పని సూత్రాలు.8. పని లో ఆనందం !
వంద శాతం అంకిత భావం తో పని చేయడం వల్ల ఉండే ఉపయోగాలు క్రితం టపాలో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు పని లో ఆనందం విషయం చూద్దాము ! చాలా మంది, ” ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాము రా బాబూ ( చంద్ర బాబు కాదు ! ) ” అనుకుంటూ, ఆఫీసుకు కానీ పని చేసే చోటకు కానీ వచ్చిన దగ్గర నుండి , గడియారం లో ముల్లులను ఆత్రుతతో గమనిస్తూ , సరిగా అయిదు అవగానే ( చాలా సమయాలలో ఇంకా ముందు గానే ) ఇంటికి ఉరికే పని లో ఉంటారు. వారి ఉద్యోగాన్ని వారు ఇష్ట పడరు. ఏదో నిమిత్త మాత్రం గా , యాంత్రికం గా తమ పని చేసి బయట పడతారు !
చేస్తున్న పనిని ఇష్ట పడుతూ చేసే వారికి, పని లో కష్టం తెలియదు ! వారి దృష్టి అంతా మనస్పూర్తి గా ఆ పని చేయడం మీదనే లగ్నమై ఉంటుంది కనుక ,ఆ పని సులువు అవుతుంది. వారికి పని వల్ల కలిగే వత్తిడి చాలా తగ్గుతుంది. వారు ప్రశాంత చిత్తం తో పని చేస్తూ ఉంటారు కూడా ! వారు చేస్తున్న పని ప్రశాంతం గా పారుతున్న ఏరు లా ఉంటుంది అంటే ఫ్లో అన్న మాట ! పాజిటివ్ సైకాలజీ లో కూడా ఇట్లా పని ని ఇష్ట పడుతూ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా ! ( బాగు ఆర్చివ్ లలో చూడండి, పాజిటివ్ సైకాలజీ గురించి వివరించడం జరిగింది ! ).
ప్రతి ఒక్కరి జీవితం లోనూ అనేక కష్టాలు ఉంటాయి , నష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. ఉత్తేజాలు ఉంటాయి ! అత్భుతాలు కూడా ఉంటాయి ! మరి జీవితాన్ని ఇష్టం లేకుండా గడప లేము కదా ! ప్రతికూల క్షణాలు ఎదురవగానే తాత్కాలికం గా ఏర్పడిన అయిష్టతా భావాన్ని , మనం మన జీవితాంతం అన్వయించు కోలేము కదా ! అతి విలువైన జీవితాన్ని , ఆస్వాదిస్తూ , ఇష్టత తో జీవించడం అలవాటు చేసుకుంటాం కదా ! అదే విధం గా మనం చేసే పని ని కూడా ఇష్ట పడుతూ చేస్తూ ఉంటే ,అది మన శారీరిక , మానసిక ఆరోగ్యానికీ , ఆనందానికీ చాలా మంచిది. ఒక పరిశీలన ప్రకారం ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు ఆ తరువాత రెండు సంవత్సరాలకే , కుమిలి పోతూ , అనారోగ్యాన్ని , చాలా తరచుగా తమ ప్రాణాలకూ ముప్పు తెచ్చుకుంటున్నారు అని తెలిసింది. తాము ఎంతో ఇష్ట పడుతూ చేసే ఉద్యోగం నుంచి రిటైర్ అవడం తో వారికి వచ్చే చిక్కులు అవి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , వారు వారి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, వారి ఉద్యోగాలు వారి ( ఆరోగ్యాని ) కి రక్షక కవచాలు గా పనిచేస్తాయన్న మాట !
ప్రతికూలత లు లేని జీవితం ఎట్లా చప్పగా ఉంటుందో , సమస్యలు లేని ఉద్యోగం కూడా అట్లాగే ఉంటుంది. కొంత మేర మీరు చేసే పని లో చాలెంజ్ ఉంటే, అది మీకు స్ఫూర్తి నిస్తుంది. ఒక క్రమ పధ్ధతి లో మీరు మీ శక్తి సామర్ధ్యాలతో , పాజిటివ్ దృక్పధం తో ఆ చాలెంజ్ లను అధిగమిస్తే, మీలో పరిపూర్ణతా , పని చక్కగా చేయ గాలుగుతున్నాననే గర్వం తొ ణికిస లాడుతూ ఉంటాయి ! అందుకే మీరు చేసే ఏ ఉద్యోగం అయినా , పని అయినా ఇష్ట పడుతూ చేయడం అలవాటు చేసుకోండి ! అట్లాగని మీ హృదయం మీద రాసుకోండి. అప్పుడు మీ మనసూ ( అంటే మెదడూ ) , హృదయమూ కూడా ఆరోగ్యం గా ఆనందం గా ఉంటాయి !
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం !