Our Health

Archive for ఫిబ్రవరి 28th, 2013|Daily archive page

పని సూత్రాలు. 13. మీ స్మైల్ తీసుకు వెళుతుంది, మిమ్మల్ని వేల మైళ్ళు !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 28, 2013 at 9:55 సా.

పని సూత్రాలు. 13. మీ స్మైల్   తీసుకు వెళుతుంది, మిమ్మల్ని,  వేల మైళ్ళు ! 

 
సదా చిరునవ్వు చిందించండి ! :నవ్వు !  చిరునవ్వు ! సృష్టి లో మానవులకు మాత్రమే  ఉన్న అతి  ప్రత్యేక  లక్షణం ! ఉదయం  మీ ఉద్యోగం లో ప్రవేశించ గానే మీ ఇతర ఉద్యోగులకు మీ అమూల్యమైన చిరునవ్వు చూపించండి ! కరచాలనం , అదే హ్యాండ్ షేక్ , చేసే సమయం లో కూడా మీ ఇతర ఉద్యోగులతో , చిరునవ్వు నవ్వండి ! మీరు చేసే పని కష్టం అవుతున్నప్పుడు , నవ్వండి ! , మీ చుట్టూ ఉండే సమస్యల వలయాన్ని కూడా ఛే దించ డానికి , ఏకైక మార్గం, మీరు చిరునవ్వు చిందిస్తూ, ముందుకు పోవడమే !  అది అనేక  సూర్యోదయాలకు సమానం !  మీ నవ్వు , మీలో ఏదో తెలియని నూతనోత్సాహం నిండుతుంది, మీలో ఒక కొత్త కాంతి జనిస్తుంది !  మీరు చేసే పని ని ఏకాగ్రత తో చేయ గలుగుతారు ! మీ రోజు హాయి గా మొదలై హాయిగా పూర్తి  కూడా అవుతుంది ! 
మరి అసలు సిసలైన మీ చిరునవ్వు ఎట్లా ఉండాలి ?:
మీ చిరునవ్వు , స్నేహ పూర్వకం గా ఉండాలి ! మీలో ఏ  భేషజాలు లేకుండా నవ్వినట్టు ఉండాలి , అంటే మీలో ఇతర వ్యక్తుల మీద అసూయ  కానీ, మీ ఆఫీసు లో మీ స్థానం అంటే మీ పొసిషన్  గురించి గానీ ఏమాత్రం మీకు గర్వం కానీ, అహం కానీ లేకుండా నిర్మలం గా నిష్కల్మషం గా ఉండాలి ! అభం శుభం తెలియని ఓ చిన్నారి చిరు నవ్వు ఎట్లా ఉంటుందో , అట్లా మీ చిరు నవ్వు ఉండాలి ! మీ చిరునవ్వు  సిన్సియర్ గా ఆనెస్ట్ గానూ , ఫ్రాంక్ గానూ ఉండాలి ! సంతోషం గానూ ఉండాలి !
కొందరు వ్యక్తులతో మనం కలిసినప్పుడు ,  ” పొద్దున్నే వీడి మొహం చూడాల్సిన ఖర్మ పట్టింది నాకు ! ఇక రోజంతా ఎట్లా ఉంటుందో ఏమో ” అనుకుంటూ నవ్వినట్టు గా ఉంటుంది  వారి నవ్వు ! ఇంకొందరు  ఏడిచినట్టు  నవ్వుతారు, చక్కటి చిరునవ్వును  వారి  మనసు ఉక్కు గోడలలో దాచేసి ! కొందరు  పురుషులు ఉద్యోగం లో తమ తోటి పురుష ఉద్యోగులతో ” వీడెక్కడ దాపురించాడు రా ,ఆఫీసు కు రాగానే అన్న విధం గా ఓ పొడి నవ్వు వారికి ” పడేసి ” వారినుంచి దూరం గా ” పడతారు ” ! అదే వారి తోటి స్త్రీ ఉద్యోగినులతో , వారి మొహం అంతా  సూర్యకాంతి పుష్పమంత చేసుకుని మరీ కృత్రిమమైన నవ్వులు అనేకం ” పండిస్తూ ” ఉంటారు ! స్త్రీ ఉద్యోగుల ముందు వారు నవ్వే ప్రతి నవ్వూ చిలిపి తనం తో  ఏదో ఒక నిగూఢమైన కోరిక తో  నిండి ఉంటుంది !  ఏదైనా పబ్లిక్ ఆఫీసు లో క్యాష్ కౌంటర్ దగ్గర ఉండే క్లర్క్  ను ఎప్పుడైనా గమనించారా ? వారి చూపులు ఎప్పుడూ మీ చేతుల మీదే ఉంటాయి ! మీరు చిరునవ్వు నవ్వి  మీ పనిని త్వరగా చేయమని వివరించి చెబుతూ ఉంటే  ” ఎవడ్రా వీడు నాకు కహానీ లు చెబుతున్నాడు ? అన్నట్టు మీ మొహం వంక తేరి పార చూస్తూ , వారి చేతులలో ఉన్న నోట్లు అతి వేగం గా లెక్క పెడుతూ ! అదే మీరు ”  మీరు కట్ట వలసిన డబ్బు కాకుండా విడిగా ఓ పదో ఇరవయ్యో నోట్లు ఇంకో చేత్తో పట్టుకుని క్యాషియర్ వైపు చూడండి ! వారి మొహం ఒక్క సారి గా వెలిగి పోయి , వారు చేస్తున్న పనిని ఆపి మీ విషయం చూస్తారు ! క్షణాల్లో పూర్తి  చేస్తారు ! 
మీ నవ్వు  మీలో ఎదుటి వ్యక్తి  మీద ఏ విధమైన అసూయా , ఈర్ష్యా ద్వేషాలు , క్రోధాలూ లేనప్పుడు , సహజం గా, నిర్మలం గా , ప్రశాంతం గా , సంతోషకరం గా ఉంటుంది!  అటువంటి మీ చిరునవ్వు  అతి శక్తి వంతమైనది !   మిమ్మల్ని  మీ జీవిత పధం లో అనేక వేల మైళ్ళు ముందుకు తీసుకు వెళుతుంది, అతి వేగం గా ! అందుకే మీ అమూల్యమైన చిరు నవ్వు సదా నవ్వుతూ ఉండండి !  మీ జీవితాలకు ” జీవం ” పోస్తూ ఉండండి నిరంతరం ! 
 
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం ! 
%d bloggers like this: