Our Health

Archive for ఏప్రిల్, 2013|Monthly archive page

మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా? (type 2 diabetes-risk-test )

In ప్ర.జ.లు., Our Health on ఏప్రిల్ 5, 2013 at 12:02 సా.
మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా? 
 
డయాబెటిస్ , అదే షుగర్ వ్యాధి , లేదా మధు మేహం అనబడుతుంది. ఈ వ్యాధి ముఖ్యం గా రెండు రకాలు గా ఉంటుంది . చిన్నతనం లో వచ్చే డయాబెటిస్ ను టైప్ వన్ డయాబెటిస్ అంటారు. కొంత వయసు మళ్ళాక ( అంటే ముప్పై నలభై సంవత్సరాల వయసున్నపుడు ) వచ్చే డయాబెటిస్ ను టైప్ టూ  డయాబెటిస్ అంటారు.మనం ఇప్పుడు మాట్లాడు కొనేది ఈ టైప్ టూ డయాబెటిస్ గురించి. ఈ టైప్ టూ డయాబెటిస్ ఆసియా వాసులలో అధికం గా వస్తూ ఉంటుంది. కొంత వరకూ ఆసియా వాసులలో జీన్స్ అంటే జన్యువుల  అమరిక వల్లనూ , ముఖ్యం గా వారి ఆహార అలవాట్ల వల్ల నూ  ఈ టైప్ టూ డయాబెటిస్ అధికం గా వస్తుంది !  ఇట్లా డయాబెటిస్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే , కొన్ని కారణాలు కలిసి ,మనలో డయాబెటిస్ ముందు ముందు వచ్చే అవకాశాలను అధికం చేస్తాయి ! అందుకే ఈ కారణాలను రిస్కు ఫ్యాక్టర్ లు అంటారు ! ఈ రిస్కు ఫ్యాక్టర్ లను ముందే మనం తక్కువ చేసుకుంటే , ముందు ముందు డయాబెటిస్ రాకుండా నివారించు కోవచ్చు. లేదా ఆ వచ్చే అవకాశాలను చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు ! మన జీన్స్ అంటే జన్యువులలో మార్పులు మనం నియంత్రించడం కానీ , నివారించడం కానీ చేయ లేక పోయినప్పటికీ , ఈ రిస్కు ఫ్యాక్టర్ లను తగ్గించు కుంటే ,మనం డయాబెటిస్ ( అంటే టైప్ టూ డయాబెటిస్ ) వ్యాధి నివారణ లో విజయ వంతం అవవచ్చు !
 
ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీరు మీ రిస్కు ను లెక్క కట్టుకోండి ! ( లింకు మీద ఒక్క క్లిక్కు తో !  )  రిస్కు కనుక అధికం గా ఉంటే , మీరు మీ వైద్యుడిని సంప్రదించి , అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ! మీ ఆరోగ్యం కోసం ఈ ముందు జాగ్రత్త  తీసుకోవడం లో తప్పు లేదు కదా !  అంతే కాక ఇది ఉచితం కూడా ! ( ఒక గమనిక : పరీక్ష వివరాలలో మీ ఎత్తు అడుగులలో ఉంది కాబట్టి మీ బరువు కూడా పౌండ్ల లో రాయాలి. ఇది కష్టమేమీ కాదు. మీ బరువును కిలోలలో కొలుచుకుని, రెండు పాయింట్ రెండు తో గుణిస్తే మీ కిలోలలో ఉన్న మీ బరువు పౌండ్ల లో మారుతుంది ( ఎందుకంటే ఒక కిలో బరువు 2. 2 పౌండ్ల తో సమానం కనుక ).
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 
 
 
 
 
 
 

పని సూత్రాలు . 40. సత్యమునే పలుక వలెను !

In మానసికం, Our minds on ఏప్రిల్ 3, 2013 at 10:45 సా.

పని సూత్రాలు . 40. సత్యమునే పలుక వలెను !

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య మైన సూత్రం ” సత్యమునే పలుక వలెను ” ! అంటే ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు ! మన మందరం , చాలా చిన్న తనం నుంచే ఈ సూక్తి నేర్చుకుంటాము.  ఈ సూక్తి మారుతున్న దేశ మాన కాల పరిస్థితుల దృష్ట్యా ఒక జోకు గా తయారయింది ! ” కాలం మారింది ” అని , మారుతున్నమనుషులంతా , కేవలం  ” వారి తప్పు కాదు  ( అసత్యం చెప్పడం ) కేవలం మారుతున్న కాలానిది ” అని తప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు !  కానీ కాలం అబద్దమాడ లేదు కదా ! కేవలం మానవులే  ఆ పని చేయ గలరు ! వారు సత్యమే చెప్పగలరు, అసత్యమైనా చెప్ప గలరు ! మరి  పైన ఉన్న సూక్తి ఎప్పుడూ మనకు వర్తిస్తుంది , ప్రత్యేకించి మనం చేసే ఉద్యోగాలలో ! 
ఒక ఉదాహరణ తీసుకుందాము ! :
మనం  అబద్ధాలు ఆడుదామని  అనుకుంటే , వివరం గా ఆలోచిస్తే ఈ క్రింది విషయాలు గోచరమవుతాయి ! 
1. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ?
2. ఎక్కడ మనం ఒక గీత గీసుకుని, ఇంత వరకే అబద్ధాలు ఆడాలి అని అనుకోగలం మనం ? అంటే మనం ఆడే అబద్ధాలకు ప్రామాణికం ఏమిటి ?
3. మనం చిన్న అబద్ధాలే చెబుదామని అనుకుందామా? లేదా పెద్ద అబద్ధాలు కూడా చెబుదామా ? అవి ఏమిటి ? 
4.  మనలను రక్షించు కోడానికే నా , లేదా మన మిత్రులను, మనం పని చేసే కంపెనీ యజమాని కోసమా ?  మనం అబద్ధాలు చెప్పేది ?
5. ఒక అబద్ధానికి మనం తోకలు అతికించి , ఒక దాని మీద ఒక అబద్ధం చెప్పుకుంటూ పోదామా ?
6. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఎప్పుడు ఆపుదాము ? 
7. ఇతరులను కూడా మనం చెప్పే అబద్ధాలలో ఇరికించు దామా ? లేక మనమే బాధ్యత తీసుకుని అబద్ధాలు చెబుదామా !  
ఇట్లా ఆలోచించుకుంటూ పొతే , మనకు స్పష్ట మయ్యేది ఒకటే ” హాయిగా అసలు అబద్ధాలు చెప్పకుండా ”  ఉంటే సరిపోతుందని ! అబద్ద మాడ  కూడదనే ఒక్క నిర్ణయం కనుక మనం తీసుకుంటే , ఏ సమస్యా ఉండదు ! మనం అబద్ధమాడ దానికి ప్రయాస పడనవసరం లేదు !  ఆ అబద్ధాలను కప్పి పుచ్చుకోవడానికి సతమత  మవ నవసరం లేదు, మన మనసులో ఏ  రకమైన భయాందోళన లూ మనం పెట్టుకొనవసరం లేదు ! నిశ్చింత గా ఉండవచ్చు ! ఎప్పుడూ సత్యాన్నే చెప్పడం వల్లా  , అబద్దాలాడక పోవడం వల్ల  అనేక లాభాలున్నాయి ! మనకు ఏవిధమైన అపరాధ భావనా , ప్రాయశ్చిత్త భావమూ ఉండదు !  తప్పు చేసిన వారిలా , మనం రాత్రుళ్ళు నిద్ర పోలేక పోవడం ఉండదు !  చెప్పిన అబద్ధాలను గుర్తు ఉంచుకోవాలనే ” బాధ్యత  ” మనకవసరం లేదు ! ఎవరో మనలను అబద్ధాలు చెప్పామని శిక్షిస్తారనే భయం అంత కన్నా అవసరం ఉండదు !  మన మిత్రులలోనూ , మన కుటుంబ సభ్యులలోనూ , మనం ఉండే సమాజం లోనూ తలెత్తుకు తిరిగే  పరిస్థితి ఉండదనే భయం కూడా ఉండదు ! కేవలం ఒక్క నిర్ణయం , అదే , ఎప్పుడూ అబద్ధాలు చెప్ప కూడదనే ఒక్క నిర్ణయం కనుక తీసుకుంటే ! 
ఇటీవల ఇంగ్లండు లో జరిగిన ఒక సంఘటన :
ఒక  అధికార పార్టీ మంత్రి తన కారులో స్పీడు గా పోతున్నాడు ! ప్రక్కనే అతని భార్య కూడా కూర్చుని ఉంది. కారు స్పీడ్ అందుకుంది. ఆ రోడ్డు మీద పోవలసిన స్పీడు ను దాటింది ! అంటే అది చట్ట విరుద్ధం ! వెంటనే పోలీసు కారు లో పోలీసులు ఆ మంత్రి గారి కారు ను ఆపారు ! ఇంగ్లండు దేశం లో నియమిత వేగం కన్నా ఎక్కువ వేగం తో పోయే కారును ఆపి , ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కు  మూడు పాయింట్లు ఇస్తారు వారి లైసెన్స్ మీద ! ఇట్లా పాయింట్లు పన్నెండు పోగవు తే , డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు ! ఈ కారు నడుపుతున్న మంత్రి గారికి అంత క్రితమే తొమ్మిది పాయింట్లు వచ్చాయి ! అందువల్ల ఆ మంత్రి గారి భార్యామణి , ఆయనగారిని రక్షించే ప్రయత్నం లో ఆమే  కారు వేగం గా నడుపుతున్నట్టు పోలీసులకు ” అబద్ధం ” చెప్పింది ! అందువల్ల పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ మీద మూడు పాయింట్స్ ఇచ్చారు !  ఇంత వరకూ బానే ఉంది కధ ! కాలక్రమేణా  ఆ మంత్రిగారు వారి సెక్రెటరీ తో ప్రేమాయణం సాగించారు ! దానితో ” భార్యా మణి  గారికి మంత్రి గారి మీద కోపం వచ్చి ,పోలీసులకు ఫోను చేసి , తాను అబద్ధం ఆడాననీ , అసలు వేగం గా కారు నడిపింది తన ” భర్త ” అయిన మంత్రే అనీ తెలిపింది !  అప్పుడు జరిగింది ఏమిటో మీరు భారత దేశం లో ఉంటే ” ఆ పోలీసులకు ట్రాన్స్ఫర్ యోగం పట్టి ఉంటుందని ” లేదా ఆ పోలీసులను , అందరి సమక్షం లో, అసెంబ్లీ లోనే చితక కొడతారని అనుకుంటారు కదూ ! కానీ ఈ సంఘటన జరిగింది,ఇంగ్లండు దేశం లో కదా ! అందువల్ల కధ వేరే మలుపు తిరిగింది !  ఆ మంత్రి గారి మంత్రి పదవి పోయింది !  అంతే కాక , వారి భార్యామణి తో సహా ఆ మంత్రి గారిని కూడా జైలు లో పెట్టారు ! వారిద్దరూ ఇప్పుడు కటకటాల వెనక ఉన్నారు ! మంత్రి గారిని , మంత్రి పదవి లో ఉండి  అబద్ధం ఆడినందుకూ , ఆయన గారి భార్య ను,  అబద్ధం చెప్పినందుకూ ! కేవలం ఒక్క అబద్ధం  చెరి ఒకరూ చెప్పినందుకు ! 
 
అందుకే ” సత్యమునే పలుకవలెను ” 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు . 39. ప్రశ్నలు అడగండి !

In మానసికం, Our minds on ఏప్రిల్ 2, 2013 at 9:07 సా.

పని సూత్రాలు . 39.  ప్రశ్నలు అడగండి !

 
సాధారణం గా మనం చేసే ఉద్యోగాలలో , మన పని మనం అతి జాగ్రత్తగా చేసుకుంటూ పోతాము, ఇతరుల తో ఎక్కువ సంబంధం పెట్టుకోకుండా ! అది కేవలం మన పని లో నిమగ్నమవడం వల్ల కావచ్చు , లేదా మనం చేసే పని లో మనం కొంత వత్తిడి అనుభవిస్తూ , ఏకాగ్రత భగ్నం అవకుండా ఉండాలనే తపనతో కూడా ! దీనితో మనకు మన పక్క సెక్షన్ లో పని చేసే వారెవరో కూడా తెలియదు , కేవలం ఏదైనా పని ఉండి, అక్కడకు వెళితే తప్ప ! కానీ మనం పని చేస్తూ ఉన్న చోట కానీ , లేదా ఉద్యోగం చేస్తూ ఉన్న చోట కానీ , ఇతర ఉద్యోగులు చేసే ఉద్యోగం గురించి కూడా మనం తరచూ తెలుసుకుంటూ ఉంటే అది మనకు ఎంతో ఉపయోగ కరం గా ఉంటుంది !  ప్రశ్నలు వేసుకోవడం , ఇతరులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడం , మానవుడి తృష్ణకు కొల మానాలు ! మానవుడికి ఎంత తృష్ణ ఉంటే , పురోగతి కూడా అంత గానూ ఉంటుంది ! ముఖ్యం గా ఇతర ఉద్యోగులు చేసే పని గురించి కానీ , లేదా మీ సెక్షన్ లో నే ఉన్న మీ సహచరుల ఉద్యోగం గురించి కానీ అప్పుడప్పుడూ , మీకై మీరు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం అనేక విధాలు గా మీకు లాభ పడుతుంది ! 
1. మీరు మీ సహచరులలో పలుకుబడి కలవారవుతారు !
2. మీ పని సామర్ధ్యం మెరుగవుతుంది , మీరు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడం వల్ల  !
3. మీరు మీ సహచరుల పని గురించీ , సామర్ధ్యం గురించీ వివరాలు తెలుసుకుంటూ ఉంటుంటే , వారి దృష్టిలో మంచి వారవుతారు !  
మరి మీరు అడగ వలసిన ప్రశ్నలు ఏమిటి ?: 
మీరు అడగవలసిన ప్రశ్నలు , సహజం గా , యదార్ధం గా , దయతోనూ , సానుభూతి పూర్వకం గానూ   ఉండాలి ! ఉదాహరణకు : ఇతర ఉద్యోగి  వేసుకున్న చొక్కా కానీ కోటు కానీ అంత బాగా లేక పోయినా , మీరు వారిని ” నీ చొక్కా బాగుంది ఎక్కడ కొన్నావు ? ” అని అడిగితే వారిని మీరు హేళన చేస్తున్నట్టు అనుకోవచ్చు ! ” మీ ప్రెజెంటేషన్ బాగుంది మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకున్నారు ? అని కానీ , ” కస్టమర్ లను ఎక్కువ చేసుకోడానికి ఈ పధ్ధతి కన్నా మెరుగైనది ఏమైనా ఉందా మీ ఉద్దేశం లో ? అని కానీ , ” మీరు  ఆ రిపోర్టు చాలా చక్కగానూ , త్వరగానూ తయారు చేశారు ? ఏమైనా కిటుకులు ఉన్నాయా ”  ? అని కానీ అడిగి తెలుసుకోవచ్చు ! మీరు సరాసరి గా వారు చేసే ఉద్యోగం గురించీ , వారి సామర్ధ్యం గురించీ అడిగే ముందు ”  మీ పిల్లలు స్కూళ్ళకు వెళుతున్నారా ?  లాంటి   ప్రశ్న ( ల ) తో ప్రారంభం చేసి అడగ వచ్చు ! ఇట్లాంటి ప్రశ్నలు అడగడం వల్ల ,  మీ కంపెనీ  లో మిగతా ఉద్యోగులకూ , మీకూ మధ్య చక్కటి  టీం వర్క్ ఏర్పడుతుంది. మీ కొలీగ్స్ మిమ్మల్ని  ఒక సమర్ధత కలిగిన ఉద్యోగి గా గుర్తిస్తారు ! మీ మీద వారికి విశ్వాసం ఏర్పడుతుంది ! వారికి కూడా మీరు చేస్తున్న కంపెనీ లో ప్రాముఖ్యత కలిగిన ఉద్యోగులనే అభిప్రాయం కలిగి ,ఎక్కువ శ్రద్ధ తో ఉద్యోగాలు చేస్తారు !  మీ ప్రస్తుత ఉద్యోగం సులభమవడమే  కాకుండా , మీరు పదోన్నతి పొందడానికి కావలసిన  నాయకత్వ లక్షణాలూ మీకు అలవడుతాయి ! 
 
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఏప్రిల్ 1, 2013 at 6:47 సా.

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త ! 

సాధారణం గా , మనం చేసే ఉద్యోగాలలో , ఇతర కొలీగ్స్ , లేదా ఇతర ఉద్యోగులలో అధిక శాతం  మంచి వారే ! వారూ మన లానే , కష్టపడి పని చేసే స్వభావం కల వారే ! కానీ కొద్ది శాతం మంది , మన మీద అసూయా ద్వేషాలు కలిగి ఉంటారు ! ఏదో రూపం లో వెన్ను పోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! ధర్మరాజుకు అందరూ మంచి వారిలానే కనిపించారు ట ! అంటే , ధర్మరాజు అందరిలోనూ మంచినే చూసే వాడుట ! కానీ దుర్యోధనుడు అందరిలోనూ చెడునే చూసే వాడుట ! అంటే దుర్యోధనుడికి అందరూ చెడ్డ వారిలానే కనపడ్డారు ట ! మీరు ధర్మరాజులూ , దుర్యోధనులూ కానవసరం లేదా ప్రస్తుత భారతం లో ! మీకు కావలసినది అప్రమత్తత ! మనం చీకటి గా ఉన్న దోవలో వెలుతురు తోడు లేకుండా నడవడానికి  సందేహిస్తాము !  కానీ ఆ చీకటి లో నడుస్తే, ఎప్పుడో కానీ  పాము కాటు వేయడం కానీ, లేదా ముళ్ళు గుచ్చుకోవడం కానీ , లేదా  గోతి లో పడడం కానీ సంభవించదు  ! ఎప్పుడో జరుగుతాయని , మనం చీకటి లో ఏ  దీపమూ లేకుండా నడవం కదా ! అదే పరిస్థితి మనం చేసే ఉద్యోగం కూడా !  మీ పని మీరు సవ్యం గా చేస్తూ , మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే వారి గురించి మీరు అప్రమత్తత తో ఉండాలి ! ఎప్పుడూ ! మీ అప్రమత్తత మీకు విరోధులను తక్కువ చేస్తుంది. అట్లాగే మీ ఆపదలను కూడా తక్కువ చేస్తుంది ! 
అందుకు మీరు ఏమి చేయాలి ? 
1. వ్యక్తి గత విలువలు నిర్ణయించుకోవడం !  మీరు చేసే ఉద్యోగం లో అప్రమత్తులై ఉండడం అంటే, ముందుగా ,  మీకు మీరు గా,  కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి ! ఆ విలువలు మీ శీలాన్ని అంటే మీ క్యారెక్టర్ ను దృ ఢ మైనది గా చేస్తాయి ! ఇతరులు వేలు పెట్టి మీలో తప్పులు ఎంచ డానికీ , లేదా వెన్ను పోటు పొడవడానికీ జంకుతారు ! మీరు ఏర్పరుచుకునే వ్యక్తిగత విలువలు అనేకం ఉండవచ్చు ! కానీ అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగం లో మీ సమగ్రత అంటే ఇంటిగ్రిటీ ను బలోపేతం చేసేవి గా ఉండాలి ! 
ఉదాహరణకు : మీరు ఈ క్రింది విధం గా,  మీలో మీరు ప్రతిన బూన వచ్చు : 
” నేను నా ఉద్యోగం కోసం ఇతరులను ( అంటే ఇతర ఉద్యోగులను ) ఏరకంగానూ శారీరికం గానైనా , మానసికం గానైనా హింసించను !”
నేను పని చేసే కంపెనీ నిబంధనలు ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించను ”
” నేను నా నీతి నియమాలను కూడా ఎప్పుడూ పాటిస్తాను ” !
” నా యజమాని శ్రేయస్సుకూ , నా కుటుంబ శ్రేయస్సు కూ ఎప్పుడూ పాటు పడతాను ” !
”ఉద్యోగం లో నాకు తెలిసిన నిపుణత అంటే స్కిల్స్ , ఇతర ఉద్యోగులకు , ఏ స్వలాభాపేక్షా  లేకుండా నేర్పుతాను”  ! 
నేను ఉద్యోగం చేసే చోట , ఇతర సహోద్యోగులు ఎవరైనా పదోన్నతి పొందినా , నేను ఏ విధమైన అసూయా ద్వేషాలను పొందను , వారిమీద ప్రదర్శించను ”
ఈ రకమైన వ్యక్తి గత విలువలను మీకు మీరే ఏర్పరుచుకునే లక్ష్మణ రేఖలు ! వీటికి బద్ధులై ఎప్పుడూ , మీ పూర్తి శక్తి యుక్తులను మీరు చేసే ఉద్యోగం లో ప్రదర్శించడం అలవాటు చేసుకుంటే, మీరు మానసికం గా అత్యంత బలవంతులవుతారు ! దానితో మీ లక్ష్యాలు మీరు చేరుకోవడం సులభమవడమే  కాకుండా ,మీ ఉద్యోగం లో మీకు శత్రువులు ఏర్పడరు, ఒకవేళ ఏర్పడినా,  వజ్రం లాంటి మీ శీలాన్ని ఛే దించ లేరు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !