పని సూత్రాలు . 1. పనితనం నేర్చుకోండి !
మీరు ఏ ఉద్యోగం లో చేరినా , చేయ వలసిన ప్రధమ కర్తవ్యం , పని నేర్చుకోవడం ! మీరు చేస్తున్న పనిలో ఎంత నైపుణ్యం చూపిస్తే, మీరు అంత అభివృద్ధి పధం లో సాగ గలరు. మీ లక్ష్యం , మీ సహచరులందరి కంటే కూడా , మీరు ఎక్కువ సామర్ధ్యం తో పని చేయడం అలవాటు చేసుకోండి ! దీనికోసం మీరు ఎంత కష్ట పడ వలసి వచ్చినా , మీరు నిశ్శబ్దం గా కష్ట పడండి , మీ సహ చరులెవ్వరికీ , మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనే విషయం తెలియ నీయకండి ! మీరు ఈ బ్లాగులో , పని సూత్రాలు చదువుతున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియ నీయకండి.మీరు చేయవలసిందల్లా , మీరు చేస్తున్న ఉద్యోగాన్ని , సమర్ధ వంతం గా బాధ్యతా యుతం గా చేయడమే ! అన్ని పరిస్థితులూ , మీ నియంత్రణ లోనే ఉన్నాయన్న ధీమా తో మీరు ఉండాలి . అంటే మీరు కష్ట పడి మీరు చేస్తున్న పని లో ప్రావీణ్యం సంపాదించడమే ! మీరు చేస్తున్న పనిని , మిగతా అందరూ ( మీ వర్క్ ప్లేస్ లో మీ చుట్టూ ఉన్న వారంతా ) గమనించేట్టు చూడండి ! ముఖ్యం గా మీ బాసు కళ్ళ లో పడాలంటే ! ,మీరు మీ ఆఫీసులో , మీ ఫైళ్ళ ముందర ఎంత కాలం కూర్చున్నా , మీ చెమటా , కష్టమూ , వృధా అవుతుందే తప్ప , దానికి తగినంత ఫలితం ఉండదు. మీరు ఎక్కడ పని చేస్తున్నా , మీ పై వాడు మీ పనిని గమనించే పరిస్థితి కలిగించండి. ఒక సాధనం ఏమిటంటే , మీరు చేస్తున్న పని గురించి ఒక రిపోర్ట్ మీ బాసుకు ఇవ్వండి. అంటే మీరు ఎంత పని పూర్తి చేసిందీ, ఇంకా ఎంత తక్కువ పని మిగిలి ఉన్నదీ కూడా , ఒక చిన్న రిపోర్ట్ ఇవ్వండి. మీ మిగతా సహచరుల సమక్షం లో ! ఇట్లా చేయడం వల్ల ,మీ పనితనానికి గుర్తింపు వస్తుంది. ప్రత్యేకించి మీ బాసుకు ! మీరు ఈ పని తరచుగా చేయకూడదు ! అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే , మీరు మీ బాసు గుడ్ బుక్స్ లో ఉంటారన్న మాట ! మీ బాసు కి మీ మీదా మీ పని మీదా మంచి ఇంప్రెషన్ రావాలంటే అత్యుత్తమ సాధనం మీరు చేస్తున్న పనిని సమర్ధ వంతం గానూ, బాధ్యతా యుతం గానూ చేయడమే ! దీనికి సబ్ స్టి ట్యూ ట్ ఏమీ ఉండదు ! అందువల్ల మీరు చేస్తున్న పనిని ఏకాగ్రత తో , తదేకం గా మిగతా ఏ వ్యాపకాలూ లేకుండా చేయడం అలవాటు చేసుకోండి !
ఒక ఉదాహరణ : మీరు బజారులో చాట్ మసాలా వాడి బండి చూసే ఉంటారు ! అట్లాంటి బండి ఎక్కడ ఉన్నా , విపరీతం గా జనాలు ! మరి బండి వాడి పనితనం కనుక గమనిస్తే ! బండి లో ఒక పొయ్యి, దాని మీద ఒక పెద్ద పెనం ఉంటుంది. ఒక సగం లో నాన బెట్టిన శనగలు ఉంటాయి, పచ్చగా. పొయ్యి పక్కగా , చక్కగా చాప్ చేసిన ఉల్లిపాయలు, కొతిమీర, టమాటాలు ఉంటాయి , వాటి పక్క గా చాట్ మసాలా ! ఇంకా వాడేమో చేతుల తో మాయ చేస్తున్నట్టు అవి కొన్నీ , ఇవి కొన్నీ చక చకా కలిపేసి ఒక ప్లేట్ లో అన్నీ పోసి , చక్కటి పెరుగు రెండు చెంచాలు వేసి, ఇస్తూ ఉంటాడు ! ఇంకో చేత్తో గోల్ గప్పా లు మధ్యలో తుంచి , వాటిలో మసాలా నీరు పోసి ఇస్తూ ఉంటాడు ! కాస్త సమయం దొరికితే , అట్ల కాడ తో పెనం మీద అవసరం లేక పోయినా కూడా టక టక టక మనే శబ్దం చేస్తూ ఉంటాడు ! ఇక్కడ గమనించ వలసినది , బండి వాడి హస్త లాఘవం , ఇంకా అందరూ మూగి ఉన్నపుడు , లైటు వెలుతురూ లో వాడు , వాడి బాసులు ( అంటే డబ్భులు ఇచ్చి వాడి చాట్ తినే వారందరూ ! ) వాడి పనితనం గమనించడానికి చేసే ప్రయత్నాలే ! అ సమయం లో ఆ చాట్ బండి చుట్టూ మూగి ఉన్న వారి నోటిలో, గోల్ గప్పా లూ ,చాట్ లో పడుతూ ఉంటే , ” ఎంత బాగా చేస్తున్నాడు ! వాడి దగ్గర ఏదో రహస్యం ఉంది” ! అనుకుంటూ తింటూ ఉంటారు ! పనితనం చూపించడం అట్లా ఉంటుంది !