Our Health

Archive for ఏప్రిల్ 3rd, 2013|Daily archive page

పని సూత్రాలు . 40. సత్యమునే పలుక వలెను !

In మానసికం, Our minds on ఏప్రిల్ 3, 2013 at 10:45 సా.

పని సూత్రాలు . 40. సత్యమునే పలుక వలెను !

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య మైన సూత్రం ” సత్యమునే పలుక వలెను ” ! అంటే ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు ! మన మందరం , చాలా చిన్న తనం నుంచే ఈ సూక్తి నేర్చుకుంటాము.  ఈ సూక్తి మారుతున్న దేశ మాన కాల పరిస్థితుల దృష్ట్యా ఒక జోకు గా తయారయింది ! ” కాలం మారింది ” అని , మారుతున్నమనుషులంతా , కేవలం  ” వారి తప్పు కాదు  ( అసత్యం చెప్పడం ) కేవలం మారుతున్న కాలానిది ” అని తప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు !  కానీ కాలం అబద్దమాడ లేదు కదా ! కేవలం మానవులే  ఆ పని చేయ గలరు ! వారు సత్యమే చెప్పగలరు, అసత్యమైనా చెప్ప గలరు ! మరి  పైన ఉన్న సూక్తి ఎప్పుడూ మనకు వర్తిస్తుంది , ప్రత్యేకించి మనం చేసే ఉద్యోగాలలో ! 
ఒక ఉదాహరణ తీసుకుందాము ! :
మనం  అబద్ధాలు ఆడుదామని  అనుకుంటే , వివరం గా ఆలోచిస్తే ఈ క్రింది విషయాలు గోచరమవుతాయి ! 
1. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ?
2. ఎక్కడ మనం ఒక గీత గీసుకుని, ఇంత వరకే అబద్ధాలు ఆడాలి అని అనుకోగలం మనం ? అంటే మనం ఆడే అబద్ధాలకు ప్రామాణికం ఏమిటి ?
3. మనం చిన్న అబద్ధాలే చెబుదామని అనుకుందామా? లేదా పెద్ద అబద్ధాలు కూడా చెబుదామా ? అవి ఏమిటి ? 
4.  మనలను రక్షించు కోడానికే నా , లేదా మన మిత్రులను, మనం పని చేసే కంపెనీ యజమాని కోసమా ?  మనం అబద్ధాలు చెప్పేది ?
5. ఒక అబద్ధానికి మనం తోకలు అతికించి , ఒక దాని మీద ఒక అబద్ధం చెప్పుకుంటూ పోదామా ?
6. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఎప్పుడు ఆపుదాము ? 
7. ఇతరులను కూడా మనం చెప్పే అబద్ధాలలో ఇరికించు దామా ? లేక మనమే బాధ్యత తీసుకుని అబద్ధాలు చెబుదామా !  
ఇట్లా ఆలోచించుకుంటూ పొతే , మనకు స్పష్ట మయ్యేది ఒకటే ” హాయిగా అసలు అబద్ధాలు చెప్పకుండా ”  ఉంటే సరిపోతుందని ! అబద్ద మాడ  కూడదనే ఒక్క నిర్ణయం కనుక మనం తీసుకుంటే , ఏ సమస్యా ఉండదు ! మనం అబద్ధమాడ దానికి ప్రయాస పడనవసరం లేదు !  ఆ అబద్ధాలను కప్పి పుచ్చుకోవడానికి సతమత  మవ నవసరం లేదు, మన మనసులో ఏ  రకమైన భయాందోళన లూ మనం పెట్టుకొనవసరం లేదు ! నిశ్చింత గా ఉండవచ్చు ! ఎప్పుడూ సత్యాన్నే చెప్పడం వల్లా  , అబద్దాలాడక పోవడం వల్ల  అనేక లాభాలున్నాయి ! మనకు ఏవిధమైన అపరాధ భావనా , ప్రాయశ్చిత్త భావమూ ఉండదు !  తప్పు చేసిన వారిలా , మనం రాత్రుళ్ళు నిద్ర పోలేక పోవడం ఉండదు !  చెప్పిన అబద్ధాలను గుర్తు ఉంచుకోవాలనే ” బాధ్యత  ” మనకవసరం లేదు ! ఎవరో మనలను అబద్ధాలు చెప్పామని శిక్షిస్తారనే భయం అంత కన్నా అవసరం ఉండదు !  మన మిత్రులలోనూ , మన కుటుంబ సభ్యులలోనూ , మనం ఉండే సమాజం లోనూ తలెత్తుకు తిరిగే  పరిస్థితి ఉండదనే భయం కూడా ఉండదు ! కేవలం ఒక్క నిర్ణయం , అదే , ఎప్పుడూ అబద్ధాలు చెప్ప కూడదనే ఒక్క నిర్ణయం కనుక తీసుకుంటే ! 
ఇటీవల ఇంగ్లండు లో జరిగిన ఒక సంఘటన :
ఒక  అధికార పార్టీ మంత్రి తన కారులో స్పీడు గా పోతున్నాడు ! ప్రక్కనే అతని భార్య కూడా కూర్చుని ఉంది. కారు స్పీడ్ అందుకుంది. ఆ రోడ్డు మీద పోవలసిన స్పీడు ను దాటింది ! అంటే అది చట్ట విరుద్ధం ! వెంటనే పోలీసు కారు లో పోలీసులు ఆ మంత్రి గారి కారు ను ఆపారు ! ఇంగ్లండు దేశం లో నియమిత వేగం కన్నా ఎక్కువ వేగం తో పోయే కారును ఆపి , ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కు  మూడు పాయింట్లు ఇస్తారు వారి లైసెన్స్ మీద ! ఇట్లా పాయింట్లు పన్నెండు పోగవు తే , డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు ! ఈ కారు నడుపుతున్న మంత్రి గారికి అంత క్రితమే తొమ్మిది పాయింట్లు వచ్చాయి ! అందువల్ల ఆ మంత్రి గారి భార్యామణి , ఆయనగారిని రక్షించే ప్రయత్నం లో ఆమే  కారు వేగం గా నడుపుతున్నట్టు పోలీసులకు ” అబద్ధం ” చెప్పింది ! అందువల్ల పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ మీద మూడు పాయింట్స్ ఇచ్చారు !  ఇంత వరకూ బానే ఉంది కధ ! కాలక్రమేణా  ఆ మంత్రిగారు వారి సెక్రెటరీ తో ప్రేమాయణం సాగించారు ! దానితో ” భార్యా మణి  గారికి మంత్రి గారి మీద కోపం వచ్చి ,పోలీసులకు ఫోను చేసి , తాను అబద్ధం ఆడాననీ , అసలు వేగం గా కారు నడిపింది తన ” భర్త ” అయిన మంత్రే అనీ తెలిపింది !  అప్పుడు జరిగింది ఏమిటో మీరు భారత దేశం లో ఉంటే ” ఆ పోలీసులకు ట్రాన్స్ఫర్ యోగం పట్టి ఉంటుందని ” లేదా ఆ పోలీసులను , అందరి సమక్షం లో, అసెంబ్లీ లోనే చితక కొడతారని అనుకుంటారు కదూ ! కానీ ఈ సంఘటన జరిగింది,ఇంగ్లండు దేశం లో కదా ! అందువల్ల కధ వేరే మలుపు తిరిగింది !  ఆ మంత్రి గారి మంత్రి పదవి పోయింది !  అంతే కాక , వారి భార్యామణి తో సహా ఆ మంత్రి గారిని కూడా జైలు లో పెట్టారు ! వారిద్దరూ ఇప్పుడు కటకటాల వెనక ఉన్నారు ! మంత్రి గారిని , మంత్రి పదవి లో ఉండి  అబద్ధం ఆడినందుకూ , ఆయన గారి భార్య ను,  అబద్ధం చెప్పినందుకూ ! కేవలం ఒక్క అబద్ధం  చెరి ఒకరూ చెప్పినందుకు ! 
 
అందుకే ” సత్యమునే పలుకవలెను ” 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: