పని సూత్రాలు.
ఆధునిక మహాభారత ఉద్యోగ పర్వం లో , యువతీ యువకులంతా , అనేక రకాలు గా ఉంటారు. చాలా మంది పట్టే ప్రధాన మైన బాట, చదువులు పూర్తి అయిన తరువాత , ఉద్యోగం కోసం వేట ! ఇట్లా ఉద్యోగం చేసే వారిలో ఎక్కువ శాతం మంది , పరీక్షలు పాసయిన వారుంటారు . కొంత శాతం మంది , పరీక్షలలో సఫలం కాలేక , చదువు కు విరామం ఇచ్చి , ఉద్యోగం వేట లో పడతారు. ఆ అదృష్టానికి కూడా నోచుకోని వారు , చదువులు మానివేసి, అంటే స్కూల్ చదువులు అయ్యాకనే , పై చదువులకు వెళ్ళ కుండా ( లేదా వెళ్ళ లేక ) ఉద్యోగాలు వెతుక్కుంటారు. అనేక సంవత్సరాలు గా వారి జీవితాలలో, అతి ముఖ్యమైన భాగమైన స్టూడెంట్ లైఫ్ ను భాగా అనుభవిస్తారు , చాలా మంది యువతీ యువకులు, అందులో తప్పు ఎంత మాత్రమూ లేదు. కానీ పరీక్షా ఫలితాలు తెలిశాక , వారు ఒక జల్లెడ లోనుంచి వేరు చేయబడతారు వివిధ గ్రూపు లు గా ! వారికి వచ్చిన మార్కుల ప్రకారం గా వారి ప్రతిభ, కొన్ని తరగతులు గా విభజింప బడుతుంది. కానీ ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం తరచూ , ప్రతిభకు డిగ్రీలూ , సర్టిఫికెట్ లు మాత్రమే కొలమానాలు కాదని ! ప్రతిభ ను వారే ” సాన ” పెట్టుకుంటే లేదా పదును పెట్టుకుంటే , వారు, వారి వారి జీవితాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించ గలుగుతారు. కావలసినది కృత నిశ్చయమూ , శ్రమా, ఆశావహ దృక్పధమూ ! వారి, వారి లక్ష్యాలను అధిగమించ డానికి వారందరికీ కావలసినది ఇంకో ముఖ్యమైన సాధనం ” పని సూత్రాలు ” అదే, రూల్స్ ఆఫ్ వర్క్ . వారు ఎక్కడ ఏపని చేసినా , వారికి పని సూత్రాలు పూర్తి గా తెలిస్తే , వారు నెగ్గుకు రాగలరు !
విచార కరమైన విషయం ఏమిటంటే , ఈ పని సూత్రాలు , చదువు కున్న వారికీ , వారి కాలేజీ లో చెప్పరు , చదువు కోలేక పోయిన వారికీ ,వీటి గురించి అవగాహన ఉండదు. పని చేసే , ప్రతి మానవ జీవితం లో అతి ముఖ్యమైన ఈ పని సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ! మన జీవితాలలో,పని సూత్రాలు పాటించి , అభివృద్ధి పధం లోకి వెళదాం !
వచ్చే టపా నుంచి , ఈ పని సూత్రాలు వివరం గా తెలుసుకుందాం !