5. గర్భం దాల్చితే డయాబెటిస్ రిస్కు ఎక్కువ అవుతుందా?
డయాబెటిస్ గురించిన కొన్ని వివరాలు క్రితం టపాలలో మనం తెలుసుకున్నాం కదా ! కొన్ని నివారణోపాయాలు కూడా తెలుసుకున్నాం కదా !మరి స్త్రీ గర్భం దాల్చగానే డయాబెటిస్ రిస్కు ఎక్కువ అవుతుందా ? :
ఒక్క మాటలో సమాధానం, ఔననే చెప్పుకోవాలి ! వాటి వివరాలు తెలుసుకుందాం ! ఈ వివరాలు,ముఖ్యం గా పిల్లా పాపలతో, కుటుంబం ప్రారంభించుదామనుకునే ప్రతి జంటా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ! ఒక అంచనా ప్రకారం, ప్రతి వంద మంది గర్భ వతులలోనూ , కనీసం పద్దెనిమిది మంది కి గర్భం తో ఉన్నప్పుడు , డయాబెటిస్ వచ్చే రిస్కు ఉంది !
గర్భం లో డయాబెటిస్ రావడానికి కారణం ఏమిటి ?:
ఇప్పటి వరకూ గర్భం దాల్చినప్పుడు, డయాబెటిస్ రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియలేదు , కానీ పెరుగుతున్న శిశువు కు అనువుగా తల్లి హార్మోనులలో కొన్ని మార్పులు జరిగి , తల్లి నుంచి వచ్చే ఇన్సులిన్ అనే రక్తం లో షుగర్ లేదా చెక్కర ను కంట్రోలు చేసే హార్మోను సరిగా పనిచేయ నీయక పోవడం జరుగుతుంది ! దీనిని ఇన్సులిన్ రెసిస్టె న్స్ అంటారు ! పిండ దశలో ఉన్న శిశువు కు అవసరమయిన మావి లోనుంచి వచ్చే హార్మోనులు, తల్లి నుంచి వచ్చే ఇన్సులిన్ ను సరిగా పని చేయనీయవు ! దానితో తల్లి లో డయాబెటిస్ వచ్చే రిస్కు ఎక్కువ అవుతుంది. గర్భం పూర్తి అయి , మావి కూడా శిశువు జన్మించాక బయటికి వస్తుంది కాబట్టి ,క్రమేణా , ఇన్సులిన్ పనిచేయడం మొదలై డయాబెటిస్ తల్లి లో మాయం అవుతుంది ! ఒక విధం గా , గర్భం దాల్చినప్పుడు తల్లి లో కనిపించే డయాబెటిస్ ” మావి చేసే మాయ ” అన్న మాట !
మరి తల్లి కి గర్భం లో డయాబెటిస్ వస్తే ఏమవుతుంది ? మళ్ళీ ప్రసవం అవగానే ఆ డయాబెటిస్ మాయం అవుతుంది కదా ? :
గర్భం దాల్చినపుడు డయాబెటిస్ కనుక వస్తే వాటి పరిణామాలు తల్లి మీదా, గర్భం లో పెరుగుతున్న శిశువు మీదా కూడా ఉంటాయి !
1. తల్లి రక్తం లో ఏర్పడిన అధిక చెక్కెర అంటే షుగర్ , రక్త నాళాల ద్వారా శిశువు లో ప్రవేశించి , శిశువు బరువు ను పెంచుతుంది ! ఈ బరువు సాధారణ బరువుకన్నా ఎక్కువ గా ఉంటుంది !
2. శిశువు బరువు ఎక్కువ గా ఉండడం వల్ల ప్రసవ సమయం లో బయట కు వచ్చే సమయం లో శిశువు భుజాలు ( పెద్దవి అవడం వల్ల ) గాయ పడే ప్రమాదం ఉంది !
3. అంతే కాక , శిశువు ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది ( తన రక్తం లో ప్రవేశించిన ఎక్కువ చెక్కెర ను నియంత్రించుకోవడం కోసం ) దానితో శిశువు రక్తం లో చెక్కెర శాతం తగ్గిపోతూ , ఊపిరి తీసుకోవడం లో సమస్యలు ఏర్పడే రిస్కు ఎక్కువ అవుతుంది !
4. ఇంకా , పరిశోధనల వల్ల , ఇట్లా అధిక బరువు తో పుట్టిన శిశువులలో , వారు పెరిగి పెద్ద అవుతున్నపుడు వారికి డయాబెటిస్ వచ్చే రిస్కు ఎక్కువ అవుతుంది !
శిశువుకే కాక , గర్భం దాల్చిన సమయం లో డయాబెటిస్ వచ్చే ప్రతి ముగ్గురు తల్లుల్లో , కనీసం ఇద్దరికి , క్రమేణా డయాబెటిస్ వస్తుంది అని తెలిసింది !
ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి ఈ విషయం మీద ఎక్కువ అవగాహన ఏర్పడడానికి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !