విధం గా సురక్షితం గా కారును నియంత్రణ చేయాలి :
ఈ క్రింద ఉన్న యూ ట్యూబ్ వీడియో మీద క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ! 
1. కారు వేగాన్ని తగ్గించాలి 
2. యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి కారును ఎక్కువ వత్తిడి కి గురి చేయడం మంచిది కాదు , ఆ పరిస్థితులలో 
3. యాక్సిలరేషన్ తగ్గిస్తే , కారు చక్రాలు రోడ్డు మీద సరి అయిన వత్తిడి తో తిరగ గలవు !
4. అదే సమయం లో కారు స్టీరింగ్ వీల్ ను జాగ్రత్త గా తిప్పుతూ , ఆ తేమ / నీరు ఉన్న రోడ్డును దాటాలి 
భారత దేశం లో రోడ్ల మీద ప్రత్యేక మైన జాగ్రత్తలు అవసరమా ?
ఈ అనుమానమే అవసరం లేదు ! ఎందు కంటే ,
1. భారత దేశం లో రోడ్ సైన్స్ సరిగా ఉండవు 
2. రోడ్ లు సరిగా ఉండవు ( అంటే గుంటలతోనూ , రోడ్ వర్క్స్ తోనూ ఉంటాయి )
3. వాన బాగా కురిసి నప్పుడు పైకి చూడడానికి అంటా నీటి మయం గా ఉన్నా కూడా , మన కారు ప్రయాణం చేసే దోవ లో గుంటలు కూడా ఉండవచ్చు , అనేకం ! 
4. సురక్షితమైన పధ్ధతి వాన ఆగి , నిలిచిన నీరు తగ్గే వరకూ డ్రైవ్ చేయక పోవడమే ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

14. రక్షిత వాహన చోదకము ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రమాదాలను పసి గట్టడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 28, 2013 at 9:10 సా.

14. రక్షిత వాహన చోదకము ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). ప్రమాదాలను పసి గట్టడం ఎట్లా ?

కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డు మీద అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి ! ఆ అవాంతరాలను ముందే పసి గడితే , వాటిని సమయ స్ఫూర్తి తోనూ , డ్రైవింగ్ నైపుణ్యం తోనూ , నివారించుకోవచ్చు ! మరి అట్లా చేయడానికి  ప్రతి డ్రైవరూ ఏమి చేయాలి ?
1. స్పష్టమైన దృష్టి ఉండాలి : 
కారు నడుపుతున్నపుడు మన ముందు ఉండే రోడ్డు మీద మనకు స్పష్టమైన  దృష్టి ఉండాలి , దానితో  ముందున్న రోడ్డు వ్యూ కూడా స్పష్టం గా కనబడుతుంది ! అంటే కేవలం కనబడితే ప్రయోజనం ఏముంటుంది అని అనుకోవచ్చు ! కానీ కారు ప్రయాణం చేస్తున్నంత సేపూ కేవలం ముందున్న రోడ్డును గమనిస్తూ ఉండాలి ! అట్లా చేస్తూ ఉండడం వల్ల , మన కారుకు అడ్డం వస్తున్న ఇతర వాహనాలు కానీ , మోటారు సైకిళ్ళు కానీ , సైకిళ్ళు కానీ , ఇంకా ముఖ్యం గా చిన్న పిల్లలు కానీ , లేదా ఇతర పాద చారులు కానీ రోడ్డు దాటుతూ ఉండడం , లేదా అకస్మాత్తు గా పడి పోవడమూ జరగ వచ్చు ! అప్రమత్తత తో గమనిస్తున్న మనం , ఆ రకమైన అవాంతరాలను ముందే గమనించి , తదనుగుణం గా మన కారును నిదానం గా నడపడం కానీ , ఇంకా అవసరం అవుతే బ్రేక్ వేసి ఆపడం కానీ చేయ వచ్చు ! 
బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటి ?
మనం నడిపే వాహనాన్ని బట్టి , మన దృష్టి కి ఇరువైపులా కూడా కొంత మేర కనబడదు ఆ ప్రదేశాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు ! ఈ బ్లైండ్ స్పాట్ ను గుర్తు ఉంచుకోవడం , ప్రత్యేకించి , మనం వాహనం నడుపుతున్నంత సేపూ , అత్యంత ముఖ్యమైన  కర్తవ్యం ! ఎందుకంటే మనం నడుపుతున్న కారుకు ఎడమ వైపు కానీ , కుడి వైపున కానీ ఈ బ్లైండ్ స్పాట్ ను కనుక మనం పట్టించుకో కుండా , కనుక , కారును  ప్రక్కకు ( కుడి ప్రక్కకు కానీ , ఎడమ ప్రక్కకు కానీ ) తిప్పగానే , వెనుక నుంచి వస్తున్న వాహనం తో ఢీ కొట్టి , తీవ్రమైన ప్రమాదం జరగ వచ్చు ! ఆ ప్రమాద తీవ్రత , ఆ పరిస్థితులలో , వెనుకనుంచి వచ్చే వాహనాల వేగం బట్టి మారుతూ ఉంటుంది ! 
ఇట్లా జరగడం ఎందువల్ల ?
బ్లైండ్ స్పాట్ లో వెనుకనుంచి వస్తున్న వాహనాలు కనిపించవు కనుక.
మరి బ్లైండ్ స్పాటు లో వచ్చే వాహనాలను గమనించే మార్గం ఏమిటి ? : మన కారు లో ఉన్న రియర్ వ్యూ మిర్రర్ నూ , సైడ్ మిర్రర్ లనూ వీలైనంత ప్రదేశం చూపించేట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ! అంతే కాక , డ్రైవింగ్ చేసే సమయం లో ఒక లిప్త కాలం పాటు, అంటే కేవలం కొన్ని క్షణాల పాటు మనం మన తలను ప్రక్క కు తిప్పి మన కారు ప్రక్క గా  ప్రయాణం చేస్తున్న వాహనాలను గమనించాలి ! ఈ క్రింద ఇచ్చిన యూ ట్యూబ్ వీడియో ను కారు ఉన్న ప్రతి వారూ తప్పని సరిగా చూసి , బ్లైండ్ స్పాట్ గురించి స్పష్టం గా అర్ధం చేసుకోవాలి ! ప్రమాద నివారణ కోసమూ , సురక్షిత డ్రైవింగ్ కోసమూ ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ఉద్యమ కారులూ, మీ ఆరోగ్యం జాగ్రత్త !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 27, 2013 at 9:09 సా.

ఉద్యమ కారులూ, మీ ఆరోగ్యం జాగ్రత్త ! 

 
అన్యాయాలూ, అవినీతుల  ‘సంతానమే’ ఉద్యమం ! 
ప్రతి ఉద్యమానికీ ‘తాతలే’, స్వార్ధం నిండిన నేతలు ! 
‘తాత’ మాట మీకు బంగారు బాటా ? ! 
‘తాతలు’ కోట్లకు పడ గెత్తి తే ,
మీరు, నిండా మునగడమా ? ! 
మీ మనుగడ ఆగడమా ???
నడుస్తారు మీరు, అనేక  మైళ్ళ దూరం !
వేస్తారు, మానవ హారాలు 
మానుతారు, నిద్రాహారాలు ! 
పట్టించుకోరు, మీ  రోగాలు ! 
మీ మందులు మానేస్తారు  !
మీ బీపీ పెరిగినా ,
మీ షుగరు తగ్గినా,
మీరు మాత్రం హుషారు ! 
గుండె ఆగి, కుప్ప కూలినా 
ఉద్యమం ఆపరు మీరు !
మీ తల్లి, తండ్రి ,
మీ కొడుకూ, కూతురూ !
మీ తోబుట్టువులూ ! 
అందరికీ మీరు కావాలి
వారందరికీ మీరొక్కరే ! 
ప్రతి జీవితం విలువైనది,
మీ జీవితం కూడా  !
తాత లెవరూ చావలేదు !  
తాతల  ‘సంతానం’ చావదు ! 
ఉద్యమం  పొందు లో, తాతలు  సుఖం ! 
లేదు, వారి నిఘంటువులో, 
‘త్యాగం ‘ !  
మరి మీకెందుకు ???
మీ స్వేదం, రక్తం ,
మీ జీవితాలూ , ఉదాత్తం !
చేయకండి, నేతలకు ధారాదత్తం ! 
‘తాతల’ ననుసరించండి !
‘సమిధల’వ్వకండి !
మీ ఆరోగ్యం జాగ్రత్త ! 
 
 
 
 
 

13. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). మోటార్ వే లో ఎట్లా డ్రైవ్ చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 26, 2013 at 1:12 సా.

13. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). మోటార్ వే లో ఎట్లా డ్రైవ్ చేయాలి ?

రక్షిత కారు చోదకం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు మోటార్ వే లలోనూ , డ్యూ ఎల్ క్యారేజ్ వే లలో ఎట్లా డ్రైవ్ చేయాలో గమనించుదాము !
మోటార్ వే : మోటార్ వే సహజం గా ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ కు కానీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీ కి కానీ ఉండే రోడ్డు. మోటార్ వే ల మీద వేగం సామాన్యం గా గంట కు 60 నుంచి 70  మైళ్ళ వేగం తో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి !  గమనించ వలసినది , గంటకు అరవై మైళ్ళు అంటే 96 కిలో మీటర్లని , అట్లాగే గంటకు 70 మైళ్ళు అంటే 112 కిలో మీటర్లని. ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , గంటకు అత్యధిక వేగం ఎట్టి పరిస్తితులల్లోనూ 112 కిలో మీటర్లు లేక 70 మైళ్ళ కు మించ కూడదు. 
మరి ప్రతి కారులోనూ స్పీడో మీటర్ లో 120 – 130 మైళ్ళు కూడా కనిపిస్తుంటాయి కదా ఆ వేగం తో ప్రయాణించ కూడదా ? 
కారు వేగం పెరుగుతున్న కొద్దీ , కారును నియంత్రించే సమయం , ఇంకా కారు ఆగే దూరం కూడా పెరుగుతుంది. అంటే పది మైళ్ళ వేగం తో ప్రయాణిస్తున్న కారు ను సడన్ గా బ్రేక్ వేస్తే ,ఖచ్చితం గా బ్రేక్ వేసిన చోటే ఆగుతుంది కారు. అదే వేగం ఎక్కువ గా ఉన్నపుడు అంటే నలభై కానీ యాభై మైళ్ళ వేగం లో బ్రేక్ చేస్తే , కారు , బ్రేక్ చేసిన చోటే ఆగదు. కాస్త ముందుకు వెళ్లి ఆగుతుంది. ఇట్లా వేగం పెరుగుతున్న కొద్దీ , బ్రేక్ వేసిన చోట కాకుండా ఇంకా ముందుకు , ఇంకా ముందుకు పోయి కారు ఆగుతుంది ! అంటే కారు అత్యధిక స్పీడు లో వెళుతున్నపుడు , ఏదైనా ప్రమాదాన్ని నివారించాలని బ్రేక్ వేసినా కూడా , కారు ఆగే దూరం ఎక్కువ అవడం వల్ల , ఎదురుగా ఉన్న దానికి ( అది వాహనం కానీయండి, లేదా డివైడర్ కానీయండి ) తప్పకుండా గుద్దు కుంటుంది ! ఇక్కడ డ్రైవింగ్ చేసే వారు అప్ర మత్తత తో ఉన్నా కూడా, కారు అత్యధిక వేగం తో పోతూ ఉండడం వల్ల , వారి కంట్రోలు లో ఉండదు ! అందుకే , కారు ను వేగం పరిమితి దాటి డ్రైవ్ చేయడం ప్రమాదకరం. 
స్లిప్ రోడ్ నుంచి మోటార్ వే లో ఎట్లా కలవాలి ?
స్లిప్ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నపుడు , కారు వేగం తక్కువ గా ఉంటుంది. అంటే అత్యధిక వేగం , యాభై నుంచి అరవై మైళ్ళు ఉంటుంది. కానీ మోటార్ వే లో కలిసే సమయం లో వేగాన్ని ఇంకా తగ్గించ వలసి ఉంటుంది కదా ! అదే సమయం లో MSM / PSL సూత్రాన్ని పాటించాలి. ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసినది , మోటార్ వే లో అంతకు ముందే ప్రయాణం చేస్తున్న వాహనాలకు ప్రయారిటీ ఇవ్వాలి అంటే , మన కుడి వైపు న ఉన్న మిర్రర్ లోనుంచి చూస్తే , వెనుక నుంచి మోటార్ వే లో వాహనాలు కనుక వస్తూ ఉంటే , వాటి ముందు స్లిప్ రోడ్ ను వదిలి మోటార్ వే లో కలవడం అత్యంత ప్రమాదకరం ! ఎందుకంటే , అట్లా కలిసే సమయం లో మన కారు వేగం తక్కువ గా ఉండి , వెనుక నుంచి వచ్చే వాహనాల వేగం అధికం గా ఉంటుంది, దానితో ప్రమాదాలకు రిస్కు ఎక్కువ అవుతుంది ! వెనుక వాహనాలు వెళ్ళాకనే , మోటార్ వే  మీదకు ఎక్కాలి ! అంతే కాకుండా ఒక సారి స్లిప్ రోడ్ వదిలాక మోటార్ వే మీద అక్కడ స్పీడ్ తో అంటే 70 మైళ్ళ వేగానికి గేర్ లు మార్చుతూ , యాక్సిలరేట్ చేయాలి కారును . 
మోటార్ వే నుంచి స్లిప్ రోడ్ లోకి ఎట్లా మారాలి ?
మోటార్ వే లో వేగం అధికం గా ఉంటుంది కదా , దానిని వదిలి స్లిప్ రోడ్ లోకి ప్రవేశించే సమయం లో ముందు గానే ఇండికేటర్ తో సూచించాలి స్లిప్ రోడ్ లో ప్రవేశించ బోతున్నట్టు ! అప్పుడు వెనుక ఉన్న వాహనాలు లేన్ మార్చుకోవడమో , లేదా వేగం తగ్గించు కోవడమో చేస్తాయి ! ప్రమాద నివారణ కోసం. 
ఒక సారి స్లిప్ రోడ్ లో ప్రవేశించిన తరువాత , వేగాన్ని తగ్గించు కుంటూ పోవాలి ! 
లేన్ డిసిప్లిన్ అంటే ఏమిటి ? :
మోటార్ వే మీద ఒక డైరెక్షన్ లో మూడు లేన్ లు కనుక ఉంటే , మనం ఎప్పుడూ ఎడమ లేన్ లోనే కారు నడపాలి !  జంక్షన్ లు సమీపిస్తున్నప్పుడు , ఎక్కువ అప్ర మత్తత తో ముందూ , ప్రక్క లా వెళ్ళే వాహనాలను గమనిస్తూ ఉండాలి ! కనీసం రెండు మూడు కార్ల దూరం ముందరి కారు నుంచి మన కారు కు ఉండడం క్షేమ దాయకం ! మోటార్ వే లో మన కారును రివర్స్ చేయడం కానీ , సెంట్రల్ రిజర్వేషన్ ను దాటే ప్రయత్నం కానీ ఎప్పుడూ చేయ కూడదు , మనం వెళ్ళే డైరెక్షన్ సరి అయినది కాక పోయినా కూడా , ( వచ్చే రౌండ్ ఎబౌట్ , అంటే కూడలి దగ్గర దాకా డ్రైవ్ చేసి , మన దిశ మార్చు కోవాలి ). 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  
 

12. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). క్రాసింగ్ లూ , జంక్షన్ లలో కారు ఎట్లా నడపాలి ? :

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 23, 2013 at 11:50 ఉద.

12. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). క్రాసింగ్ లూ  , జంక్షన్ లలో కారు ఎట్లా నడపాలి ? : 

జంక్షన్ లు పలు రకాలు గా ఉంటాయి. T జంక్షన్ : T జంక్షన్ దగ్గర ఒక చిన్న రోడ్డు మెయిన్ రోడ్డు లో కలుస్తుంది. Y జంక్షన్: Y జంక్షన్ లో కూడా ఒక చిన్న రోడ్డు మెయిన్ రోడ్డు లో కల్సుస్తుంది కానీ నిటారు గా కాకుండా ఈ చిన్నరోడ్డు ఏ ట వాలు గా మెయిన్ రోడ్డు లో కలుస్తుంది ( T జంక్షన్ అందుకే T అక్షరం తోనూ Y జంక్షన్ ను Y అక్షరం తోనూ పోల్చేది అందుకే ! )క్రాస్ రోడ్డు లు ప్లస్ + ఆకారం లో ఉంటాయి లేదా X ఆకారం లో ఉంటాయి. రౌండ్ ఎబౌట్ లు పేరుకు తగ్గట్టు వృత్తాకారం లో ఉంటాయి ! ఇవి కాక కొన్ని జంక్షన్ లు జిగ్ జాగ్ గా కూడా ఉంటాయి అంటే గజి బిజి గా ! ఇక్కడ మెయిన్ రోడ్డు లో కలిసే చిన్న రోడ్డు లు ఖచ్చితం గా కాక ఒక్కో కోణం లో కలుస్తాయి. 
జంక్షన్ ల దగ్గర పాటించవలసిన నియమం ఏమిటి ?
క్రితం టపాల లో తెలుసుకున్నట్టు , MSM / PSL  సూత్రాన్ని పాటించాలి తప్పనిసరిగా ( సురక్షిత ప్రయాణం కావాలనుకునే వారు )
M అంటే మిర్రర్ లో ప్రక్క నుంచీ , వెనుక నుంచీ వచ్చే వాహనాలను గమనించడం 
S అంటే సిగ్నల్ ఇవ్వడం 
M ఈ రెండో M   అంటే మెనూవర్ చేయడం ఈ మెనూవర్ చేయడానికి PSL ను గుర్తు ఉంచుకోవాలి 
P అంటే పొజిషన్ 
S స్పీడ్ అంటే వేగాన్ని కంట్రోలు చేసుకోవడం 
L అంటే లుకింగ్ అంటే అన్ని వైపులా చూసి సురక్షితం గా ఉంటేనే , ముందుకు పోవాలి !
1. ఎడమ ప్రక్కకు కారును తిప్పడం ఎట్లా ?:
పైన చెప్పిన MSM /PSL సూత్రాన్నే పాటించాలి ఇక్కడ కూడా కానీ కారును ఫుట్ పాత్ కెర్బ్ కు కనీసం మూడడుగులు దూరం లో పొజిషన్ చేసుకోవాలి ! కానీ భారత దేశం లో ఈ మూడడుగుల చోటు ఇవ్వగానే, ఆరు ఆటో లు ఆ సందులో దూరుతాయి కదా ! కానీ ఆటోలకూ , సైకిలిస్ట్ లకూ ఖచ్చితమైన సిగ్నల్ ఇవ్వాలి , వారికి ఏ రకమైన 
కన్ఫ్యూజన్ కలగకుండా ! అదే సమయం లో తిరగ వలసిన సైడ్ రోడ్డు నుంచి మీ ఎదురు గా వస్తున్న వాహనాలను కూడా గమనించాలి !
2. కుడి ప్రక్కకు కారును తిప్పడం ఎట్లా ?:
పైన చెప్పిన MSM /PSL సూత్రాన్నే పాటించాలి ఇక్కడ కూడా కానీ కారు పొజిషన్ ను రోడ్డుకు వీలైనంత సెంటర్ కు తీసుకు వెళ్ళాలి. అదే సమయం లో మీ సందు లోకి తిప్పే వాహనాలకు సరిపడినంత చోటు ఇవ్వాలి మీరు. అంటే రోడ్డంతా ఆక్రమించుకో కూడదు !
మీకు కుడి వైపునుంచి రోడ్డు మీద వస్తున్న ( అంటే మెయిన్ రోడ్డు మీద ) వాహనాలనన్నిటినీ జాగ్రత్తగా గమనించాలి ! అంతే కాకుండా , ఆ యా వాహనాలను ఓవర్ టేక్ చెస్తూ కూడా కొన్ని వాహనాలు కానీ , మోటార్ సైకిలిస్ట్ లు కానీ , పాద చారులు కానీ ప్రయాత్నాలు చేయ వచ్చు ! వారిని కూడా అప్రమత్తత తో గమనించాలి, కుడి ప్రక్క కు కారు మళ్ళించే ముందు ! జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ గా మారగానే ఎదురు గా వచ్చే వాహనాలకు ముందుగా రోడ్డు ను ఇవ్వాలి అంటే ఎదురుగా వచ్చే వాహనాలనే పోనివ్వాలి , ఆ తరువాతే మీ కారును ప్రక్కకు తిప్పాలి ! ప్రత్యేకించి కుడి ప్రక్కకు కనుక మీ కారును తిప్పుతున్నట్టయితే ! జీబ్రా క్రాసింగ్ ల దగ్గర తప్పనిసరిగా కారు వేగాన్ని తక్కువ చేసి పోనియ్యడమే కాకుండా , పాద చారులు రోడ్డు దాటు తున్నపుడు తప్పని సరిగా కారును ఆపాలి ! పాద చారులకు ఎప్పుడూ ప్రయారిటీ ఇవ్వాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 
 

11. రక్షిత కారు చోదకం. ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). బెండ్ ( రోడ్డు వంకర ) వద్ద ఎట్లా డ్రైవ్ చేయాలి ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 22, 2013 at 9:52 ఉద.

11. రక్షిత కారు చోదకం. ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). బెండ్ ( రోడ్డు వంకర ) వద్ద ఎట్లా డ్రైవ్ చేయాలి ?  bend in road sign

మనం డ్రైవ్ చేసే ప్రతి చోటా , మనకు అనుకూలం గా రోడ్డు నేరు గా , ఏ వంపులూ లేకుండా ఉండదు కదా ! అనేక రోడ్లు , అనేక మలుపులు తిరుగుతూ ఉంటాయి ! అట్లాంటి పరిస్థితులలో , మనం ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి ! మనం తిరగబోయే మలుపు ఎంత వంకర గా ఉందో ,అందుకు ఏ స్పీడ్ తో కారు ను నడపాలో , ఖచ్చితం గా అవగాహన ఏర్పడి ఉండాలి , కారులో ఈ మలుపులు తిప్పే సమయం లో ! మలుపు ఎంత వంకర గా  ఉందో , ఈ క్రింది విషయాలు గమనిస్తే తెలుసుకోవచ్చు :
1. ముఖ్యం గా మన కళ్ళ తో ఎదురుగా ఉన్న రోడ్డు వంకర ను పరిశీలించడం.
2. ఆ బెండ్ దగ్గర రోడ్డు సైన్స్ ఏమైనా ఉంటే ,వాటిని గమనించాలి !
3. లిమిట్ పాయింట్ ఎనాలిసిస్ తో మన దృష్టి తో గరిష్టం గా అంటే అత్యధికం గా ఎంత దూరం గమనించ గలమో , అంత దూరం చూసుకుంటూ , ఆ దోవ సురక్షితం గా ఉందని నిర్ధారించుకున్నాకే , డ్రైవింగ్ కంటిన్యూ చేయాలి ! ఈ లిమిట్ పాయింట్ ఎనాలిసిస్ వంకర రోడ్ల మీద ప్రయాణం చేసే సమయం లో అతి ముఖ్యమైన పధ్ధతి . ఈ లిమిట్ పాయింట్ ఎనాలిసిస్ వివరాలు ఈ క్రింది వీడియో ( యూ ట్యూబ్ ) చూసి గమనించండి , సురక్షిత డ్రైవింగ్ కోసం !
గమనించ వలసిన మిగతా విషయాలు :
కేవలం పైన ఉన్నవే కాక , అనేక ఇతర విషయాలను కూడా , కారును వంకర రోడ్డు మీద నడిపే సమయం లో గుర్తు ఉంచుకోవాలి 
1. ఆ సమయం లో వెదర్ అంటే వాతావరణ పరిస్థితులు 
2. విజిబిలిటీ: ఆ సమయం లో వెలుతురు ఎంత ఉందో , ఎందుకంటే , చీకటి పడుతున్న కొద్దీ , మనం గమనించే ఏరియా తగ్గుతుంది కదా !
3. ప్రయాణం చేస్తున్న రోడ్డు తడిసి జారి పోతున్నట్టు ఉందో లేదో కూడా , ఎందుకంటే , కొద్ది గా వానకు తడిసినా , రోడ్డు మీద కారు టైర్లకు పట్టు తక్కువ అవుతుంది అంటే గ్రిప్. 
4. ప్రయాణం చేస్తున్న రోడ్డు కు బ్యాంకింగ్ ఉందో లేదో , ఉంటే  ఎంత ఉందో అంచనా వేయడం ! రోడ్డుకూ బ్యాంకింగ్ కూ సంబంధం ఏమిటి అనుకుంటున్నారు కదూ , బ్యాంకింగ్ అనేది ఇంకో భౌతిక శాస్త్ర నిబంధన. వంకర రోడ్లన్నీ బ్యాంకింగ్ చేయబడి ఉంటాయి ప్రమాద నివారణ కోసం !
5. మనం నడుపుతున్న కారు సాంకేతికం గా సరిగా నిర్మితం అయి ఉందో లేదో కూడా మనకు ముందే తెలిసి వుండాలి !
6. ఆ ప్రదేశం లో ఇతర రోడ్డు వాడుక దారులు ఉంటారనే విషయం కూడా ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి ! 
మరి బెండ్స్ లో అంటే రోడ్డు వంకర ల లో ముఖ్యం గా ఏమి చేయాలి ?
పై విషయాలు కేవలం గమనించడమే కాకుండా , కారును సమర్ధ వంతం గా ఆ మలుపులను నెగోషి ఎట్  చేయ గలగాలి . అందుకు ముఖ్యం గా B A G S అనే పదం గుర్తు ఉంచుకోవాలి !
B అంటే బ్రేక్స్ : బెండ్ సమీపిస్తున్నప్పుడు , ఫుట్ బ్రేక్ మీద పాదం ఉంచి , వేగాన్ని సరిగా నియంత్రించుకోవాలి !
A అంటే యాక్సిలరేషన్ :యాక్సిలరేటర్ మీద పాదం జాగ్రత్తగా పెడుతూ , యాక్సిలరేటర్ ను తదనుగుణం గా ఉపయోగించాలి !
G అంటే గేర్స్ ను కూడా వేగానికి అనుగుణం గా మార్చు కుంటూ ఉండాలి !
S అంటే స్టీరింగ్ : మలుపు తిప్పే సమయం లో మన లేన్ లోనే ఉంటూ , ఎదురు లేన్ లోకి ఎంత మాత్రమూ వెళ్ళ కుండా , స్టీరింగ్ వీల్ ను సమర్ధ వంతం గా తిప్పడం కూడా అలవాటు చేసుకోవాలి ! 
( పైన ఉన్న కార్టూన్ , అమెరికా లో కారు నడపడం మీద గీసినది ! గమనించండి , కారు కుడి వైపు డ్రైవ్ చేయబడుతుంది ! అమెరికా లో అదే లీగల్ ! అంటే, అక్కడ అన్ని వాహనాలూ కుడి వైపు నుంచే డ్రైవ్ చేయాలి !  భారత దేశం లో,మర్చి పోయి కూడా ఎన్నడూ కుడి వైపు డ్రైవ్ చేయకూడదు. ప్రత్యేకించి , రోడ్డు అంతా ఖాళీ గా ఉన్నట్టు అనిపించినా కూడా ! ఎందుకంటే, క్షణాలలోనే , ప్రత్యక్షం అవుతుంది స్పీడు గా వస్తున్న ఏ వాహనం అయినా , ఎదుటి నుంచి !  )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

10. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). రోడ్డు మీద మన కారు పొజిషన్ ఎట్లా ఉండాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on ఆగస్ట్ 21, 2013 at 9:50 సా.

10. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). రోడ్డు మీద మన కారు పొజిషన్ ఎట్లా ఉండాలి ?

తప్పించుక తానొవ్వక , తిరుగు వాడు ధన్యుడు సుమతీ ‘ అని సుమతీ శతక కారుడు శతాబ్దాల క్రితమే అన్నాడు ! ఆ సూక్తి కారు డ్రైవింగ్ లోనూ పనికొస్తుంది ! 
ఒక సారి కారు లో కూర్చుని రోడ్డు మీద పడ్డాక , మళ్ళీ కారును ఇంటికి చేర్చే వరకూ , రోడ్డు మీద ప్రయాణం చేస్తూ కూడా , నిరంతరం , మన పొజిషన్ ను , అంచనా వేసుకుంటూ , అప్రమత్తత తో కారు డ్రైవింగ్ చేయాలి ! ఎందుకంటే , సురక్షిత కారు చోదకం , మన కారు ఒక్క దాని మీదే , ఆధార పడి ఉండదు కదా ! అనేక మైన అవాంతరాలు రోడ్డు మీద తారస పడవచ్చు మనకు !  ఈ క్రింది జాగ్రత్తలు సురక్షిత డ్రైవింగ్ కు ఎంతగానో ఉపయోగ పడతాయి :
1. ఫుట్ పాత్ కు దగ్గర గా డ్రైవింగ్ చేయకూడదు. పాద చారుల కదలికలు దృష్టి లో ఉంచుకోవాలి. 
2. పార్క్ చేసి ఉన్న కార్ల మధ్య నుంచి బయటకు త్వర త్వరగా రాకూడదు. 
3. ఎట్టి పరిస్థితులలోనూ , పేవ్ మెంట్, అంటే ఫుట్ పాత్ మీద డ్రైవ్ చేయకూడదు ! 
4. సైకిలిస్ట్ ల రూట్ లో  కారు నడప కూడదు. 
5. అదే విధం గా బస్సులు ఆగే చోటా కారు నడప కూడదు ! 
( విదేశాలలో , సైకిళ్ళూ , బస్సులూ , నడపదానికీ , ఆపడానికీ , ప్రత్యేకమైన లేన్ లు ఉంటాయి ! , భారత దేశం లో ఆ పరిస్థితి కనపడదు ! ) 
6. కానీ కొన్ని బారత పట్టణాలలో , కొన్ని చోట్ల , ప్రత్యేక మైన లేన్ లు గీయబడి ఉంటాయి. ఆ యా చోట్ల , లేన్ డిసిప్లిన్ తప్పని సరిగా పాటించాలి ! అందరి భద్రత కోసమూ ! 
ఎప్పుడు ఓవర్ టేక్ చేయాలి ?
ఈ విషయం కన్నా ఎప్పుడు ఓవర్ టేక్ చేయ కూడదో తప్పని సరిగా గుర్తు ఉంచుకోవాలి 
1. మన కు ఎదురుగా వ్యూ స్పష్టం గా లేనప్పుడు , అంటే స్పష్టం గా కనిపించనప్పుడు , ఓవర్ టేక్ చేయకూడదు ! 
2. ఇతర డ్రైవర్ లకు మనం కానీ మన కారు కానీ కనిపించట్లేదని పించినప్పుడు మనం ఓవర్ టేక్ చేయ కూడదు ! ఇతర డ్రైవర్లు అప్రమత్తం గానే డ్రైవ్ చేస్తారు లే అనే నిర్లక్ష్యా భావం తో డ్రైవ్ చేయడం , ప్రమాదాలను ఆహ్వానించడమే ! 
3. ఓవర్ టేక్ చేద్దామనుకునే ఏరియా కానీ , చోటు కానీ తక్కువ గా ఉన్నప్పుడు , ఓవర్ టేక్ చేయ కూడదు !
4. మన ఎదురుగా ఉన్న రోడ్డు న్యారో గా అవుతున్నపుడు , అంటే మనం ప్రయాణిస్తున్నప్పుడు విశాలం గా ఉండి , క్రమేణా సన్న బడుతున్నప్పుడు  ఓవర్ టేక్ చేయడం సురక్షితం కాదు !
5.ఇంకొద్ది దూరం లో కానీ ( లేదా ఇంకొన్ని క్షణాలలో కానీ ) జంక్షన్ ను కనుక చేరుకో బోతుంటే , ఓవర్ టేక్ చేయడం సురక్షితం కాదు ! ( అంటే జంక్షన్ లేదని ఖచ్చితం గా తెలిసి ఉంటేనే ఆ ప్రయత్నం చేయాలి )
6. మనం పల్లం అంటే దిగువ లో ప్రయాణం చేస్తూ , ఎదురు గా ఎత్తు గా ఉన్నప్పుడు ( దీనిని డెడ్ గ్రౌండ్ అంటారు ) ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం ! ఎందుకంటే ఎదురు గా రోడ్డు ఎత్తు గా ఉండడం వల్ల , మనకు వ్యతిరేక దిశ లో వచ్చే వాహనాల గురించి ఏ రకమైన అవగాహనా ఉండదు కనుక ! 
అంతే కాక , ఓవర్ టేక్ చేసే సమయం లో  ముందు ఉన్న వాహనానికీ , మన కారు కూ మధ్య సరిపడినంత దూరం ఉండాలి ! చాలా దగ్గరగా ఉండి , ఓవర్ టేక్ చేస్తూ ఉంటే , మన కారు ముందు ఉన్న వాహనానికి , మనం ఓవర్ టేక్ చేస్తూ ఉన్నట్టు తెలియదు ! దానితో , ఆ వాహన దారు కూడా అదే సమయం లో ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తే , ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని జాగ్రత్తలు ! 

 

 

9.రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). స్టీ రింగూ , మనూవరింగూ !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఆగస్ట్ 20, 2013 at 9:26 ఉద.

9.రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ). స్టీ రింగూ , మనూవరింగూ ! 

( పార్టీ లో మితిమీరి తాగి ,  డ్రైవింగ్ కూడా చేస్తే ,జరిగే పర్యవసానాలకు , ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లా ఉంటాయో తెలిపే కార్టూన్ !  కాక పొతే అవన్నీ అమెరికా లో ! భారత దేశం లో మొదటి రెండిటినీ ( కనీసం ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకూ ! ) మినహాయించు కోవచ్చు కదా !  ) 

స్టీ రింగూ , మనూవరింగూ ! 
స్టీరింగ్ : కారు స్టీరింగ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి , పెద్దవారి వరకూ అందరికీ భలే సరదా కదా ! అనేక గుండ్రని చక్రాలను , కారు స్టీరింగ్ గా ఊహించుకుంటూ , ఎన్ని ఆటలు ఆడు కోలేదు మనమంతా , బాల్యం లో ! ఒక వాహనం లో ప్రయాణం చేస్తున్నట్టు ఊహించుకుని స్టీరింగ్ చేస్తూ ఉంటే , ఎక్కడకూ వెళ్ళక పోయినా కూడా అదొక విచిత్రమైన అనుభూతి ! ప్రస్తుతం అనేక కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లు అందుబాటు లో కూడా ఉన్నాయి కదా డ్రైవింగ్ మీద ( స్టీరింగ్ వీల్ ను కూడా అమ్ముతున్నారు )
మరి అసలు స్టీరింగ్ విషయానికొస్తే , సమర్ధ వంతం గా స్టీరింగ్ చేయడం ఒక కళ ! నేర్పు ! అందుకే ప్రతి పార్టీ కీ ఒక స్టీరింగ్ కమిటీ ఏడిసింది కదా ! ప్రజలను అనేక రకాలు గా మభ్యపెడుతున్నా కూడా సమర్దవంతం గా ఆ కార్యం నిర్వహించడానికి ! కానీ నిజజీవితం లో కారు స్టీరింగ్ సరిగా చేయకుండా , మభ్య పెట్టడం అంత తేలిక కాదు, పైగా ప్రమాదం కూడా ! స్టీరింగ్ ను పట్టుకోవడం కూడా శాస్త్రీయం గా చేయాలి ! అంటే సామాన్యం గా ఎడమ చేతిని పది సంఖ్య ఉన్న స్థానం లోనూ , కుడి చేతిని రెండు లేదా మూడు అంకె ఉన్న స్థానం లోనూ ఉంచి అవసరమైనంత పట్టు తో పట్టుకోవాలి స్టీరింగ్ ను ! ఈ పదీ , పదకొండూ , రెండూ , మూడూ ఎక్కడ నుంచి వచ్చాయను కుంటున్నారు కదూ ! స్టీరింగు చక్రాన్ని కనుక ఒక గోడ గడియారం లా ఊహించు కుంటే ! స్టీరింగ్ మీద అతి గా మన బరువు అంతా వేయకూడదు ! అట్లా చేసినా , లేదా అతి తేలిక గా పట్టు వదిలినా కూడా , కారు కంట్రోలు తప్పి పోయే ప్రమాదం ఉంది ! ఒక మోస్తరు గా తాగిన మైకం లో కూడా ( మైకం అనిపించక పోయినా కూడా ) స్టీరింగ్ లో సమతూకం తప్పి పోయి ప్రమాదాలకు కారణం అయే రిస్కు ఉంటుంది ! ( ఎందుకంటే ఆల్కహాలు తో ‘తడిసి ‘ ఉండే మెదడు , మిగతా సమయం లో లాగా ఆలోచించ లేదు కనుక ! ). 
మనూవరింగ్ : ఈ మనూవరింగ్ కారు నడపడం లో ఒక ముఖ్యమైన నేర్పు ! మనూవరింగ్ అంటే , స్టీరింగు నూ , యాక్సిలరేటర్ నూ , ఇండికేటర్ నూ , ( అవసరమయితే బ్రేక్ నూ ) హేతు బద్ధం గా ఉపయోగించి కారును ముందు కో లేదా ప్రక్కకో నడపడం ! ఒక సారి కారు కదిలి రోడ్డు మీద ‘ పడ్డప్పుడు ‘ ఏ రకమైన మనూవరింగ్ చేయాలన్నా కూడా కొన్ని నిబంధనలను తప్పని సరిగా పాటించాలి ! నిబంధనలు అంటే రూల్స్ ఎవడికి పట్టింది ? అని అశ్రద్ధ చేయడం , ఎట్టి పరిస్థితులలోనూ సమర్ధనీయం కాదు ! అప్రమత్తత కోల్పోయి , ఆశ్రద్ధతో కారు నడపడం , ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కదా ! 
మరి మనూవరింగ్ ఎట్లా చేయాలి ? 
దీనికి ప్రతి కారు డ్రైవరూ గుర్తు ఉంచుకోవలసిన ఆంగ్ల అక్షరాలు కొన్ని ఉన్నాయి ! అవి : O  S M P S L. ( ఓ ఎస్సెమ్ పీ ఎస్సెల్ , ఓ ఎస్సెమ్ , పీ ఎస్సెల్ అని చాలా సార్లు పునశ్చరణం చేయడం కూడా మంచిదే ! ) 
O అంటే అబ్సర్వే షన్ 
S అంటే , సిగ్నల్ ఇవ్వడం ,
M అంటే మనూవరింగ్ 
ఈ మనూవరింగ్ ను మూడు దశలు గా చేయాలి 
P అంటే మన కారును సరి అయిన పొజిషన్ లోకి తెచ్చుకోవాలి !
S ఈ రెండో ఎస్ అంటే కారు వేగాన్ని అంచనా వేసి , అవసరమవుతే , ఆ వేగాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి !
L  అంటే , మనం నడుపుతున్న కారు చుట్టూ పరిశీలించి చూడడం , ప్రమాదం ఏదీ లేదని నిర్ధారించుకోవడం ! అంటే , ఇతర రోడ్డు వాడే వారూ , పాద చారులూ వారి భద్రతా , మన భద్రతా కూడా ! 
మనం కొనుక్కునే కార్లలో సెన్సర్ లు అమర్చ బడి ఉన్నా కూడా మన ‘ మనో సెన్సర్  ‘ ను ఎప్పుడూ అప్రమత్తం గా ఉంచి సురక్షితం గా కారు స్టీరింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి ! 
గుర్తు ఉంచుకోవలసినది : మనం మనూవర్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ , బ్రేక్ ను కానీ , యాక్సిలరేటర్ ను కానీ, స్టీరింగ్ వీల్ ను కానీ , సడెన్ గా అప్లై చేయకూడదు , ప్రత్యేకించి మనూవర్ చేసే సమయం లో ! దానివల్ల  మనం చేయవలసిన మనూవర్ సరి గా అవ్వక పోవడమే కాకుండా , ఇతర వాహన చోదకుల కు అవరోధం అవ వచ్చు !
ప్రతి కారు డ్రైవరూ తప్పని సరిగా నేర్చుకోవలసిన మనూవర్ లు అయిదు ఉన్నాయి :
1. కారు వెళుతున్నప్పుడు ఎడమ వైపు రోడ్డు మీదకు తిప్పడం. 
2. కారు వెళుతున్నప్పుడు కుడి వైపు రోడ్డు మీదకు తిప్పడం. 
3. U టర్న్ కు కారును తిప్పడం 
4. రోడ్డు మీద కారు నడిపుతున్నప్పుడు తిప్ప వలసిన అవసరం ఏర్పడితే , తిప్పడం 
5. రివర్స్ పార్కింగ్ చేయ గలగడం.  
ఈ పై పరిస్థితులు అన్నీ కూడా సమర్ధ వంతం గా , ఆత్మ విశ్వాసం తో మనూవర్ చేయ గలగాలి , కారు నడిపే ప్రతి వారూ ! చాలా మంది , ప్రత్యేకించి , భారత దేశం లో , కారున్న వారు ఏదో ఒక లా మ్యానేజ్ చేయ గలిగితే పరవా లేదనుకుంటారు ! కానీ ఇట్లా ప్రతి చోటా అనుకోవడం , మ్యానేజ్ చేయ గలగడం జరగదు ! అప్పుడే ప్రమాద రిస్కు ఎక్కువ అవుతుంది ! అందు వల్లనే ,అంత ప్రాముఖ్యం లేనివి గా అనిపించినా కూడా , పైన తెలిపిన మనూవర్స్  నేర్చుకుని ఉండడం సర్వదా క్షేమదాయకం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

9. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ).

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 18, 2013 at 10:59 సా.

9. రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ).

కారు వేగం పెంచడం ఎట్లా ?:
కారు వేగం పెంచడం ఎట్లాగో యాక్సిలరేటర్ మీద కాలు పెట్ట గలిగే ప్రతి వారూ చెప్పగలరు ! అందుకే , ప్రతి కుర్రకారూ , తమకు తామే ఎంతో సమర్ధవంతమైనా , ప్రతిభావంతమైన డ్రైవర్ లు అని అనుకుంటూ ఉంటారు ! అది చాలా పొర పాటు ! ఎందుకంటే, కారు వెళుతూ ఉన్నపుడు ,కేవలం కొంత బరువుతో ఉన్న బ్యాగ్ ను యాక్సిలరేటర్  మీద పడేసినా కూడా కారు పోగలదు ! కానీ సమర్ధవంతమైన డ్రైవింగ్ అంటే వీలైనంత క్రిందకు , కాలితో యాక్సిలరేటర్ ను నొక్కి వేగం పెంచడం కాదు !  కారు వేగం పెంచడం అనేక మీటలను సమర్ధ వంతం గా నియంత్రించడం ! మొదటి గేర్ లో ఉన్న కారు వేగాన్ని ఒక స్పీడుకు కనుక స్మూత్ గా యాక్సిలరేట్  చేశాక , రెండవ గేర్ లోకి స్మూత్ గా మార్చాలి , రెండవ గేర్ లో ఒక నియమితమైన స్పీడ్ కు కారు వేగం చేరుకున్నపుడు , యాక్సిలరేటర్ ను క్రిందకు క్రమేణా నొక్కి రెండవ గేర్ లో అత్యధిక వేగానికి కారు చేరుకునే లా చేయాలి , అదే విధం గా మూడవ గేర్ కు మార్చి , మళ్ళీ యాక్సిలరేటర్ ను క్రమేణా నొక్కి ఉంచుతూ , మూడవ గేర్ లో కూడా అత్యధిక వేగానికి కారు చేరుకునేట్టు చూడాలి ! నాలగవ , అయిదవ గేర్ కు కూడా అదే పధ్ధతి ని అనుసరించాలి ! 
రెండవ గేర్ లోనే అత్యధికం గా యాక్సిలరేట్ చేస్తే పోయేదేంటి ?:
ప్రతి గేర్ కూ ఒక నియమిత వేగం ఉంటుంది ! ఆ నియమిత వేగానికే ఇంజన్ ట్యూన్ అవుతుంది , ఆ గేర్ లో ! తక్కువ గేర్ లో ఎక్కువ వేగం గా కారు వెళ్లాలని , ఎక్కువ గా అదిమి పట్టి , యాక్సిలరేట్ చేయడం , ఒక గుర్రం కనుక అత్యధిక వేగం తో పరిగెత్తుతూ ఉంటే , దానిని ఇంకా తోలు పటకాతో ( ఆంగ్లం లో విప్ అంటారు కదా ) చావ బాదుతూ ఉండడం తో పోల్చ వచ్చు ! ఇట్లా చేయడం వల్ల , ఇంజన్ మీద అత్యధిక వత్తిడి పడి , త్వరగా పాడయే రిస్కు ఎక్కువ అవుతుంది ! ఎంత ఎక్కువగానూ , తీవ్రం గానూ యాక్సిలరేటర్ పెడల్ ను నొక్కి పట్టి ఉంచితే , అంత ఎక్కువ ఇంధనం ఖర్చు కూడా అవుతుంది !  
గేరు మార్చడం ఎట్లా ? : ప్రతి కారుకూ కనీసం అయిదు నుంచి ఆరు గేర్లు అమర్చ బడి ఉంటాయి. ప్రతి గేరు లోనూ యాక్సిలరేటర్ పెడల్ ను అనుసంధానం చేసి నొక్కుతూ ఉండాలి ! తక్కువ గేర్ లో ఎక్కువ గానూ , ఎక్కువ అంటే నాలుగో లేక ఐదో గేర్ లో తక్కువ గానూ  యాక్సిలరేట్ చేయడం ఇంజన్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ! 
ఇంకో ముఖ్య విషయం : ఐదో లేక ఆరో గేర్ లో కారు వేగం గా పోతూ , సడన్ గా వేగం తగ్గించ వలసిన అవసరం వస్తే , వెంటనే గేరు మార్చి తక్కువ గేరు లోకి కారును తే కూడదు ! ఇట్లా చేస్తే ఇంజన్ త్వరగా పాడవుతుంది. మొదట గా చేయవలసినది , బ్రేక్ మీద కాలు ఉంచి క్రమేణా కారు వేగాన్ని తగ్గించి , అప్పుడు , కారు గేర్ ను కూడా మార్చాలి ! కొన్ని సమయాలలో , రెండవ గేర్ నుంచి నాలుగవ గేర్ లోకి స్మూత్ గా కారు వేగాన్ని మార్చవచ్చు , దానితో సమానం గా యాక్సిలరేట్ చేస్తూ ఉంటే ! 
కారు ఎత్తు కు వెళుతున్నప్పుడు గేర్ లు ఎట్లా మార్చాలి ? 
ఇక్కడ కూడా భౌతిక శాస్త్రం ఉపయోగ పడుతుంది మనకు !  మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎట్లాగైతే ఎక్కువ శ్రమ పడతామో , కారు ఇంజన్ కూడా అంతే ! అందువల్ల కారు ఇంజన్ శ్రమ తగ్గించడానికి , కారును రెండవ లేదా మూడవ గేర్ లో నడపడం ఉపయోగ కరం ! తక్కువ గేర్ లలో ఇంజన్ ఎక్కువ శక్తి తో పనిచేస్తుంది కనుక ! 
మరి కారు దిగువ కు వస్తున్నపుడు కూడా తక్కువ గేర్ లో ఎందుకు ప్రయాణించాలి ? : 
ఎందుకంటే , గ్రావిటీ వల్ల కారు వేగం పెరుగుతుంది సహజం గానే ! అప్పుడు కనుక నాలుగు , అయిదు , లేదా ఆరో గేర్ వేసి కారు ను నడుపుతూ ఉంటే , సహజమైన వేగం తో పాటుగా , కారు ఇంజన్ వేగం కలిసి , చాలా ఎక్కువ వేగం తో కారు క్రిందకు పోతూ ఉంటుంది ! ఆ సమయం లో కారు ను కంట్రోలు చేయడం కష్టం ! అప్పుడు సహజం గానే ప్రమాదాల రిస్కు ఎక్కువ అవుతుంది . అందువల్ల తక్కువ గేర్లే , ఉపయోగించాలి దిగువ కు వచ్చే సమయం లో కూడా ! ఎత్తు లో అంటే ఎగువ ( అప్ హిల్ ) లో కారు పార్క్ చేయ వలసిన అవసరం ఏర్పడినప్పుడు ఒక సురక్షిత మైన పధ్ధతి , కారును మొదటి గేర్ లో మార్చి ( హ్యాండ్ బ్రేక్ తో సహా ) పార్క్ చేయడం. ఇట్లా చేస్తే , ఒక వేళ , హ్యాండ్ బ్రేక్ పనిచేయక పోయినా కూడా , కారు మొదటి గేర్ లో ఉండడం వల్ల క్రిందకు జారదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

8.రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ).కారు ఆపడమూ , పార్క్ చేయడమూ ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 17, 2013 at 11:43 ఉద.

8.రక్షిత కారు చోదకం ( సేఫ్ కార్ డ్రైవింగ్ ).కారు ఆపడమూ , పార్క్ చేయడమూ ఎట్లా ? :

ఒక వేగం లో కారును నడుపుతూ , ఆపవలసిన సమయం లో ఆపడం కూడా ఒక నేర్పే ! చాలా మంది యువకులు కొత్త కారు చాలా వేగం గా నడుపుతూ , సడన్ గా రోడ్ల మీద బ్రేక్ చేస్తూ ఉండడం సాధారణమే !  ఇట్లా ఒక్క సారిగా కారును సడన్ గా ఆపడం, కారు ఆరోగ్యానికి మంచిది కాదు ! కారు టైర్లు త్వరగా అరిగి పోతాయి , ఇంధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. గమనించ వలసినది , ఎక్కువ వేగం గా కారు నడుపుతూ ఉంటే , ఆ కారును ఆపడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.  రోడ్డు మీద తేమ ఉంటే , లేదా , రోడ్డు ఐసీ గా ఉంటే కూడా కారు ఆపడం ఆలస్యం అవుతుంది. రోడ్డు తేమ గా ఉన్నా , ఐసీ గా ఉన్నా కూడా కారు టైర్లకు పట్టు దొరకదు అంటే కారు టైర్లు గ్రిప్ కోల్పోతాయి ! అందువలననే , సాధారణ వేగం కన్నా తక్కువ వేగం తో ప్రయాణం చేయాలి , బాగా వాన కురుస్తున్నపుడు !కారును  ఆపే దూరం రెండు రకాలు గా ఉంటుంది. ఒకటి : మనం కారు ను ఆపుదామని మనసులో ఎప్పడు ఆలోచిస్తామో అది. అంటే , థింకింగ్ డిస్టెన్స్ ! రెండవది బ్రేకింగ్ డిస్టెన్స్ ! అంటే , ప్రాక్టికల్ గా బ్రేక్ ను ఎప్పుడు అప్లై చేస్తామో ఆ దూరం ! ఈ క్రింద సూచించిన ఆట లో మీరు మీ కారును ఆపే దూరాన్ని అంచనా వేసుకోవచ్చు , వివిధ వాతావరణ సమయాలలో ! చాలా ఉపయోగ కరం గా ఉంటుంది, మీ సురక్షిత డ్రైవింగ్ కు ! ప్రయత్నించండి ! 
బ్రేక్ వేయాలి అని యాంటి సిపేట్ చేస్తూ, జాగ్రత్త గా బ్రేక్ వేయడం అలవాటు చేసుకుంటే , కారు కుదుపులు లేకుండా ఆగడమే కాకుండా , కారు టైర్లు కూడా ఎక్కువ కాలం మన్నుతాయి ! టైర్ల తో పాటు బ్రేక్ ప్యాడ్స్ కూడా , ఎన్ని ఎక్కువ సార్లు బ్రేక్ వేస్తే , అంత త్వరగా బ్రేక్ ప్యాడ్స్ పాడవుతాయి ! అట్లా గని అసలు బ్రేక్ వేయకుండా ఎప్పుడూ నడిపించలేము కదా , కారును ,కానీ బ్రేక్ వేసే ప్రతి సారీ అతి జాగ్రత్తగా నిదానం గా వేస్తూ ఉంటే , బ్రేక్ ప్యాడ్ లు తరచూ మార్చ నవసరం ఉండదు ! ఈ బ్రేక్ ప్యాడ్స్ మార్పించాలంటే , చాలా ఖర్చు తో కూడిన పని !  నాసి రకం కంపెనీ వి వేయిస్తే , అవి త్వరగా పాడవ డమే కాకుండా, ప్రమాదాలకు కూడా కారణం అవుతాయి !  ఆ కారు కంపెనీ స్పేర్స్ లోనే కీలకమైన స్పేర్స్ మార్పించడం ఉత్తమం !
యాంటి సిపేట్ చేయడం అంటే , ట్రాఫిక్ లైట్ లు అంబర్ కలర్ లోకి మారడం చూడగానే , లేదా పాదచారులు రోడ్డు క్రాస్ చేస్తూ ఉండడం గమనించినా , కూడా బ్రేక్ అవసరం ఉంటుందని ఊహించడం ! ( చాలా సమయాలలో, భారత దేశం లో అనేక రోడ్ల కూడలు లలో జీబ్రా క్రాసు మీద పాద చారులు దాటుతూ ఉన్నా కూడా ఏమాత్రం పట్టింపు లేకుండా , కారు ఆపకుండా నడుపుతూ ఉంటారు ! పాదచారులకూ , సైకిల్ నడిపే వారికీ , అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి , కారు నడిపే వారు ! చాలా సమయాలలో పాదచారులదీ , సైకిలిస్ట్ లదీ తప్పు ఉన్నా కూడా !, ఎందుకంటే , పంతాలకు , పట్టింపు లకూ పొతే , ప్రమాదాలలో ఎక్కువ గా గాయ పడేది వారే కదా , కారులో కూర్చున్న వారు కాదు కదా !
పార్క్ చేయడము : 
పార్క్ చేసే ముందు , ఆ ప్రాంతం సురక్షితమో కాదో గమనించాలి ! : వెనుక నుంచీ , ప్రక్క నుంచీ వేగం గా వాహనాలు వెళుతూ ఉంటే , సరి అయిన ఇండికేటర్ ఉపయోగించి , వారికి తెలియచేయాలి , మీరు పార్క్ చేయబోతూ ఉన్నట్టు ! రివర్స్ పార్కింగ్ చేసే సమయాలలో కూడా మీరు పార్క్ చేస్తున్న ప్రదేశం సురక్షితం గా ఉందో లేదో నిర్ధారించు కోవాలి ముందే ! అవసరం అవుతే , కారు దిగి చూడడానికీ వెనుకాడ కూడదు !  ఇట్లా గమనించకుండా రివర్స్ పార్కింగ్ చేసిన ఫలితం గా , అనేక ప్రమాదాలు సంభవించి , చిన్న పిల్లలూ , పెంపుడు జంతువులూ మరణిస్తూ ఉంటారు ! పార్క్ చేశాక , అన్ని లైట్లూ ఆపి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి ! కారులో కొద్ది సమయం కోసమైనా , చిన్న పిల్లలను వదిలి వెళ్ళ కూడదు ! అమెరికా , ఇంగ్లండు లాంటి దేశాలలోనే , ఎండా కాలం లో ఇట్లా కారు లో వదిలి వేయబడ్డ పిల్లలూ ,కుక్కలూ , కారు వేడెక్కి , మరణించిన సందర్భాలు అనేకం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: