పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త !
సాధారణం గా , మనం చేసే ఉద్యోగాలలో , ఇతర కొలీగ్స్ , లేదా ఇతర ఉద్యోగులలో అధిక శాతం మంచి వారే ! వారూ మన లానే , కష్టపడి పని చేసే స్వభావం కల వారే ! కానీ కొద్ది శాతం మంది , మన మీద అసూయా ద్వేషాలు కలిగి ఉంటారు ! ఏదో రూపం లో వెన్ను పోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! ధర్మరాజుకు అందరూ మంచి వారిలానే కనిపించారు ట ! అంటే , ధర్మరాజు అందరిలోనూ మంచినే చూసే వాడుట ! కానీ దుర్యోధనుడు అందరిలోనూ చెడునే చూసే వాడుట ! అంటే దుర్యోధనుడికి అందరూ చెడ్డ వారిలానే కనపడ్డారు ట ! మీరు ధర్మరాజులూ , దుర్యోధనులూ కానవసరం లేదా ప్రస్తుత భారతం లో ! మీకు కావలసినది అప్రమత్తత ! మనం చీకటి గా ఉన్న దోవలో వెలుతురు తోడు లేకుండా నడవడానికి సందేహిస్తాము ! కానీ ఆ చీకటి లో నడుస్తే, ఎప్పుడో కానీ పాము కాటు వేయడం కానీ, లేదా ముళ్ళు గుచ్చుకోవడం కానీ , లేదా గోతి లో పడడం కానీ సంభవించదు ! ఎప్పుడో జరుగుతాయని , మనం చీకటి లో ఏ దీపమూ లేకుండా నడవం కదా ! అదే పరిస్థితి మనం చేసే ఉద్యోగం కూడా ! మీ పని మీరు సవ్యం గా చేస్తూ , మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే వారి గురించి మీరు అప్రమత్తత తో ఉండాలి ! ఎప్పుడూ ! మీ అప్రమత్తత మీకు విరోధులను తక్కువ చేస్తుంది. అట్లాగే మీ ఆపదలను కూడా తక్కువ చేస్తుంది !
అందుకు మీరు ఏమి చేయాలి ?
1. వ్యక్తి గత విలువలు నిర్ణయించుకోవడం ! మీరు చేసే ఉద్యోగం లో అప్రమత్తులై ఉండడం అంటే, ముందుగా , మీకు మీరు గా, కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి ! ఆ విలువలు మీ శీలాన్ని అంటే మీ క్యారెక్టర్ ను దృ ఢ మైనది గా చేస్తాయి ! ఇతరులు వేలు పెట్టి మీలో తప్పులు ఎంచ డానికీ , లేదా వెన్ను పోటు పొడవడానికీ జంకుతారు ! మీరు ఏర్పరుచుకునే వ్యక్తిగత విలువలు అనేకం ఉండవచ్చు ! కానీ అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగం లో మీ సమగ్రత అంటే ఇంటిగ్రిటీ ను బలోపేతం చేసేవి గా ఉండాలి !
ఉదాహరణకు : మీరు ఈ క్రింది విధం గా, మీలో మీరు ప్రతిన బూన వచ్చు :
” నేను నా ఉద్యోగం కోసం ఇతరులను ( అంటే ఇతర ఉద్యోగులను ) ఏరకంగానూ శారీరికం గానైనా , మానసికం గానైనా హింసించను !”
నేను పని చేసే కంపెనీ నిబంధనలు ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించను ”
” నేను నా నీతి నియమాలను కూడా ఎప్పుడూ పాటిస్తాను ” !
” నా యజమాని శ్రేయస్సుకూ , నా కుటుంబ శ్రేయస్సు కూ ఎప్పుడూ పాటు పడతాను ” !
”ఉద్యోగం లో నాకు తెలిసిన నిపుణత అంటే స్కిల్స్ , ఇతర ఉద్యోగులకు , ఏ స్వలాభాపేక్షా లేకుండా నేర్పుతాను” !
నేను ఉద్యోగం చేసే చోట , ఇతర సహోద్యోగులు ఎవరైనా పదోన్నతి పొందినా , నేను ఏ విధమైన అసూయా ద్వేషాలను పొందను , వారిమీద ప్రదర్శించను ”
ఈ రకమైన వ్యక్తి గత విలువలను మీకు మీరే ఏర్పరుచుకునే లక్ష్మణ రేఖలు ! వీటికి బద్ధులై ఎప్పుడూ , మీ పూర్తి శక్తి యుక్తులను మీరు చేసే ఉద్యోగం లో ప్రదర్శించడం అలవాటు చేసుకుంటే, మీరు మానసికం గా అత్యంత బలవంతులవుతారు ! దానితో మీ లక్ష్యాలు మీరు చేరుకోవడం సులభమవడమే కాకుండా ,మీ ఉద్యోగం లో మీకు శత్రువులు ఏర్పడరు, ఒకవేళ ఏర్పడినా, వజ్రం లాంటి మీ శీలాన్ని ఛే దించ లేరు !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !