Our Health

Archive for ఫిబ్రవరి, 2013|Monthly archive page

పని సూత్రాలు.3. ఇంకొకరి పని మీరు చేయ వచ్చా ?

In మానసికం, Our minds on ఫిబ్రవరి 16, 2013 at 12:30 సా.

పని సూత్రాలు.3. ఇంకొకరి పని మీరు చేయ వచ్చా ?

 
వర్క్ ప్లేస్ లో సామాన్యం గా ఇతర కొలీగ్స్ లీవ్ మీద ఉన్నప్పుడు కానీ, వారు ఆకస్మికం గా ఇతర కారణాల వల్ల , డ్యూటీ కి రానప్పుడు , అత్యవసర చర్య గా మీరు ,వారి జాబ్ ను కవర్ చేయడం జరుగుతుంది.ఆఫీసులలో, కొంతమంది చాలా ఉదారం గా ఉంటారు. వారు వారి కొలీగ్స్ ఉద్యోగానికి వచ్చినా , వారి పనులు కొన్ని చేసి వారికి ” ఉపకారం ” చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి , ఆఫీసులో యువతులు ఉన్నప్పుడు, పురుషులు చాలా స్నేహ పూర్వకం గా , ఉంటూ , వారి ఉద్యోగం లో సహాయం చేస్తూ ఉంటారు. ఇంకొందరు, ఇంకొంత ముందుకు పోయి , వారు మూడవ తరగతి , నాల్గవ తరగతి కి చెందిన ఉద్యోగాలు చేస్తూ కూడా , ఆ ఆఫీసులో వారికి తెలియనిది ఏదీ లేదన్న ధీమా తో ఉంటారు. ప్రతి ఉద్యోగి విధులలో ” వేలు ” పెడుతూ ఉంటారు. వారి పైన ఉన్న ఉద్యోగులకు కూడా  సలహాలు ఇస్తూ ఉంటారు. అవసరం లేక పోయినా ప్రతి వారికీ సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అత్యుత్సాహం తో అందరికీ , అన్ని విధాలా సహాయం చేసే వారు, చాలా సమయాలలో ఏ  విధమైన గుర్తింపూ లేకుండా , ఎదుగు దల కూడా లేకుండా ఉంటారు. ఒక సారి ఆఫీసు అంతా , వారి పేరు ( అందరికీ సహాయం చేస్తుంటాడని ) తెలిస్తే , వారిని బాగా ‘ ఉపయోగించుకోడానికి ‘ చూస్తూ ఉంటారు. వారి విలువ కూడా కోల్పోతారు ! అందుకనే వీరు, ఇతరుల పని చేసే ముందు ప్రతి సారీ, ఆత్మావలోకనం చేసుకోవాలి. 
1. ఆ పనిని తనను ఎందుకు చేయమంటున్నారు?
2. ఆ పని , ఇతరుల కోసం చేయడం లో తన లాభం ఎంత మాత్రం ఉంది ?
3.ఇతరులకు ఆ పనిని తను చేసి పెట్టడం వల్ల , ఆఫీసు హెడ్ దృష్టి లో తన మీద అభిప్రాయం ఎట్లా ఉంటుంది?
4.తాను ఆ పని చేయక పొతే ఏమవుతుంది ?
5. ఆ పని ని తననే చేయమనడం లో ఉద్దేశం, ఆ పనిని డర్టీ  జాబ్ అని మిగతా అందరూ ముట్టుకోక పోవడం వలననా ?
6. లేదా ఆ పనిని తనను చేయమంటున్న వారు నిజం గానే పని వత్తిడి ఎక్కువ గా ఉండి, తన సహాయం కోసం అర్ధిస్తూ ఉన్నారా?
ఈ ప్రశ్నలన్నిటినీ వేసుకుని , సమంజసమైన సమయాలలోనే , ఇతరులకు సహాయం చేయడానికి పూనుకోవాలి.  ఒక సారి వారికి సహాహాయం చేశాక , వారి ప్రవర్తన తమ తో ఎట్లా ఉంది, వారు మళ్ళీ మళ్ళీ తనను ” వాడుకోవడానికి చూస్తున్నారా ? ” అని కూడా పరిశీలించుకోవాలి ! ఈ రకమైన ఆలోచనా ధోరణి ఏర్పరుచు కోవడం వల్ల ,  వారు ” అడ్డ మైన గాడిద చాకిరీ ” చేసే పరిస్థితిని మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించుకోగలరు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు ! 

పని సూత్రాలు.2. కదలిక కీలకం !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 14, 2013 at 7:36 సా.

పని సూత్రాలు.2. కదలిక కీలకం ! 

చాలా మంది ఉద్యోగం లో చేర గానే , ఉదయమే ఉద్యోగానికి వెళ్ళడం , అక్కడ ఉన్న పని ఏదో అల్లా టప్పా గా చేయడం , నాలుగున్నర అవుతుండ గానీ మళ్ళీ , ఇంటి కి బయలు దేరే ప్రయత్నాలు చేయడం , చేస్తూ ఉంటారు. వారికి , ఉద్యోగం  ఒక గమ్య స్థానం అవుతుంది.
కానీ  జీవిత గమ్యస్థానాలకు , అంటే వారి జీవితాలలో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకావాలనుకునే వారికి , ఉద్యోగం ఒక సాధనం అవుతుంది. వారు , వారి వారి బాధ్యతలను ( వారి ఉద్యోగాలలో ) సరిగా నిర్వర్తించడమే కాకుండా , ఉద్యోగాన్ని , అనుకున్న సమయానికి ముందు గా నే పూర్తి  చేసి , మిగతా సమయాన్ని , ” ముందుకు ” పోయే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అంటే వారి ఉద్యోగం, అంత వరకూ చేసి , పదోన్నతి పొందిన వారి తో పరిచయాలు పెంచుకుంటారు. స్నేహాలు చేస్తారు. వారు ఏ  విధం గా పదోన్నతులు పొందుతున్నారో , ఏ యే  మార్గాలు అనుసరిస్తున్నారో , శ్రద్ధ గా తెలుసుకుంటారు !  ప్రమోషన్ల కిటుకులు తెలుసుకుంటారు !  వారి పని వారు చేస్తూనే , ఒక కన్ను తరువాతి అవకాశాల కోసమూ , ఆ ఉద్యోగం లో  తాము పొందే లాభాల మీదా వేసి ఉంచుతారు ! 
ఉద్యోగం ఒక గమ్య స్థానం అనుకునే వారు, వారి జీవితమే ధన్యమైందని అనుకుంటారు. కొంత వరకూ అది నిజమే కదా , నిరుద్యోగులు గా ఉండడం కంటే ! కానీ వారి అపారమైన శక్తి సామర్ధ్యాలను ఒకే స్థానం లో , ఒకే ఉద్యోగం లో వృధా చేస్తూ ఉంటారు ! వారికి  కదలిక ఉండదు అంటే మూవ్ మెంట్ ఉండదు!  సాహస మనస్తత్వం ఏర్పడదు ! బెరుకు గా పిరికి గా ఉన్న చోటునే ఉండి , పరిస్థితులతో రాజీ  పడడం  అలవాటు చేసుకుంటారు ! 
ఎప్పుడూ పారే ఏరు ప్రశాంతం గా నూ , గంభీరం గానూ , నిశ్శబ్దం గానూ , ఉంటుంది. అందులో నీరు కూడా తాజా గా ఉంటుంది. జీవం ఉంటుంది. నిలకడగా ఉన్న సరసు లో తాజా తనం ఉండదు ! నాచు మొక్కలు పెరుగుతాయి. అందుకే, ప్రతి వ్యక్తి కీ, కదలిక కీలకం ! 
‘దూరపు కొండలు నునుపు’ అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ, వచ్చిన  అవకాశాలను వినియోగించుకోక ,  ఆత్మ సంతృప్తి చెంద  లేక , పరిస్థితులతో రాజీ పడ లేక నిరంతరం ఘర్షణ చెందే యువతీ యువకులు కూడా చాలా మంది ఉన్నారు ! వారి ఆ పరిస్థితి కాల క్రమేణా , తీవ్రమైన అసంతృప్తి  గా మారి ,వారి లో ప్రశాంతతను దూరం చేసి, అలజడి రేపుతుంది. అదే సమయం లో వారు రాజకీయ నాయకుల చేతులలో పావులు గా మారుతారు.  తమదైన , సహజమైన , ఇంకా   ప్రభావ శీలమైన వ్యక్తిత్వాలను కోల్పోతారు !  ఆత్మ న్యూనతా భావాలు ఎక్కువ చేసుకుంటారు !   ! అందుకనే , వారు సరి అయిన సమయం లో సరి అయిన నిర్ణయాలు తీసుకొని , పురోగమించడానికి తమ  శక్తి యుక్తులా ప్రయత్నాలు చేయాలి !
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు . 1. పనితనం నేర్చుకోండి !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 13, 2013 at 9:04 సా.

పని సూత్రాలు . 1. పనితనం నేర్చుకోండి ! 

మీరు ఏ  ఉద్యోగం లో చేరినా , చేయ వలసిన ప్రధమ కర్తవ్యం , పని నేర్చుకోవడం !  మీరు చేస్తున్న పనిలో ఎంత నైపుణ్యం చూపిస్తే, మీరు అంత  అభివృద్ధి పధం లో సాగ గలరు. మీ లక్ష్యం , మీ సహచరులందరి కంటే కూడా , మీరు ఎక్కువ సామర్ధ్యం తో పని చేయడం అలవాటు చేసుకోండి ! దీనికోసం మీరు ఎంత కష్ట పడ  వలసి వచ్చినా , మీరు నిశ్శబ్దం గా  కష్ట పడండి , మీ సహ చరులెవ్వరికీ , మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనే విషయం తెలియ నీయకండి !  మీరు ఈ బ్లాగులో , పని సూత్రాలు చదువుతున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియ నీయకండి.మీరు చేయవలసిందల్లా , మీరు చేస్తున్న ఉద్యోగాన్ని , సమర్ధ వంతం గా బాధ్యతా యుతం గా చేయడమే  !  అన్ని పరిస్థితులూ , మీ నియంత్రణ లోనే ఉన్నాయన్న ధీమా తో మీరు ఉండాలి . అంటే  మీరు కష్ట పడి  మీరు చేస్తున్న పని లో ప్రావీణ్యం సంపాదించడమే !  మీరు చేస్తున్న పనిని , మిగతా అందరూ (  మీ వర్క్ ప్లేస్ లో మీ చుట్టూ ఉన్న వారంతా )  గమనించేట్టు  చూడండి ! ముఖ్యం గా మీ బాసు కళ్ళ లో పడాలంటే ! ,మీరు మీ ఆఫీసులో , మీ ఫైళ్ళ ముందర ఎంత కాలం కూర్చున్నా , మీ చెమటా , కష్టమూ , వృధా అవుతుందే తప్ప , దానికి  తగినంత ఫలితం ఉండదు. మీరు ఎక్కడ పని చేస్తున్నా , మీ పై వాడు మీ పనిని గమనించే పరిస్థితి కలిగించండి.  ఒక సాధనం ఏమిటంటే , మీరు చేస్తున్న పని గురించి ఒక రిపోర్ట్ మీ బాసుకు ఇవ్వండి. అంటే మీరు ఎంత పని పూర్తి  చేసిందీ, ఇంకా ఎంత తక్కువ పని మిగిలి ఉన్నదీ కూడా , ఒక చిన్న రిపోర్ట్ ఇవ్వండి. మీ మిగతా సహచరుల సమక్షం లో ! ఇట్లా చేయడం వల్ల ,మీ పనితనానికి గుర్తింపు వస్తుంది. ప్రత్యేకించి మీ బాసుకు !  మీరు ఈ పని తరచుగా చేయకూడదు ! అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే , మీరు మీ బాసు  గుడ్ బుక్స్ లో ఉంటారన్న మాట !  మీ బాసు కి మీ మీదా మీ పని మీదా మంచి ఇంప్రెషన్ రావాలంటే అత్యుత్తమ సాధనం మీరు చేస్తున్న పనిని సమర్ధ వంతం గానూ, బాధ్యతా యుతం గానూ చేయడమే ! దీనికి సబ్ స్టి ట్యూ ట్  ఏమీ ఉండదు ! అందువల్ల మీరు చేస్తున్న పనిని ఏకాగ్రత తో , తదేకం గా మిగతా ఏ  వ్యాపకాలూ లేకుండా చేయడం అలవాటు చేసుకోండి ! 

ఒక ఉదాహరణ : మీరు బజారులో చాట్ మసాలా వాడి బండి చూసే ఉంటారు !  అట్లాంటి బండి ఎక్కడ ఉన్నా , విపరీతం గా జనాలు !  మరి బండి వాడి పనితనం కనుక గమనిస్తే !  బండి లో ఒక పొయ్యి,  దాని మీద ఒక  పెద్ద పెనం ఉంటుంది. ఒక సగం లో నాన బెట్టిన శనగలు ఉంటాయి, పచ్చగా.  పొయ్యి పక్కగా , చక్కగా చాప్ చేసిన ఉల్లిపాయలు, కొతిమీర, టమాటాలు ఉంటాయి , వాటి పక్క గా చాట్ మసాలా ! ఇంకా వాడేమో చేతుల తో మాయ చేస్తున్నట్టు అవి కొన్నీ , ఇవి కొన్నీ చక చకా కలిపేసి ఒక ప్లేట్ లో అన్నీ పోసి , చక్కటి పెరుగు రెండు చెంచాలు వేసి, ఇస్తూ ఉంటాడు ! ఇంకో చేత్తో  గోల్ గప్పా లు మధ్యలో తుంచి , వాటిలో మసాలా నీరు పోసి ఇస్తూ ఉంటాడు ! కాస్త సమయం దొరికితే , అట్ల  కాడ తో పెనం మీద అవసరం లేక పోయినా కూడా టక టక టక  మనే శబ్దం చేస్తూ ఉంటాడు ! ఇక్కడ గమనించ వలసినది , బండి వాడి హస్త లాఘవం , ఇంకా అందరూ మూగి ఉన్నపుడు , లైటు వెలుతురూ లో వాడు , వాడి బాసులు ( అంటే డబ్భులు ఇచ్చి వాడి చాట్ తినే వారందరూ ! ) వాడి పనితనం గమనించడానికి చేసే ప్రయత్నాలే !  అ సమయం లో ఆ చాట్ బండి చుట్టూ మూగి ఉన్న వారి నోటిలో, గోల్ గప్పా లూ ,చాట్ లో పడుతూ ఉంటే , ” ఎంత బాగా చేస్తున్నాడు !  వాడి దగ్గర ఏదో రహస్యం ఉంది” ! అనుకుంటూ తింటూ ఉంటారు !  పనితనం చూపించడం అట్లా ఉంటుంది ! 

వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !  
  

పని సూత్రాలు.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 12, 2013 at 9:06 సా.

పని సూత్రాలు.

 
ఆధునిక మహాభారత ఉద్యోగ పర్వం లో , యువతీ యువకులంతా , అనేక రకాలు గా ఉంటారు. చాలా మంది పట్టే ప్రధాన మైన  బాట, చదువులు పూర్తి అయిన తరువాత , ఉద్యోగం కోసం  వేట !  ఇట్లా ఉద్యోగం చేసే వారిలో ఎక్కువ శాతం మంది , పరీక్షలు పాసయిన వారుంటారు .  కొంత శాతం మంది , పరీక్షలలో సఫలం కాలేక , చదువు కు విరామం ఇచ్చి , ఉద్యోగం వేట లో పడతారు. ఆ అదృష్టానికి కూడా నోచుకోని వారు , చదువులు మానివేసి, అంటే స్కూల్ చదువులు అయ్యాకనే , పై చదువులకు వెళ్ళ కుండా ( లేదా వెళ్ళ లేక ) ఉద్యోగాలు వెతుక్కుంటారు. అనేక సంవత్సరాలు గా వారి జీవితాలలో, అతి ముఖ్యమైన భాగమైన స్టూడెంట్ లైఫ్ ను భాగా అనుభవిస్తారు , చాలా మంది యువతీ యువకులు, అందులో తప్పు ఎంత మాత్రమూ లేదు. కానీ పరీక్షా ఫలితాలు తెలిశాక , వారు ఒక జల్లెడ లోనుంచి వేరు చేయబడతారు వివిధ  గ్రూపు లు గా ! వారికి వచ్చిన మార్కుల ప్రకారం గా వారి ప్రతిభ, కొన్ని తరగతులు గా విభజింప బడుతుంది.  కానీ ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం తరచూ , ప్రతిభకు డిగ్రీలూ , సర్టిఫికెట్  లు మాత్రమే కొలమానాలు కాదని ! ప్రతిభ ను వారే ” సాన ” పెట్టుకుంటే లేదా పదును పెట్టుకుంటే , వారు, వారి వారి జీవితాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించ గలుగుతారు.  కావలసినది కృత నిశ్చయమూ , శ్రమా, ఆశావహ దృక్పధమూ ! వారి, వారి లక్ష్యాలను అధిగమించ డానికి  వారందరికీ కావలసినది ఇంకో ముఖ్యమైన  సాధనం ” పని సూత్రాలు ” అదే, రూల్స్ ఆఫ్ వర్క్ . వారు ఎక్కడ ఏపని చేసినా , వారికి పని సూత్రాలు పూర్తి గా తెలిస్తే , వారు నెగ్గుకు రాగలరు ! 
విచార కరమైన విషయం ఏమిటంటే , ఈ పని సూత్రాలు , చదువు కున్న వారికీ , వారి కాలేజీ లో చెప్పరు , చదువు కోలేక పోయిన వారికీ ,వీటి గురించి అవగాహన ఉండదు. పని చేసే , ప్రతి మానవ జీవితం లో అతి ముఖ్యమైన ఈ పని సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ! మన జీవితాలలో,పని సూత్రాలు పాటించి , అభివృద్ధి పధం లోకి వెళదాం !
 
వచ్చే టపా నుంచి , ఈ పని సూత్రాలు వివరం గా తెలుసుకుందాం ! 

 

పరీక్షల ముందు, విద్యార్ధులలో ఆందోళన తగ్గించడం ఎట్లా ? మిగతా పద్ధతులు.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 10, 2013 at 9:57 ఉద.

పరీక్షల ముందు, విద్యార్ధులలో ఆందోళన తగ్గించడం ఎట్లా ? మిగతా పద్ధతులు. 

2. సన్నద్ధం అంటే ప్రిపరేషన్ లో నే ఉంది కిటుకు : 

పరీక్షా సమయం లో విద్యార్ధులలో ఏర్పడే భయాందోళన లకు ఇంకో ముఖ్య కారణం , సరిగా సన్నద్ధం అవక పోవడం. ఈ పరిస్థితిని యుద్ధానికి వెళ్ళే సైనికులు ,ఆయుధాలు మర్చి పోయిన  పరిస్థితి తో పోల్చ వచ్చు.  పరీక్షా స్థలం లో జరిగేది కేవలం, అంతకు ముందంతా, విద్యార్ధులు , ఏమి నేర్చుకున్నారో పరీక్ష చేయడమే కదా !  అందువల్ల  ఆ పరీక్ష కు సరిగా ప్రిపేర్ అవ్వడం ఎంతో  ముఖ్యం. ఈ సన్నద్ధం అవడాన్ని ప్రధానం గా రెండు రకాలు గా విభజించు కోవచ్చువిద్యార్ధులు.స్కూలు తెరవ గానే ఆ సంవత్సరం లో చెప్పే పాఠాల  వివరాలు తెలుసుకోవడం.ఈ పని , విద్యార్ధులు చిన్న వయసు లో ఉంటే , వారి తలిదండ్రులు కూడా చేయ వచ్చు.  పాఠాల వివరాల తో పాటుగా , క్లాసు పరీక్షల లోనూ , ఇంకా ఫైనల్ పరీక్షల లోనూ , వచ్చే ప్రశ్నల వివరాలు, అంటే మోడల్ పేపర్స్, లేదా నమూనా ప్రశ్న పత్రాలను కూడా , స్కూల్ ప్రారంభించిన సమయం లోనే సంపాదించి , ఆ యా ప్రశ్నలకు సమాధానాలు వివరం గా రాసే దిశగా , విద్యార్ధిని సన్నద్ధం చేయాలి. ఈ విధం గా చేయడం వల్ల , సంవత్సరం పొడుగునా చదువుతున్నా ,పరీక్షా సమయం లో ఇచ్చే ప్రశ్నలను చూసి ఆందోళన చెందకుండా , వాటిని సులభం గా రాసే అలవాటు విద్యార్ధికి ఏర్పడుతుంది. ఇట్లా పరీక్షా ప్రశ్నా పత్రాలు కూడా ,తరచూ  ప్రాక్టిస్ చేయిస్తూ ఉంటే , విద్యార్ధులకు , ఆత్మ స్థైర్యం పెరుగుతూ ఉంటుంది.ఇంతే కాక తలిదండ్రులు పరీక్షా సమయాలలో చేయవలసినది ఇంకో ముఖ్య మైన కార్యం ఉంది. అది అన్ని పరిస్థితులలోనూ , విద్యార్ధిని ఎంకరేజ్ చేస్తూ , అంటే ఉత్సాహ పరుస్తూ , వారిలో  ఆ పరీక్షను  తాము చక్కగా రాయగలమనే ధైర్యాన్నీ , ఆత్మ విశ్వాసాన్నీ  కలిగిస్తూ , లేదా సన్నగిలి పోతున్న వారి ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ  ఎక్కువ చేస్తూ ఉండాలి. అంతే  కానీ , ఆ పరిస్థితులలో వారికి లేని పోనీ భయాలు కలిగిస్తూ ” ఈ పరీక్షలో పాసు కాక పొతే , లేదా మంచి మార్కులు రాక పొతే ఇక చదివించేది లేదు , నీ పని చెబుతా ! ” అంటూ బెదిరిస్తూ ఉంటే , ప్రయోజనం శూన్యం ! 
3.  చిన్న వయసు నుంచే !: 
చాలా మంది విద్యార్ధులు , ప్రత్యేకించి ఒకటో , రెండో తరగతో చదివే చిన్నారులు కూడా ఈ ఆందోళన లకూ భయాలకూ లోనవుతూ ఉంటారని మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు అంటారు . ఆ సమయాలలో తలిదండ్రులు కనక వారి మానసిక  పరిస్థితి ని గమనిస్తూ , వారికి సహాయం చేయక పొతే , వారి భయాందోళన లు, వారితో పాటుగా పెరిగి , వారు ( పెద్ద క్లాసులలో ) పరీక్ష రాసే ప్రతి సారీ వారిని బాధ పెడుతూ , వారి ప్రతిభను మరుగు పరుస్తాయి ! ముఖ్యం గా చిన్న పిల్లలు , అకారణం గా ముభావం గా ఉండడమో ,  కడుపు లో తిప్పు తుందనో , లేదా అతి గా మూత్ర విసర్జన చేయడమో , చేస్తూ ఉంటారు.ఆకస్మికం గా పెద్దగా ఏడుస్తూ ఉంటారు. పిల్లలలో ఎదురయే ఈ పరిస్థితి , ప్రత్యేకించి , పరీక్షల ముందు , అతి జాగ్రత్త గా వారి తల్లి దండ్రులు గమనించి, వివరం గా వాటి కారణాలు ఆరా తీయాలి. ఇట్లా ఎక్కువ యాంగ్జైటీ కి లోనయే  చిన్నారులకు  బ్రీదింగ్ ఎక్సర్సైజు లు బాగా ఉపయోగ పడతాయని విశదం అయింది. సాధారణం గా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజులు ,లేదా  శ్వాస వ్యాయామాలు ఇంట్లో నైనా వారి స్కూల్ లో నైనా చేయించ వచ్చు. వారిని చాప మీద పడుకుని కళ్ళు మూసుకోవాలని చెప్పాలి. తరువాత వారిని వారి శ్వాస మీద కేంద్రీకరించ మనాలి. తరువాత క్రమేణా , వారిని వారి కాళ్ళనూ చేతులనూ, టెన్స్  గా చేస్తూ , తరువాత రిలాక్స్ చేస్తూ ఉండమని చెప్పాలి. అంటే వారిని వారి చేతి కండరాలనూ , కాళ్ళ కండరాలనూ బిగిస్తూ , విడుదల చేస్తూ ఉండాలి. ఈ విధం గా చేయడం వల్ల, వారి మనసు కేవలం ఎక్సర్సైజు మీదే లగ్నం అయి , వారి ఆందోళనలు తగ్గుతాయి. ఇట్లా చిన్న పిల్లలతో , ప్రత్యేకించి యాంగ్జైటీ ను అనుభవిస్తున్న చిన్నారులలో , ఇట్లా ఎక్సర్సైజులు చేయించడం వల్ల , వారి భయాందోళన లు చాలా వరకు తగ్గి పోయి ,పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారని  కూడా స్పష్టమైంది. ( కొందరు పిల్లలైతే ఆ ఎక్సర్సైజులు చేస్తూ నిద్ర లోకి జారుకున్నారు ట ! )
పరీక్షలు అనేవి, పురోగమించే  ప్రతి మానవ జీవితానికీ అనివార్యం అయ్యాయి. ప్రతి మానవ జీవితం లో భాగం అయ్యాయి. వాటిని సమర్ధ వంతం గా ఎదుర్కోవడమే ఉత్తమ పధ్ధతి.  తలిదండ్రులూ , ఉపాద్యాయులూ కూడా , బాల బాలికలకు ప్రోత్సాహం, సహకారం ఇచ్చి వారిని సదా కర్తవ్యోన్ముఖులను చేస్తూ,చక్కటి ఫలితాలు కూడా పొందే లా చూడాలి. మనమంతా ఒక్కసారి గా పెరిగి, పెద్ద   అయిపోలేదు కదా !  ( టైం  పత్రిక సౌజన్యం తో ).
 
 
 

పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఫిబ్రవరి 9, 2013 at 11:09 ఉద.

పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?

 
నిన్నటి టపా లో మనం తెలుసుకున్నాం , పరీక్షల ముందు పిల్లలు పడే ఆందోళన, ఆతురత ,వారు రాసే పరీక్షలను ఎట్లా ప్రభావితం చేస్తుందో ! వారి అసలు మేధ ను ఎట్లా తక్కువ చేసి చూపిస్తుందో ! మరి ఆ ఆందోళన తగ్గించి వారి ప్రతిభను సరిగా చూపించేట్టు చేయడానికి  వారు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !  
1. ఆందోళనలను ముట్టడించడం ! :
చాలా మంది విద్యార్ధులు , పరీక్షకు ముందుగా , ఆందోళనా , యాంగ్జైటీ చెందినా , వారు పరీక్షా సమయం లో , ప్రశ్నలను చదివి , వారికి గుర్తు వచ్చిన సమాధానాలు రాస్తూ ఉంటారని. కానీ వారి ఆందోళనల వల్ల , వారి సమాధానాలలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.సాధారణం గా మన జ్ఞాపక శక్తి , వర్కింగ్ మెమరీ ఇంకా స్టోర్డ్ మెమరీ అని ప్రధానం గా రెండు రకాలు గా ఉంటుంది. మనము ఏ  పని చేయాలన్నా , ఈ రెండు రకాల మెమరీ కూడా అవసరం. ప్రత్యేకించి  వర్కింగ్ మెమరీ , పరీక్షలు రాసే సమయం లో ముఖ్యం గా అవసరం ఉంటుంది. ఎందుకంటే , ఇచ్చిన ప్రశ్నను అర్ధం చేసుకుని,మన మెదడులో నిక్షిప్తమై ఉన్న మెమరీ అంటే అంతకు మునుపు నేర్చుకున్న , విజ్ఞానాన్ని  గుర్తు చేసుకుంటూ ,  సమాధానం రాయడం జరుగుతుంది. పరీక్షల ముందు తీవ్రం గా ఆందోళన చెందిన విద్యార్ధులు ,  ఈ వర్కింగ్ మెమరీ ను సరిగా ఉపయోగించ లేక పోతారని తెలిసింది. ఎందుకంటే ఆందోళనా, యాంగ్జైటీ లు ,వారి వర్కింగ్ మెమరీ ను కొంత మేర వినియోగించు కుంటాయి , దానితో ప్రశ్నలకు , సమాధానాలు రాయడానికి సరిపోయేంత వర్కింగ్ మెమరీ మిగిలి ఉండదు. మరి ఈ సమస్యను అధిగమించడం  కష్టమేమీ కాదంటారు , మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు. అది ఎట్లా అంటే , వారు ఎక్స్ ప్రెసివ్ రైటింగ్ అనే పధ్ధతి ని అనుసరించాలి.
ఎక్స్ ప్రెసివ్  రైటింగ్ అంటే ఏమిటి : ఈ పధ్ధతి లో విద్యార్ధి చేయవలసినది ,పరీక్ష రోజుకు ముందు , కేవలం పది నిమిషాలు తన ఆందోళన లనూ , యాంగ్జైటీ లనూ ,ఇంకా పరీక్ష గురించి తనకు ఉన్న భయాలనూ , ఒక పేపర్ మీద రాయడమే ! ఇట్లా చేయడం వల్ల  వారు, వారి భయాందోళన లను తాత్కాలికం గా , తమ మెదడు లోనుంచి తీసివేసి , పేపర్ మీద పెడుతున్నారన్న మాట ! ఇట్లా చేయడం వల్ల  పరీక్ష ముందు, విద్యార్ధుల భయాందోళన లు ఇంకా ఎక్కువ అవ గలవని కొందరు సందేహాలు వెలిబుచ్చినప్పటికీ , అనేక పరిశీలనల వల్ల , ఈ పధ్ధతి పాటించడం వల్ల  విద్యార్ధులకు మార్కులు ఎక్కువ గా వస్తున్నాయని తెలిసింది. ఎందు వల్ల నంటే , ఇట్లా పేపర్ మీద రాసుకున్న విద్యార్ధులకు , ఉపయోగించడానికి , వారి వర్కింగ్ మెమరీ పూర్తిగా వినియోగం లోకి వస్తుంది ( భయాందోళన లు పేపర్ మీదకు మార్చ బడ్డాయి కాబట్టి )  ఈ పరిస్థితిని ఇంకో ఉదాహరణ ద్వారా వివరించ వచ్చు.  మనం కంప్యూటర్  వాడుతున్నపుడు , అనేక సైట్లను ఒకేసారి ఓపెన్ చేశామనుకోండి. అప్పుడు  మనకు కావలసిన సైటు మనకు దొరకడం ఆలస్యం అవుతుంది ఎందుకంటే, కంప్యూటర్  లో మెమరీ ఎక్కువ ఉన్నా కూడా , వర్కింగ్ మెమరీ , అంటే ప్రాసెసింగ్ పవర్ పరిమితం గా ఉంటుంది కాబట్టి , వీలైనంత వరకూ , మనం ఒక సమయం లో ఒక సైటు నే చూస్తూ ఉండాలి ( ప్రాసెసింగ్ స్పీడు ఎక్కువ గా ఉన్న కంప్యుటర్ లకు ఇట్లాంటి సమస్యలు ఉండవనుకోండి  ! ) 
 
వచ్చే టపాలో మిగతా పద్ధతులు !  

పిల్లలకు, చదువుల్లో, తరచూ పరీక్షలు మంచిదేనా?

In మానసికం, Our minds on ఫిబ్రవరి 8, 2013 at 6:41 సా.

పిల్లలకు, చదువుల్లో ,తరచూ పరీక్షలు మంచిదేనా?

విద్య – క్లాసు రూములు –  పరీక్షలు – ఇవన్నీ చాలా మంది వయసు వచ్చిన   విద్యార్థులకే మనస్తాపం, ఆందోళనా , వత్తిడీ  కలిగిస్తాయన్న విషయం కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా ! ఇటీవల అమెరికా లో జరిపిన పరిశీలనా ఫలితాల వల్ల  తేలిందేమిటంటే , యుక్త వయసు లో ఉన్న విద్యార్థులకే కాకుండా ,  చిన్న వయసు లో ఉన్న బాల బాలికలు కూడా , తమ స్కూళ్ళలో , తరచూ పెట్టే  పరీక్షల వల్ల , సతమతమవుతూ , ఆందోళన  చెందుతూ  ఉంటారని. అంతే  కాక , ఆందోళన చెందుతున్నబాల బాలికలు , తాము రాస్తున్న పరీక్షలలో , తమ ప్రతిభకు తగ్గట్టు గా , ఫలితాలు సాధించ లేక పోతున్నారని , అంటే  పరీక్షా సమయాలలో పడే ఆందోళనా వత్తిడు ల వల్ల , అని తెలిసింది.ఈ రకమైన  పరీక్షా సమయాలలో పడే ఆందోళన కూ , వత్తిడికీ,  వారి ప్రతిభా సామర్ధ్యాలకూ ఉన్న లంకె లేదా ఇంగ్లీషు లో లింకు ను ఈ మధ్యే , మనో వైజ్ఞానిక శాస్త్ర వేత్తలు చేదించడం మొదలు పెట్టారు. అంతే  కాక ,  పరీక్షా సమయాల ముందూ , పరీక్ష రాసే సమయం లోనూ కలిగే వత్తిడినీ , ఆందోళనల నూ  వీలైనంత వరకూ తగ్గించుకుని , తమ ప్రతిభా పాటవాలను సంపూర్ణం గా బహిరంగ పరిచి , ఆ యా పరీక్షలలో , అధిక శాతం మార్కులు తెచ్చుకునే శాస్త్రీయ  మార్గాలు కూడా వీరు సూచిస్తున్నారు ! వీరి సలహాల ప్రకారం  పరిష్కార మార్గాలు సులభమే కాకుండా , ఖర్చు కూడా లేకుండా  ఉండడమే కాకుండా , చాలా ప్రభావ శీలమైనవి గా కూడా ఉంటాయి , ఒక క్రమ పధ్ధతి లో ఆచరిస్తే !  అని ! 

అమెరికా లోని ఒహియో రాష్ట్రం లో ఇట్లా  పరీక్షా సమయాలలో బాలికలలో వచ్చే ఆందోళనలను నివారించడానికీ , వారిని ఎక్కువ ప్రభావ శీలురు గా చేయడానికీ ఒక ప్రత్యెక మైన డిపార్ట్ మెంట్ ఉంది దానికి ఒక మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు లిజా డమూర్  ఇట్లా అన్నారు ” బాలికలలో పరీక్షా సమయాలలో వచ్చే ఆందోళనలను నివారించడానికి మేము సూచించిన పద్ధతులు ఖచ్చితం గా సత్ఫలితాలు ఇస్తున్నాయి ” అమెరికా విద్యా వ్యవస్థ లో  ఒక చట్టం ఉంది. అది NCLB  అంటే నో చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ ” అంటే అమెరికా విద్యావవస్థ లో ఏ  బాలుడూ , ఏ  బాలికా వెనక పడకూడదని !  ఈ చట్టం వచ్చాక , ప్రతి స్కూల్ లోనూ క్లిష్ట తరమైన పరీక్షా పద్ధతులను పాటిస్తున్నారు. దాని ప్రయోజనం ఏమిటంటే , పరీక్షా పధ్ధతి లో ఉన్నత ప్రమాణాలు పెడితే ,అది , ప్రతి బాల బాలిక లలోనూ అంతర్గతమైన ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికీ , వారి భవిష్యత్తు , ఉజ్వలం గా ఉండడానికీ  తోడ్పడుతుంది ! ” అని. అంతే  కాక ,అమెరికా ప్రభుత్వం , ఈ పధకానికి , కేవలం స్కూళ్ళ లో పరీక్షలకే , 1.7 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది. ( ఒక బిలియన్ డాలర్లంటే వెయ్యి లక్షల డాలర్లు ! )( అంటే , రమారమి వెయ్యి కోట్ల రూపాయలు ! ) 

ఇంత ప్రతిష్టాత్మక , ఇంకా కఠిన తరమైన పరీక్షలలో కనుక  , బాల బాలికలు సరిగా ఫలితాలు సాధించక పోయినట్టయితే , ఆ పరిణామాలు , వారి జీవితాంతం , వారి అవకాశాలను తగ్గిస్తాయి.  అంతే  కాక , చాలా తక్కువ స్కోర్లు వచ్చిన అంటే మార్కులు తెచ్చుకున్న బాల బాలికలు ఎక్కువ గా ఉన్న స్కూళ్ళు కూడా మూత  పడే ప్రమాదం ఉందని , ప్రభుత్వం వారు హెచ్చరించారు ! 
ఈ కారణాల వల్లనే , ఆ దేశం లో పరీక్షా సమయాలలో వచ్చే ఆందోళన మీద ఇంతగా పరిశోధనలు చేసి ఉపాయాలు సూచిస్తున్నారు ! వారి అంచనా ప్రకారం,ఈ ఆందోళనలను ఆదిలోనే తుంచి వేస్తే  మంచిది, లేక పొతే  ఈ ఆందోళన లూ , యాంగ్జైటీ లూ , వారి జీవితాంతం వారిని వెన్నాడుతూ , వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయి ” అని తేల్చారు !  ఈ మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు సూచించిన సలహాలు , ఉపాయాలు ఏ  దేశం లో విద్యార్ధి కైనా వర్తిస్తాయి కదా అందుకే , మరి వచ్చే టపాలో ఈ ఉపాయాలను గురించి తెలుసుకుందాము ! 
 

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు. 4.కర్తవ్యం ?

In మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 5, 2013 at 8:57 సా.

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు. 4. కర్తవ్యం ?

 ఋణ  బంధాలలో చిక్కుకునే వారికి , ఇంగ్లండు లో ఒక అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ గారు ఇచ్చే  సలహా చూడండి !
1. మీకు ఉన్న ఆర్ధిక పరిస్థితులు మీ మానసిక ఆరోగ్యాన్ని ఏ విధం గా ప్రభావితం చేస్తున్నాయో  పరిశీలించండి, కొంత సమయం తీసుకుని. ప్రత్యేకించి , తీవ్రమైన వత్తిడి కి లోనవడమూ , లేదా డిప్రెషన్ కో ,నిద్ర లేమి కో లోనవడమూ  కూడా మీరు నిశితం గా పరిశీలించు కోవాలి. అట్లాగే ,మీరు చీటికీ మాటికీ, చీకాకు పడడం , ప్రత్యేకించి , మునుపెన్నడూ లేని విధం గా అప్పులు ఎక్కువ అవుతున్నప్పుడే , ఈ చీకాకూ , అశాంతీ , ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి ! 
2. ప్రత్యేకించి , మీరు మీ ఆలోచనా ధోరణి సరిగా ఉందో  లేదో అని రోజూ లేదా తరచూ  ఆత్మావలోకనం చేసుకోవాలి ! అప్పులు పాపాల పుట్ట లా పెరుగుతున్నా , ఏమీ పట్టనట్టు,  ” ఆనందో బ్రహ్మ ” అనే  ఆత్మ  వంచన కు మీ ఆలోచనలు మిమ్మల్ని గురిచేస్తున్నాయా ? లేదా పెరుగుతున్న అప్పులు , మిమ్మ్మల్ని నిరాశావాదులు గా , నిర్వీర్యులు గా చేస్తూ , మీకు జీవితం మీద వైరాగ్యం లేదా నెగెటివ్ అంటే నిరాశావాదపు ఆలోచనలూ , ఈ లోకం లో జీవించి ఉండడం అనవసరం ” అనే విధం గా  మీ చేత ఆలోచింప చేస్తున్నాయా ?పైన వివరించిన రెండు పద్ధతులూ అప సవ్యమైనవే అని ఎవరూ చెప్పకనే మనకు తెలుస్తున్నాయి కదా ! అందువలన  మీ ఆలోచనా ధోరణి పాజిటివ్ దృక్పధం తో ఉండాలి . మీ అప్పులు పెరుగుతున్నా , మీ ఆలోచనలు గాడి తప్పకూడదు ! 
3. మీరు ఎక్కువ సమయం పడక లోనే గడుపుతూ, మీ సొంత వాళ్ళనూ , మీ స్నేహితులకు మీ ముఖం చూపించ కుండా , మీరు తీర్చ వలసిన అప్పు ల గురించే దీర్ఘం గా ఆలోచిస్తున్నారా ? అయితే అది కూడా ఒక తిరోగమన చర్యే ! 
అయితే , మీరు చేయ వలసినది ఏమిటి ? : 
ఎట్టి  పరిస్థితులలోనూ  మీ ప్ర ప్రధమ కర్తవ్యం  ” మీ జీవితం ఎంత విలువైనదో గుర్తుంచు కోవడం ” ఈ విశాల ప్రపంచం లో మీరు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన , ఒక ప్రత్యేకమైన వ్యక్తి ! అంతే  కాక మీ జీవితం ఎంతో  అమూల్యమైనది.  మీరు ఎంత అప్పు చేసినా , మీరు ఎంత తీర్చలేక పోయినా , ఆ అప్పు కన్నా మీ ప్రాణం ఎంతో  మిన్న !  అందు చేత మిమ్మల్ని మీరు ఏ  విధమైన హానీ చేసుకో కూడదు !  తిరోగమన చర్యలు చేపట్టడం ఏ  విధం గానూ సమంజసం  కాదు , సమర్ధనీయం కాదు , హేతు బద్ధం కాదు !  మీరు అప్పు ల ఊబి లో నుంచి బయట పడే ముందు , ఏ  రకమైన నెగెటివ్ ఆలోచన ల ఊబి లోనూ కూరుకు పోకుండా మీరు జాగ్రత్త వహించాలి  ! నిండా మునిగిన వారికి చలి ఏమిటి ఇంకా అనే ” పలాయన వాదం ” తో చాలా మంది , తాగుడు , జూదం , సిగరెట్టూ , ఇట్లా రక రకాల వ్యసనాలకు బానిస లవుతుంటారు ! తెలిసి తెలిసీ ఒక విష వలయం లో కూరుకు పోతుంటారు , అది చాలా   పొర పాటు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 

 

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 4, 2013 at 10:37 ఉద.

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.

అప్పు గురించిన వాస్తవాలు : 
ప్రతి నలుగురిలో ఒకరిని  జీవితం లో ఏదో ఒక సమయం లో మానసిక రుగ్మత కానీ వ్యాధి కానీ బాధిస్తుంది.అట్లా బాధింప బడే ప్రతి నలుగురిలో  ఒకరికి అప్పు సమస్యలు ఉంటాయి. అప్పు సమస్యలు ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి  మానసిక రుగ్మతలు , లేదా వ్యాధులు ఉంటాయి.
మానవులు అప్పు ఊబి లో ఎట్లా కూరుకు పోతారు ? :
1. జీవిత చక్రం లో మార్పులు : అంటే  ఉద్యోగం పోవడమో, అయిన వాళ్ళతో విడి పోవడమో , లేదా మరణించడమో , విడాకులు తీసుకోవడమో లాంటి ఊహించని పరిణామాలు వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితిని  విషమం చేస్తాయి.
2. అనుకోకుండా సంభవించిన అనారోగ్యం కూడా  మానవులను మంచానికి కట్టి  పడేయడమే  కాకుండా , వారి కంచం లో కూడా ఆహారానికి వెతుక్కునే పరిస్థితి కలిగిస్తుంది.
3. చేస్తున్న ఉద్యోగం లో కూడా , చాలీ చాలని జీతాలు వస్తూ , అవసరాలు ఎక్కువ గా ఉన్నప్పుడు .
4. విచ్చల విడి గా ఖర్చు చేయడం , ( మ్యానియా అనే మానసిక పరిస్థితి లో కూడా  విచక్షణా రహితం గా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది . )చాలా మంది మానవులు , శాస్త్రీయం గా మానసిక శాస్త్ర నిపుణు డయిన డాక్టర్ చూడక పోయినా , ఇట్లాంటి మానసిక స్థితి లో ఉంటారు, మితి మీరి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వారు వ్యాపారస్తులకు ప్రియం. ఎందుకంటే , వారు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటే  వ్యాపారస్తులు అంత  లాభ పడుతూ ఉంటారు.
5. తీసుకున్న అప్పు తీర్చక పోవడం.
6. కట్టవలసిన బిల్లులు ( నెల వారీ )  అశ్రద్ధ చేసి కట్టక పోవడం. 
అప్పు చేసిన వారి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది?:
1. పరిస్థితి చేయి దాటి పోతున్నట్టూ , అందుకు తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నట్టూ  భావిస్తూ ఉంటారు.
2. నిరాశా వాద పరిస్థితిలో , ప్రత్యేకించి , తీర్చ వలసిన అప్పు రోజు రోజు కూ  ఎక్కువ అవుతుంటే !
3.తీవ్ర మైన స్వీయ అపరాధ భావనలు: అంటే ఆ పరిస్థితి కంతటికీ తామే కారణమనీ , ప్రత్యేకించి వారికి , శరీర లేదా మానసిక ఆరోగ్య కారణాలు ఉన్నప్పటికీ , తీవ్రం గా తమను తాము నిందించు కుంటూ , మనస్తాపం చెందడం !
4. డిప్రెషన్ కూ  , అందోళన కూ  లోనవడం !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 3, 2013 at 11:04 ఉద.

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?

 
సాధారణం గా మనమందరమూ , అప్పు చేయడానికి  సందేహిస్తూ ఉంటాము. మన ఆదాయం మించి ఖర్చులు అవుతున్నప్పుడు కంగారు పడతాము. ఎవరి దగ్గర అప్పు చేయ వలసి వస్తుందో అని, అప్పు చేయడానికి కూడా సంకోచిస్తూ ఉంటాము. వీలైతే  అప్పు లేని జీవితం గడుపుదామని అనుకుంటాము.కానీ వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ , ఆదర్శాలకూ , ఆశయాలకూ భిన్నం గా ఉంటాయి కదా ! మనం, మన పరిస్థితులకు , క్రెడిట్ కార్డులు ఎంతవరకు కారణమో చూద్దాం !
అప్పు చేసే వారికి క్రెడిట్ కార్డ్ లు ” దేవుడిచ్చిన ” వరం !  ఈ ప్రపంచం లో   అనేక కోట్ల మందిని ఒక్క సారిగా ఋణ గ్రస్తులను చేయడానికి ఉపయోగ పడే అతి చిన్న సాధనం ! అనేక పరిశీలనల వలన మనం కరెన్సీ అంటే డబ్బు నోట్ల రూపం లో మన చేతుల్లో ఉన్నప్పుడు , ఖర్చు చేయడానికి వెనుకాడు తాము , కానీ క్రెడిట్  కార్డు ఉన్నప్పుడు , ఆ జంకు  పోయి ” హుందాగా ”  క్రెడిట్ కార్డ్ ఫ్లాష్ చేస్తూ ఉంటాము.మన చేతిలో ఉన్న డబ్బు తో కాకుండా క్రెడిట్ కార్డు ఇచ్చి కొన్న వస్తువులను , ఆనందం గా కొంటాము !  ఆ సమయం లో మనం అనుభవించే ఆనందం, డబ్బు పెట్టి ,కొనే సమయం లో వచ్చే ” విచారాన్ని ” కను మరుగు చేస్తుంది ! మన మానసిక స్థితిని క్రెడిట్ కార్డ్ ఆ విధం గా ట్యూన్ చేస్తుంది. చాలా పరిశీలనల వల్ల , మన చేతిలో డబ్బు నోట్ల రూపం లో ఉన్నప్పుడు , మనం జాగ్రత్త గా ఆచి తూచి ఖర్చు చేస్తూ ఉంటాం అని తెలిసింది.
చాలా మంది  చేయని ఇంకో పని ఉంది ! అది డబ్బు విలువ తెలుసుకోవడం ! అంటే  డబ్బు గురించి మనకు ఉన్న అవగాహన ఏమిటి ? మన జీవితాలలో డబ్బుకు  ఏ  స్థానం ఇస్తున్నాము, ఇవ్వదలుచుకున్నాం , ఇవ్వ బోతున్నామనే విషయాలను , వివరం గా తెలుసుకోవాలి. కేవలం మనకు ఉన్న డబ్బు బట్టే , మన ఆస్తిత్వమూ , ఉనికీ ఆధార పడి ఉందా?  ఆ విధమైన ఆలోచన ఇంకేవరిదోనా , లేక మన నమ్మకమా ? డబ్బు లేక పొతే మనం లేమా ? !  ఈ  ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు రాబట్టు కావడానికి  ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి , తమంత తామే ! 
క్రెడిట్ కార్డు తో ”  ఋణాను బంధం ” ఎట్లా పెరుగుతుంది?:
ఒక ఉదాహరణ : లక్ష రూపాయలకు ఒక ఆకర్షణీయమైన టెలివిజన్, కనుక మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నట్టయితే , దానికి  మీరు మినిమమ్ పేమెంట్ కేవలం నెలకు వెయ్యి రూపాయలు  అనుకుంటే ,కనీసం  నూట యాభై నెలలు కడుతూ ఉండాలి , వడ్డీ తో కలిపి !  మీరు ఆ సమయం  అంటే కనీసం పన్నెండు సంవత్సరాలకు పైగా , నెలకు వెయ్యి రూపాయలు కడుతూ ఉంటే , కనీసం లక్షన్నర రూపాయలకు పైగా మీరు మీ శ్రమ ఫలితాన్ని క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అప్పు తీర్చడానికి ధార పోయాల్సిందే కదా !  అదే మినిమమ్ పేమెంట్ లో ఉన్న కిటుకు ! మానవులను దీర్ఘ కాలికం గా ” ఋణ గ్రస్తులను ” చేయడమే !  అదే మీరు ( మీ కోరికలను నియంత్రించుకుని ) ఆ టెలివిజన్ కొనకుండా, మీ డబ్బును  నెలకు వెయ్యి రూపాయల చొప్పున బ్యాంకు లో వేసుకుంటే ( వచ్చే వడ్డీ తో సహా  ) మీకు ఎంత  డబ్బు జమా అవుతుందో ఊహించుకోండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !