8. మధుమేహం ( డయాబెటిస్ ) కాంప్లి కేషన్లు ఏమిటి ?:
డయాబెటిస్ నివారణకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో , ప్రీ డయాబెటిస్ ను ఎట్లా కనుక్కోవాలో క్రితం టపాలలో వివరం గా తెలుసుకున్నాం కదా ! మరి ఈ డయాబెటిస్ ఒక సారి వచ్చాక , ” ఏమవుతుంది ? ఈ డయాబెటిస్ ను పథ్యం ఏమీ చేయకుండా అశ్రద్ధ చేస్తే ఏం పోతుంది ? ” అని అనుకుని ,పాటించ వలసిన ఆహార నియామాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు, చాలా మంది ! దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు ! అంతకు ముందు అన్ని ఆహార పదార్ధాలూ, ఏ పథ్య మూ లేకుండా, తమ ఇష్టానుసారం గా తిని, ఒక్క సారిగా , కేవలం చెక్కెర ఉన్న తీపి పదార్దాలే కాకుండా , అసలు తినే ప్రతి పదార్ధం విషయం లోనూ అతి జాగ్రత్త పాటిస్తూ , ముళ్ళ దారిలో , పాద రక్షలు ఏమీ లేకుండా , నడిచిన విధం గా అనుభూతి చెందుతూ , జీవితం సాగించడం అతి కష్టం గా అనిపిస్తూంది చాలా మందికి ! అందు వల్ల విరక్తి తో కొంత కాలం పథ్యం పాటించి , కొన్ని రోజులు వారి ఆహార పానీయ నియమాలను ఒక్క సారిగా సడలిస్తూ ఉంటారు చాలా మంది ! వారందరికీ ఒకటే సూచన !
ప్రపంచం లో కొన్ని రకాల ఆహారం తింటే విపరీతమైన ఎలర్జీ వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ! సీరియస్ గా ఎలర్జీ ఒక సారి వచ్చి ,మళ్ళీ ఎప్పుడూ , ఆ పడని ఆహారాన్నీ , ఆహార పదార్దాలనూ , మళ్ళీ జీవితం లో ముట్టుకొని వారు చాలా మంది ఉన్నారు ! డయాబెటిస్ కూడా ఇట్లాంటి పరిస్థితే, కాక పొతే , ఈ పరిస్థితిలో వచ్చే మార్పులు, ఒక్క సారిగా కాక , క్రమేణా , కాంప్లికేషన్ ల గా మారి , వివిధ అవయవాలకూ , ఇంకా తీవ్రం గా ఉంటే , ప్రాణాలకూ ముప్పు తెస్తుంది ! డయాబెటిస్ , ఒక రకం గా, మన దేహం ఎక్కువ చెక్కర కు సరిగా స్పందించ లేక ఏర్పడే పరిస్థితి ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, కేవలం మన పాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్ అనే హార్మోనే కాక , మన దేహం లో అన్ని చోట్లా ఉన్న కండరాలు కూడా సరిగా స్పందించలేక పోవడం అని ! అంటే , పాంక్రియాస్ లో నుండి ఉత్పత్తి అయే ఇన్సులిన్ అనే హార్మోను , నిత్య జీవితం లో, మనం తినే ఆహారం లో ఉండే చెక్కెర ను, మన శరీరం లోని వివిధ కణాలలోకి ప్రవేశించే ట్టు చేస్తుంది. కానీ మన ఆహారం లో , రోజు రోజు కూ చెక్కర ఎక్కువ అవుతూ ఉంటే , ఇన్సులిన్ ఇక సరిపడినంత ఉత్పత్తి అవక, పాంక్రియాస్ కణాలు ” చేతులెత్తేస్తాయి ” ! ఇంకా , మనం ప్రతి రోజూ వ్యాయామం చేయక పోవడం వల్ల , మన కండరాలు కూడా ” మొండి కెత్తుతాయి ” ! దానితో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాక పోవడం తో పాటుగా,కండరాలు సక్రమం గా చెక్కర ను అంటే గ్లూకోజు ను ” పీల్చ ” లేక పోవడం తోడై , డయాబెటిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది ! మరి ఈ పరిస్థితి ఎక్కువ సమయం శరీరం లో ఉంటున్న కొద్దీ , ఎక్కువ గా ఉన్న చెక్కర , అదే గ్లూకోజు , రక్త నాళాల మీదా , వివిధ అవయవాలలోనూ, అనేక మార్పులు తీసుకు వస్తుంది ! వాటినే కాంప్లికేషన్ లు అంటారు !
పైన కొన్ని ఫోటోలు వరస గా ఉన్నాయి !వాటిలో ఏ విధం గా డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్ లు వస్తాయో , చెప్ప గలరా ? !!!
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !