అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.
అప్పు గురించిన వాస్తవాలు :
ప్రతి నలుగురిలో ఒకరిని జీవితం లో ఏదో ఒక సమయం లో మానసిక రుగ్మత కానీ వ్యాధి కానీ బాధిస్తుంది.అట్లా బాధింప బడే ప్రతి నలుగురిలో ఒకరికి అప్పు సమస్యలు ఉంటాయి. అప్పు సమస్యలు ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి మానసిక రుగ్మతలు , లేదా వ్యాధులు ఉంటాయి.
మానవులు అప్పు ఊబి లో ఎట్లా కూరుకు పోతారు ? :
1. జీవిత చక్రం లో మార్పులు : అంటే ఉద్యోగం పోవడమో, అయిన వాళ్ళతో విడి పోవడమో , లేదా మరణించడమో , విడాకులు తీసుకోవడమో లాంటి ఊహించని పరిణామాలు వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితిని విషమం చేస్తాయి.
2. అనుకోకుండా సంభవించిన అనారోగ్యం కూడా మానవులను మంచానికి కట్టి పడేయడమే కాకుండా , వారి కంచం లో కూడా ఆహారానికి వెతుక్కునే పరిస్థితి కలిగిస్తుంది.
3. చేస్తున్న ఉద్యోగం లో కూడా , చాలీ చాలని జీతాలు వస్తూ , అవసరాలు ఎక్కువ గా ఉన్నప్పుడు .
4. విచ్చల విడి గా ఖర్చు చేయడం , ( మ్యానియా అనే మానసిక పరిస్థితి లో కూడా విచక్షణా రహితం గా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది . )చాలా మంది మానవులు , శాస్త్రీయం గా మానసిక శాస్త్ర నిపుణు డయిన డాక్టర్ చూడక పోయినా , ఇట్లాంటి మానసిక స్థితి లో ఉంటారు, మితి మీరి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వారు వ్యాపారస్తులకు ప్రియం. ఎందుకంటే , వారు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటే వ్యాపారస్తులు అంత లాభ పడుతూ ఉంటారు.
5. తీసుకున్న అప్పు తీర్చక పోవడం.
6. కట్టవలసిన బిల్లులు ( నెల వారీ ) అశ్రద్ధ చేసి కట్టక పోవడం.
అప్పు చేసిన వారి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది?:
1. పరిస్థితి చేయి దాటి పోతున్నట్టూ , అందుకు తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నట్టూ భావిస్తూ ఉంటారు.
2. నిరాశా వాద పరిస్థితిలో , ప్రత్యేకించి , తీర్చ వలసిన అప్పు రోజు రోజు కూ ఎక్కువ అవుతుంటే !
3.తీవ్ర మైన స్వీయ అపరాధ భావనలు: అంటే ఆ పరిస్థితి కంతటికీ తామే కారణమనీ , ప్రత్యేకించి వారికి , శరీర లేదా మానసిక ఆరోగ్య కారణాలు ఉన్నప్పటికీ , తీవ్రం గా తమను తాము నిందించు కుంటూ , మనస్తాపం చెందడం !
4. డిప్రెషన్ కూ , అందోళన కూ లోనవడం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !