Our Health

Archive for ఫిబ్రవరి 24th, 2013|Daily archive page

పని సూత్రాలు.10. మీ స్వేదం కనపడనీయకండి !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 24, 2013 at 2:48 సా.

పని సూత్రాలు.10. మీ స్వేదం కనపడనీయకండి ! 

 

పని సూత్రాలలో ఇంకో ముఖ్యమైనది,  మీరు చేసే పని లేదా ఉద్యోగం లో మీరు పడే శ్రమను బహిరంగ పరచకుండా జాగ్రత్త పడడం ! మీరు ఆఫీసులలో గమనిస్తే, పై అధికారులు అట్లా కనిపిస్తారు ! ఆఫీసులో తమ సీట్లో కూర్చుని, చాలా ప్రశాంతం గా మౌన ముద్రలో ఉన్నట్టు ఉంటారు ! నిత్యం ఎదురయే సమస్యలను, ఏమాత్రం ఆందోళన, ఆదుర్దా లేకుండా  పరిష్కరిస్తూ ఉంటారు !  చేసే పనిని అతి చాక చక్యం గా చేస్తూ ఉంటారు ! ( ఇట్లా ప్రవర్తిస్తూ ,  తమ హస్త లాఘవం కూడా  ప్రదర్శించే వారి విషయాలు ప్రస్తుతం మనం పట్టించుకోవట్లేదు ! ) 
ఇంకో ఉదాహరణకు ( మన ) ప్రస్తుత  భారత దేశ నాయకులను చూడండి !  అనేక విధాలుగా రోజూ వివిధ మీడియా లో తమ ” ప్రకటనల ” లో  ” ప్రతాపం ” చూపిస్తూ ఉంటారు ! విపరీతమైన హడావిడి చేస్తూ ఉంటారు !  అవి నీటి మాటలే అయినా నిత్యం మీడియా లో కనపడుతూ ఉంటే లేదా వారి మాట వినపడుతూ ఉంటే నే వారు , ” బాగా పని చేస్తున్నట్టు ! ”  అన్ని విధాలా దేశాన్ని దోచుకునే వారు, పల్లె పల్లెలలో కూడా తమ నిలువెత్తు  విగ్రహాలు ప్రతిష్టించుకుంటారు. ఏళ్ల తరబడి తాగే నీటి వసతి లేని ఊళ్లు చాలా ఉన్న మహారాష్ట్ర లో ఈ మధ్య ఒక ” మహా నాయకుడు ” తన కొడుకు  పెళ్ళికి  22 హెలి ప్యాడ్ లను ఏర్పరిచి , ఒక లక్ష మంది అతిథులను ఆహ్వానించి , ఒక అరవై  ఐటమ్స్ తో విందు చేశాడు ! అదీ ప్రస్తుత నాయకుల  ” నిస్వార్ధ ” సేవా జీవితం ! జనాలు కూడా వారికి జే జే లు కొడుతూ ఉంటారు ! మీడియా మత్తులో మునుగుతున్న చాలా మంది జనాలకు, అసంఖ్యాకమైన నిస్వార్ధ దేశ భక్తులు, తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి , స్వాతంత్ర్యం తెచ్చిన సంగతి, గుర్తుకు రాదు ! విగ్రహాలు లేక పోయినా , కనీసం వారి పేర్లు కూడా  తెలుసుకునే స్థితిలో వారు  లేరు !  కానీ నిజం గా పని చేసే వారు, కాశ్మీరు లోయలలో, మంచు అంచున ,ఆహార్నిశాలూ సరిహద్దు ను కాపలా కాస్తూ ఉండే సిపాయీలు !  వారికి ఏ  విగ్రహాలో అవసరం లేదు ! వారి స్వేదం కనపడదు మనకు ! నిశ్శబ్దం గా తమ ధర్మం నిర్వర్తిస్తున్నారు ! మనకు అమూల్యమైన స్వేఛ్చ ను అందిస్తున్నారు ! 
అసలు విషయానికి వద్దాము ! 
మీరు  ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకుంటే , వాటి కోసం మీరు పడే శ్రమను , మీ వర్క్ ప్లేస్ లో ఏమాత్రం చూపకండి ! మీరు మీ ఉద్యోగం లో కానీ , చేసే పనిలో కానీ ,మీ విసుగును కానీ , కోపాన్ని కానీ మీ ఆందోళనలను కానీ చూపించ కండి !  మీ ఇతర ఉద్యోగులతో మీ పని ఎక్కువ గా ఉందనో , లేదా మీకు ఆ పని చేయడం చాలా కష్టం గా ఉందనో  ” నస  ” పెడుతూ ఉండకండి !  ఈ భయాందో ళనలు  అన్నీ  మీ ఉద్యోగం చేయడం లో మీకు ఉన్న శక్తి సామార్ధ్యాలను  మరుగున పరిచి ,మిమ్మల్ని  ఆ పని లో లేదా ఉద్యోగం లో ” అసమర్ధులు ” గా ముద్ర వేసే ప్రమాదం ఉంది ! పని లో కష్టాలూ , జటిల  సమస్యలూ ఉన్నా కూడా , మీరు ” నిండు కుండ ” లా తొణ కకుండా, బెణక కుండా ఉండాలి ! చాలా రిలాక్స్ అయి ఉండాలి ! హుందా గా ఉండాలి !  అంతే  కాక , మీరు మీకు ఇచ్చిన పని గడువు తీరే సమయం లోనే చేయడం అలవాటు చేసుకోవాలి !  ఇతరుల సహాయం సాధ్యమైనంత తక్కువ గా తీసుకుంటూ ఉండాలి !  మీకు ఉన్న పనిని త్వర గా పూర్తి  చేసుకుంటూ మీరు విరామం తీసుకుంటూ ఉండాలి !  
మీ స్వేదం ( శ్రమ )  ఇతరులకు కనపడ నీయకండి !  ( ఇది అక్షరాలా  కూడా నిజమే ! అంటే మీరు ఆందోళన పడుతూ , ఆదుర్దా పడుతూ చెమటలు కారుకుంటూ ఎప్పుడూ కనపడ కండి ! ) ఎందుకంటే, మీరు సమర్ధులు, మీ లక్ష్యం ఉన్నతమైనది !   ఇవే ఇతరులకు మీలో కనపడాలి !  
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 
%d bloggers like this: